ఉత్తరాఖండ్: రిటైరయ్యే వయసులో కోర్టు కేసు గెలిచి ఉద్యోగం సంపాదించిన లెక్చరర్

డెహ్రాడూన్:55 ఏళ్ల వయసులో ఉద్యోగం సాధించిన సీనియర్ లెక్చరర్ జెరాల్డ్ జాన్

ఫొటో సోర్స్, RAJESH DOBRIYAL/BBC

ఫొటో క్యాప్షన్, 55 ఏళ్ల వయసులో ఉద్యోగం సాధించిన సీనియర్ లెక్చరర్ జెరాల్డ్ జాన్
    • రచయిత, రాజేశ్ దోబ్రియాల్
    • హోదా, డెహ్రాడూన్ నుంచి, బీబీసీ కోసం....

ఉత్తరాఖండ్‌కు చెందిన 55 ఏళ్ల జెరాల్డ్ జాన్ కథ వింటే రష్యన్ రచయిత ఆంటోన్ చెకోవ్ రాసిన 'ది బెట్' కథలోని ప్రధాన పాత్రధారి అయిన యువ లాయర్ గుర్తొస్తారు. ఈ కథలో ఆ లాయర్ 15 ఏళ్లపాటు ప్రపంచానికి దూరంగా తనకు తాను ఏకాంత వాసం విధించుకుంటారు.

24 ఏళ్ల వయసులో, చేతిదాకా వచ్చినా, పొందలేకపోయిన ఉద్యోగాన్ని 31 ఏళ్ల న్యాయపోరాటం ద్వారా సాధించారు జెరాల్డ్ జాన్. ప్రస్తుతం ఆయన వయసు 55 సంవత్సరాలు

ఉద్యోగ పరీక్షలో మెరిట్‌లో నిలిచినా ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. కానీ, మూడు దశాబ్దాల ఆ నిరీక్షణకు ఫలాన్ని మాత్రం దక్కించుకోబోతున్నారు.

31 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఉద్యోగం సంపాదించిన జెరాల్డ్ జాన్‌కు ఎవరి మీదా కోపం లేదు. ఇన్నాళ్లూ తాను చేసిన, చేయలేక పోయిన పనుల మీద పశ్చాత్తాపం లేదు.

ఆయనలోని కోపాన్ని, నిరాశను, ఆనందాన్ని ఈ సుదీర్ఘ పోరాటం పొడిబారిపోయేలా చేసింది.

డెహ్రాడూన్‌ లోని సీఎన్ఐ కాలేజీకి 167 ఏళ్ల చరిత్ర ఉంది.

ఫొటో సోర్స్, RAJESH DOBRIYAL/BBC

ఫొటో క్యాప్షన్, డెహ్రాడూన్‌ లోని సీఎన్ఐ కాలేజీకి 167 ఏళ్ల చరిత్ర ఉంది.

వచ్చినట్లే వచ్చి....

1989లో డెహ్రాడూన్‌లోని సీఎన్ఐ బాయ్స్ ఇంటర్ కాలేజ్‌లో టీచర్ ఆఫ్ కామర్స్ సబ్జెక్ట్ కోసం రిక్రూట్‌మెంట్ జరిగింది. 24 ఏళ్ల జెరాల్డ్ జాన్‌కు ఈ ఉద్యోగం వచ్చింది. మెరిట్‌ లిస్టులో ఆయన అగ్రస్థానంలో ఉన్నారు.

కానీ, షార్ట్‌హ్యాండ్ తెలియదనే కారణంతో విద్యాశాఖ అధికారులు ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. జెరాల్డ్ తర్వాత స్థానంలో ఉన్న వ్యక్తికి ఆ జాబ్ దక్కింది.

వాస్తవానికి జెరాల్డ్ దరఖాస్తు చేసిన పోస్టుకు షార్ట్‌హ్యాండ్ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 1990లో అలహాబాద్ కోర్టులో జెరాల్డ్ కేసు వేశారు.

