చైనా వీగర్ ముస్లింలను రకరకాల ప్రాంతాలకు ఎందుకు పంపిస్తోంది... వారు కలిసి ఉంటే ప్రమాదమని అనుకుంటోందా?

వీగర్ ముస్లింలు
ఫొటో క్యాప్షన్, బుజేనాప్ (19) 2017 నాటి కార్మికుల బదిలీలో కనిపించారు
    • రచయిత, జాన్ సుడ్వర్త్
    • హోదా, బీబీసీ న్యూస్, బీజింగ్

ఉద్యోగాలు, ఉపాధి పేరుతో చైనాలోని షిన్‌జియాంగ్ ‌ ప్రాంతం నుంచి వీగర్‌ ముస్లింలను సుదూర ప్రాంతాలకు పంపించడం వారి జనాభాను నియంత్రించే చర్యల్లో భాగమేనని ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ నివేదికను బీబీసీ గుర్తించింది.

అయితే ఉద్యోగాల పేరుతో వీగర్లను దూర ప్రాంతాలకు పంపించడం వారి ఆదాయాలను పెంచడానికి, గ్రామీణ పేదరికాన్ని తగ్గించడానికే తప్ప జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా కాదని చైనా అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది.

బీబీసీకి అందిన సమాచారం ప్రకారం ఇటీవలి కాలంలో బైటపడ్డ రీ-ఎడ్యుకేషన్‌ క్యాంపులతోపాటు ఇలా ఉద్యోగాల పేరుతో వీగర్లను దూరంగా పంపి, వారి కమ్యూనిటీని విడదీయడం, బలవంతంగా వారి జీవన, ఆలోచనా విధానాలలో మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలుస్తోంది.

ఉన్నతాధికారులు మాత్రమే చూడాల్సిన ఈ నివేదిక పొరపాటున ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. దీంతో చైనావ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పర్యటించి, వ్యక్తులతో మాట్లాడి, ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ రిపోర్ట్ నిజమనడానికి ఉన్న ఆధారాలను బీబీసీ పరిశీలించింది.

షిన్‌జియాంగ్ ‌ ప్రాంతంలోని ఓ గ్రామంలో వీగర్‌ ముస్లింలు గడ్డి, కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. అయితే వారిని ఈ పని నుంచి తప్పించి ఇతర ప్రాంతాలకు పంపించాలన్న లక్ష్యంతో చైనా అధికార పార్టీ కార్యకర్తలు ఆ గ్రామానికి చేరుకున్నారు.

చైనా వీగర్ ముస్లింలు
ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ మీడియా రిపోర్ట్ నుంచి తీసిన ఈ చిత్రంలో ఒక రిోపర్టర్ బుజేనెప్‌ను ప్రశ్నిస్తున్నారు

ఒప్పించేందుకు ప్రయత్నాలు

ఊరి మధ్యలోని కమ్యూనిస్టు పార్టీ బ్యానర్లు ఏర్పాటు చేసిన అక్కడికి 4000 కి.మీ. దూరంలోని అన్హూయీ ప్రావిన్స్‌లో ఉద్యోగాలు ఉన్నాయంటూ ప్రకటనల బోర్డులు అంటించారు.

అలా రెండు రోజులు కూర్చున్నా, సుదూర ప్రాంతాలలో ఉద్యోగానికి వెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వారు ఇంటింటికీ తిరిగి కూడా ప్రచారం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో రికార్డు కూడా ఆన్ లైన్ లో ఉంది.

ఈ వీడియో ఆధారంగా 2017లోనే చైనా అధికార వార్తా ఛానల్లో ఒక కథనం ప్రసారమైంది. అప్పట్లో దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల వీగర్ క్యాంపులపై విమర్శలు చెలరేగడంతో ఈ వీడియోపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

కమ్యూనిటీగా ఉండే వీగర్లను విడదీయడానికి ఒక క్రమపద్ధతిలో ప్రయత్నాలు జరిగినట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ వీడియోలో ఓ అధికారి గ్రామస్తులతో మాట్లాడుతూ మీలో కొందరు వేరే ప్రావిన్సులకు వెళ్లి ఉద్యోగాలు చూసుకోవాల్సిందేనని ఓ వ్యక్తికి చెబుతుంటాడు. అయితే ఆ గ్రామస్తుడు మాత్రం తాము ఎక్కడికీ వెళ్లేది లేదని చెప్పడం వీడియోలో కనిపిస్తుంది.

దూర ప్రాంతంలో ఉన్న ప్రావిన్సులతో ఉద్యోగం చేసుకుంటే జీవితంలో స్థిరపడతావని, తిరిగి ఇక్కడికి రావాల్సిన పని ఉండదని టీవీ ఛానల్‌ రిపోర్టర్ ఓ యువతితో చెప్పగా ''నేను వెళ్లనే వెళ్లను" ఆ యువతి చేతిని అడ్డంగా ఊపడం ఈ వీడియోలో కనిపిస్తుంది.

అధికారులు ఆమెను వెళ్లాల్సిందిగా పదే పదే కోరగా "అందరూ వెళితే నేనూ వెళతాను" అంటూ ఆ యువతి ఏడుస్తూ చెప్పడం కూడా ఆ వీడియోలో ఉంది.

ఆ వీడియో చివరిలో తల్లిదండ్రులు, పిల్లలు ఏడుస్తూ ఒకరికి ఒకరు వీడ్కోలు చెప్పుకోవడం కనిపిస్తుంది.

గువాంగ్ ‌జోలోని దోంగ్వువాన్ లుజో షూ ఫ్యాక్టరీ

ఫొటో సోర్స్, Nathan VanderKlippe/The Globe and Mail

ఫొటో క్యాప్షన్, గువాంగ్ ‌జోలోని దోంగ్వువాన్ లుజో షూ ఫ్యాక్టరీ

స్వచ్ఛందంగానే వెళ్లారా?

