ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో మహిళలను నగ్నంగా చూపించే టూల్స్

న్యూడిఫయర్ యాప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ యాప్‌తో ఏ మహిళ ఫోటోనైనా నగ్నంగా మార్చేయవచ్చు

మహిళల ఫోటోలను కృత్రిమ మేధ సాయంతో నగ్నంగా చూపించే సాఫ్ట్‌వేర్ సేవలకు గిరాకీ పెరుగుతోంది. ఇలా తయారు చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఒక్క జూన్ నెలలోనే ఈ సేవలను 50 లక్షల సార్లు ఉపయోగించినట్లు డేటా సూచిస్తోంది.

ఇలాంటి టూల్స్‌ను నిషేధించాల్సిన అవసరం ఉందని, దీనిపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ జరగాలని ఎఁపీ మరియా మిల్లర్ కోరుతున్నారు.

ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఫొటోల్లోని మహిళలను వివస్త్రను చేయడానికి ఉపయోగించే సర్వీసుల నిషేధంపై చర్చకు దారి తీస్తుంది. ఈ సర్వీసుల ద్వారా రూపొందించే చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెందుతాయి.

సెలెబ్రిటీలతో పాటు ఒలింపిక్స్ అథ్లెట్ల ఫొటోలు కూడా ఇలాంటి వెబ్‌సైట్ల బారిన పడుతున్నాయని చెప్పారు.

'బట్టల వెనుక ఉన్న నిజాన్ని బహిర్గతం చేస్తాం' అని తమ వినియోగదారులకు ఓ వెబ్‌సైట్ హామీ కూడా ఇచ్చింది. 2020లో ప్రారంభమైన ఈ సైట్‌ వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆ కంపెనీ దీనిపై సమాధానం ఇవ్వలేదు.

ఆ కంపెనీ ట్విట్టర్ పేజీ ప్రకారం 'ఇది ఏఐ ఆధారిత న్యూడిఫయర్. పురుషులందరి కలలను నిజం చేయడమే మా లక్ష్యం' అని పేర్కొంది.

మరింత శక్తిమంతంగా పనిచేసే ఈ న్యూడిఫయర్ టూల్ కొత్త వర్షన్ కోసం శ్రమిస్తున్నట్లు తయారీదారులు ఒక పోస్టులో పేర్కొన్నారు.

స్క్రీన్ గ్రాబ్

ఫొటో సోర్స్, DeepSukebe

ఫొటో క్యాప్షన్, DeepSukebe అనే వెబ్‌సైట్ మహిళల ఫోటోల దుస్తులను వెంటనే తీసేసి చూపిస్తానని హామీ ఇస్తోంది

తీవ్రమైన నేరం

ఇలాంటి సర్వీస్ టూల్స్‌ను నిషేధించడానికి ఇదే సరైన సమయం అని మిల్లర్ బీబీసీతో అన్నారు.

'అనుమతి లేకుండా డిజిటల్‌ పద్ధతుల్లో మహిళల నగ్న, అసభ్యరమైన చిత్రాల తయారీ నిషేధంపై పార్లమెంట్‌లో చర్చించే అవకాశం రావాలి. ఒకవేళ పార్లమెంట్‌లో ఈ అంశం చర్చకు వస్తే చట్టాల్లో మార్పు వస్తుంది' అని మరియా పేర్కొన్నారు.

'ఆన్‌లైన్‌లో మహిళల నగ్న చిత్రాలను అందుబాటులో పెట్టడం తీవ్రమైన నేరంగా పరిగణించాలి. ఇది ప్రజల జీవితాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది.'

'ఇలాంటి సాంకేతికతను సాఫ్ట్‌వేర్ డెవలపర్లు అభివృద్ధి చేస్తున్న‌ట్లయితే వారు పెద్ద నేరం చేస్తున్నట్లే లెక్క. కాబట్టి దీనిని అడ్డుకోవడానికి ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌లను వారు తయారు చేయాలి.'

సమ్మతి లేకుండా నగ్న, అసభ్యకరమైన చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టడాన్ని రివేంజ్ పోర్న్‌గా పిలుస్తారు. మరియా గత ఆరేళ్లుగా రివేంజ్ పోర్న్‌కు వ్యతిరేకంగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు.

