క్రిప్టోకరెన్సీ: భారత్‌లో తొలి బిట్ కాయిన్ స్కామ్, 25 ఏళ్ల హ్యాకర్ చుట్టూ తిరుగుతున్న కర్ణాటక రాజకీయాలు

క్రిప్టోకరెన్సీ

ఫొటో సోర్స్, Nik Oiko/SOPA Images/LightRocket via Getty Images

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

శ్రీ కృష్ణ రమేష్ అలియాస్ సిక్రీ స్కూలు చదువు సాగుతుండగానే హ్యాకింగ్‌కు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని సంపాదించాడని చెబుతున్నారు.

బిట్‌కాయిన్ ఎక్స్చేంజ్, పోకర్ గేమ్ వెబ్‌సైట్లు, కర్నాటక ప్రభుత్వ ఈ- గవర్నెన్స్‌కు సంబంధించిన ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్‌సైటును కూడా హ్యాకింగ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.

హాంగ్‌కాంగ్‌కు చెందిన బిట్‌ఫినెక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్‌‌ను కూడా 2015లో హ్యాక్ చేసినట్లు శ్రీ కృష్ణ పోలీసులకు స్వయంగా తెలిపారు. ఆగస్టు 2016లో ఇదే ఎక్స్చేంజ్‌ నుంచి 1,19,756 బిట్ కాయిన్ల దొంగతనం జరిగింది.

కృష్ణ గతంలో మాదక ద్రవ్యాల కేసుల్లో జైలుకు వెళ్లి, విడుదలయ్యారు. గత వారం తిరిగి ఆయన జైలుకు వెళ్లారు.

కానీ, ఆయన చేసిన పనులు, విచారణ సంస్థల ఎదుట చెబుతున్న మాటలు, విచారణ జరుగుతున్న తీరు కర్నాటక ముఖ్యమంత్రి బొమ్మై, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్య రాజకీయ వివాదానికి దారి తీశాయి.

శ్రీకృష్ణ చెబుతున్న విషయాలకు ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఈ విచారణతో నేరుగా సంబంధం ఉన్న పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ పోలీసు అధికారి బీబీసీతో మాట్లాడారు.

బసవరాజ్ బొమ్మై

ఫొటో సోర్స్, BASAVARAJ BOMMAI/FACEBOOK

బిట్‌కాయిన్ స్కాం పట్ల పార్టీలో తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తూ బొమ్మై కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారని వస్తున్న వార్తలను మాత్రం బీజేపీలో ఎవరూ ఖండించలేదు. ఈ వ్యవహారంపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పార్టీ శాఖ నుంచి నివేదిక కోరిన విషయాన్ని కూడా ఎవరూ అధికారికంగా ధ్రువీకరించలేదు.

అయితే, ప్రభుత్వం ఈ విచారణను తప్పు దారి పట్టించడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

"పై నున్న వారిని కాపాడేందుకే ఈ పోలీసు విచారణ సాగుతోంది. సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జితో విచారణ చేయిస్తేనే నిజం బయటకు వస్తుంది" అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, బిట్‌కాయిన్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?

శ్రీ కృష్ణ పాత్ర

హ్యాకింగ్‌లో శ్రీ కృష్ణకు అద్భుతమైన నైపుణ్యం ఉందని పోలీసులు చెబుతున్నారు.

కోర్టులో చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు స్వయంగా చేసిన వాంగ్మూలంలో నాలుగవ తరగతి నుంచే దీనికి సంబంధించిన మెళకువలు నేర్చుకున్నానని శ్రీ కృష్ణ చెప్పారు. ఈ నైపుణ్యమే సైబర్‌ క్రైమ్ నేరాలు చేసేందుకు పనికొచ్చిందని చెప్పారు.

ఆయన 10వ తరగతి చదివే లోపే, బ్లాక్‌హ్యాట్ హ్యాకర్స్ అనే గ్రూపులో చేరి, హ్యాకింగ్ గురించి, మోసం చేయడం గురించి మెళకువలు నేర్చుకున్నట్లు చెప్పారు.

