ఆ వెబ్‌సైట్లపై నిషేధం ఉన్నా ఎలా చూస్తున్నారు, విపిఎన్ ఎలా పని చేస్తుంది?: డిజిహబ్

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
- హోదా, బీబీసీ కోసం
భద్రతా కారణాల దృష్ట్యా భారతదేశం అంతటా వీపీఎన్ (VPN) సేవలను నిషేధించాలని హోం శాఖ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆనంద్ శర్మ ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిటీ వాస్తవానికి ఈ ఏడాది మార్చి 15వ తేదీనే ఈ సూచన చేసింది. దీనికి కేంద్ర హోం శాఖ జూలై 2వ తేదీన సమాధానం ఇచ్చింది.
పార్లమెంటరీ కమిటీ చేసిన సూచనపై.. కేంద్ర ఐటీ శాఖతో కూడా చర్చించామని వెల్లడించింది.
ఐటీ చట్టం సెక్షన్ 69 ఎ ప్రకారం.. కోర్టు ఆదేశిస్తే, లేదా పార్లమెంటు కమిటీ ఆదేశిస్తే తాము ఏదైనా వెబ్‌సైట్, యూఆర్ఎల్‌ను బ్లాక్ చేస్తామని.. అంతే తప్ప తమంతట తాముగా ఎలాంటి చర్యలూ తీసుకోలేమని ఐటీ శాఖ వివరించినట్లు పేర్కొంది.
ఒకవేళ వీపీఎన్‌లను బ్లాక్ చేయాలని ఐటీ చట్ట ప్రకారం ఏమైనా సిఫార్సులు వస్తే.. వాటిని చట్ట ప్రకారం అమలు చేస్తామని వెల్లడించింది.
అయితే, ఈ సమాధానంతో సంతృప్తి చెందని పార్లమెంటరీ కమిటీ.. దేశంలో వీపీఎన్‌లను శాశ్వతంగా బ్లాక్ చేసేందుకు, నిఘా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో కేంద్ర హోం శాఖ, ఐటీ శాఖ చర్చించి తమకు తెలియజేయాలని ఆగస్టు 10వ తేదీన ఆదేశించింది.
ఈ నేపథ్యంలో, వీపీఎన్ టెక్నాలజీ అంటే ఏమిటి, దాని ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు లాంటి విషయాలను ఈ వ్యాసం ద్వారా అర్థం చేసుకోడానికి ప్రయత్నిద్దాం.

ఇంటర్నెట్‌పై సమాచారం రవాణా అయ్యే విధానం
వీపీఎన్ గురించి మాట్లాడుకునే ముందు, అసలు ఇంటర్నెట్‌పై సమాచారం ఎలా రవాణా (information flow) అవుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. మన బ్రౌజర్ నుంచి సమాచారం ఎలా వచ్చి వెళ్తుందో ఒక ఉదాహరణతో చూద్దాం. ఇప్పుడు మన బ్రౌజర్‍లో bbc.com/telugu అన్న వెబ్‍సైట్ తెరిచినప్పుడు..
- ఈ వెబ్‍సైట్ కావాలి అని అడగగానే మన డివైజులో ఉన్న డి.ఎన్.ఎస్ (DNS) సర్వర్, bbc.comకి ఉన్న ఐ.పి. అడ్రస్ కనుక్కుంటుంది. మనం ఎవరికన్నా ఉత్తరం రాయాలనుకుంటే వాళ్ళ పేరుతో పాటుగా పోస్టల్ అడ్రస్ ఇస్తాం కదా. ఇదీ అలాంటిదే అనుకోవచ్చు. మనం ఏ సైటు నుంచి అయితే సమాచారం ఆశిస్తున్నామో, వారి పబ్లిక్ ఐ.పి.అడ్రస్ మన డివైజుకి తెలియాలి.
- ఉత్తరానికి జవాబు తిరిగి రావాలంటే వాళ్ళ అడ్రస్‍తో పాటు మన అడ్రస్ కూడా రాయాలి. “ఫ్రమ్ అడ్రస్” అంటాం దీన్ని. అచ్చం అలానే, ఈ సమాచారాన్ని అడుగుతున్నది మన డివైజు కాబట్టి దాని పబ్లిక్ ఐ.పి.అడ్రస్ కూడా పెట్టి మన రిక్వెస్టుని పంపిస్తాం.
