ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: మొదటి టీ20 మ్యాచ్‌లో ఇండియా ఓటమికి ఐదు కారణాలు ఇవీ...

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, మనోజ్ చతుర్వేది
- హోదా, స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
ఇంగ్లండ్‌తో టెస్ట్ సీరీస్‌లాగానే టీ20 సీరీస్‌లో కూడా ఓటమితో ప్రారంభించింది టీం ఇండియా.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబర్చి ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది.
ఈ ఏడాది చివర్లో స్వదేశంలోనే జరగబోతున్న టీ20 ప్రపంచ కప్ పోటీలకు సన్నాహాలు ప్రారంభించే ఉద్దేశంతో భారత్ ఈ మ్యాచ్‌లో అడుగుపెట్టింది. కానీ ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
భారత్ ఎందుకు ఓడిపోయిందని విశ్లేషిస్తే ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.
రోహిత్ శర్మ బయటే ఉండిపోవడం
ఈ మధ్యనే రోహిత్ శర్మ టెస్టుల్లో తన సత్తా చాటుకుంటున్నాడుగానీ టీ20లో ఎప్పటినుంచో అతను మాస్టర్ క్లాస్ బ్యాట్స్‌మన్.
అన్ని కోణాల నుంచీ విశ్లేషించి భారత జట్టును నిలబెట్టగలిగే ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఎన్నుకోవడం చాలా ముఖ్యం.
ఆ దిశలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక రోజు ముందుగానే ప్రకటించాడు. కానీ, శిఖర్ ధావన్‌కు చోటు కల్పించడం కోసం రోహిత్‌ను క్రీజుకు బయటే కూర్చోబెట్టారు.
రోహిత్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సిద్ధహస్తుడు. కానీ, అతని గైర్హాజరీలో రాహుల్, ధావన్‌లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు వేసిన బంతులకు సరైన జవాబు ఇవ్వలేకపోయారు.
ఇటీవల జరిగిన టెస్ట్ సీరీస్‌లో రోహిత్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. రోహిత్ ఫాంను ఈ మ్యాచ్‌లో కూడా ఉపయోగించుకుని ఉంటే ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెరిగి ఉండేది. కానీ అతన్ని బయటే కూర్చోబెట్టడం వలన ఇంగ్లండ్‌కు భారత్‌పై ఒత్తిడి పెంచే అవకాశం వచ్చింది.

ఫొటో సోర్స్, Reuters
నిరాశపరిచిన విరాట్ కోహ్లి
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొద్ది కాలంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. ఈ మ్యాచ్ కూడా అందుకు భిన్నంగా లేదు.
టాస్ గెలిచిన తరువాత టీం ఇండియా దూకుడుగా ఆడుతుందని కోహ్లీ చెప్పాడు. కానీ అది జరగలేదు.. జట్టు, కెప్టెన్ కూడా నిరాశపరిచారు.
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ ఇద్దరూ కూడా మంచి ఫాంలో ఉన్నారు. ఆ రోజు వికెట్ బాగా బౌన్స్ అవుతోంది కూడా.
పరుగుల కోసం కోహ్లీ బాగా కష్టపడాల్సి వచ్చింది. రాహుల్ అవుటయ్యాక జట్టుపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నంలో రషీద్ వేసిన బంతిని తప్పుగా కొట్టి అవుటయిపోయాడు. దాంతో జట్టుపై మరింత ఒత్తిడి పెరిగింది.
ఇంతలో శిఖర్ ధావన్ బాధ్యతారహితమైన షాట్ కొట్టి అవుటయ్యాడు.
దాంతో భారత్ ఐదు ఓవర్లలో 20 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత ఇండియా మ్యాచ్‌పై పట్టు సాధించడంలో పూర్తిగా విఫలమైంది.
మరోపక్క ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించేశారు.

పంత్, హార్దిక్‌లు శ్రేయాస్‌కు మద్దతు ఇవ్వలేకపోయారు
శ్రేయాస్ కన్నా ముందు రిషభ్ పంత్‌ను బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారా అనే సందేహం వచ్చిందిగానీ టెస్టుల్లో పంత్ కనబర్చిన సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసమే అయ్యుంటుంది అనిపించింది.
పంత్ ఆట ఆరంభించిన తీరు చూస్తే జట్టును గట్టెక్కిస్తాడనే ఆశ చిగురించింది.
పంత్, శ్రేయాస్ కలిసి ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెడుతున్నారని సంబరపడేలోపే పంత్ కొట్టిన టైమింగ్ షాట్ బెయిర్‌స్టో చేతుల్లోకి వెళిపోయింది.
ఆ తరువాత శ్రేయాస్, హార్దిక్ పాండ్యా కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించే ప్రయత్నం చేశారు.
కానీ హార్దిక్ కూడా పంత్‌లాగానే పెవిలియన్ బాట పట్టాడు.
పంత్‌గానీ హార్దిక్‌గానీ ఇంకాసేపు క్రీజులో నిలబడి ఉంటే భారత్ స్కోరు కనీసం 150 పరుగులు చేరుకుని ఉండేది. అప్పుడు భారత బౌలర్లకు, ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి తెచ్చే అవకాశం చిక్కేది.

