పిల్లలకు కరోనా వ్యాక్సీన్ అవసరమా, వైద్యులు ఏం చెబుతున్నారు

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, HAZEM BADER/AFP VIA GETTY IMAGES

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు అన్నిరకాల కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ, ముందు జాగ్రత్త చర్యలతో తెరుచుకుంటున్నాయి.

పిల్లల అభివృద్ధి కోసం పాఠశాలలను తెరవాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతుంటే, పాఠశాలలు తెరవడానికి అంత తొందర ఎందుకని మరికొందరు వాదిస్తున్నారు.

వైద్య రంగం, విద్యా సంస్థలు, తల్లిదండ్రుల మధ్య దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది.

అయితే, ఇప్పుడు పిల్లలపై కరోనా ప్రభావం తగ్గించడానికి వ్యాక్సీన్ ఇవ్వాలా, వద్దా అనే మరో చర్చ కూడా మొదలైంది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ దీనిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.

బ్రిటన్‌లో 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లల్లో ఉన్న ఆరోగ్య సమస్యలను బట్టి టీకా ఇవ్వడానికి వ్యాక్సిన్ అడ్వైజరీ బాడీ లేదా వ్యాక్సీన్ అడ్వైజింగ్ కమిటీ తన అసమ్మతిని వ్యక్తం చేసింది.

పిల్లల్లో వైరస్ ప్రమాదం చాలా తక్కువగా ఉందని, టీకాలు వేయడం వల్ల చాలా తక్కువ ప్రయోజనం ఉంటుందని జాయింట్ కమిటీ ఆన్ వాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్(జేసీవీఐ) పేర్కొంది.

గుండె, ఊపిరితిత్తులు లేదా కాలేయ సమస్యలు ఉన్న పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఆరోగ్యవంతులైన పిల్లలతో పోల్చితే ఇలాంటి పిల్లలకు కోవిడ్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

భారతదేశంలో కూడా పిల్లలకు టీకా ఇచ్చే అంశంలో వైద్య నిపుణులు ఏకాభిప్రాయానికి రానట్టు కనిపిస్తోంది.

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ పిల్లల నుంచి ఇతరులకు సోకుతుందా?

భారతదేశంలో పిల్లలకు టీకాలు

కాడిలా హెల్త్‌కేర్ జైకోవ్-డి వ్యాక్సీన్‌ను అక్టోబర్‌ మొదటి వారం లేదా రెండో వారం నుంచి 12-17 సంవత్సరాల పిల్లలకు ఇవ్వనున్నారని, ఈ టీకా టీనేజర్లలో సురక్షితంగా, ప్రభావవంతంగా పని చేస్తుందని భారత ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్(ఎన్‌టీఏజీఐ) చీఫ్ డాక్టర్ ఎన్‌కె అరోరా బీబీసీకి చెప్పారు.

కానీ, ఈ వ్యాక్సీన్ ఇవ్వడంలో అనారోగ్యంతో ఉన్న పిల్లలకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు.

''క్యాన్సర్, మధుమేహం, ఇతర వ్యాధులు ఉన్న పిల్లలకు మేం టీకా ఇవ్వడం ప్రారంభిస్తాం. అలాంటి పిల్లల్లో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండచ్చు, లేదా మరణించే ప్రమాదం కూడా ఉంది. డిసెంబర్ నెలాఖరులోపు వృద్ధులకు టీకాలు ఇవ్వడం పూర్తయిన వెంటనే, ఆరోగ్యవంతులైన పిల్లలకు కూడా టీకా ఇవ్వడం ప్రారంభిస్తాం'' అని ఎన్‌కె అరోరా తెలిపారు.

కాడిలా హెల్త్‌ కేర్ టీకా భారతదేశంలో ఆమోదం పొందింది. ఇది సూది లేని టీకా, 'దీనివల్ల ఎక్కువ నొప్పి ఉండదు' అని ఆయన చెప్పారు.

ఈలోపు 2-18 సంవత్సరాల వయస్సు పిల్లలపై చేస్తున్న ట్రయల్స్ ఫలితాలు కూడా వస్తాయని ఆశిస్తున్నారు. మిగతా కంపెనీలు కూడా పిల్లలపై ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.

పిల్లలకు కరోనా టీకా

ఫొటో సోర్స్, Ani

పిల్లలందరికీ టీకా ఇవ్వకూడదని ఐఏపీఎస్ఎమ్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ సునీలా గార్గ్ అంటున్నారు.

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్(ఐఏపీఎస్ఎం)లో భారతదేశమంతటా 550 వైద్య కళాశాలలకు చెందిన సభ్యులున్నారు.

డాక్టర్ సునీలా గార్గ్ యూకే వైద్యుల అభిప్రాయంతో ఏకీభవించారు. కోవిడ్ వ్యాక్సీన్‌ను అనారోగ్యంతో ఉన్న పిల్లలకు మాత్రమే ఇవ్వాలన్నారు.

