దిల్లీ అల్లర్లలో మరణించిన అంకిత్ శర్మ, రతన్‌లాల్‌ కుటుంబాలు ఇప్పుడెలా ఉన్నాయి

రతన్ లాల్ కుటుంబం

ఫొటో సోర్స్, Dheeraj Bari

ఫొటో క్యాప్షన్, రతన్ లాల్ కుటుంబం
    • రచయిత, భూమికా రాయ్‌
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్‌

‘‘ఒక్క నిమిషం ఆగండి. నేను మేడ మీదకు వెళ్తాను. ఇక్కడ మాట్లాడాలంటే పిల్లలున్నారు. నేను వారి ముందు ఏడవకూడదు’’ అన్నారు ఫోన్‌లో బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ పూనమ్‌.

ఫోన్‌ పట్టుకుని ఆమె హడావుడిగా మెట్లు ఎక్కుతున్నశబ్దం బీబీసీ కరస్పాండెంట్‌కు వినిపిస్తూనే ఉంది.“మేడ మీద గదిలోకి వచ్చి తలుపేసుకుంటే ఎంతైనా మాట్లాడవచ్చు. పిల్లల ముందు నేను ఏడిస్తే వారు దిగాలు పడిపోతారు. అసలే తండ్రి లేని పిల్లలు” అన్నారు పూనమ్‌.

దిల్లీ అల్లర్ల సమయంలో హత్యకు గురయిన హెడ్‌ కానిస్టేబుల్ రతన్‌లాల్‌ భార్య పూనమ్‌. ఆమె ప్రస్తుతం జైపూర్‌లో తన ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు.

గదిలో కూర్చున్న పూనమ్‌ మాట్లాడడం ప్రారంభించారు. “నా భర్త చనిపోయి ఏడాదైంది. ఈ ప్రపంచంలో లేని వ్యక్తి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను” అన్నారు పూనమ్‌.

నేను ఆయన్ను దేవతల(పిల్లలు) తండ్రి అని పిలుస్తుంటానని ఆమె చెప్పారు.

“గత ఏడాది ఫిబ్రవరి 22న మేమంతా కలిసి ఉన్నాం. మరుసటి రోజు ఆదివారం. ఆయన ఇంట్లోనే ఉన్నారు.” అన్నారు పూనమ్‌.

“ ఆ రోజు సోమవారం. పరీక్షలు ఉండటంతో త్వరగా లేచి స్కూల్‌కు వెళ్లేందుకు పిల్లలు రెడీ అయ్యారు. ఆయన నిద్ర పోతుండటంతో నేనే పిల్లలను స్కూల్‌ బస్‌ ఎక్కించి వచ్చాను. ఇంటికొచ్చి టిఫిన్‌ సిద్ధం చేస్తూ టీవీ ఆన్‌ చేశాను. దిల్లీలో అల్లర్లు పెరిగిపోతున్నట్లు టీవీలో వార్తలు వస్తున్నాయి.

టీవీలో వచ్చే శబ్దాలు విని ఆయన లేచారు. ఇంత జరుగుతున్నా నన్ను నిద్రలేపవేంటని కోప్పడ్డారు. గబగబా లేచి బాత్రూమ్‌లోకి వెళ్లిపోయారు” అని ఆ రోజు జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు పూనమ్‌.

“ఆ రోజు సోమవారం. ఆయన ఉపవాసం ఉంటారు. యాపిల్‌ కోసి ఇచ్చాను. డ్యూటీకి వెళ్లిపోయారు”అని వెల్లడించారామె.

ఆ రోజు పోలీస్‌ స్టేషన్‌ నుంచి పిలుపు ఏమీ రాలేదని.. అయినా, రోజూ 11 గంటలకు డ్యూటీ వెళ్లే రతన్‌లాల్‌ ఆ రోజు 8 గంటల ప్రాంతంలోనే యూనిఫాం వేసుకుని విధుల్లోకి వెళ్లిపోయారని చెప్పారు పూనమ్‌.

“అంతకు ముందు సీఏఏ ఆందోళనల సందర్భంగా ఆయన చేతికి గాయలయ్యాయి. డ్యూటీలో ఇది మామూలే అనుకున్నాను. కానీ అవి ఇంత సీరియస్‌గా ఉంటాయని అనుకోలేదు" అన్నారామె.