- మన రిక్వెస్టు ముందుగా మన ఐ.ఎస్.పి (ISP - Internet Service Provider, అంటే మనకి ఇంటర్నెట్ ఇస్తున్న కంపెనీ) సర్వర్లకి చేరుకుంటుంది. అక్కడనుంచి మనం అడిగిన సర్వర్‌కి వెళ్తుంది. (bbc.com)
- మనం అడిగిన సమాచారాన్ని సమకూర్చి ఆ కంపెనీ సర్వర్ మన ఐ.ఎస్.పికి చేరవేస్తుంది. అక్కడనుంచి వచ్చిన సమాచారాన్ని మన డివైజు అందుకని, ఆ డేటాను ప్రాసెస్ చేసుకుని మనకి అర్థమయ్యే విధంగా మన బ్రౌజరులో చూపెడుతుంది.
మనం ఏం క్లిక్ చేసినా, ఏ పేజ్ లోడ్ చేసినా, ఏ యాప్ తెరిచినా ఈ తతంగమంతా జరుగుతుంటుంది. ప్రపంచమంతా సజ్జనులు, సన్మార్గులు మాత్రమే ఉండుంటే ఈ పద్ధతి సరిపోతుంది, పనులు చేసుకోవడానికి. కానీ లోకం తీరు వేరు కదా!
పైన చెప్పిన సమాచార రవాణా విధానంలో కొన్ని సమస్యలు ఇవి:
- మన బ్రౌజర్ నుంచి సర్వర్ వరకూ, సర్వర్ నుంచి మన డివైజు వరకూ వచ్చే సమాచారాన్ని దారిలో ఎవరన్నా, ఎలా అయినా కాపు కాసి ఆ డేటాని కాజేసే అవకాశాలున్నాయి. డేటా ఎన్‍క్రిప్ట్ అయి ఉండదు కాబట్టి ఎవరన్నా దాన్ని చదవగలరు. డేటాను దారి మళ్ళించగలరు.
- మనం అడిగి, అందుకునే ఏ సమాచారమైనా మన ఐ.ఎస్.పి ద్వారా వెళ్తుంది. అందుకని, మనం ఏ సమయాల్లో ఏ సైట్లు వాడాం, ఏ సమాచారాన్ని చూస్తున్నాం లాంటి విషయాలన్నీ ఐ.ఎస్.పిల దగ్గర చిట్టా ఉండిపోతుంది. (మీరు ఇన్‍కాగ్నిటో మోడ్‍లో (incognito mode) బ్రౌజర్ తెరిచినప్పుడు కూడా ఒక వార్నింగ్ కనిపిస్తుంది గమనించండి. ఈ మోడ్‌లో తెరవడం వల్ల మీ బ్రౌజర్ హిస్టరీలో మీరు వాడుతున్న సైట్ల వివరాలు ఉండవు కానీ, మీ ఐ.ఎస్.పిల వద్ద మాత్రం ఈ సమాచారం ఉంటుందని చెప్తుంది.)
- అన్నింటికన్నా ముఖ్యంగా, సమాచారంతో పాటు మన పబ్లిక్ ఐ.పి.అడ్రస్ కూడా నెట్‍వర్క్‌లో తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఆసరా చేసుకుని మన డివైజులపై అటాక్‍లు జరగవచ్చు.

వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN)
సమాచారం అటూ, ఇటూ రవాణా అవుతూ ఉండాలంటే ఐ.ఎస్.పి ద్వారానే వెళ్ళాలి. ఇది తప్పదు. వీటిని ఇలానే ఉంచుతూ, పై చెప్పుకున్న సమస్యలు పరిష్కరించడానికే వర్చువల్ ప్రైవేట్ నెట్‍వర్క్ (Virtual Private Network - VPN) అనే టెక్నాలజీ పుట్టింది. ఇది ముఖ్యంగా రెండు పనులు చేస్తుంది.
డేటాను ఎన్‍క్రిప్ట్ చేస్తుంది: దారిలో డేటా ఎవరూ చూసే వీలు లేకుండా ఒక సొరంగం (tunnel) ద్వారా పంపిస్తుంది, అందులో డేటాని ఎన్‍క్రిప్ట్ చేస్తుంది. సమాచారాన్ని అందించే (sender), అందుకునే (receiver) వారికి తప్పించి మరెవరూ ఈ సొరంగాన్ని ఛేదించలేరు. కనుక డేటా సురక్షితంగా, ఎవరి కంటా పడకుండా ఉంటుంది. సైబర్ క్రిమినల్స్, ఐ.ఎస్.పీలే కాదు, ప్రభుత్వాలు కూడా దారిలో ఉన్న సమాచారాన్ని చూడలేవు.
