కరోనావైరస్: ఇండియాలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి కారణమేమిటి.. మరో వేవ్ మొదలైందా

మాస్కు ధరించిన యువతి

ఫొటో సోర్స్, Hindustan Times/gettyimages

గత కొద్ది నెలలుగా భారతదేశంలో కోవిడ్ 19 కేసులు బాగా తగ్గిపోయాయని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో, మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడం కలవరపెడుతోంది. తాజా పరిస్థితులపై బీబీసీ ప్రతినిధులు వికాస్ పాండే, సౌతిక్ బిశ్వాస్ అందిస్తున్న కథనం.

మహరాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఒక్కసారిగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయని అక్కడి డాక్టర్లు గమనించారు.

ముంబయికి సుమారు 700 కిమీ దూరంలో ఉన్న ఈ జిల్లాలో గత ఏడాది వేసవిలో కరోనావైరస్ విజృంభణ తరువాత పరిస్థితి చాలావరకు సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐసీయూలో 1,600 పడకలున్న ప్రభుత్వ ఆసుపత్రి, అర డజను ప్రైవేట్ ఆసుపత్రులు కూడా దాదాపు ఖాళీ అయిపోయాయి.

"కానీ, ఫిబ్రవరిలో అంతా తారుమారైపోయింది. మళ్లీ ఈ జిల్లాలో అందరికీ కరోనా భయం పట్టుకుంది" అని స్థానిక జర్నలిస్ట్ అనిల్ యాదవ్ తెలిపారు.

ఫిబ్రవరి మొదలు, అమరావతి జిల్లాలో 10,000లకు పైగా కేసులు నమోదయ్యాయి. 66 కోవిడ్ మరణాలు సంభవించాయి. ఈ వారంలో 1,000 మందికి పైగా కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. కేసులు పెరుగుతున్న రేటు భయం గొల్పుతోంది.

దీంతో మహరాష్ట్రలో అమరావతి జిల్లాతో పాటూ మరి కొన్ని జిల్లాలు మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి.

25 లక్షల జనాభా ఉన్న అమరావతి జిల్లాలో ఇరుకుగా ఉండే పట్టణ ప్రాంతాలన్నీ కోవిడ్ హాట్‌స్పాట్లుగా మారిపోయానని స్థానికులు అంటున్నారు.

మరో కోవిడ్ వేవ్ మొదలవుతుందేమోనని హెల్త్‌వర్కర్లు ఆందోళన చెందుతున్నారు
ఫొటో క్యాప్షన్, మరో కోవిడ్ వేవ్ మొదలవుతుందేమోనని హెల్త్‌వర్కర్లు ఆందోళన చెందుతున్నారు

"అకస్మాత్తుగా కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణం ఏంటో తెలియట్లేదు. కుటుంబం మొత్తం వ్యాధి బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇది పూర్తిగా కొత్త ట్రెండ్" అని జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ శ్యామసుందర్ నికం చెప్పారు.

ఆ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం నాడు మహరాష్ట్రలో 9,000 కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలల్లో నమోదైన అత్యధిక రోజువారీ కేసుల సంఖ్య ఇదే. అదే రోజు 80 కోవిడ్ మరణాలు సంభవించాయి.

రద్దీగా ఉన్న మార్కెట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రద్దీగా ఉన్న మార్కెట్లు

"ఇక్కడ ఎవరూ మాస్కులు పెట్టుకోవట్లేదు. పెళ్లిళ్లకు, స్థానిక ఎన్నికల ప్రచారాలకు గుంపులుగుంపులుగా వెళ్తున్నారు. అందరూ మామూలుగా తిరిగేస్తున్నారు. ఎవరూ భౌతిక దూరం పాటించట్లేదు. కరోనా టెస్టులు సంఖ్య తగ్గింది. ట్రాకింగ్ కూడా తగ్గిపోయింది. అందుకే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది" అని మహరాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యులు డాక్టర్ సంజయ్ ఓక్ అంటున్నారు.

ఒక్క మహరాష్ట్రలోనే కాకుండా కేరళ, కర్నాటక, తెలంగాణ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

భారతదేశంలో కోవిడ్ కేసులు చాలావరకు తగ్గు ముఖం పట్టాయి. సెప్టెంబర్‌లో రోజువారీ పాజిటివ్ కేసులు 90,000 ఉన్నవి.. ఇప్పుడు 20,000లకి తగ్గాయి.

