2022 జనవరి 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేయాలంటే గుర్తుంచుకోవాలసిన విషయాలు..

ఫొటో సోర్స్, Deepak Sethi/Getty Images
- రచయిత, అలోక్ జోషి
- హోదా, బీబీసీ కోసం
ఆన్‌లైన్ షాపింగ్ లేదా ఇతర లావాదేవీల కోసం డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించేవారు ఇప్పుడు కొన్ని కొత్త పద్ధతులకు అలవాటు పడక తప్పదు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో, మింత్ర, మేక్ మై ట్రిప్ లాంటి వెబ్‌సైట్లలో మన క్రెడిట్, లేదా డెబిట్ కార్డులను జత చేసుకునే అవకాశం ఉంటుంది. అలా జత చేసుకుంటే షాపింగ్ చేసిన ప్రతీసారి అన్ని వివరాలూ ఇవ్వక్కర్లేకుండా కేవలం సీవీవీ పిన్ నంబర్, కొన్నిసార్లు కార్డు గడువు తేదీ ఇస్తే సరిపోతుంది. ఇది సౌకర్యంగా ఉంటుంది కాబట్టి చాలామంది ఈ పద్దతిని పాటిస్తారు.
కానీ, ఈ డిసెంబర్ 31 తరువాత ఈ విధానం పనిచేయదు.
ఇ-కామర్స్ లేదా ఎం-కామర్స్ వేదికలు, కార్డు కంపెనీలు, చెల్లింపుల లావాదేవీలు నడిపే అగ్రిగేటర్లు కూడా తమ పద్ధతిని మార్చుకోవాల్సి ఉంటుంది.
ఎందుకంటే, ఇకపై క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లలో లేదా సర్వర్‌లలో జత చేసే అవకాశం ఉండదని రిజర్వ్ బ్యాంకు తెలిపింది.
అంటే, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ప్రతీసారి మన కార్డు వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కారణమేంటి?
కస్టమర్ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలను దుకాణదారులు లేదా ఇ-కామర్స్ సైట్లు, పేమెంట్ గేట్‌వేల వంటి మధ్యవర్తుల వద్ద కంప్యూటర్‌లో భద్రపరచడం వలన ముప్పు పెరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది.
ఏదైనా ఒక కార్డ్ కంపెనీ, ఒక ప్లాట్‌ఫారం లేదా కన్స్యూమర్ కంపెనీ డేటాబేస్ మొత్తం హ్యాక్ చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు, ప్రపంచం మొత్తం మీద కోట్ల మంది సమాచారం నేరస్థుల చేతికి చిక్కుతుంది. వీరందరి ఖాతాలు రిస్క్‌లో పడ్డట్టే.
గత కొన్ని సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పలు కేసులు బయటపడ్డాయి. ఈ ఘటనలు రిజర్వ్ బ్యాంకు వాదనకు బలం చేకూరుస్తున్నాయి.
కేవలం ఆన్‌లైన్ కొనుగోళ్లకే కాదు, షాపింగ్ కోసం పెద్ద దుకాణాలకు వెళ్లినప్పుడు కార్డు ఉపయోగిస్తే ఆ మొత్తం వివరాలు వారి సిస్టమ్‌లో స్టోర్ అవుతాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
టూ ఫ్యాక్టర్ ఆథరైజేషన్
అయితే, కార్డు వివరాలు ఉన్నప్పటికీ, పిన్ నంబర్ ఇవ్వకుండా ఆ కార్డు నుంచి ఎవరూ కొనుగోళ్లు చేయలేరు. అయినప్పటికీ, కార్డు వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కడం ప్రమాదమే. ఇది కేవలం ఆన్‌లైన్ షాపింగ్ లేదా అలాంటి వాటికి మాత్రమే పరిమితం కాదు.
రిజర్వ బ్యాంకు, కార్డు కంపెనీలు ఈ విషయంలో ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నాయి. టు ఫ్యాక్టర్ ఆథరైజేషన్‌ను ఏర్పాటు చేశాయి.
ఏదైనా యాప్‌లో ఒక పరిమితికి మించి చెల్లింపులు చేయాలంటే వన్ టైం పాస్‌వర్డ్ అడుగుతుంది. సీవీవీ నంబర్, వన్ టైం పాస్‌వర్డ్.. ఇలా రెండు దశల విధానాన్ని ఇప్పటికే అమలుచేస్తున్నారు.
ఇప్పుడు వీటన్నింటినీ పక్కకు పెట్టి, చెల్లింపు చేసిన ప్రతీసారి కార్డు వివరాలన్నీ ఇవ్వాలంటే కొంత ఇబ్బందే.
ముఖ్యంగా, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, డీటీహెచ్ రీఛార్జీలు లేదా ఫోన్, విద్యుత్, గ్యాస్ బిల్లు వంటి వాటికి ప్రతి నెలా కొంత చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రతీసారి అన్ని వివరాలూ ఇస్తూ ఉండడం కొంత సమస్యాత్మకమే.