ఆ తర్వాత శ్రీ కృష్ణ బెంగళూరు కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదివి నెదర్లాండ్స్ వెళ్లారు. వెబ్ సైట్లు, బిట్‌కాయిన్ ఎక్స్చేంజ‌్‌ల్లోకి ప్రవేశించడంలో నైపుణ్యం సాధించారు. ఈ ఎక్స్చేంజ‌్‌ల్లో డబ్బుల కోసం బిట్‌కాయిన్ల మార్పిడి జరుగుతుంది.

అయితే, శ్రీ కృష్ణకు సొంత బ్యాంకు అకౌంట్ లేదు. దాంతో, డబ్బంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆయన స్నేహితుడు రాబిన్ ఖండేల్‌వాల్ అకౌంట్‌కు వెళ్ళింది.

రాబిన్‌కు 8 కోట్ల విలువైన బిట్‌కాయిన్‌లను ఇచ్చినట్లు ఆయన చెప్పారు. రాబిన్ దానికి బదులుగా ఆయనకు డబ్బు ఇస్తారని చెప్పారు.

క్రిప్టో కరెన్సీ

ఫొటో సోర్స్, ADALBERTO ROQUE/AFP via Getty Images

శ్రీ కృష్ణ కొన్ని వారాల పాటూ విలాసవంతమైన హోటళ్లలో ఉండేందుకు ఆయన స్నేహితులు సహాయం చేసేవారని పోలీసులు చెప్పారు. అక్కడ నుంచే పోకర్ వెబ్‌సైట్లను హ్యాక్ చేసేవారు. ఆయన స్నేహితులు కొన్ని కార్డు గేమ్‌లను గెలుచుకునేవారు.

ఆయన బిట్‌ఫినెక్స్ బిట్‌కాయిన్ ఎక్స్చేంజ‌్‌ను హ్యాక్ చేసి 2000 బిట్ కాయిన్లను దొంగలించినట్లు చెబుతున్నారు.

అప్పట్లో ఒక్కొక్క బిట్ కాయిన్ విలువ 100 - 200 యూఎస్ డాలర్లు(సుమారు రూ. 7400 - 15000) ఉండేది.

విలాసవంతమైన హోటళ్లలో గడిపి ఆ డబ్బును ఖర్చు పెట్టేసినట్లు ఆయన చెప్పారు.

బెంగళూరులో ఒక ఖరీదైన మాల్‌లో ఉన్న ఒక రెస్టారంట్‌లో జరిగిన గొడవ తర్వాత శ్రీ కృష్ణ పేరు మొదటి సారి పోలీసు రికార్డుల్లోకి చేరింది.

ఫర్జీ కెఫే కేసుగా పేర్కొనే ఈ కేసులో కాంగ్రెస్ ఎంఎల్‌ఏ ఎన్ఏ హ్యారిస్ కొడుకు మొహమ్మద్ నలపాడ్ మరొక రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కొడుకు విద్వత్‌పై చేయి చేసుకున్నాడనే అభియోగం ఉంది.

ఆ సమయంలో ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల పిల్లలు కూడా అక్కడ ఉన్నారు.

శ్రీ కృష్ణ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నలపాడ్ పేరును ప్రస్తావించారు. దీనిని బెంగళూరు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో రిజిస్టర్ చేశారు.

ఈ కేసులో శ్రీ కృష్ణ కూడా ఒక నిందితుడు. కానీ, యాంటిసిపేటరీ బెయిల్ దొరికిన తర్వాతే ఆయన నగరానికి విచ్చేసారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటిస్తూ అరెస్టు నుంచి తప్పించుకున్నారు.

ఆ తర్వాత నవంబరు 2020లో డార్క్‌నెట్ ద్వారా మాదక ద్రవ్యాలను అందుకున్న కేసులో రెండవ సారి ఆయన పేరు పోలీసు రికార్డుల్లోకి చేరింది.

క్రిప్టో కరెన్సీ

ఫొటో సోర్స్, Costfoto/Barcroft Media via Getty Images)

ఆ సమయంలో కూడా శ్రీ కృష్ణ తనకున్న హ్యాకింగ్ నైపుణ్యం గురించి, జీవన శైలి గురించి చెప్పారు.

