కరోనావైరస్: తెలంగాణలోని ఈ గ్రామానికి కోవిడ్‌ను ఎదుర్కొనే శక్తి ఎలా వచ్చింది

- రచయిత, ప్రవీణ్ కుమార్
- హోదా, బీబీసీ కోసం
కోవిడ్‌తో సహవాసం తప్పదని ఎపిడమాలజిస్ట్‌లు ఇప్పటికే తేల్చి చెప్పారు. ప్రపంచ ప్రజలందరికీ టీకాలు పూర్తయినా కోవిడ్ జాడ ఇంకా ఉంటుందని అంటున్నారు.
కాలానుగుణంగా దాని తీవ్రత తగ్గి ప్రాణాంతక మహమ్మారి స్థాయి నుంచి మామూలు ఇన్ఫెక్షన్‌గా మారవచ్చని వైద్య వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రోజువారి జీవితంలో కోవిడ్ ఒక భాగంగా మారిన పరిస్థితుల్లో దాన్ని సమర్థంగా ఎదుర్కోవడం, నిరోధించే సామర్థ్యాన్ని కలిగిఉండటం ఎలా అన్న అంశం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామం కోవిడ్‌ను తట్టుకుని తిరిగి పూర్వస్థితికి రాగల సామర్థ్యం గల గ్రామంగా వార్తల్లోకి వచ్చింది.
దేశంలోనే 'కోవిడ్ రెసీలియంట్ విలేజ్'గా రాజన్నపేట ప్రాచుర్యం పొందుతోంది.
"విదేశాల్లో స్థిరపడ్డ భారత సంతతి డాక్టర్ల బృందం సహకారంతో మా రాజన్నపేట గ్రామం ఇప్పుడు కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కుని తిరిగి యథాస్థానంలో నిలబడే స్థాయికి చేరింది. ఇక ముందు ఎన్ని వేవ్‌లు వచ్చినా మేం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం'' అని రాజన్నపేట సర్పంచ్ ముక్క శంకర్ బీబీసీతో చెప్పారు.

"ప్రాజెక్ట్ మదత్'
భారత్ కంటే ముందే అమెరికా కరోనా వల్ల గడ్డు పరిస్థితులను చూసింది. అమెరికాలో కోవిడ్ చికిత్స, నిర్వహణలో తమ అనుభవాలు మాతృదేశానికి అందించాలని అక్కడ స్థిరపడ్డ 15మంది తెలుగు వైద్యులు, ఇతర ప్రాంతాల్లోని తమ మిత్రులతో కలిసి 'ప్రాజెక్ట్ మదత్'ను ప్రారంభించారు.
ఈ బృందంలో వైద్య నిపుణులు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, చార్టెడ్ అకౌంటెంట్లు, ఐక్యరాజ్యసమితిలో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు.
రెండవ విడత కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కుని బయటపడే సామర్థ్యం కలిగిఉన్న ఓ ఆదర్శ గ్రామాన్ని తయారు చేయాలన్న ప్రధాన లక్ష్యంతో 'ప్రాజెక్ట్ మదత్' పనిచేసింది.
కరోనాపై ప్రచారంలో ఉన్న అపోహలు, దుష్ప్రచారాలపై అవగాహన కల్పించారు. స్థానిక సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో కోవిడ్ బాధితులు, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌తో కలిసి పనిచేశారు.
మే, జూన్, జులై నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో సిరిసిల్ల, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో 1500 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అధికారులు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులకు అమెరికా నుంచి 'జూమ్' ద్వారా వారంలో రెండుసార్లు వర్ఛువల్ విధానంలో కోవిడ్‌ను ఎదుర్కోవాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు.
ఈ క్రమంలో పది కంటే ఎక్కువ కేసులు బయటపడ్డ తెలంగాణలోని రాజన్నపేట గ్రామాన్ని కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కునే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు.
'ప్రాజెక్ట్ మదత్‌కు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. సేవాభావం కలిగిన అమెరికాలోని తెలుగు డాక్టర్లు, నాన్ డాక్టర్స్‌తో ఏర్పాటైన మిత్రుల బృందం ఇది. గ్రామీణ భారతం కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నదే మా ఉద్దేశం.
