డీప్ ఫేక్ టెక్నాలజీతో న్యూడ్ ఫొటోలు: లక్షకు పైగా మహిళల సోషల్ మీడియా ఫొటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నగ్నంగా మార్చేశారు..

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, ప్యాట్రిక్ క్లహానే
- హోదా, బీబీసీ ప్రతినిధి
సోషల్ మీడియాలో లక్షకు పైగా మహిళల చిత్రాలను నకిలీ పద్దతుల ద్వారా నగ్నంగా మార్చి ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నట్లు ఒక నివేదిక తెలిపింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫొటోల్లో మహిళల ఒంటిపై ఉన్న దుస్తులను డిజిటల్‌గా తొలగించి, ఆ న్యూడ్ ఫోటోలను టెలిగ్రామ్ యాప్‌లో షేర్ చేశారు.
కొంత మంది దీని కోసం చిన్న వయసు పిల్లలను కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఇంటలిజెన్స్ కంపెనీ సెన్సిటీ తెలిపింది.
కాకపోతే, ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఒక కంపెనీ మాత్రం దీనిని కేవలం వినోదం కోసమే చేస్తున్నట్లు చెబుతోంది.
బీబీసీ ఈ సాఫ్ట్‌వేర్‌ని పరిశీలించింది. సాఫ్ట్‌వేర్ పనితనం అంత సవ్యంగా కనిపించలేదు.
ఈ వ్యవహారంలో "డీప్ ఫేక్ బాట్" ని వాడినట్లు సెన్సిటీ చెబుతోంది.
కంప్యూటర్ ద్వారా నిజమైన చిత్రాలను, వీడియోలను పోలినట్లు ఉండే డీప్ ఫేక్‌ని సృష్టిస్తారు. ఇవి అచ్చంగా నిజమైన ఫొటోలలానే కనిపిస్తాయి. కొంత మంది సెలబ్రిటీల నకిలీ నగ్న చిత్రాలను తయారు చేసేందుకు ఈ టెక్నాలజీ వాడుతూ ఉంటారు.
అయితే, ప్రైవేటు వ్యక్తుల ఫోటోలను ఇలా చేయడం ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామమని సెన్సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జార్జో ప్యాట్రిని అన్నారు.
“ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవడానికి సోషల్ మీడియాలో పబ్లిక్‌గా పెట్టిన ఫోటోలు చాలు" అని ఆయన హెచ్చరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేసే బాట్ ఒకటి టెలిగ్రామ్ యాప్‌లో ఉంటుంది. టెలిగ్రామ్ యూజర్లు ఆ బాట్‌కి ఎవరిదైనా అమ్మాయి ఫోటో పంపిస్తే, కొన్ని నిమిషాల్లో ఎటువంటి ఖర్చు లేకుండా ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా చేస్తుంది.

ఫొటో సోర్స్, SENSITY
బీబీసీ కొంత మంది వ్యక్తుల అంగీకారం తీసుకుని కొన్ని ఫోటోలను ఆ బాట్‌కి పంపించి ఫలితాలను పరీక్షించింది. అయితే, అందులో వచ్చిన ఫలితాలేవీ పూర్తిగా సహజంగా లేవు. పొట్ట భాగంలో బెల్లి బటన్ ఉన్న ఒక అమ్మాయి ఫోటోని కూడా పరీక్షించి చూసాం.
గత సంవత్సరం ఇలాంటి ఒక యాప్ నిషేధానికి గురయింది. కానీ, మార్కెట్లో చాలా రకాల నకిలీ వెర్షన్లు ప్రాచుర్యంలో ఉన్నట్లు భావిస్తున్నారు.
"దీని గురించి నేనంతగా పట్టించుకోను. ఇది కేవలం వినోదం మాత్రమే. ఇందులో హింస ఏముంది" అని ఈ సర్వీస్ ని నడుపుతున్న 'పి' అని పిలిచే ఒక వ్యక్తి ప్రశ్నించారు.