అలా కర్నాటక ఈ ప్రొక్యూర్మెంట్ లో చోటు చేసుకున్న రూ.11.5 కోట్ల హ్యాకింగ్ కేసు విచారణ ముందుకు కదిలేందుకు వీలయింది.

ఈ కేసును ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తోంది.

ఈ-గవర్నెన్స్ నుంచి దోచుకున్న సొమ్ము ఉత్తర్‌ప్రదేశ్ లోని బులంద్‌షహర్ కు చెందిన నిమ్మి ఎంటర్ ప్రైజెస్ అనే కంపెనీకి చెందిన 14 అకౌంట్లలో ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు నాగపూర్ కి చెందిన ఉదయ్ గ్రామ వికాస్ సంస్థ అనే స్వచ్చంద సంస్థ అకౌంట్లలో కూడా చేరినట్లు ఈడీ ఆగస్టులో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

"ఇదొక పెద్ద మనీ లాండరింగ్ స్కాంను తలపిస్తోంది" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి అన్నారు.

సిద్దరామయ్య

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ వాగ్వాదం

అయితే, ఈ వ్యవహారంలో కొంత మంది రాజకీయ నాయకుల హస్తం ఉందని కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య సోషల్ మీడియా వేదికగా తన ఆందోళనను వ్యక్తం చేశారు. దీంతో, ఈ గొడవ రాజకీయ రంగును పులుముకుంది.

"రాజకీయ నాయకులకు సహాయం చేసేందుకు ఈ కేసును మూసివేద్దామని కూడా అనుకున్నారు" అని సిద్దరామయ్య ఆరోపించారు.

దాంతో, ముఖ్యమంత్రి బొమ్మై, సిద్దరామయ్య మధ్య వాగ్వాదం మొదలయింది.

ఆయన సిటీ క్రైం బ్రాంచ్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ప్రస్తావించిన 5000 బిట్ కాయిన్ ల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. ఒక్కొక్క బిట్ కాయిన్ విలువ 49 లక్షలని చెబుతున్నారు. అయితే, ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ పర్యవేక్షిస్తున్నాయని బొమ్మై బదులిచ్చారు.

కాంగ్రెస్, జేడీఎస్ అధికారంలో ఉన్నప్పుడే శ్రీకృష్ణను విడుదల చేశారని బొమ్మై అన్నారు.

అయితే, ఈ ఆరోపణను సిద్ధరామయ్య ఖండించారు.

ముఖ్యమంత్రి చేస్తున్న వాదనలను సమర్ధించేందుకు సొంత పార్టీలో నాయకులెవరూ ముందుకు రాలేదు. చివరకు కాంగ్రె‌స్‌ను వదిలి పెట్టి వచ్చిన ఇద్దరు మంత్రులు మాత్రం నోరు విప్పారు.

"ప్రతీ చిన్న విషయానికీ ప్రకటనలు చేస్తున్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ కుమార్ కటీల్ ఈ విషయంలో మౌనం ఎందుకు వహించారు" అని ప్రియాంక్ ప్రశ్నించారు.

ఈ బిట్‌కాయిన్ అంశం గురించి పెద్దగా పట్టించుకోవద్దని ప్రధాన మంత్రి మోదీ తనతో చెప్పినట్లు బొమ్మై విలేఖరులకు చెప్పారు.

"ఈ వ్యవహారంలో బొమ్మై పాత్ర ఉందో లేదో.. మాకు తెలియదు. ఈ కేసును సరైన రీతిలో విచారించి తప్పు చేసిన వారిని శిక్షించాలని మాత్రమే మేము కోరుతున్నాం" అని సిద్దరామయ్య అన్నారు.

ఈ విచారణ జరుగుతున్న తీరు పట్ల సిద్ధరామయ్యతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్, ప్రియాంక్ ఖర్గే కూడా ప్రశ్నలు లేవనెత్తారు.