అమెరికా అనుభవాలను ఇక్కడి వారితో పంచుకున్నాం. గ్రామస్థుల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్నాం. రాజన్నపేటలో మేము అనుసరించిన విధానాలతో సమర్థవంతంగా కరోనాను దేశంలో కట్టడి చేయవచ్చని భావిస్తున్నాం.
ఇక ముందు కరోనాను ఎదుర్కోవడం పెద్ద సమస్యగా ఉండకూడదు' అని 'ప్రాజెక్ట్ మదత్' నిర్వాహకుల్లో ఒకరైన 'ఉచ్చిడి బలరాం రెడ్డి' బీబీసీతో అన్నారు.

ఆదర్శ గ్రామం-ఐదు అంచెల వ్యూహం
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కుని నిలబడే ఆదర్శ గ్రామం రూపొందించే క్రమంలో భాగంగా "ప్రాజెక్ట్ మదత్" అనేక ప్రయోగాలను చేసింది. సాంకేతిక పరిజ్ఞానం విరివిగా ఉపయోగించింది. చివరకు ఐదు అంచెల వ్యూహం అమలు చేసింది. అందులో...
•గ్రామీణ వైద్య సహాయకుల్లో కరోనాపై అవగాహన, ఆత్మస్థైర్యం నింపడం.
•గ్రామస్తుల్లో బాధ్యతాయుతమైన కోవిడ్ నడవడిక ఏర్పర్చడం.
•కోవిడ్‌పై నెలకొన్న అపోహలు, దుష్ప్రచారాలపై స్థానిక భాషలో సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించడం.
•టెక్నాలజీ సహాయంతో కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, కోవిడ్ రోగుల పర్యవేక్షణ, సమాచారం ఒకే దగ్గర క్రోడీకరించడం.
•అవసరమైతే ఇంటి గడప వద్దే అందుబాటులో వాక్సినేషన్.
రాజన్నపేటలో గ్రామీణ వైద్య సహాయకులకు మొదట కరోనా ఎదుర్కోవడంలో అవగాహన కల్పించడంతో పాటు వారిలో నెలకొన్న భయాన్ని పోగెట్టేందుకు మానసిక నిపుణులతో సలహాలను అందించింది.
అదే సమయంలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరిగా అందేలా ఉపయోగపడే ప్రోనింగ్ ఎక్సర్సైజ్‌లు, బలవర్థకమైన అహారం తీసుకోవడంపై అవగాహన కల్పించారు.
పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, సానిటైజర్, పల్స్ ఆక్సీమీటర్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సెల్ఫ్ టెస్టింగ్ కిట్లు విస్తృతంగా పంపిణీ చేపట్టారు. కోవిడ్‌పై నెలకొన్న అపోహలపై వాట్సాప్, ఫేస్‌బుక్ వేదికగా విస్తృత ప్రచారం నిర్వహించారు.
ప్రత్యేకంగా కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, వ్యాపారులకు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు.
గ్రామంలో పోస్టర్లను విరివిగా అంటించారు. కోవిడ్ రోగులకు దగ్గరలో చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, వాటిలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బెడ్‌ల వివరాలు మదత్ మ్యాప్స్ రూపంలో, కోవిడ్ టెస్టింగ్, వాక్సినేషన్ వివరాలు అన్నీ ఒకే చోట వైద్య శాఖకు అందుబాటులో ఉండేలా మదత్ కేర్ డాట్ కామ్ రూపంలో డాటా బేస్‌ను రూపొందించారు.
డ్రోన్ కెమెరాల సహాయంతో గ్రామంలోని పరిస్థితులను పర్యవేక్షించారు. ఇలా పూర్తి అవగాహన, కోవిడ్ బాధ్యతాయుత నడవడిక కల్పించాక చివరి దశలో వాక్సినేషన్ సెంటర్ల వద్దకు రాలేని వారికి ఇళ్ల వద్దకే వెళ్లి కోవిడ్ టీకాలను వేశారు.
గ్రామం ఎంట్రీ పాయింట్‌లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వారికి రాపిడ్ టెస్టులను నిర్వహించాకే లోనికి అనుమతించారు.
''కరోనా సమయంలో మన దేశానికి ఏమి చేయగలమని అనుకున్నాం. మహాత్మాగాంధీ స్ఫూర్తితో డాక్టర్లు, వైద్య నిపుణులతో కలిసి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాం. ఐదంచెలా సూత్రంతో రాజన్నపేటను కరోనాను నిరోధించి నిలబడగలిగే గ్రామంగా తయారు చేయగలిగాం.