కరోనా తరువాత, చాలామంది నేరుగా వార్తాపత్రికలు కొనుక్కోకుండా ఆన్‌లైన్‌లో సభ్యత్వం తీసుకుంటున్నారు. ఇలాంటి వాటన్నింటికీ నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ఖాతాలు ఉంటాయి. ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జీ లాంటి వాటికి అవసరమైనప్పుడు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
ఇవన్నీ మీకు జీవితాన్ని చాలా సులభతరం చేసే అంశాలు. కార్డు వివరాలు అన్నీ ముందే జత చేసి ఉంటే, కేవలం పిన్ నంబర్ ఇస్తే చాలు. లేదంటే బ్యాంకు వెరిఫికేషన్ పేజీ తెరుచుకుంటుంది. అక్కడ ఓటీపీ ఇస్తే చాలు.. నిముషాల్లో పని అయిపోతుంది.

ఫొటో సోర్స్, AFP
జనవరి 1 నుంచి ఏం మారుతుంది?
వస్తువులను విక్రయించే పెద్ద, చిన్న వ్యాపారి అయినా, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారం అయినా, ఓటీటీ ప్లాట్‌ఫారం అయినా లేదా ఏదైనా కంపెనీ, పేమెంట్ గేట్‌వే.. ఎందులోనూ కస్టమర్ల కార్డు వివరాలను జత చేసే అవకాశం ఉండదు.
అంతే కాదు, ఇంతకు ముందు తమ సర్వర్‌లలో నిక్షిప్తమైన వివరాలన్నింటినీ ఆ కంపెనీలు తొలగించాల్సి ఉంటుంది.
ఈ అంశంలో కస్టమర్ లేదా వస్తువులను విక్రయించే వ్యాపారి కంటే, ఈ వ్యాపారంలో మధ్యవర్తులుగా వ్యవహరించే వారిపైనే రిజర్వ్ బ్యాంక్ ఎక్కువ దృష్టి నిలిపింది.
కస్టమర్లకు ఆర్డరు చేసిన వస్తువులు అందేవరకు డబ్బులు ఈ మధ్యవర్తుల చేతిలోనే ఉంటాయని బ్యాంకు చెబుతోంది.
కొనుగోలుదారుడు చేసిన ఆర్డరు వివరాలు అమ్మకపుదారుడికి చేరిన తరువాత, వస్తువులను కొనుగోలుదారుడికి చేరవేసేవరకు.. ఈ సమయమంతా చెల్లింపుల డబ్బులు మధ్యవర్తుల అగ్రిగేటర్లలో ఉంటాయి. హ్యాకర్లు ఈ సమయాన్ని తెలివిగా వినియోగించుకునే అవకాశం ఉంది.
కొన్నిసార్లు ఈ సమయం ఎక్కువగా ఉంటుంది. వారం, పది రోజుల పైనే పట్టొచ్చు. అలాగే, పెద్ద మొత్తాల్లో చెల్లింపులు ఉండవచ్చు.
గత ఏడాది మార్చిలో ఈ మధ్యవర్తుల కోసం రిజర్వ్ బ్యాంక్ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ వ్యాపారం చేయడానికి నియమాలు, కనీస మూలధనం మొదలైన వాటిపై స్పష్టమైన నిబంధనలను జారీ చేసింది.
ఈ దిశలో మరో ముందడుగు వేస్తూ జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.
కస్టమర్ల లావాదేవీలను సురక్షితంగా ఉంచడం, వారి బ్యాంకు ఖాతా లేదా క్రెడిట్ కార్డ్ ఖాతాలోకి ఎవరూ చొరబడకుండా చూసుకోవడమే లక్ష్యమని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది.

టోకెన్ వ్యవస్థ
తమ కస్టమర్లకు టోకెన్ సౌకర్యాన్ని అందించాలని కార్డ్ కంపెనీలు, పేమెంట్ గేట్‌వేలు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారంలకు రిజర్వ్ బ్యాంకు సూచించింది.
టోకెనైజేషన్ అంటే మీ కార్డ్‌తో లావాదేవీలు చేస్తున్నప్పుడు ఒక టోకెన్‌ను తయారుచేసుకోవచ్చు.
ఈ టోకెన్ మీ గుర్తింపుగా వ్యాపారి సైట్‌కి వెళుతుంది. దీని ద్వారానే అమ్మకపుదారుడు మీ బ్యాంకు లేదా కార్డ్ ఖాతా నుంచి డబ్బు వసూలు చేసుకోగలడు.
ఈ టోకెన్ మీకు మాత్రమే సొంతం. వేరొకరికి ఇది పనికిరాదు. ఒక వ్యాపారి, ప్లాట్‌ఫారం లేదా ఒక పరికరానికి మాత్రమే ఈ టోకెన్ జత పడుతుంది.
ఇది ఎలా తయారవుతుంది, ఎలా పని చేస్తుంది మొదలైన అంశాల వెనుక క్లిష్టమైన సమీకరణాలు ఉంటాయి.
