రాజ్‌ కుంద్రా: పోర్నోగ్రఫీ కేసులో శిల్పా శెట్టి భర్తకు జులై 23 వరకు పోలీస్ కస్టడీ

రాజ్‌కుంద్రా

ఫొటో సోర్స్, Getty Images

ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులో ముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 2021 లో క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో రాజ్ కుంద్రాను సోమవారం అరెస్టు చేశారు.

ఈ కేసులో రాజ్ కుంద్రా ప్రమేయం ఉందని చెప్పడానికి తమ వద్ద తగిన ఆధారాలున్నాయని పోలీసులు పేర్కొన్నారు.

అయితే, రాజ్‌ కుంద్రా అరెస్టు వ్యవహారంలో ఆయన కుటుంబం నుంచి లేదా శిల్పా శెట్టి కుటుంబం నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా వెలువడ లేదు.

కుంద్రాను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు కేసు దర్యాప్తులో తమకు అందిన సమాచారాన్ని న్యాయస్థానానికి వివరించారు.

రాజ్‌కుంద్రా

ఫొటో సోర్స్, PRODIP GUHA/GETTY IMAGES

పోలీసులు కోర్టుకు ఏం చెప్పారు?

  • రాజ్‌ కుంద్రా హాట్‌షాట్ అనే యాప్ ద్వారా పోర్న్‌ వీడియోలు సరఫరా చేసేవాడు.
  • గహనా వశిష్ట అనే మహిళను అరెస్టు చేసినప్పుడు ఆమె ఉమేశ్ కామత్ పేరు చెప్పారు.
  • ఉమేశ్ కామత్ రాజ్‌ కుంద్రాకు మాజీ పీఏ. రాజ్‌ కుంద్రా-పోర్న్‌ వీడియోల మధ్య లింకును ఉమేశ్ వెల్లడించాడు.
  • అయితే, తన హాట్‌షాట్ యాప్‌ను ప్రదీప్‌ బక్షీ అనే వ్యక్తికి అమ్మినట్లు రాజ్‌ కుంద్రా చెప్పారు.
  • కానీ ఈ యాప్ ఆర్థిక లావాదేవీల గురించి రాజ్‌ కుంద్రా క్రమం తప్పకుండా అప్‌డేట్స్ తీసుకుంటున్నారు.
  • హాట్‌షాట్ క్లిప్‌ల పంపిణీ, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను చర్చించేందుకు రాజ్‌కుంద్రా ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.
  • గహనా వశిష్ట, ఉమేశ్ కామత్‌లు నిర్మాత, దర్శకులు. హాట్‌షాట్ కోసం వీరు కథలు రాశారు. కథతోపాటు ఇతరులకు పంపే మెయిల్స్‌ సీసీలో రాజ్‌కుంద్రా పేరు ఉంది.
  • రాజ్‌ కుంద్రా అనేక మార్లు హాట్‌షాట్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల గురించి సంభాషణలు జరిపారు.
శిల్పా షెట్టి

ఫొటో సోర్స్, MILIND SHELTE/THE INDIA TODAY GROUP VIA GETTY IMAG

ఎప్పటి నుంచి జరుగుతోంది?

ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబయి పోలీసు బృందం గ్రీన్ పార్క్ బంగ్లాపై దాడి చేసింది. అక్కడ పోర్న్ చిత్రాల షూటింగ్ గురించి సమాచారం రావడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

అప్పట్లో పోలీసులు అయిదుగురిని అరెస్టు చేశారు. వారిలో ఒక బాలికను విడుదల చేశారు. అరెస్టయిన అయిదుగురిలో ఇద్దరు నటులు, ఇద్దరు యువతులు కూడా ఉన్నారు.

ఇప్పటివరకు ఈ కేసులో మొత్తంగా 11 మందిని అరెస్టు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు.

రాజ్‌కుంద్రా

ఫొటో సోర్స్, Ani

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో కుంద్రా

2012 సంవత్సరంలో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజ్ కుంద్రా పేరు ఉంది. ఆయన్ను అరెస్టు కూడా చేశారు.

ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌లో రాజ్ కుంద్రాకు వాటా ఉంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో కుంద్రాతో పాటు పలువురు ఆటగాళ్లను కూడా దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్, రాజ్‌ కుంద్రాలు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

ముద్గల్ కమిటీ నివేదిక తరువాత, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పై రెండేళ్ల నిషేధం విధించాలని సుప్రీంకోర్టు ప్యానెల్ సిఫారసు చేసింది. రాజ్ కుంద్రా, మెయ్యప్పన్ ఎలాంటి క్రికెట్ వ్యవహారాలలో పాల్గొనరాదని అప్పట్లో జీవితకాల నిషేధం కూడా విధించారు.

ఆ తర్వాత సాగిన విచారణ అనంతరం రాజ్ కుంద్రాకు స్పాట్ ఫిక్సింగ్‌లో పాత్ర లేదంటూ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)