సిద్దరామయ్య , కుమార స్వామి

ఫొటో సోర్స్, Getty Images

"శ్రీ కృష్ణ దగ్గర నుంచి రూ. 9 కోట్ల విలువైన బిట్‌కాయిన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

"బొమ్మై హోం మంత్రిగా ఉన్న సమయంలో స్వాధీనం చేసుకున్న 31 బిట్ కాయిన్లు ఏమయ్యాయో సమాధానం చెప్పాలి. నేడు ఒక్కొక్క బిట్‌కాయిన్ విలువ రూ. 51 లక్షలు" అని సిద్ధ రామయ్య అన్నారు.

"ఈ కేసుల విచారణ పట్ల బీజేపీ సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఇక్కడ వాస్తవాలను దాచిపెట్టి, ఎవరినో కాపాడాల్సిన అవసరం లేదు" అని కర్నాటక బీజేపీ ప్రతినిధి గణేష్ కార్నిక్ బీబీసీకి చెప్పారు.

బొమ్మై ఈ అంశాన్ని లేవనెత్తిన వెంటనే ప్రధాన మంత్రి క్రిప్టో కరెన్సీలతో వ్యవహరించే తీరు పట్ల అధికారిక సమావేశాన్ని నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

పోలీసు విచారణ పట్ల ఎదురవుతున్న ప్రశ్నలు

అయితే, 31 బిట్ కాయిన్లు కనిపించటం లేదని సిద్ధరామయ్య చేసిన ఆరోపణను పోలీసులు ఖండించారు.

"శ్రీ కృష్ణ అకౌంట్ నుంచి బిట్‌కాయిన్‌ల బదిలీ జరగలేదు. అలాగే, బిట్‌కాయిన్‌లు చోరీ అవ్వలేదు" అని పోలీస్ కమీషనర్ కమల్ పంత్ చెప్పారు.

గత డిసెంబరులో క్రిప్టో కరెన్సీ అకౌంట్ తెరిచేందుకు పోలీసులకు అనుమతి లభించింది.

31.08 బిట్‌కాయిన్‌లు ఉన్న బిట్‌కాయిన్ అకౌంట్ వాలెట్‌ను శ్రీ కృష్ణ చూపించారు.

కానీ, వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అందులో 186.811 బిట్ కాయిన్‌లు ఉన్నట్లు తెలిసింది.

"వ్యక్తిగత అకౌంట్ అని చెబుతున్న అకౌంట్ ఒక ఎక్స్చేంజీలో లైవ్ వాలెట్ అని దానికి నిందితుడి దగ్గర ప్రైవేటు కీ లేదని సైబర్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు".

శ్రీ కృష్ణ చెబుతున్న విషయాలకు ఆధారాలు లేవని సైబర్ నిపుణులు చెబుతున్నట్లు పోలీసులు అంటున్నారు.

నిందితుడు చెబుతున్నట్లుగా విదేశీ న్యాయ విచారణ సంస్థలు కానీ, విదేశీ సంస్థలు కానీ బెంగళూరు పోలీసులను సంప్రదించలేదని పోలీసులు రాసిన స్టేట్మెంట్ చెబుతోంది.

ఆఖరుకు బిట్ ఫినెక్స్ కూడా తమను ఎటువంటి సమాచారం కోసం సంప్రదించలేదని పోలీసులు చెబుతున్నారు.

అయితే, క్రిప్టోకరెన్సీ వెబ్‌సైట్లను హ్యాక్ చేసినట్లు నిందితుడు చెప్పడంతో, ఒక కేసును ఏప్రిల్ 2021లో సీబీఐ ఇంటర్ పోల్ అధికారికి రిఫర్ చేసినట్లు చెప్పారు.

"ఇంటర్‌పోల్‌కు రిఫర్ చేసిన కేసులో విచారణ చేయవలసిన మొత్తం రూ. 23,000. కానీ, ఈ కేసుకు వేసిన క్రైం నంబర్ తప్పని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయం గ్రహించడానికి పోలీసులకు ఆరు నెలలు పట్టింది. నేను చెప్పేవరకూ ఈ విషయం అర్ధం కాలేదు" అని ప్రియాంక్ ఖర్గే అంటున్నారు.