భారతదేశంలో నిర్వహించిన సెరో సర్వే-4 గురించి ప్రస్తావించిన సునీలా గార్గ్.. ''పాఠశాలకు వెళ్లకపోయినా, ఇంటి నుంచి బయటకు రాని, దాదాపు 60 శాతం మంది పిల్లలు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు సెరో సర్వేలో గుర్తించారు. అంటే, దీని అర్థం పిల్లలు వ్యాధి బారిన పడినా ఎలాంటి లక్షణాలు లేవు. ఇందులో మూడు శాతం మంది పిల్లలు పదేళ్లలోపు, 9 శాతం మంది 11-18 సంవత్సరాల వయసులో ఉన్నారు. వీరిలో తేలికపాటి ఇన్ఫెక్షన్ గుర్తించారు.'' అని సునీలా గార్గ్ అన్నారు.

కానీ, ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు కూడా వ్యాక్సీన్ ఇవ్వాల్సి అవసరం ఉందని డాక్టర్ ఎన్‌కె అరోరా చెప్పారు. ఎందుకంటే, వారు ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందడానికి ఒక వాహకంలా ఉపయోగపడే అవకాశం ఉందన్నారు.

డాక్టర్ సునీలా గార్గ్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ సునీలా గార్గ్

"12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీకా ఇవ్వకపోయినా ఏమీ కాదు. వారికి అధిక రోగనిరోధక శక్తి ఉంటుంది. కానీ, 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయాలి" అని మాక్స్ హాస్పిటల్‌లో పీడియాట్రిక్, అంటు వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ శ్యామ్ కుక్రేజా చెప్పారు.

''ఒక వ్యక్తి వయసు పెరిగే కొద్దీ, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి పెద్ద పిల్లలకు టీకా ఇవ్వాలి. కానీ పిల్లల్లో తీవ్రమైన కోవిడ్ కేసులు మా దృష్టికి రాలేదు'' అని డాక్టర్ ఆయన తెలిపారు.

భారతదేశంలో కూడా దశలవారీగా టీకాలు వేయడం ప్రారంభించారు. ప్రాధాన్య క్రమం ప్రకారం మొదట ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, మునిసిపల్ ఉద్యోగులు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకాలు వేశారు.

తర్వాత 60 సంవత్సరాలు పైబడినవారికి, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సీన్ వేశారు.

తరువాత, 45 సంవత్సరాలు పైబడిన వారికి, 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కూడా టీకాలు వేయడం ప్రారంభించారు.

భారతదేశంలో ఇప్పటివరకు 68 కోట్ల 75 లక్షల మందికి పైగా కోవిడ్ టీకాలు వేశారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎమ్ఆర్) జూన్, జులైలలో నిర్వహించిన ఒక సర్వేలో ప్రతి ముగ్గురిలో ఒకరిలో యాంటీబాడీలు గుర్తించినట్టు చెప్పారు. 21 రాష్ట్రాలకు చెందిన 36,227 మందిపై ఈ సర్వే జరిగింది.

టీకా దుష్ప్రభావాలు

ఫొటో సోర్స్, Getty Images

టీకా దుష్ప్రభావాలు

బ్రిటన్‌లో ఆరోగ్యవంతులైన పిల్లలకు టీకా ఇవ్వకూడదని సిఫారసు చేశారు. ఫైజర్, మోడెర్నా టీకాలతో ఛాతీ నొప్పి, వేగంగా గుండె కొట్టుకోవడం వంటి దుష్ప్రభావాలు వస్తున్నట్టు రిపోర్టులున్నాయి.

అమెరికాలో లక్షలాది పిల్లలకు టీకా ఇచ్చారు. టీకా రెండు డోసులు తీసుకున్న 12 నుంచి 17 ఏళ్ల వయసున్న ప్రతి 10 లక్షల మంది మగ పిల్లల్లో 60 మందిలో గుండె సమస్యలు గుర్తించారు. అదే సమయంలో, అదే వయసు బాలికలలో 10 లక్షల మందిలో ఎనిమిది మందికి ఇలాంటి లక్షణాలు కనిపించాయి.

ఆరోగ్యకరమైన పిల్లలకు కోవిడ్ సోకితే 10 లక్షల మందిలో ఇద్దరు పిల్లల్ని మాత్రమే ఐసీయూలో చేర్చాల్సి వస్తోందని బ్రిటన్‌లో పిల్లల వైద్యులు చెబుతున్నారు. కానీ పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉంటే, ఆ సంఖ్య ప్రతి 10 లక్షల మందిలో సగటున 100 ఉంటుందని తెలిపారు.

ఏ వ్యాక్సిన్‌లో అయినా దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుందని మాక్స్ హాస్పిటల్‌ పిల్లల వైద్యుడు శ్యామ్ కుక్రేజా చెప్పారు. కొంతమంది పిల్లల గుండెలో వాపు రావడం అనేది మోడెర్నా లేదా ఫైజర్‌ టీకాలు వేసినప్పుడు కనిపించిందన్నారు. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుందన్నారు. టీకా వేయడం మంచిదని ఆయన సిఫార్సు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)