ఇలాంటి సమయంలో మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అంటువ్యాధి నిపుణులకు, శాస్త్రవేత్తలకు కూడా ఈ పరిస్థితి కలవరం కలిగిస్తోంది.

ఈ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరగడానికి సాధారణంగా కనిపిస్తున్న కారణాలు.. పెద్దసంఖ్యలో జనం హాజరవుతున్న పెళ్లిళ్లు, మాస్కులు వేసుకోకపోవడం, సినిమా హాళ్లు, జిమ్, స్విమ్మింగ్ పూల్స్ తెరవడం, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారాలు.

మహారాష్ట్రలో కేసుల పెరుగుదల
ఫొటో క్యాప్షన్, మహారాష్ట్రలో కేసుల పెరుగుదల తీరు

ఇండియాలో మరో కోవిడ్ వేవ్ మొదలవుతోందా?

అంతా సాధారణ స్థితికి వచ్చేసింది అనే భావన దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఎపిడమాలజిస్ట్ డాక్టర్ లలిత్ కాంత్ అంటున్నారు.

"అజాగ్రత్తగా ఉండే పరిస్థితి మనకు లేదు. జనం ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలు అన్నీ తెరుచుకుంటున్నప్పుడు మరింత జాగ్రత్త అవసరం. అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్, ట్రాకింగ్, ఐసొలేషన్ కూడా మళ్లీ భారీగా పెంచాలి. పరిస్థితులు మరింత దిగజారిపోయేవరకూ వేచి ఉండకూడదని" డా. కాంత్ అభిప్రాయపడ్డారు.

"ఇండియాలోనూ అంతర్జాతీయ సరళి కనిపిస్తోంది. పలు ఇతర దేశాల్లోనూ కేసులు తగ్గు ముఖం పట్టి, మళ్లీ పెరగడం చూశాం" అని ఆయన అన్నారు.

కేసులు పెరగడం ఊహించినదేనని డిసీజ్ మోడలింగ్ నిపుణులు గౌతం మీనన్ అంటున్నారు.

"భారతదేశంలో ఇప్పటికీ ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు మెండుగానే ఉన్నాయని మోడలింగ్ వర్క్, సెరో సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్న పెరుగుదల ఆశ్చర్యకరమేమీ కాదు" అని ఆయన అన్నారు.

కేసులు, మరణాలు

అయితే, కొన్ని రాష్ట్రాల్లోనే కోవిడ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? ముఖ్యంగా మహరాష్ట్రలో ఇది ఇంతలా పెరగడానికి కారణమేంటి?

ఈ రాష్ట్రాల్లో నిఘా బలంగా ఉండడమే కారణమని మీనన్ అంటున్నారు. మిగతా రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులను గుర్తించకపోవడం తప్ప మరే కారణం కనిపించడం లేదని ఆయన అంటున్నారు.

వైరస్‌లో వస్తున్న మ్యుటేషన్ కూడా ఒక కారణం కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. వైరస్‌లు తరచుగా తమ జెనెటిక్ కోడ్ మారే విధంగా పరివర్తన చెందుతూ ఉంటాయి. కొన్ని రకాల మ్యుటేషన్లు వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతాయి. కొన్నిసార్లు యాంటీబాడీలు ప్రభావవంతంగా పనిచేయకుండా అడ్డుకుంటాయి.

బ్రిటన్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్‌లలో ఈ పరిస్థితి కనబడింది. ఈ దేశాల్లో కనిపించిన కొత్త వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందాయి. ఈ కొత్త రకాలకు సంబంధించిన కేసులు ఇండియాలో కూడా కనిపించాయి. అయితే అవి సమూహవ్యాప్తి చెందాయనడానికి ఆధారాలు లేవు.