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం, గ్రామస్తులు మాకు ఎంతగానో సహకరించారు. ప్రాజెక్ట్ పూర్తి నివేదిక త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తాం. రాజన్నపేట ప్రయోగం మోడల్‌తో ఏ గ్రామాన్నైనాకరోనా రహిత గ్రామంగా తయారు చేయగలమన్న నమ్మకం మాకుంది.
పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో కరోనాతో పోరాడి కట్టడి చేసేందుకు మేము అనుసరించిన మోడల్ మంచి ఉదాహరణగా నిలుస్తుంది'' అని ప్రాజెక్ట్ మదత్ ప్రాజెక్ట్ లీడర్ రాజా కార్తీకేయ బీబీసీకి తెలిపారు.

రాజన్నపేటలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి?
రాజన్నపేట దాని అనుబంధ (హామ్లేట్ విలేజ్) గ్రామం కిష్టూనాయక్ తండా కలిపి మొత్తం జనాభా 2253 మంది. ఇందులో కరోనా టీకాకు అర్హత కలిగిన వారి సంఖ్య 1551 మంది.
ఈ గ్రామంలో ప్రాజెక్ట్ మదత్ పని ప్రారంభించే సమయానికే 332మందికి ప్రభుత్వం మొదటి విడత టీకాలను పూర్తి చేసింది. ప్రస్తుతం 1219 మందికి రెండో విడత వాక్సినేషన్ పూర్తి కావాల్సి ఉంది.
గ్రామానికి అవసరమైన టీకాలను మొత్తం ప్రాజెక్ట్ మదత్ బృందం సమకూర్చింది. స్థానిక వైద్యశాఖ అధికారులు, సిబ్బంది సహాయంతో గ్రామస్తులకు మొదటి విడత వాక్సినేషన్‌ను పూర్తి చేసింది. రెండో విడత వాక్సీన్‌ను కూడా ఉచితంగా అందించేందుకు సిద్ధమయ్యారు.
'ఇప్పుడు కరోనా పట్ల గ్రామస్తులందరం సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నాం. ప్రాజెక్ట్ మదత్‌కు మా కృతజ్ఞతలు. ఇప్పుడు కరోనా మళ్లీ వచ్చినా మాకు ఇబ్బంది లేదు. దాన్ని ఎదుర్కునేందుకు పూర్తి స్థాయి సన్నద్ధత మా గ్రామంలో ఉంది'' అని రాజన్నపేట గ్రామస్తుడు ద్యాప దేవయ్య బీబీసీకి చెప్పారు.
'"గ్రామంలోనే వాక్సినేషన్ అందరికీ అందుబాటులో రావడంతో హెల్ప్ అయ్యింది. మొదట్లో గ్రామంలో సంపూర్ణ వాక్సినేషన్ జరుగుతుందని మాకు నమ్మకం కలగలేదు. కొంతమంది టీకాలు వేసుకోవడానికి భయపడ్డారు. అయితే మేం స్వయంగా టీకాలు వేసుకున్నామని వారికి అవగాహన కల్పించాం. ఇప్పుడు గ్రామంలో అర్హులందరికి మొదటి డోస్ పూర్తయ్యింది'' అని రాజన్నపేట ఆశా కార్యకర్త సంతోషి అన్నారు.
రాజన్నపేట ప్రయోగం సక్సెస్ వెనుక రాజన్నసిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం కృషి కూడా ఉంది. ప్రాజెక్ట్ మదత్‌కు అవసరమైన అన్ని రకాల అనుమతులను ఇచ్చారు.
"రాజన్నపేట భవిష్యత్తులో కోవిడ్‌ను తట్టుకుని ఏ విధంగా నిలబడుతుందన్నది ఒక స్టడీలా మాకు పనికొస్తుంది" అని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావ్ బీబీబీతో అన్నారు.
రాజన్నపేట మాడల్‌ను అధ్యయనం చేసేందుకు ఇండోర్‌లోని ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్)ఆసక్తి చూపిందని ప్రాజెక్ట్ మదత్ బృందం చెబుతోంది.
అలాగే, అమెరికా మెడికల్ జర్నల్‌లో సైతం ఈ ప్రయోగంపై పరిశోధన పత్రాలను ప్రచురించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది..
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











