ఫిల్మీమోజీ హిట్ కొట్టింది ఇలా.. మీరూ ఇలానే కలల ప్రపంచానికి బాటలు వేసుకోండి

ఫిల్మీమోజీ
ఫొటో క్యాప్షన్, తపన క్యారెక్టర్ పోషిస్తున్న ఐశ్వర్య కేతినీడి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

"చూడాలమ్మరేయ్, చెప్పాలమ్మరేయ్, వినాలమ్మరేయ్"...అంటూ వన్ ఏ మాస్టర్ మెమోజీ తన స్టూడెంట్లతో చేసే కామెడీ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తోంది.

ఇలాంటి క్యారెర్టర్లు ఫిల్మీమోజీ అనే యూ ట్యూబ్ ఛానల్ లో చాలానే ఉన్నాయి. ఇవన్ని కూడా మన పరిసరాల్లో, మన ఫ్యామిలీలో, మన స్నేహితుల గ్రూపుల్లో ఉండే వ్యక్తుల క్యారెక్టర్లే.

ఈ ఛానల్ ఏదైనా వీడియో పెడితే మినిమం మిలియన్ వ్యూస్ గ్యారంటీ అనే బ్రాండ్ క్రియేట్ చేసుకుంది ఫిల్మీమోజీ. అయితే ఇంత సక్సెస్ సాధించిన ఈ యూట్యూబ్ ఛానల్ ఏ మెట్రో సిటీ నుంచో నిర్వహించడం లేదు.

ఏపీలోని మూలన ఉండే విజయనగరం జిల్లా నుంచి ఫిల్మీమోజీ ఛానల్ నడుపుతున్నారు.

వీడియో క్యాప్షన్, ఫిల్మీమోజీ: మారుమూల పట్నం కుర్రోళ్లు.. కోట్ల కొద్దీ హిట్లు ఎలా కొట్టేస్తున్నారు
Presentational grey line

మీరూ ఇలానే మీ కలల ప్రపంచానికి బాటలు వేసుకోండి..

మీ ప్రతిభను బయటపెట్టేందుకు, ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు చక్కని అవకాశమిది! ఫిల్మీమోజీలానే మీరు కూడా మీ కలల ప్రపంచానికి బాటలు వేసుకున్నారా? లేదా ఇలా విజయవంతమైన వారు మీకు ఎవరైనా తెలుసా?

అయితే, ఈ కింది వివరాలను [email protected] కు పంపండి.

పూర్తి పేరు:

వయసు:

ఎవరిని నామినేట్ చేస్తున్నారు? : సెల్ఫ్/అదర్

ఒకవేళ ఇతరులను నామినేట్ చేయాలని అనుకుంటే, వారితో మీకున్న అనుబంధం ఏమిటి:

స్ఫూర్తిని నింపే మీ కథను షేర్ చేయండి:

మిమ్మల్ని మా ఎడిటోరియల్ టీమ్ సంప్రదించేందుకు కాంటాక్ట్ వివరాలు ఇవ్వండి:

Presentational grey line

మధ్యతరగతి కథలే...

విజయనగరం జిల్లా యాసతో మధ్య తరగతి కుటుంబాల్లో రోజు తల్లిదండ్రులు, పిల్లల మధ్య జరిగే సంబాషణలు, పండగ సమయాల్లో ఆ ఇళ్లలోని సందడి, డబ్బు సంపాదనకు పడే కష్టాలు, టీనేజర్ల ప్రేమలు, కాలేజ్, స్కూల్, ట్యూషన్ లలో టీచర్లకు భయపడే స్టూడెంట్లు, ఆ భయంతో చేసే పిచ్చి పనులు...ఇలాంటి విషయాలకు ఎక్కువ హాస్యం, కాస్త సందేశం జోడించి వీడియోలు చేయడమే ఫిల్మీమోజీ ఛానల్ ప్రత్యేకత.

"మిడిల్ క్లాస్ మధు, మచ్చలేని మహేష్, సరదా సుబ్బారావు, వన్ ఏ మాస్టారు...ఇలా డిఫరెంట్ క్యారెక్టర్ల మెమోజీ క్యారెక్టర్లను తమ సొంత మనుషులుగా చూస్తున్నారు. వీక్షకుల ఆదరణతో ప్రస్తుతం రెండున్నర మిలియన్ల సబ్ స్క్రెబర్ల దగ్గరకు వచ్చాం. తెలుగుతో పాటు తమిళ్, హిందీ బాషాలో కూడా ఈ ఛానల్ నిర్వహిస్తున్నాం. అలాగే ఇటీవలే ఫిల్మీ మోజీ షాట్స్ అనే ఛానల్ కూడా ప్రారంభించాం'' అని ఛానల్ ఫౌండర్ కార్తీక్ చిర్రా బీబీసీతో చెప్పారు.

