పెట్రోల్‌, గ్యాస్‌ ధరల వల్ల మీ జేబుపై ఎంత భారం పడుతుంది

పెట్రోలు పంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిధి రాయ్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

దేశంలోని కొన్నిరాష్ట్రాల్లో పెట్రోలు ధర రూ.100 దాటింది. దీనికి తోడు వంట గ్యాస్‌ ధర కూడా సిలిండర్‌కు రూ.50 చొప్పున పెరిగి రూ.796కి చేరింది.

పైప్‌ ద్వారా ముంబయిలోని 7 లక్షల కుటుంబాలకు అందే నేచురల్‌ గ్యాస్‌ కూడా యూనిట్‌‌కు 95 పైసలు పెరిగింది.

పెట్రోల్‌, డీజిల్‌లకు రోజువారీగా ధరలు నిర్ణయిస్తుండగా, ఎల్‌పీజీ గ్యాస్‌కు ప్రతి నెల 1, 16వ తేదీలలో ధరలను నిర్ణయిస్తున్నారు.

ప్రజలు తాము కొంటున్న పెట్రోల్‌లో 60 శాతం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను రూపంలో చెల్లిస్తుండగా.. డీజిల్‌పై 54 శాతం చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై రూ.32.90, డీజిల్‌పై రూ.31.80 పన్ను విధిస్తోంది.

పెరుగుతున్న చమురు ధరలు సామాన్యుడిపై ధరల భారం మోపుతున్నాయి

ఫొటో సోర్స్, NURPHOTO/ CONTRIBUTOR

ఫొటో క్యాప్షన్, పెరుగుతున్న చమురు ధరలు సామాన్యుడిపై ధరల భారం మోపుతున్నాయి

పెరుగుతున్న ద్రవ్యోల్బణం

గత ఏడాది మార్చి రెండో వారం తరువాత నుంచి లీటరు మీద పెట్రోల్ ధర రూ.19.7, డీజిల్ ధర రూ.17.41 పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు తక్కువకు దొరుకుతున్నప్పుడు కూడా ధరలు పెరగడానికి కారణం ప్రభుత్వం విధించే పన్నులు పెంచడమేనని నిపుణులు చెబుతున్నారు.

పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల పార్లమెంటులో చెప్పారు.

ఇటు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరుగుతుండటంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఒకవైపు కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ప్రజల ఆదాయంపై ప్రభావం పడిన వేళ మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుండడం ఆందోళనకర పరిణామం.

మన్మోహన్‌ సింగ్ ప్రభుత్వ హయాంలో పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతల ఫొటోలను మీమ్స్‌ రూపంలో యూజర్లు ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేస్తున్నారు.

#ModiFuelScamవంటి హ్యాష్‌ట్యాగ్‌లు కూడా ట్విట్టర్‌లో కనిపిస్తున్నాయి.

సామాన్యుడి జేబు మీద పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు ప్రత్యక్షంగానూ, డీజిల్‌ ధరలు పరోక్షంగానూ ప్రభావం చూపుతున్నాయి. డీజిల్‌ ధరల పెరుగుదలతో పండ్లు, కూరగాయల ధరల పెరుగుతూ వస్తున్నాయి.

“మా రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. వాటిని మేము ధరలతో సర్దుబాటు చేసుకోవాలి” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ముంబయికి చెందిన ఓ కూరగాయల వ్యాపారి చెప్పారు.

గ్యాస్ సిలెండర్లు

పట్టణ ప్రజలపై భారం

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల ప్రభావం గ్రామీణ ప్రజల కన్నా, పట్టణవాసులపైనే ఎక్కువగా ఉంది.

“రుతుపవనాలు సరిగా లేకపోవడంతో గ్రామీణ భారతదేశం కూడా వ్యవసాయ కార్యకలాపాల కోసం డీజిల్‌పై ఆధారపడుతోంది” అని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకనామిస్ట్ సునీల్ కుమార్ సిన్హా అన్నారు.

ద్రవ్యోల్బణం గత 16 నెలలలో కనిష్ఠ రేటులో ఉండటం ఆసక్తికరమైన విషయం. 2021 జనవరిలో ద్రవ్యోల్బణం 4.1 శాతంగా అంచనా వేయగా, డిసెంబర్‌లో ఇది 4.6 శాతంగా ఉంది.

పెట్రోల్, డీజిల్‌ సూచి 2020 జనవరితో పోలిస్తే 13 శాతం పెరిగింది, వంట గ్యాస్‌ ధర పెరుగుదల 11శాతం వద్ద ఉంది. మీడియాలో వస్తున్న గణాంకాల ప్రకారం 2020 జనవరితో పోలిస్తే ఈ ఏడాది బస్సు ఛార్జీలు సగటున 12 శాతం, టాక్సీ, ఆటోల ఛార్జీలు 7 శాతం పెరిగాయి. ఇంధన ధరల పెరుగుదలే దీనికి కారణం.

"టోకు ధరల సూచిలో ముడి చమురు, దాని ఉత్పత్తుల వాటా 10.36 శాతం ఉంటుంది. కాబట్టి దీని ధరలలో పెరుగుదల, తగ్గుదల రిటైల్ ధరల సూచీపై భారీ ప్రభావాన్ని చూపుతుంది” అని CARE రేటింగ్స్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌ ఉర్విషా జగశేఠ్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)