ఐ.పి అడ్రస్ దాచిపెట్టి మరో పబ్లిక్ ఐ.పి ఇస్తుంది: మన పబ్లిక్ ఐ.పి అందరికీ తెలిసే వీలుంటే దురుపయోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, దాన్ని తన దగ్గరే దాచుకుని వేరే ఫేక్ పబ్లిక్ ఐ.పిని మన ఐ.పిగా పంపిస్తుంది. దీని వల్ల రెండు ఉపయోగాలు ఉంటాయి.
ఒకటి, మన సమాచరం గోప్యంగా ఉంటుంది.
రెండు, మన ఐ.పి మారిపోతుంది కాబట్టి, మనకి అందుబాటులో లేని కొన్ని సైట్లు లేదా కంటెంట్ వాడుకోవచ్చు. ఉదాహరణకు, నెట్‍ఫ్లిక్స్‌లో మీరు చూడాలనుకున్న సినిమా అమెరికాలో మాత్రమే ఉండి ఇండియాలో లేకపోతే, మీరు వీపీఎన్ వాడి ఆ సినిమాని చూడచ్చు. ఎందుకంటే మీ ఐ.పి అమెరికాకు సంబంధించింది అయితే, మీరు అమెరికానుంచే రిక్వెస్ట్ పంపుతున్నారని సర్వర్ అనుకుంటుంది. అలానే, గత ఏడాది పబ్‍జీ యాప్‍ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసినప్పుడు, VPN వాడి ఆ ఆటను చాలామంది ఆడారు.
ఇలా డేటాను భద్రంగా ఉంచుతూ, మన ఐ.పి.ని, దాని నుంచి వచ్చిపోతున్న ట్రాఫిక్ వివరాలను గోప్యంగా ఉంచుతుంది కాబట్టి వీపీఎన్ ఎప్పటినుంచో వాడుకలో ఉంది. కార్పొరేట్, మిలటరీ, ప్రభుత్వ రంగాలకి సంబంధించిన సమాచారం మరీ సెన్సిటివ్ కాబట్టి, వీపీఎన్ వాడుక తప్పనిసరి. ఎయిర్‌పోర్ట్, హోటళ్ల వంటి పబ్లిక్ ప్రదేశాల్లో కూడా దీని వాడకం ఎక్కువ. వ్యక్తిగత స్థాయిలో కూడా వాడుకునే వీలుగా బోలెడు క్లైంట్స్ మార్కెట్లో ఉన్నాయి.
2021 ప్రథమార్థంలో భారతదేశంలో వీపీఎన్ వాడుక 600% పెరిగిందని అట్లాస్ విపిఎన్ (AtlasVPN) ఒక సర్వేలో వెల్లడించింది. ఇంటర్నెట్ షట్‍డౌన్లు, జియో బేస్డ్ స్ట్రీమింగ్ (అంటే, భూభాగాన్ని బట్టి కంటెంట్ అందుబాటులో ఉండడం), వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ అవ్వడం దీనికి కారణాలై ఉండొచ్చు అని పేర్కొంది.

ఎందుకు బ్యాన్ చేయాలి?
వీపీఎన్ లేకపోతే భద్రత, గోప్యత ఉండదు. కానీ, దాన్ని వాడడం వల్ల ఇంకొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
ఈ టెక్నాలజీ, పెద్ద కంపెనీల నుంచి సాధారణ యూజర్స్ వరకూ అందరికీ అందుబాటులో ఉంటుంది. అంటే సైబర్ నేరగాళ్లకూ అందుబాటులో ఉన్నట్టే. వీపీఎన్ వాడడం వలన, వాళ్లు చేసే సైబర్ అటాక్స్ ఎక్కడనుంచి చేస్తున్నారో కనిపెట్టడం దాదాపు అసంభవం. నేరాన్ని నిరూపించే సంస్థలకు ఇది ఆటంకం.
డార్క్ వెబ్ అంటే సైబర్ నేరగాళ్ల అడ్డా అనుకోవచ్చు. అక్కడ అన్ని రకాల అక్రమాలను, నేరాలను టెక్నాలజీ ద్వారా నడిపిస్తుంటారు. క్రెడిట్ కార్డులు వివరాలు కొట్టేయడం దగ్గరనుంచి హ్యూమన్ ట్రాఫికింగ్, స్పై చేయడం, అక్రమ రవాణాలు లాంటి తీవ్రమైన నేరాలు చేస్తుంటారు.