తమ ఛానల్ ఊహించిన దానికంటే ఎక్కువ విజయవంతమైందని, అనేక మంది ఆ ఛానల్‌ను అనుకరిస్తూ వీడియోలు చేస్తున్నారని కార్తీక్ అన్నారు.

వీడియో క్యాప్షన్, రజనీకాంత్: ‘నేనీ స్థాయికి రావడానికి కారణమైన ఆ డ్రైవర్‌కి ఈ అవార్డు అంకితం’

ఈ క్యారెక్టర్లను ఎలా సృష్టించారంటే..

''ఐ ఫోన్ మెమోజీ టెక్నాలజీతో ఎనిమోజీ (ANIMOJI) లేదా మెమోజీలను క్రియేట్ చేస్తాం. ఇవి క్యారెక్టర్లు చేసేది నిజమైన మనుషులే అనేంతంగా హవభావాలను సైతం ప్రదర్శిస్తాయి. దాంతో నిజమైన మనుషులే మనతో మాట్లాడుతున్న అనుభవం కలుగుతుంది" అని ఆయన వివరించారు.

మూడేళ్ల క్రితం ఐఫోన్లో ఫేస్ ట్రాకింగ్ టెక్నాలజీ గురించి తెలిసినప్పుడు వచ్చిన ఆలోచన నుంచి ఈ ఛానల్ పుట్టిందని కార్తీక్ అన్నారు. అయితే తొలి రోజుల్లో పాపులర్ సినిమా డైలాగులు, వన్ లైనర్లును మెమోజీ క్యారెక్టర్లతో చెప్పించేవారు.

అది అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో సొంత కంటెంట్ తో చేసిన వినాయక చవితి వీడియో ఛానల్‌ను ప్రేక్షకులకు దగ్గర చేసింది.

''ఆ వీడియోకు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అప్పట్నుంచి కంటెంట్ పై దృష్టి పెట్టాం. ఉత్తరాంధ్ర యాసలో వీడియోలు, కొత్తకొత్తగా మెమోజీ క్యారెక్టర్లను సృష్టించడం మొదలు పెట్టాం. ఒక్కొ క్యారెక్టర్లో వీక్షకులు తమ సొంత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. దాంతో ఫిల్మీమోజీ సూపర్ హిట్ అయ్యింది" అని కార్తీక్ చెప్పారు.

1-ఏ మాస్టర్, మిడిల్ క్లాస్ మధు పాత్రలు పోషించే సాయి కిరణ్ అండలూరి
ఫొటో క్యాప్షన్, 1-ఏ మాస్టర్, మిడిల్ క్లాస్ మధు పాత్రలు పోషించే సాయి కిరణ్ అండలూరి

తెలుగు, తమిళ్, హిందీ...ఫ్రమ్ విజయనగరం

తెలుగులో ఛానల్ హిట్ కావడంతో తమిళ్, హిందీలో కూడా ఫిల్మీ మోజీ పేరుతోనే మరో రెండు ఛానల్స్ ప్రారంభించింది కార్తీక్ బృందం. అవి కూడా విజయవంతమయ్యాయి. ఈ ఛానల్స్‌ను కూడా విజయనగరం నుంచే నిర్వహిస్తున్నారు.

"విజయనగరం రాష్ట్రంలో చిన్నసిటీ. కానీ మా ఛానల్ కు కావాలసిన అన్నీ వనరులు ఇక్కడే దొరుకున్నాయి. మేం హిందీ, తమిళ్ లో ఛానల్ ప్రారంభిద్దామని అనుకున్నాం. సరిగ్గా అదే సమయంలో తమిళ్, హిందీ భాషలపై పట్టు ఉండి...డిజిటల్ మీడియాపై అవగాహన ఉన్న మరో ఇద్దరు మా ఛానల్‌ని సంప్రదించారు. వారిలో ఒకతను విజయనగరం వాసే. ఇలా మాకు అన్నీ విజయగనంలోనే దొరుకుతున్నాయి. మా ఛానల్‌లో పని చేసే టెక్నిషియన్లు, క్రియేటీవ్ టీం అంతా కూడా విజయనగరం నుంచే" అని కార్తీక్ తెలిపారు.

