Cowin app: కోవిడ్-19 వ్యాక్సీన్ తీసుకునేందుకు ఇప్పటికీ ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరా?

కోవిన్ యాప్ రిజిస్ట్రేషన్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవోవ్యాక్స్, బయోలాజికల్ ఈ సంస్థ తయారుచేసిన కోర్బెవ్యాక్స్‌లకు తాజాగా అత్యవసర వినియోగానికి అనుమతుల జారీచేశారు. దీంతో భారత్‌లో ప్రస్తుతం మొత్తంగా ఆమోదించిన వ్యాక్సీన్ల సంఖ్య ఎనిమిదికి పెరిగింది.

మొదట్లో కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. ఆ తర్వాత స్పుత్నిక్ వీ, మోడెర్నా వ్యాక్సీన్లకు అనుమతులు ఇచ్చింది. ఆ తర్వాత, జైకోవ్-డీ, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలకు ఆమోద ముద్ర వేసింది.

జూన్ 21, 2021 నుంచి దేశ వ్యాప్తంగా కొత్త వ్యాక్సినేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రజలకు సరిపడా వ్యాక్సీన్లను టీకా తయారీదారుల నుంచి కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. అనంతరం రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఈ కొత్త విధానం అమలు చేసిన అనంతరం తొలి రోజే 80 లక్షల మందికిపైగా వ్యాక్సీన్లు తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

2022 జనవరి 27నాటికి 163 కోట్ల డోసుల వ్యాక్సీన్లను ప్రజలకు ఇచ్చారు. 68.9 కోట్ల మంది రెండు డోసుల వ్యాక్సీన్లు తీసుకున్నారు.

అయితే ఇప్పటికీ కోవిన్ లేదా ఆరోగ్య సేతు యాప్‌లలో రిజిస్ట్రేషన్ తప్పనిసరా? అనే ప్రశ్న చాలా మందిని వెంటాడుతోంది.

కేంద్ర ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం వ్యాక్సీన్ వేసుకోవడానికి ఈ యాప్‌లలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. అయితే, మనం రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, వ్యాక్సీన్ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే రిజిస్ట్రేషన్ మాత్రం కచ్చితంగా జరుగుతోంది.

వ్యాక్సీనేషన్

ఫొటో సోర్స్, EPA

నిజానికి చాలా మంది ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత, వ్యాక్సీన్ తీసుకోవడానికి కేంద్రానికి రావడం లేదు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, విద్యుత్ సరఫరాల్లో అంతరాయం కూడా వెంటాడుతోంది.

ఒక మొబైల్ ఫోన్‌పై నలుగురి పేర్ల వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. అయినప్పటికీ, చాలా మందికి స్మార్ట్‌ఫోన్ సేవలు అందుబాటులో ఉండటం లేదు.

దీంతో చాలా మంది గ్రామీణులకు కోవిన్ లేదా ఆరోగ్య సేతు యాప్‌లలో రిజిస్ట్రేషన్ కష్టం అవుతోంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, యాప్‌లలో రిజిస్ట్రేషన్ తప్పనిసరనే నిబంధనను తొలగించారు.

అయితే, వ్యాక్సీన్ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ కేవలం ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంటోంది. అంటే ప్రైవేటు కేంద్రాల్లో టీకా వేయించుకోవాలంటే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

కోవిన్ యాప్ రిజిస్ట్రేషన్

ఫొటో సోర్స్, cowin.gov.in

ఈ యాప్‌లలో రిజిస్ట్రేషన్ తప్పనిసరికాదని, వ్యాక్సీన్ కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్ కోసం జిల్లా పరిపాలన యంత్రాంగాలతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే, ఈ ఆదేశాలను రాష్ట్రాలు ఏ మేరకు అనుసరిస్తాయనే అంశాన్ని బట్టి ఈ స్పాట్ రిజిస్ట్రేషన్ ఆధారపడి ఉంటుంది.

ఇంతకీ కోవిన్ యాప్ ద్వారా కానీ, వెబ్‌సైటు ద్వారా కానీ .. ఆరోగ్య సేతు యాప్ ద్వారా గానీ వ్యాక్సీన్ కోసం పేర్లను నమోదు చేసుకోవడం ఎలా?

కోవిన్ అనే యాప్ భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు వెన్నెముకగా నిలుస్తోంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కోవిన్ అనే యాప్ భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు వెన్నెముకగా నిలుస్తోంది.

యాప్ ద్వారా నమోదు చేసుకోవడం ఎలా?

మొబైల్ ఫోన్లో కోవిన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

కోవిన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్‌కి వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. అందులో పేరు, పుట్టిన తేదీ, వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల వివరాలు నమోదు చేసుకోవాలి.

ఆ తర్వాత దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రం, తేదీని కూడా యాప్‌లో షెడ్యూల్ చేసుకోవచ్చు.

కోవిన్ యాప్ రిజిస్ట్రేషన్

ఫొటో సోర్స్, Gov.in

ఫొటో క్యాప్షన్, కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ ఇలా

అవసరమయితే ఈ తేదీని మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.

వ్యాక్సీన్ తీసుకునేందుకు అపాయింట్‌మెంట్ లభించిన వెంటనే దానిని ఖరారు చేస్తూ ఎస్ఎంఎస్ కూడా వస్తుంది.

ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్ట్రేషన్ ఇలా
ఫొటో క్యాప్షన్, ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్ట్రేషన్ ఇలా

ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్ట్రేషన్..

కోవిన్ యాప్ తరహాలోనే ఆరోగ్య సేతు యాప్‌లో కూడా వ్యాక్సీన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీని కోసం మొదట ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం, వ్యాక్సినేషన్ విభాగంలోకి వెళ్లాలి.