ఈ టోకెన్ వ్యవస్థ కస్టమర్లకు మార్గం సుగమం చేస్తుంది. కొనుగోలు చేసిన ప్రతీసారి కార్డు వివరాలన్నీ ఇవ్వక్కర్లేకుండా టోకెన్ కాపాడుతుంది.
వ్యాపారులు లేదా పేమెంట్ కంపెనీలు ప్రతి కొనుగోలుదారుడికీ టోకెనైజేషన్ ఎంచుకునే అవకాశం కల్పించాల్సిందే. ఇది రిజర్వ్ బ్యాంకు విధించిన నిబంధన.
దీని వలన, లావాదేవీల సమయంలో, కస్టమర్ బ్యాంకు వివరాలు లేదా వారి క్రెడిట్ కార్డ్ వివరాలు వ్యాపారి కంప్యూటర్‌కు చేరవు. వారికి కేవలం ఒక నిర్దిష్టమైన (యునిక్) టోకెన్ మాత్రమే అందుతుంది. దాంతో, కొనుగోలు, అమ్మకం జరుగుతాయి.
అయితే, వినియోగదారులు కచ్చితంగా టోకెన్ వాడాలనే నియమం లేదు. టోకెన్ తయారుచేసుకోవచ్చు లేదా కార్డు వివరాలు ఇవ్వొచ్చు.

ఫొటో సోర్స్, PA Media
లావాదేవీలు రియల్ టైంలో జరిగే సైట్లు.. అంటే డబ్బు చెల్లించిన వెంటనే కస్టమర్లకు సేవలు అందించే వెబ్‌సైట్లను మధ్యవర్తుల నిర్వచనం నుంచి దూరంగా ఉంచుతామని కూడా రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది. బుక్‌మైషో లేదా యాత్రా, మేక్ మై ట్రిప్ లాంటి వెబ్‌సైట్లు ఈ కోవలోకి వస్తాయి.
ఇకపై, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు జారీ చేసే బ్యాంకు లేదా నెట్‌వర్క్‌ల మినహా కార్డు వివరాలు ఎవరి దగ్గరా స్టోర్ కావు.
గుర్తింపు, సౌలభ్యం కోసం గరిష్టంగా కస్టమర్ పేరు, కార్డు చివరి నాలుగు అంకెలు స్టోర్ చేసుకోవచ్చు.
ఇప్పటివరకూ డాటాబేస్‌లో స్టోర్ అయిన అన్ని వివరాలనూ కంపెనీలు, అగ్రిగేటర్లు తక్షణమే తొలగించాలి.
అయితే, టోకైనైజేషన్‌లో కూడా టూ ఫ్యాక్టర్ ఆథరైజేషన్ ఉంటుంది. వినియోగదారుల సమ్మతి అవసరం.
కాగా, ఈ టోకెన్ వ్యవస్థను ప్రారంభించడం అంత సులభం కాదు. కార్డ్ కంపెనీలు, ముఖ్యంగా ఇ-కామర్స్ వ్యాపారంలో ఉన్న వాళ్లంతా తమ సిస్టంలలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది.
అందుకే నిబంధనల గడువు తేదీని పొడిగించాలని వారంతా రిజర్వ్ బ్యాంకును కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇ-రూపీ: గూగుల్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకుండానే చెల్లింపులు, ఇదెలా పని చేస్తుంది?
- విజన్ 2020: అబ్దుల్ కలాం, చంద్రబాబు లక్ష్యాలు ఏంటి? వాటిలో ఎన్ని నెరవేరాయి
- మోదీ ఏడేళ్ల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ఈ ఏడు చార్టులు చెప్పేస్తాయి
- సెప్టెంబర్ 1 నుంచి అమలవుతున్న కొత్త నిర్ణయాలు ఇవే, వీటి వల్ల మీ జేబుపై పడే భారమెంత?
- ఒకప్పటి భారతదేశానికి నేటి ఇండియాకు తేడా ఇదే
- మాస్టర్ కార్డ్ భారత్‌లో కొత్త కార్డులు జారీ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ నిషేధం
- కరోనావైరస్ రోజుల్లో బంధు మిత్రులను ఆదుకుంటున్న 'బ్యాంకర్ లేడీస్'
- ట్రేడింగ్ చేస్తున్న చిట్టెలుక.. వారెన్ బఫెట్ కంపెనీ కంటే ఎక్కువ లాభాల శాతం
- స్కూల్ సెలవుల్లో తిమింగలం బొమ్మలు సృష్టించి రూ.3 కోట్లు సంపాదించాడు
- 1900నాటి ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోంది: ప్రపంచ బ్యాంకు మాజీ అధిపతి హెచ్చరిక
- కొత్త నోట్లు ముద్రిస్తే భారత ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందా
- భారత్‌లో వ్యాపారం ఎంత ఈజీగా మారిపోయిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