"పై స్థాయిల్లో ఉన్న వారిని రక్షించేందుకే ఈ విచారణ కొనసాగుతోందని మాకు అర్ధమవుతోంది. సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జీ విచారణకు ఇచ్చేవరకూ, నిజం బయటకు రాదు" అని ప్రియాంక్ ఖర్గే అన్నారు.

వీడియో క్యాప్షన్, బిట్ కాయిన్ మైనింగ్ ఫ్యాక్టరీ చూద్దాం రండి

బిట్ కాయిన్లు 'వైల్డ్ వెస్ట్' లాంటివి

బిట్ కాయిన్ లు 'వైల్డ్ వెస్ట్' లాంటివి (18వ శతాబ్దంలో పశ్చిమ అమెరికా ప్రాంతంలో నెలకొన్న హింసాత్మక, అనిశ్చిత పరిస్థితులను వైల్డ్ వెస్ట్ అని వర్ణిస్తారు) అని బెంగళూరుకు చెందిన సెక్యూరిట్ కన్‌సల్టెన్సీ సీఈఓ సిఎన్ శశిధర్ చెప్పారు.

"ఇది పూర్తిగా రహస్యం. ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు, అమ్మవచ్చు. దాంతో, మనీ లాండరింగ్ కార్యకలాపాలకు, నేర కార్యకలాపాలకు దీనిని వాడతారు. ఇది కూడా హవాలా రాకెట్ లాంటిదే. ఈ డబ్బుతో మాదక ద్రవ్యాలు కొనొచ్చు. అన్నిటి కంటే దారుణమైన విషయం ఏంటంటే, ఇది బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తిగా అధిగమిస్తుంది. ఇది ఏ ప్రభుత్వాన్నైనా భయపెట్టే విషయమే" అని అన్నారు.

శ్రీ కృష్ణ చెబుతున్న మాటల్లో వాస్తవం ఉందో, లేదో పోలీసులెలా కనిపెడతారు?

"శ్రీ కృష్ణ ఇంటర్నెట్ ద్వారా పని చేయడంతో ఆయన కార్యకలాపాలకు సంబంధించిన అన్ని రికార్డులను సంపాదించవచ్చు. సేకరించిన ఆధారాలను తిరిగి పునర్నిర్మించుకుని పరిశీలించాలి. ఆన్‌లైన్ లో సాక్ష్యాలు చెరిగిపోవు. అయితే, పోలీసులు ఇచ్చిన స్టేట్ మెంట్ చూస్తుంటే మన దేశం నుంచి హ్యాకింగ్ జరిగినట్లు తెలుసుకునేందుకు బిట్ కాయిన్ ఎక్స్చేంజ్‌ను సంప్రదించారా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది" అని అన్నారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

శ్రీ కృష్ణ ఏమన్నారు?

పబ్‌లో చోటు చేసుకున్న గొడవ తర్వాత శ్రీ కృష్ణ ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఉండగా అరెస్టు చేశారు.

అప్పుడు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ "ఇదంతా అబద్ధం. విసుగ్గా ఉంది. దీని గురించి నాకేమి తెలియదు" అని చెప్పారు.

ఏమి జరగబోతోంది?

"సంపన్నులు, రాజకీయ పలుకుబడి ఉన్న అతని స్నేహితులు శ్రీ కృష్ణను పావుగా ఉపయోగించుకున్నాయి" అని పేరు చెప్పడానికి ఇష్టపడని బీజేపీ నాయకుడు ఒకరు బీబీసీతో అన్నారు.

"నిప్పు లేకుండా పొగ రాదు. అయితే, ఈ పొగ ఎంత వరకు వ్యాపిస్తుందో ఎవరికీ తెలియదు" అని అన్నారు.

శ్రీ కృష్ణపై ఉన్న కేసులు ఎంత దూరం వెళతాయో, ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తాయో ఎవరికీ తెలియదు.

"అమిత్ షాకి అన్నీ తెలుసు. ఆయనెప్పుడు బాణాన్ని విసురుతారో ఎవరికీ తెలియదు" అని బీజేపీలో ప్రముఖులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)