అక్కడే, అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. పిన్‌కోడ్ టైప్ చేసిన వెంటనే, దగ్గర్లోని వ్యాక్సీన్ కేంద్రాలను యాప్ మనకు చూపిస్తుంది. అనంతరం డేట్‌ను కూడా సెలెక్ట్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవాలి.

వ్యాక్సినేషన్ కోసం వెళ్ళేటప్పుడు వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు తీసుకుని వెళ్ళాలి. వ్యాక్సీన్ కేంద్రం దగ్గర ఆ పత్రాలను తనిఖీ చేసి, వ్యాక్సీన్ వేస్తారు.

ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్ట్రేషన్ ఇలా
ఫొటో క్యాప్షన్, ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్ట్రేషన్ ఇలా

వ్యాక్సినేషన్ పూర్తయినట్లు యాప్ ద్వారా సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వ్యాక్సీన్

వెబ్ సైటు ద్వారా నమోదు చేసుకోవడం ఎలా?

కోవిడ్-19 వ్యాక్సీన్ కోసం 18 ఏళ్లు దాటినవారు నమోదు చేసుకోవడం ఇలా..

  • వ్యాక్సిన్ కోసం అధికారిక వెబ్ సైట్ www.cowin.gov.in లో పేరు నమోదు చేసుకోవాలి.
  • కొవిన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత అందులో Register/ Sign in yourself అనే బటన్‌ ఉంటుంది. అది క్లిక్‌ చేసి మొబైల్‌ నంబరు కానీ ఆధార్ నంబర్ కానీ నమోదు చేయాలి.
  • అనంతరం మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి.
  • పేరు, వయసు, పుట్టినతేదీ వంటి వివరాలు ఎంటర్‌ చేయాలి. దీంతో మీ ధ్రువీకరణ పత్రం ఒకటి అప్‌లోడ్ చేయాలి.
  • ఇదంతా పూర్తయిన తరువాత అపాయింట్‌మెంట్‌ తేదీ, సమయం షెడ్యూల్ చేసుకోవాలి.

ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరో ముగ్గురు సభ్యులను కూడా 'యాడ్ మోర్' అనే ఆప్షన్ ద్వారా నమోదు చేయవచ్చు. ఆ వ్యక్తుల వివరాలు కూడా పైన వివరించిన పద్దతిలోనే నమోదు చేయాలి.

* గూగుల్ మ్యాప్స్ సహాయంతో మీకు సమీపంలోని కోవిడ్ వ్యాక్సీన్ కేంద్రాల గురించి తెలుసుకోవచ్చు.

కోవిన్ వెబ్‌సైట్

ఫొటో సోర్స్, www.cowin.gov.in

ఈ పత్రాలలో ఏదో ఒకటి ధ్రువీకరణకు అప్‌లోడ్ చేయొచ్చు

  • ఆధార్ కార్డు
  • పాన్ కార్డు
  • ఓటర్ ఐడీ
  • డ్రైవింగ్ లైసెన్స్
  • హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డు
  • ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అధికారిక ఐడీ కార్డులు
  • పాస్ పోర్టు
  • బ్యాంకు/పోస్టాఫీసులు జారీ చేసిన పాస్ బుక్స్
  • పెన్షన్ డాక్యుమెంట్
  • రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు జారీ చేసిన ఐడీ కార్డులు
  • ప్రభుత్వ, పబ్లిక్ లిమిటెట్ కంపెనీలు జారీ చేసిన ఐడీకార్డులు
కోవిడ్-19 వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

కోవిన్ వెబ్‌సైట్

ఫొటో సోర్స్, www.cowin.gov.in

ప్రతీ వ్యక్తి రిజిస్ట్రేషన్ పూర్తవగానే కన్ఫర్మేషన్ మెస్సేజ్ వస్తుంది. ఎవరి పేరునైనా తొలగించే అవకాశం కూడా ఉంటుంది.

ఒక్కసారి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత షెడ్యూల్ అపాయింట్మెంట్ పేజీ నుంచి వ్యాక్సీన్ తీసుకునే తేదీని నిర్ణయించుకోవచ్చు.

మనకు దగ్గరలో ఉన్న వ్యాక్సీన్ కేంద్రాలన్నీ అక్కడ కనిపిస్తాయి. అందులోంచి వ్యాక్సీన్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న తేదీని ఎంపిక చేసుకోవచ్చు.

ఒక్క సారి వ్యాక్సీన్ కేంద్రం, తేదీని ఎంపిక చేసుకున్న తర్వాత అక్కడ నుంచి తిరిగి అకౌంట్ డీటెయిల్స్ పేజీకి వెళ్ళాలి. ఆ తర్వాత బుక్ అపాయింట్మెంట్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా వ్యాక్సీన్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.

ఒక సారి పొందుపర్చిన వివరాలను సరి చూసుకుని కంఫర్మ్ బటన్ ప్రెస్ చేయగానే వ్యాక్సీన్ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లే.

రిజిస్ట్రేషన్ పూర్తయితే "అపాయింట్‌మెంట్ సక్సెస్‌ఫుల్" అనే పేజీ కనిపిస్తుంది. ఈ పేజీని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి.

ఈ వివరాలను, ఇతర దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలను ధ్రువీకరించే సర్టిఫికేట్‌లతో సహా వ్యాక్సీన్ కేంద్రానికి తీసుకుని వెళ్లాలి. వీటిని పరిశీలించిన తర్వాత వ్యాక్సీన్ ఇస్తారు.

వ్యాక్సీన్ తీసుకునే తేదీని, యాప్, లేదా వెబ్ సైటులోకి లాగిన్ అయి ఎప్పుడైనా మార్చుకోవచ్చు.

(ఆధారం: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ కోవిడ్-19 నోడల్ అధికారి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)