"ఈ ఫొటోలో ఎవరూ సహజంగా ఉండకపోవడంతో వీటిని వాడి ఎవరూ ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయరు" అని ఆయన అన్నారు.
అలాగే, ఎటువంటి ఫోటోలను షేర్ చేస్తున్నారనే విషయంపై తమ సిబ్బంది దృష్టి పెట్టి ఉంచుతారని చెప్పారు. ఎవరైనా మైనర్ పిల్లల చిత్రాలను షేర్ చేస్తున్నట్లు అనిపిస్తే వెంటనే యూజర్లను బ్లాక్ చేస్తామని చెప్పారు.
అయితే, ఆ ఫోటోలను ఎవరితోనైనా షేర్ చేయాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా యూజర్ల పై ఆధార పడి ఉంటుందని ఆయన అన్నారు.
"ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, రోగాలు ప్రబలుతున్నాయి. ప్రపంచానికి హాని కలిగించే మరెన్నో విషయాలు జరుగుతున్నాయి." వాటితో పోలిస్తే ఈ యాప్ చేసే హాని ఏమీ లేదు" అని ఆయన చేస్తున్న పనిని సమర్ధించుకున్నారు. కొన్ని రోజుల్లో అన్ని చిత్రాలను తొలగిస్తానని చెప్పారు.
ఈ అంశంపై టెలిగ్రామ్ స్పందించలేదు.
చిన్న పిల్లల పట్ల లైంగిక ఆకర్షణ
జులై 2019 - 2020 మధ్యలో సుమారు 104,852 మంది మహిళలను ఈ యాప్ ద్వారా లక్ష్యంగా పెట్టుకుని వారి నగ్న చిత్రాలను పబ్లిక్‌గా షేర్ చేశారని సెన్సిటీ తెలిపింది.
ఇందులో కొన్ని చిన్న పిల్లల చిత్రాలు కూడా ఉన్నాయని సెన్సిటీ పరిశీలనలో తేలినట్లు చెప్పారు. కొంత మంది ముఖ్యంగా చిన్న పిల్లల చిత్రాలను షేర్ చేయడానికి ఈ బాట్‌ని వాడుతున్నట్లు తెలిసిందని చెప్పింది.
రష్యా సోషల్ మీడియా సైట్ ‘వి కె’లో ఈ బాట్‌కి మంచి ప్రచారం ఉందని సెన్సిటీ పేర్కొంది. ఆ ప్లాట్ఫారంపై నిర్వహించిన సర్వేలో రష్యా, గతంలో రష్యా సమాఖ్యకి చెందిన దేశాల నుంచి చాలా మంది యూజర్లు ఉన్నట్లు చెప్పింది.
అయితే, అలాంటి సమాచారాన్ని కానీ, వాటిని ప్రచారం చేసే లింకులను కానీ, వాటిని షేర్ చేసేవారిని కానీ సహించబోమని వి కె స్పష్టం చేసింది.
ఈ సంవత్సరం మొదట్లో రష్యాలో అధికారికంగా టెలిగ్రామ్ ని నిషేధించారు.
"చాలా వరకు ఈ వెబ్ సైట్లు గాని, యాప్‌లు గాని పూర్తిగా చట్టం పరిధిలోకి రాకపోవడం వలన ఇవి రహస్యంగా పని చేయాల్సిన అవసరం ఉండదు’’ అని ప్యాట్రిని చెప్పారు.
"ఇవి చట్టం పరిధిలోకి వచ్చేవరకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనే భయం మాత్రం ఉంది" అని ఆమె అన్నారు.
ఈ నివేదికలో వెల్లడయిన అన్ని వివరాలను టెలిగ్రామ్, వి కె, సంబంధిత న్యాయ వ్యవస్థలతో షేర్ చేసినట్లు సెన్సిటీ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ సంస్థల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం లభించలేదని చెప్పారు.
ఈ డీప్ ఫేక్‌ని సృష్టించే వారు ప్రపంచమంతా ఉన్నారని డీప్ ఫ్యాక్స్ అండ్ ది ఇన్ఫోకాలిప్స్ పుస్తక రచయత నీనా షిక్ అంటారు.