ప్రతి వీడియోకు యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్ సంపాదిస్తున్నట్లు ఫిల్మీమోజీ నిర్వహాకులు తెలిపారు.
ఫొటో క్యాప్షన్, ప్రతి వీడియోకు యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్ సంపాదిస్తున్నట్లు ఫిల్మీమోజీ నిర్వహాకులు తెలిపారు

మా లెక్కల మాస్టారే...మా ఛానల్ మెగాస్టార్

అల్లరి పనులతో తండ్రితో చివాట్లు తింటూ...ఫ్రెండ్స్ ముందు గొప్పలు చెప్పుకునే మిడిల్ క్లాస్ మధు క్యారెక్టర్ జనాల్లోకి దూసుకెళ్లింది. ఆ క్యారెక్టర్ ని అన్ని వయసుల వారు ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే కొన్ని రోజులకి ఈ క్యారెక్టర్ పట్ల జనాలకు ముఖం మొత్తితే...అనే ఆలోచన మోజీ టీంకి వచ్చింది. దాంతో ఇక వరుస క్యారెక్టర్లు సృష్టించామని... అందులో ప్రస్తుతం వన్ ఏ మాస్టారే మెగాస్టారని ఫిల్మీ మోజీ ఛానల్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అండలూరి సాయి కిరణ్ బీబీసీతో చెప్పారు.

"మిడిల్ క్లాస్ మధు క్యారెక్టర్ మీదే బాగా ఆధారపడినట్లు అనిపించింది. చాలామంది ఇది తప్ప మరో క్యారెక్టర్ ఉండదా అని కామెంట్లు కూడా చేశారు. ఛాలెంజ్ గా తీసుకున్నాం. అలా మచ్చలేని మహేష్, తపన, సరదా సుబ్బారావు ఇలా ఒక్కొ క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటూ పోతున్నాం. సరిగ్గా ఆ సమయంలోనే మాకు ఇంటర్‌లో పాఠాలు చెప్పిన వన్ ఏ మాస్టారు క్యారక్టర్ గుర్తొచ్చింది. వన్ ఏ మాస్టార్ పేరుతో ఒక మెమోజీ క్రియేట్ చేశాం. అంతే...ఇక ఆగలేదు'' సాయి కిరణ్ చెప్పారు.

అమ్మా...వినాలమ్మారేయ్, చూడాలమ్మారేయ్ అంటూ ఒక రకమైన మేనరిజంతో ఆయన మాకు క్లాస్ లో పాఠాలు చెప్పిన తీరు చాలా సరదాగా ఉండేదని, ఆ మేనరిజాన్నే హైలెట్ చేస్తూ చేసిన...వన్ ఏ మాస్టారు క్యారెక్టర్ బ్లాక్ బస్టరైందని సాయి కిరణ్ తెలిపారు.

వన్ ఏ మాస్టారి వీడియోలకు మిలియన్ కంటే తక్కువ వ్యూస్ రాలేదని, ప్రస్తుతం వన్ ఏ మాస్టారి క్యారెక్టర్‌ను తానే చేస్తున్నట్లు సాయి కిరణ్ తెలిపారు.

ఉద్యోగ బాధ్యతలతోపాటు క్యారెక్టర్లను కూడా పోషిస్తున్నారు ఫిల్మీమోజీ టీం సభ్యులు
ఫొటో క్యాప్షన్, ఉద్యోగ బాధ్యతలతోపాటు క్యారెక్టర్లను కూడా పోషిస్తున్నారు ఫిల్మీమోజీ టీం సభ్యులు

‘సినిమా పిచ్చోళ్లమంతా కలిశాం’

''సాధారణ మధ్య తరగతి కుటుంబం మాది. నాకు కొంత వయసు వచ్చాక సినిమాల పిచ్చి పట్టుకుంది. సినిమాల్లో ఏదైనా సాధించాలని అనుకునేవాడిని. దాంతో డిగ్రీ మధ్యలోనే ఆపేసి హైదరాబాద్‌ వెళ్లిపోయాను. అక్కడ కొందరు స్నేహితుల సలహాతో వీఎఫ్‌ఎక్స్‌ కోర్సు నేర్చుకునేందుకు ఓ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. అది కార్తీక్ చిర్రాదే. అక్కడే మా ఇద్దరికి పరిచయం'' అని వివరించారు సాయి.

"ఇన్‌స్టిట్యూట్‌లో కొందరితో మంచి స్నేహం ఏర్పడింది. వారే ఇప్పుడు మా ఫిల్మీమోజీ టీం. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో కరోనా వచ్చింది. దాంతో ఖాళీ అయిపోయాం. అంతలో కార్తీక్ ఫిల్మీ మోజీ పేరుతో మెమోజీ కాన్సెప్ట్‌ ఆధారంగా చేసుకుని ఒక యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. ఆ ఆలోచనే మా అందరి దశను మార్చేసింది" అని సాయి చెప్పారు.