ఫొటో సోర్స్, Reuters
ఇంగ్లండ్ ఓపెనర్లు మ్యాచ్ విజయాన్ని ఖాయం చేసేశారు
ఈ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ ఎందుకు అగ్ర స్థానంలో ఉందో ఆ జట్టు ఓపెనర్లు జోస్ బట్లర్, జేసన్ రాయ్‌లు నిరూపించారు.
భారత పేసర్ భువనేశ్వర కుమార్ చాలా కాలం తరువాత మంచి ప్రదర్శన కనబర్చాడు. అయితే, లక్ష్యం చిన్నది కావడంతో త్వరత్వరగా వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. కానీ భువనేశ్వర కుమార్ అందులో విఫలమయ్యాడు.
వాస్తవానికి జోస్ బట్లర్, జేసన్ రాయ్‌లు బ్యాటింగ్ చేస్తున్న విధానం చూస్తే ఎలాంటి బౌలర్లయినా వారిని కట్టడి చేయలేరనే తోచింది.
టెస్ట్ సీరీస్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన అక్షర్ పటేల్‌ను లక్ష్యంగా చేసుకుని ఇద్దరు ఓపెనెర్లూ పరుగుల వరద సృష్టించారు.
ఇద్దరూ కలిసి ఎనిమిది ఓవర్లలో 72 పరుగులు చేసి మ్యాచ్‌పై తమ ఆధిక్యాన్ని బలపరిచారు.
తరువాత వచ్చిన డేవిడ్ మలాన్, బెయిర్‌స్టో మిగతా పని పూర్తి చేసి 15.3 ఓవర్లలో తమ జట్టుకు విజయాన్ని అందించారు.

భారత జట్టు వ్యూహం ఫలించలేదు
ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో భారత జట్టు బరిలోకి అడుగుపెట్టింది.
యజువేంద్ర చాహల్ పేలవమైన బౌలింగ్ చేశాడు. అక్షర్ పటేల్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టగలడని ఎప్పుడూ అనిపించలేదు.
పేసర్లు భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్‌లు ఇంగ్లండ్ పేసర్లంత వేగం చూపించకపోవడంతో బంతిని బాగా బౌన్స్ చెయ్యలేకపోయారు.
భారత జట్టుకు స్పిన్నర్లను మార్చే అవకాశం లేదు. కానీ, పేసర్లతో ప్రయోగాలు చేయవచ్చు. ఈ సీరీస్‌లో ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. టెస్ట్ సీరీస్‌లాగానే టీం ఇండియా మళ్లీ వెనక్కి దూసుకు రావొచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఎవరీ క్రికెట్ షారుఖ్ ఖాన్... చెన్నై సూపర్ కింగ్స్‌ను కాదని పంజాబ్ కింగ్స్ జట్టులోకి ఎలా వెళ్లాడు?
- జాతిరత్నాలు - సినిమా రివ్యూ: మందు, సిగరెట్, గొడవలు... ముగ్గురూ ముగ్గురే
- మియన్మార్ సైనిక కుట్ర: 'నిరసనకారులను షూట్ చేయమని చెప్పారు... మా వల్ల కాదన్నాం'
- మహారాష్ట్ర: యునెస్కో గుర్తింపు పొందిన ఈ కైలాస మందిరాన్ని ఔరంగజేబు సందర్శించేవారు
- వసీం జాఫర్‌పై వస్తున్న మతతత్వ ఆరోపణలపై స్టార్ క్రికెటర్లు ఎందుకు పెదవి విప్పడం లేదు?
- తెలంగాణ: ‘చీకటి పడిన తరువాత ఇక్కడికి రావాలంటే మగవాళ్లమే భయపడతాం.. అలాంటిది ఆమె ఇక్కడ ఉంటోంది’
- చిరంజీవి: 'విశాఖ ఉక్కు సాధిస్తామని గోడల మీద నినాదాలు రాశాను.. ప్రైవేటీకరణ ఆలోచన విరమించాలి'
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- హాథ్రస్: కూతురిని వేధించారని కేసు పెట్టినందుకు తండ్రిని కాల్చి చంపేశారు
- కరోనావైరస్: ఇండియాలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి కారణమేమిటి.. మరో వేవ్ మొదలైందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