ఈ టెక్నాలజీని అందుకోవడానికి చట్టం దాగుడుమూతలాడుతోందని అన్నారు.
"డీప్ ఫేక్‌ని వాడి నగ్నంగా మార్చే వీడియోల సంఖ్య ప్రతీ ఆరు నెలలకు రెట్టింపవుతోంది" అని ఆమె అన్నారు.
"ఈ సమస్యను పరిష్కరించడానికి మన చట్టాలలో ఉన్న నిబంధనలు సరిపోవు. టెక్నాలజీలో వస్తున్న మార్పుల వలన సమాజం మనం ఊహిస్తున్నదాని కంటే వేగంగా మారిపోతోంది. దీనిని ఎలా నియంత్రించాలో ఒక సమాజంగా ఇంకా మనం ఏమి నిర్ణయానికి రాలేకపోతున్నాం" అని ఆమె అన్నారు.
"ఈ ఫేక్ పోర్న్ బారిన పడిన బాధితులకు ఇది చాలా వినాశాత్మకంగా మారుతోంది. ఇలా జరగడం వలన వారిని అవమానించినట్లు, భంగపరిచినట్లు భావించడంతో ఒక్కొక్కసారి వారి జీవితాలే తల కిందులుగా మారిపోయే అవకాశం ఉంది.
ఈ డీప్ ఫేక్ లను చట్ట విరుద్ధం చేసిన రాష్ట్రాలలో వర్జీనియా ఒకటిగా నిలిచింది.
నకిలీ నగ్న చిత్రాల గురించి యూకేలో ఉన్న చట్టం కాలానికనుగుణంగా లేదని, అస్పష్టంగా ఉందని ఒక యూనివర్సిటీ నివేదిక విమర్శలు చేసింది.
రివెంజ్ పోర్న్, అప్ స్కర్టింగ్ లాంటి అంశాలను నిరోధించడానికి చట్టపరంగా కొంత వరకు ముందుకు వెళ్లినప్పటికీ, చట్టాలలో ఇంకా చాలా లోపాలు ఉన్నాయని విమెన్స్ ఎయిడ్ చారిటీ లూసీ హ్యాడ్లి చెప్పారు.
డీప్ ఫేక్ చిత్రాలు ఏ మేరకు పాతుకుపోయాయో ఈ గణాంకాలు చెబుతున్నప్పటికీ , ఇప్పటికీ ఇది ఒక ప్రత్యేక నేర పరిధిలోకి రావడం లేదు.
ఈ అంశం పై ఇంగ్లండ్, వేల్స్ లో ఉన్న చట్టాన్ని పునః పరిశీలించమని ప్రభుత్వం లా కమిషన్ ని ఆదేశించింది. ఈ కమిషన్ నివేదిక 2021లో వెల్లడి కానున్నది.
ఇవి కూడా చదవండి:
- డీప్ ఫేక్: నకిలీ వీడియోలను ఎలుకలు గుర్తిస్తాయా...
- డీప్ ఫేక్: ఫేక్ ఫోటోలు, ఫేక్ న్యూస్ కంటే ప్రమాదకరమైనది
- "కశ్మీరీ అమ్మాయిలు అమ్మకానికి లేరు" - శ్రీనగర్‌లో మహిళల నిరసన
- "నేను చేతబడి చేస్తున్నానని మా అమ్మ అనుమానించింది"
- అర్థరాత్రి ఓ మహిళ ఇంటికి వెళ్ళి కాల్పులు జరిపిన పోలీసు అధికారిపై మర్డర్ కేసు
- పశ్చిమ బెంగాల్: ముగ్గురు కుటుంబ సభ్యుల హత్య కేసులో ఆర్ఎస్ఎస్ కోణం
- పౌరసత్వం అమ్ముతున్నారు... కొనుక్కుంటారా? ఒక్కో దేశానికి ఒక్కో రేటు
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
- ఉప్పలపాడు పక్షుల పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి...
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