'ఇలా డిజిటల్ పద్ధతుల్లో నగ్న చిత్రాలను రూపొందించడం, ఆన్‌లైన్ నుంచి వాటిని తీసుకోవడం ప్రస్తుతం చట్ట పరిధిలోకి రావట్లేదు. అవి జీవితాలపై చూపెట్టే తీవ్ర పరిణామాల దృష్ట్యా, ఆన్‌లైన్‌లో నగ్న చిత్రాలు పంపిణీ చేయడాన్ని లైంగిక నేరంగా పరిగణించాలి.' అని మరియా అన్నారు.

భవిష్యత్‌లో రానున్న ఆన్‌లైన్ భద్రతా చట్టంలో ఈ అంశాన్నికూడా చేర్చాలని మరియా ఆశిస్తున్నారు.

'నగ్న చిత్రాల్ని రూపొందించే సాధనాల గురించి కూడా చట్టంలో కూడా పేర్కొనాలి' అని ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్న 'సీజ్' (సెంటర్ టు ఎండ్ ఆల్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్) సంస్థ బీబీసీతో చెప్పింది.

'ఈ సమస్యకు చట్టం ఒక్కటే సరిపోదు' అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ వనిస్సా మోర్స్ అన్నారు.

'మహిళలను మానసిక క్షోభకు, అవమానాలకు గురిచేసే సాంకేతికతను పూర్తిగా నిషేధించాలి. ఈ చిత్రాలను భారీ స్థాయిలో పంపిణీ చేస్తూ లాభాలను ఆర్జిస్తోన్న పోర్న్ సైట్లు ఆ చిత్రాలను అప్‌లోడ్ చేయకుండా నిరోధించాలి.' అని ఆమె పేర్కొన్నారు.

ఇంటర్నెట్ నుంచి తమ చిత్రాలను తొలిగించడంతో తమ బాధ్యత తీరిందని బాధితులు అనుకుంటే సరిపోదు. అది సమంజసం కాదు అని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ న్యూడిఫయర్ టూల్స్ ఇప్పుడే కొత్తగా రాలేదు.

2019లో ప్రారంభమైన ఇలాంటి ఒక వెబ్‌సైట్ కొద్దికాలానికే తమ సర్వీసులను నిలిపి వేసింది. ప్రజల నుంచి ఎదురుదెబ్బ తగలడంతో ఖాతాదారులకు డబ్బుల్ని తిరిగి చెల్లించింది.

ఈ సాధనాన్ని ప్రజలు దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ వెబ్‌సైట్ తయారీదారులు గుర్తించారు. ఇలాంటి వివాదాస్పద సాధనాన్ని వాడేందుకు ప్రపంచం సిద్ధంగా లేదని పేర్కొన్నారు.

అనైతికం

కానీ దీనిని పోలిన పలు సర్వీసులు ఇంకా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇవన్నీ చాలా తరచుగా వికృతమైన చిత్రాలను తయారు చేస్తుంటాయి. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ సర్వీసులు పోటీలో ముందుండటానికి సరికొత్త అల్గారిథమ్స్‌ను ఉపయోగిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఇలాంటి టూల్స్ రూపకర్త ఇవాన్ బ్రావోతో బీబీసీతో మాట్లాడగా...' ప్రస్తుతం ఈ టూల్స్‌ను ఉపయోగించి చిత్రాలు రూపొందిస్తున్న తీరు అనైతికమే. తొలుత న్యూడ్ యువర్ ఫ్రెండ్స్ అని ప్రచారం చేస్తూ డెవలపర్లు వీటిని తయారు చేశారు' అని వ్యాఖ్యానించారు.

'మనం పరిపూర్ణమైన ప్రపంచంలో జీవించట్లేదు. ఇలాంటి వాటిని చేయడానికి ప్రజలు వేరే మార్గాల్ని వెతుకుతారు. వ్యక్తిగతంగా నేను పురుషులను, కల్పిత పాత్రలను నగ్నంగా చూపించే కొత్త వర్షన్‌ను రూపొందించాలనుకున్నా. దీంతో ప్రజలందరూ ఈ ప్రయోగాన్ని ఆస్వాదించగలుగుతారు.'

'చట్టాలకు, నైతికపరమైన అంశాలకు లోబడి ఈ టెక్నాలజీని ఎలా వినియోగించవచ్చో తెలుసుకోవడమే ప్రస్తుతం మా లక్ష్యం' అని ఇవాన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)