ఉత్తరాఖండ్ ఏర్పడిన తర్వాత, ఈ కేసు నైనిటాల్‌ లోని ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ అయ్యింది.

2007లో ఉత్తరాఖండ్ హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వగా, దీనిపై ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. డిసెంబర్ 2020 లో సుప్రీంకోర్టు జాన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

2021 జనవరిలో సీఎన్ఐ బాయ్స్ ఇంటర్ కాలేజ్‌లో 11, 12 తరగతులకు సీనియర్ లెక్చరర్‌గా నియమించాలని కోర్టు ఆదేశించింది.

సీఎన్ఐ కాలేజీ ప్రిన్సిపాల్ పదవి విరమణ చేయడంలో ఆయన స్థానంలో తాత్కాలిక ప్రిన్సిపాల్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జెరాల్డ్ ప్రస్తుతం కాలేజీ తాత్కాలిక ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు.

ఫొటో సోర్స్, RAJESH DOBRIYAL/BBC

ఫొటో క్యాప్షన్, జెరాల్డ్ ప్రస్తుతం కాలేజీ తాత్కాలిక ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు.

బాధకు, సంతోషానికీ అతీతంగా...

డెహ్రాడూన్‌లోని రద్దీగా ఉండే పల్టాన్ బజార్‌లోని సీఎన్ఐ ఇంటర్ కాలేజీకి వెళ్లి, మీ కథను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నానని సీనియర్ లెక్చరర్ జెరాల్డ్ జాన్‌తో నేను అన్నాను.

''ఇప్పుడు నా కథ అవసరం లేదు. పత్రికలు ఇప్పటికే అవసరమైన దానికన్నా ఎక్కువ రాశాయి'' అన్నారాయన.

స్థానిక మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, లెక్చరర్ జెరాల్డ్ జాన్‌కు ఇవ్వాల్సిన 20 ఏళ్ల బకాయిలను ఉత్తరాఖండ్ విద్యాశాఖ చెల్లించింది. ఉత్తర్‌ప్రదేశ్ వాటా కింద రావాల్సిన 10 సంవత్సరాల బకాయి మిగిలి ఉంది.

అయితే, తనకు ఇంత వరకు ఎవరి నుంచీ ఎలాంటి చెల్లింపులు జరగలేదని జాన్ జెరాల్డ్ చెప్పారు. తన గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆయన బాధపడ్డారు.

వీడియో క్యాప్షన్, టాయిలెట్లు లేక మహిళ కష్టాలు...

సాధించింది ఏంటి, కోల్పోయింది ఏంటి?

సీఎన్ఐ ఇంటర్ కాలేజీకి చెందిన మరో లెక్చరర్ జాన్‌తో పాటు కూర్చున్నాడు. ''ఇంత కాలం పోరాడాలంటే చాలా ధైర్యం కావాలి. అందుకే మేమంతా జాన్‌ని చాలా గౌరవిస్తాం'' అని అన్నారు. తన పేరు ప్రచురించడానికి ఆయన ఇష్టపడ లేదు.

''అలాంటి పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. అనిశ్చితి కారణంగా వేరే పని ఏమీ చేయలేరు. నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. న్యాయం జరుగుతుందో లేదో, పోరాటం ఎంతకాలం సాగుతుందో తెలియదు. ఒంటరిగానే ఈ యుద్ధంలో పోరాడాలి'' అన్నారాయన.

కానీ, జాన్ చాలా సింపుల్‌గా కనిపిస్తున్నారు. సంపాదన కోసం ఈ 30 ఏళ్ల కాలంలో ఏమీ చేయలేదా? అని జాన్ సహ లెక్చరర్‌ ను అడిగాను.

"ఏం చేయగలరు. తనకు తెలిసింది టీచింగ్ ఒక్కడే. ఏదో ఒకటి చేయాలి కాబట్టి, ఇంట్లో ట్యూషన్లు చెప్పుకుంటూ బతికారు'' అన్నారాయన.