వీటన్నింటికీ కొన్ని వెబ్‍సైట్స్ ఉంటాయి, వాటిని హిడెన్ వెబ్‌సైట్స్ (hidden websites) అంటారు. కొన్ని ప్రత్యేక బ్రౌజర్లు (specialized browsers) వాడితే తప్ప వాటిని ఉపయోగించలేం. ఎక్కడనుంచి ఈ వెబ్‍సైట్లకు రిక్వెస్టులు వెళ్తున్నాయో దాచిపెట్టడానికి నేరస్తులు వీపీఎన్ వాడుతుంటారు. ఇలాంటి నేరాలను అరికట్టడానికి వీపీఎన్ అడ్డొస్తుందని, అందుకే దాని బ్యాన్ చేయాలనే వాదనలూ ఉన్నాయి.

వీపీఎన్ బ్యాన్ సాధ్యమేనా?
మన దేశంలో వీపీఎన్ వాడకం కాస్త తిరకాసు వ్యవహారమే. మనం మార్కెట్లో ఉన్న యాప్స్ డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు, కానీ ఏ లీగల్ ఇష్యూస్‌లో అయినా ఇరుక్కుంటే వీపీఎన్ వాడుతున్నందుకు ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఈ బ్యాన్‌కు సంబంధించి పార్లమెంటరీ కమిటీ ఒక సిఫార్సు చేసిందే తప్ప.. దాని సాధ్యాసాధ్యాలపై ఎలాంటి చర్చా జరగలేదు. వీపీఎన్ బ్యాన్ అమలు పరచడానికి, ఐ.ఎస్.పి సంస్థలని వీపీఎన్ వాడే పోర్ట్స్ (ports), ప్రొటోకాల్స్ (protocols)ను బ్లాక్ చేయమని ఆదేశించవచ్చు.
లేదంటే, deep packet inspection, SNI based filtering లాంటి ఆధునిక టెక్నాలజీలు వాడి కూడా అమలు పరచవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో ఉన్న వీపీఎన్ సంబంధిత యాప్స్ అన్నీ బ్యాన్ చేయవచ్చు. పెద్ద కార్పొరేట్ సంస్థల వీపీఎన్ మినహా మిగతావన్నీ తొలగించబోతున్నారనే కథనాలు కూడా వస్తున్నాయి.
ఒకవేళ నిజంగానే వీపీఎన్‌లను రద్దు చేస్తే వీటిని తప్పించుకోడానికి సైబర్ నేరగాళ్లు ఇంకేవో మార్గాలు కనుక్కోవచ్చు.
(ఈ కథనం టెక్నాలజీ మీద అవగాహన కోసం మాత్రమే. ఇందులో రచయిత అభిప్రాయాలు వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- సెల్ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి? ప్రమాదాన్ని ముందే గుర్తించవచ్చా?
- సైబర్ మాయగాళ్లు వేసే ఎరలు ఎలా ఉంటాయి? వాటికి చిక్కుకోకుండా ఉండడం ఎలా : డిజిహబ్
- స్కూల్ సెలవుల్లో తిమింగలం బొమ్మలు సృష్టించి రూ.3 కోట్లు సంపాదించాడు
- ఈ టాయిలెట్లకు గోల్డ్ మెడల్ ఇవ్వాల్సిందే!
- గాలిలో ఎగిరే కారు: హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు గంటల్లో
- మీ సెల్‌ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవడం ఎలా... హ్యాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రిలయన్స్ జియో: టెలికాం కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతుంటే 'జియో'పై కాసుల వర్షం ఎలా?
- ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో మహిళలను నగ్నంగా చూపించే టూల్స్
- పెగాసస్: గూఢచర్య ఆరోపణలపై చర్చలను మోదీ ప్రభుత్వం ఎందుకు దాటవేస్తోంది?
- మీరు కోరుకున్న ఎమోజీ లేకపోతే ఏం చేస్తారు? కావాల్సిన ఎమోజీ పొందడం ఎలా
- వాట్సాప్: స్మార్ట్ ఫోన్ వాడకుండానే మెసేజ్‌లు పంపొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












