Gold: మట్టి నుంచి బంగారం - మూడు గ్రామాలలో ఇంటింటా ఇదే పరిశ్రమ

ముందుగా మట్టిని ముద్దలుగా చేసి దానిపై పిడకలు పేర్చి మంట పెడతారు
ఫొటో క్యాప్షన్, ముందుగా మట్టిని ముద్దలుగా చేసి దానిపై పిడకలు పేర్చి మంట పెడతారు
    • రచయిత, తులసి ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

రైతులు మట్టిని బంగారంతో పోలుస్తుంటారు. భూమిలో బంగారాన్ని పండిస్తామనే నానుడి చెబుతుంటారు. కానీ ఆ గ్రామాల ప్రజలు మాత్రం మట్టి నుంచి బంగారాన్ని వెలికితీస్తున్నారు.

మట్టిని సేకరించి బంగారాన్ని అన్వేషించడమే వారి వృత్తి. ఆ మూడు గ్రామాల్లో ప్రతి ఇల్లూ మట్టిలో నుంచి బంగారం తీసే ఓ కుటీర పరిశ్రమే.

మట్టిని అనేక రకాల పద్దతుల్లో ప్రాసెస్ చేసి బంగారాన్ని వెలికితీస్తున్నారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, మూడు గ్రామాల ప్రజలు ఇప్పుడు ఈ వృత్తినే నమ్ముకొని బతుకుతున్నారు.

చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం ఎగువ సాంబయ్య పాలెం, దిగువ సాంబయ్య పాలెం, కళ్లుపూడి గ్రామాల్లో ఎటు చూసినా మట్టి బస్తాలు కనిపిస్తుంటాయి.

కొందరు మట్టిని నీళ్లతో కలుపుతూ ఉంటే, మరి కొందరు ఆ మట్టిని ముద్దలుగా మారుస్తూ ఉంటారు. ఇంకొందరు ఆ ముద్దలను ప్రాసెస్ చేసి బంగారాన్ని బయటికి తీస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా ఆ మూడు గ్రామాల ప్రజలకు మట్టే బంగారం.

మట్టిలో బంగారం తీస్తారు

మట్టిని ఎలా సేకరిస్తారంటే..

బంగారు ఆభరణాలు తయారు చేసేటప్పుడు కొంత బంగారం వృథా అవుతుంది. అలా వృథా అయిన బంగారం మట్టిలో కలిసిపోతుంది.

బంగారు దుకాణాల వద్ద స్వర్ణకారులు ఆ మట్టిని సేకరించి నిల్వ చేస్తారు.

"మేం బెంగుళూరు, మద్రాసు, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి ఈ మట్టిని కొనుగోలు చేస్తాం.

ఆ మట్టిని తీసుకువచ్చి ప్రాసెస్ చేసి బంగారు రేణువులను ఒక్కటిగా చేస్తాం" అని దిగువ సాంబయ్య పాలేనికి చెందిన మునిరెడ్డి బీబీసీతో చెప్పారు.

మట్టిలో బంగారం తీస్తారు

బంగారు దుకాణాల వద్ద కొనుగోలు చేసిన మట్టిని ముందుగా శుభ్రం చేస్తారు. అందులో ఉన్న వ్యర్ధపదార్ధాలను తొలగించి ముద్దలుగా తయారు చేసి ఎండబెడుతారు.

"ముందుగా పిడకలపైన మట్టి ముద్దలు పేర్చి దానిపై గడ్డి వేసి మంట పెడతాం. ఆ మంటలో ఎండిన మట్టి ముద్దలను బాగా కాలుస్తాం. కాలిన దాన్ని పొడిచేసి జల్లెడ పడతాం. దాన్ని మిషన్‌లో వేసి మెత్తగా పొడి చేస్తాం" అని దిగువ సాంబయ్య పాలేనికి చెందిన లక్ష్మమ్మ వివరించారు.

మట్టిలో బంగారం తీస్తారు

ప్రత్యేక యంత్రాలు ఉపయోగిస్తారు

ఈ ప్రాసెస్ కోసం ఈ గ్రామాల్లో ప్రజలు కొన్ని ప్రత్యేకమైన యంత్రాలను, వస్తువులను వినియోగిస్తున్నారు.

"సిమెంటు లాగ మెత్తటి పొడిగా మారిన మట్టి పొడిని చెక్క దొనలో వేసి పాదరసం, ఉప్పు చల్లి బాగా రుద్దుతాం. బాగా రుద్దడం వల్ల మట్టిలోని బంగారం పాదరసానికి అంటుకుంటుంది. తరువాత నీళ్లు పోసి మట్టిలోనుంచి పాదరసం వేరు చేస్తాం. పాదరసాన్ని నల్లటి పొడి గుడ్డలో వేసి పిండుతాం. అప్పుడు బంగారంలో నుంచి పాదరసం వేరై ఇతర లోహాలతో కూడిన బంగారం వస్తుంది'' అని దిగువ సాంబయ్య పాలేనికి చెందిన మునెమ్మ చెప్పారు.

మట్టి నుంచి తీసిన బంగారం

సట్టి పాత్రలో వేసి కాల్చడం వల్ల ఇతర వర్థాలు వేరై రాగి, బంగారంతో కూడిన ముక్కలు బయటకు వస్తాయి.

"వ్యర్థాలతో కూడిన బంగారాన్ని బట్టీ దగ్గరకు తీసుకెళ్లి సట్టిలో వేసి కాలుస్తాం. దాని నుంచి వచ్చిన దాన్ని గాజు పాత్రలో వేసి యాసిడ్ పోసి బాగా మరగబెడతాం. అందులో ఉన్న ఇతర లోహాలు యాసిడ్‌లో కరిగి పోవడంతో బంగారం మాత్రమే మిగులుతుంది. యాసిడ్‌ను బంగారాన్ని మరో పాత్రలో పోసి వేరు చేస్తాం. అప్పుడు నాణ్యమైన బంగారం బయటికి వస్తుంది" అని మునిరెడ్డి చెప్పారు.

మట్టి నుంచి తీసిన బంగారం
ఫొటో క్యాప్షన్, మట్టి నుంచి తీసిన బంగారం

మూడు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి

మట్టిలో నుంచి బంగారం తయారు చేసే ఈ వృత్తిని నమ్ముకొని దాదాపు 400 కుటుంబాల వరకు బతుకుతున్నాయి. కుటుంబం మొత్తం కష్టపడితే ఒక్కోసారి గిట్టుబాటు అవుతుంది. ఒక్కోసారి ఏమీ మిగలని పరిస్థితి.

"ఒక్కొక్కసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే రూ.50 వేలు వస్తుంది. కొన్నిసార్లు నష్టాలు కూడా వస్తాయి. ఎంత వస్తుందని అంచనా వేసుకొని మట్టిని సేకరిస్తాం. లాభం లేదా నష్టం వస్తుంది. చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు రాక ఈ పని నేర్చుకుని బతుకుతున్నారు" అని మునిరెడ్డి చెప్పారు.

వీడియో క్యాప్షన్, తొలకరి వర్షాలకు వజ్రాలు దొరుకుతాయా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)