"ఇది మంచి వార్త, చెడు వార్త కూడా. వైరస్‌లో కొత్త రకాలు వ్యాప్తి చెందకపోవడం మంచి విషయం. ఎందుకంటే ఇవి చాలా వేగంగా, వ్యాప్తి చెందుతాయి. గత ఇంఫెక్షన్ కారణంగా మెరుగుపడిన రోగ నిరోధక శక్తి కూడా వీటిని అడ్డుకోలేదు. అయితే, ఇండియాలో కనిపిస్తున్న కొత్త రకాలు ఇదే సరళిని అనుసరిస్తాయా, లేదా అనేది మనకు తెలీదు. వీటి గురించి మన దగ్గర సమాచారం లేదు. ఇది అంత మంచి విషయమేం కాదు" అని మీనన్ తెలిపారు.

ఇండియాలో అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్‌లో కొత్త రకాలను గుర్తించేందుకు మొత్తం జన్యురాశి క్రమాన్ని నిర్థారించే ప్రక్రియ (జీనోం సీక్వెన్సింగ్)ను ప్రారంభించారు. దీని ద్వారా వందలాది కొత్త మ్యూటేషన్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

అయితే, మ్యూటేషన్ల వల్లే ప్రస్తుతం కేసులు పెరుగుతున్నాయనడానికి ఈ ఆధారలు సరిపోవని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ అంటున్నారు.

మ్యూటేషన్ల వల్లే కోవిడ్ మళ్లీ విజృభిస్తోదని నిర్థరించడానికి మనకు మరింత డాటా, పరిశోధన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజా రవాణా

ఫొటో సోర్స్, Getty Images

"ప్రస్తుతం అమరావతిలో, ఇతర ప్రాంతాల్లో కూడా కరోనా కేసుల ఆకస్మిక పెరుగుదలకు మ్యూటేషన్లు మాత్రమే కారణం అని అనుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే మారిపోవచ్చు. రాబోయే వారాల్లో దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా స్థానికంగా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. మనం చేయవల్సిందల్లా జాగ్రత్తగా ఉండడమే. పరిస్థితి ఆందోళనకరమేగానీ భయపడాల్సినంత కాదు" అని డా. జమీల్ అన్నారు.

ప్రమాదకరంగా మారగలిగే కొత్త రకాలను త్వరగా గుర్తించేందుకు ఇండియాలో జీనోం సీక్వెన్సింగ్ ప్రక్రియను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త వేరియంట్లు పరిస్థితిని మరింత దిగజార్చకుండా ఉండేందుకు ఇదొక్కటే మార్గమని డాక్టర్లు కూడా భావిస్తున్నారు.

గత కొద్ది వారాలుగా కేరళలో కేసులు పెరగడానికి ప్రధాన కారణం టెస్టింగ్ పెరగడమేనని కేరళ కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యులు డాక్టర్ ఫతాహుదీన్ తెలిపారు.

మిగతా రాష్ట్రాలు కూడా టెస్టింగ్ పెంచాలని ఆయన సూచించారు.

"కొత్త కేసులు కనిపించకపోతే కోవిడ్ అంతమైపోయిందని అనుకోడానికి వీల్లేదు. వైరస్ ఇంకా ప్రజల్లోనే తిరుగుతూ ఉంది.. వృద్ధులను, బలహీనమైన ఆరోగ్యం ఉన్నవారిని కబళించడానికి సిద్ధంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి" అని డా. ఫతాహుదీన్ అన్నారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, టెస్టులు పెంచడం, జీనోం సీక్వెన్సింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం మాత్రమే కరోనావైరస్‌ను నివారించే మార్గాలు అని నిపుణులు నొక్కి చెబుతున్నారు.

"లేదంటే మిగతా రాష్ట్రాల్లో కూడా కేసులు అమాంతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే సంవత్సర కాలంలో ఈ మహమ్మారితో పోరాడుతూ అలిసి పోయున్న హెల్త్‌వర్కర్లకు పరిస్థితి మరింత దుర్భరమవుతుంది. అయితే, అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇప్పుడు ఆసుపత్రులన్నీ తయారుగా ఉన్నాయన్న దాన్లో సందేహమేం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. ఏదైనా తేడా వస్తే హెల్త్‌కేర్ వర్కర్లపై, జనాభాపై కూడా అధిక భారం పడుతుంది. ఆ పరిస్థితి మనకు రాదనే ఆశిద్దాం" అని డా. ఫతాహుదీన్ అన్నారు.

(చార్టులు, డాటా విశ్లేషణ - షాదాబ్ నజ్మి )

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)