31 ఏళ్ల కిందట జెరాల్డ్‌ జాన్‌ స్థానంలో ఉద్యోగం సంపాదించిన వ్యక్తి రిటైర్‌ కూడా అయ్యారు. మెరిట్‌ లిస్ట్‌లో ఉన్న జాన్‌ ను కాదని, వేరే వ్యక్తికి ఉద్యోగం ఇచ్చిన అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు.

''జాన్ తల్చుకుంటే ఇలాంటి వ్యక్తులను కూడా కేసులో పార్టీగా మార్చేవారు. చాలా జరిగేవి. కానీ, ఆయన వదిలేశారు. జాన్‌కు ఇవన్నీ అవసరం లేదు. తన గౌరవం కోసం మాత్రమే ఆయన పోరాడారు'' అన్నారు జాన్ సహ లెక్చరర్

24 సంవత్సరాల వయస్సులో అనుకోకుండానో, ఉద్దేశపూర్వకంగా ఉద్యోగం పొందడానికి నిరాకరణకు గురైన జాన్, అవివాహితుడిగానే మిగిలిపోయారు. మొదట్లో తల్లి ఎంతో చెప్పి చూశారని, తర్వాత దాని గురించి ఎవరూ ఆలోచించలేదని ఆ కాలేజీ లెక్చరర్ వెల్లడించారు.

''సార్‌ కు ఆత్మాభిమానం ఎక్కువ. న్యాయం జరిగే వరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు'' అని ఆయన సహ లెక్చరర్లు చెప్పారు.

''పెళ్లి చేసుకుంటే..ఈ పోరాటం చేసి ఉండేవాడిని కాదు. ఇంత సుదీర్ఘ పోరాటం చేసి నేను కేసు గెలుస్తానని మా బంధువులకు కూడా నమ్మకం లేదు'' అన్నారు జాన్.

మీరు జీవితంలో ఏం సాధించారు, ఏం పోగొట్టుకున్నారు అని నేను ఆయన్ను ప్రశ్నించాను. ''నాకు ఎవరి మీదా కోపం లేదు. జరిగిన దానికి పశ్చాత్తాపం లేదు. ఇక డబ్బంటారా? అది ఎప్పటికైనా నాకే వస్తుంది. కాకపోతే పింఛను కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది'' అన్నారు జాన్.

సీఎన్ఐ కాలేజీని 1854లో స్థాపించారు.

ఫొటో సోర్స్, RAJESH DOBRIYAL/BBC

ఫొటో క్యాప్షన్, సీఎన్ఐ కాలేజీని 1854లో స్థాపించారు.

పేరున్న కాలేజీలో...

చర్చ్ ఆఫ్ ఇండియా...సీఎన్ఐ కాలేజీ సంక్షిప్త నామం ఇది. 1854లో దీనిని స్థాపించారు. డెహ్రాడూన్‌లోని పాత కాలేజీలలో ఇది ఒకటి. చారిత్రాత్మకమైన సంస్థలో పని చేయడం గర్వంగా ఉందా అని జాన్‌ను ప్రశ్నించినప్పుడు ఆయన ముఖంలో ఎలాంటి భావాలు కనిపించ లేదు.

167 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఇంటర్ కాలేజీ గోడలలోని ఎర్ర ఇటుకల మధ్య నుంచి మొక్కలు పెరుగుతున్నాయి. నేను కాలేజీ నుండి బయటకి వస్తూ, ఇంటర్ కాలేజీ వైపు చూశాను. అక్కడే నిలబడి ఉన్న జెరాల్డ్ జాన్ ముఖం అదే తేజస్సు, అదే నిర్వికారత, అదే ప్రశాంతతో కనిపించింది.

వీడియో క్యాప్షన్, తామెవరో తమకే తెలియని వారికి అన్నీ తామై నిలుస్తున్న అనాథల పుణ్యక్షేత్రం ఇది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)