సరదా సుబ్బారావు పాత్రధారి కార్తీక్ చిర్రా
ఫొటో క్యాప్షన్, సరదా సుబ్బారావు పాత్రధారి కార్తీక్ చిర్రా

15 నిముషాల కోసం మూడు రోజులు

ఐఫోన్‌లో ఉన్న మెమోజీ టెక్నాలజీతో ముఖాలకి క్యారెక్టర్ మాస్క్ లు క్రియేట్ చేస్తారు. క్యారెక్టర్లు చేసేది నిజమైన మనుషులే అయినా టెక్నాలజీతో యానిమేషన్ రూపంలోకి దాదాపుగా అదే రూపు, హావభావాలతో సహా మారిపోతాయి. అయితే ఇదంత సులభం కాదని అంటున్నారు ఫిల్మీ మోజీ టీం.

"మేం చేసే వీడియోలలో ఉన్న కంటెంట్ కు సరిగా సరిపోయే విధంగా మెమోజీ క్యారెక్టర్ల ముఖకవళికలు కూడా ఉంటాయి. యానిమేషన్ కాబట్టి ఏదో రెండు, మూడు హవభావాలు సరిపోయేటట్లు కాకుండా...నిజమైన మనిషి ఎన్ని రకాలుగా తన ముఖకవళికలను చూపించగలడో...అదే విధంగా యానిమేషన్ క్యారెక్టర్లకు వచ్చేవరకు మా టీం కృషి చేస్తుంది. పది, పదిహేను నిముషాలుండే ఒక్కో ఏపిసోడ్ తయారవ్వాలంటే మూడు రోజులు పడుతుంది. ప్రస్తుతం 16 మంది టీంతో ఫిల్మీ మోజీ ఛానల్స్ నడుస్తున్నాయి" అని కార్తీక్ చిర్రా చెప్పారు.

ఏ1 మాస్టర్ పాత్ర

ఫొటో సోర్స్, youtube/FilmyMoji

ఫొటో క్యాప్షన్, ఏ1 మాస్టర్ పాత్ర

ఉద్యోగులుగా వచ్చాం...మెమోజీలుగా మారిపోయాం

ఇక్కడ పని చేయడానికి వచ్చిన వారిలో చాలామంది ఫిల్మీ మోజీలో డిఫరెంట్ క్యారెక్టర్లను పోషిస్తూ ఆర్టిస్టులుగా కూడా మారిపోయారు. దాంతో ఒకవైపు ఉద్యోగం, మరోవైపు నటన రెండూ కూడా ఎంతో ఉల్లాసంగా ఉంటుందని చెప్తున్నారు ఫిల్మీ మోజీ ఉద్యోగులు.

"నేను ఫిల్మీమోజీ ఛానల్ లో తపన అనే క్యారెక్టర్ చేస్తున్నాను. నేను సాధారణ ఉద్యోగిగా ఇక్కడికి వచ్చాను. ఆ క్యారెక్టర్ హిట్ కావడంతో...నేను ఇప్పుడొక చిన్న సైజ్ సెల్రబిటీగా మారిపోయాను. ఇప్పుడు ఏ ఈవెంట్ కి వెళ్లినా నాతో సెల్ఫీలు, ఫోటోలు దిగుతుంటారు. ఇదంతా నాకు చాలా ఆనందంగా ఉంటుంది" అని ఛానల్‌లో వీడియో ఎడిటర్‌గా పని చేస్తున్న కేతినీడి ఐశ్వర్య బీబీసీతో అన్నారు.

"నేను మచ్చలేని మహేష్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇక్కడ మేనేజ్ మెంట్ కూడా నేనే చూసుకుంటా. అంతా టీం వర్క్ చేస్తాం. విజయనగరం యాసలో మాట్లాడుతూ సరదాగా సాగే మహేష్ క్యారెక్టర్ నాకు ఎంతో పేరు తెచ్చింది. బయట మమ్మల్ని అంతా క్యారెక్టర్ పేరుతోనే పిలుస్తుంటారు." అని నవీన్ వర్మ సిరివూరి బీబీసీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్టులు రోడ్డున పడ్డారు

త్వరలో వెండితెరపై...

ఫిల్మీమోజీ ఛానల్ విజయవంతం కావడానికి కంటెంటే ప్రధాన కారణమని, అందులోనూ ఏ విషయాన్ని చెప్పడానికైనా హాస్యాన్ని జోడిస్తామని ఫిల్మీ మోజీ ఫౌండర్ కార్తీక్ చిర్రా చెప్పారు. తమ కామెడీ సినిమా వాళ్లకు కూడా నచ్చిందన్నారు.

"మా ఛానల్‌తో కలిపి పని చేసేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చాయి. ముఖ్యంగా సినీ నిర్మాతలు కొందరు మా కంటెంట్‌తో సినిమా తీయడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే మా టీం పేర్లు వెండి తెరపై కూడా కనిపించనున్నాయి. పనిలో పనిగా ఫిల్మీమోజీ ని ఓటీటీ ప్లాట్ ఫాంపైకి తీసుకుని వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తున్నాం" కార్తీక్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)