“ప్రజలు స్వచ్ఛందంగా ఈ ట్రాన్స్‌ఫర్‌ పథకంలో పాల్గొంటున్నారని చైనా ప్రభుత్వం చెబుతోంది. కానీ వీడియోలలో అసలు విషయాలు బైటపడ్డాయి” అని బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ హల్లమ్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న లారా మర్ఫీ అన్నారు.

“ఆదాయాలు మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నా వారిని సాంస్కృతికంగా విడదీసి, భాష, ఆచార వ్యవహారాలను, జనాభా స్థితిగతులను మార్చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల వారి పేదరికం పెరుగుతుంది తప్ప తగ్గదు” అన్నారు మర్ఫి‌.

2013లో బీజింగ్‌లో, 2014లో కున్మింగ్‌ నగరాలలో ప్రజలపై జరిగిన దాడులకు కారణం వీగర్‌ ముస్లింలు, వేర్పాటువాద వర్గాలేనని భావిస్తున్న ప్రభుత్వం వారి విషయంలో అప్పటి నుంచి తన వైఖరిని మార్చుకుంది.

వీగర్ల సంస్కృతి సంప్రదాయాలను మార్చేయడం ద్వారా వారిని జన జీవన స్రవంతిలో కలపాలన్నది చైనా కమ్యూనిస్టు పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. వారిని ఇస్లామిక్‌ సంప్రదాయం నుంచి చైనాలోని హన్‌ సంప్రదాయంలోకి తీసుకురావాలని అధికారం పార్టీ భావిస్తోంది.

చైనా వీగర్ ముస్లింలు
ఫొటో క్యాప్షన్, స్థానిక హలాల్ రెస్టారెంట్

ఎలా పంపించాలి?

ఇందులో భాగంగా జాబ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్కీమ్‌లాంటివి ప్రవేశపెట్టి వారిని చెట్టుకొకరిని, పుట్టకొకరిని పంపించాలన్నది చైనా అధికారులు ప్రణాళిక. ఈ ప్రణాళిక తీరుతెన్నులు, పురోగతిపై అధికారులకు పంపిన ఓ రిపోర్ట్‌ 2019 డిసెంబర్‌లో ఆన్‌లైన్‌లోకి వచ్చింది.

కొన్నాళ్లకు దాన్ని తొలగించారు. వీగర్‌ ముస్లింలను వారి ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు పంపడమే ఉత్తమమైన మార్గమని ఓ యూనివర్సిటీ నిపుణుల బృందం తమ నివేదికలో పేర్కొంది. ఇలా పంపడం ద్వారా వీగర్‌ ముస్లింల జనసాంద్రతను తగ్గించవచ్చని ఆ రిపోర్ట్‌ సలహా ఇచ్చింది.

ఈ రిపోర్ట్‌ను వీగర్‌ తెగకు చెందిన ఓ పరిశోధకుడు ఒకరు ఆన్‌లైన్‌లో చూసి వెంటనే డౌన్‌లోడ్‌ చేశారు. యూనివర్సిటీ అధికారులు తమ తప్పు తెలుసుకుని దాన్ని తొలగించేలోపే అది బయటి ప్రపంచానికి చేరింది.

బుజేనెప్‌ను పనిలోకి తీసుుకన్న హువాఫు టెక్స‌టైల్ కంపెనీ వసతి గృహం
ఫొటో క్యాప్షన్, బుజేనెప్‌ను పనిలోకి తీసుుకన్న హువాఫు టెక్స‌టైల్ కంపెనీ వసతి గృహం

“షిన్‌జియాంగ్ ‌ ప్రావిన్స్‌లో జరుగుతున్న పరిణామాలకు ఈ రిపోర్ట్ నిజమైన ఆధారం” అని ఈ రిపోర్టును అనువదించి, విశ్లేషించిన డాక్టర్‌ ఆడ్రియన్‌ జెన్జ్‌ వ్యాఖ్యానించారు. ఆయన వాషింగ్టన్‌లోని విక్టిమ్స్‌ ఆఫ్‌ కమ్యూనిజం మెమోరియల్ ఫౌండేషన్‌లో సీనియర్‌ ఫెలోగా పని చేస్తున్నారు.

యూనివర్సిటీ నిపుణులు తయారుచేసిన నివేదిక మానవత్వంపై జరుగుతున్న దాడికి నిదర్శనంగా ఉందని ఆయన అన్నారు. అయితే ఈ రిపోర్టుపై బైటికి రావడంతో చైనా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది.

ఆడ్రియన్‌ జెన్జ్‌ రాసిన విశ్లేషణపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ అధికారులు “ ఇవి కేవలం రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు తప్ప ఇందులో వాస్తవాలు లేవు. జర్నలిస్టులు షిన్‌జియాంగ్ ‌ పరిణామాలపై వార్తలు రాసే ముందు అధికారులతో మాట్లాడి అసలు విషయాలు తెలుసుకుంటే మంచిది” అని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.

చైనా అధికారులు వీగర్‌ ముస్లింలను బలవంతంగా ట్రాన్స్‌ఫర్‌ చేసిన ప్రాంతాలను అనేకమంది అంతర్జాతీయ జర్నలిస్టులతో కలిసి బీబీసీ సందర్శించింది. ఆరు ఫ్యాక్టరీలను సందర్శించి పలువురిని ఇంటర్వ్యూలు చేసి అక్కడి వీగర్‌ ముస్లింల స్థితిగతులను స్వయంగా పరిశీలించింది.

BBC ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)