రతన్ లాల్, పూనమ్

ఫొటో సోర్స్, Dheeraj Bari

ఫొటో క్యాప్షన్, రతన్ లాల్, పూనమ్

‘రాళ్లు రువ్వడం వల్ల కాదు.. కాల్చి చంపేశారు’

“మా ఇంటి దగ్గర్లో ఇక్కడ చాలామంది పోలీస్‌ ఉద్యోగులు, వారి కుటుంబాలు ఉన్నాయి. వారికి విషయం తెలిసినా నాకు చెప్పలేదు. తర్వాత ఒక అంకుల్‌ వచ్చి టీవీ చూడమని చెప్పారు” అన్నారు పూనమ్‌.

గోకుల్‌పురి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న రతన్‌లాల్‌ ఫిబ్రవరి 24న దిల్లీ ఈశాన్య ప్రాంతంలో జరిగిన అల్లర్లలో చనిపోయారు.

మొదట రతన్‌లాల్‌పై కొందరు రాళ్లు రువ్వారని, తలకు గాయాలయ్యాయని, స్పృహ కోల్పోయారని చెప్పారు. కానీ ఆయనపై కాల్పులు కూడా జరిగినట్లు తర్వాత వైద్యులు వెల్లడించారు. ఆయన ఎడమ భుజంలో బుల్లెట్‌ ఉంది. దాని కారణంగానే ఆయన చనిపోయారని ఆమె చెప్పారు. రతన్‌లాల్‌ చివరిసారిగా ధరించిన యూనిఫామ్‌ తనకు ఇవ్వలేదని పూనమ్‌ చెప్పారు.

“ఆ జ్జాపకాలను మనసు నుంచి తీసివేయలేకపోతున్నాను. దిల్లీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదు. ఉద్యోగం ఇస్తామన్నారు. అది కూడా లేదు” అన్నారు పూనమ్‌.

అంకిత్ శర్మ

ఫొటో సోర్స్, Ankur Sharma

కాలువలో అంకిత్‌ శర్మ మృతదేహం

దిల్లీ అల్లర్లలో మరణించిన 53మందిలో అంకిత్ శర్మ కూడా ఒకరు. ఆయన మృతదేహం అత్యంత దారుణమైన పరిస్థితుల్లో లభించించింది.

ఐబీలో పని చేస్తున్న అంకిత్‌శర్మ ఫిబ్రవరి 25న కనిపించకుండా పోయారు. మరుసటి రోజు ఆయన మృతదేహం ఓ మురుగు కాలువలో లభించింది. ఆయన శరీరంపై 51 గాయాలున్నాయని పోలీసులు ఛార్జిషీటులో పేర్కొన్నారు.

అంకిత్ మృతదేహంపై 51 గాయాలున్నాయని పోలీసులు చెప్పగా, గత ఏడాది మార్చి 11న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభలో మాట్లాడుతూ, అంకిత్ శర్మ మృతదేహంపై 400 గాయాలున్నట్లు చెప్పారు.

తన అన్న ముఖాన్ని ఛిద్రం చేశారని, ఛాతిపై కాల్చారని అంకిత్‌ శర్మ సోదరుడు అంకుర్‌ శర్మ ఆరోపించారు.

“మా అన్నను చంపి కాలువలో వేసిన వీడియోను దృశ్యాలను మా కుటుంబం అంతా చూశాం. ప్రపంచమంతా చూసింది. ఆయన్ను చాలా ఘోరంగా హత్య చేశారు” అన్నారు అంకుర్‌.

22 ఏళ్ల వయస్సులోనే ఉద్యోగంలో చేరిన అంకిత్‌, ముగ్గురు సంతానంలో రెండోవారు. పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేసిన అంకిత్‌ శర్మ సోదరి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు.

తన అన్న ఎంతో మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నారని అంకుర్‌ అన్నారు.

“ అప్పుడే ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చారు. గొడవ అవుతుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందామని బయటకు వెళ్లారు. తిరిగి రాలేదు” అన్నారు అంకుర్‌.

“మేం ఈ ప్రాంతంలో చాలా రోజులుగా ఉంటున్నాం. ఇక్కడ గొడవలు అవుతాయని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు ఇల్లు వదిలి రావాల్సి వచ్చింది.” అని అంకుర్ చెప్పారు.

దిల్లీలోని ఖాజురి ఖాస్‌ ప్రాంతంలోని ఓ ఇరుకైన సందులో నివసించిన అంకిత్‌ కుటుంబం ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో నివసిస్తోంది.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నుంచి తనకు ఓ లేఖ వచ్చిందని అంకుర్ చెప్పారు. విధుల్లో ఉండగా అంకిత్ శర్మ‌ మరణించాడని అందులో రాశారని అంకుర్‌ చెప్పారు. ఆ లేఖను చూపించడానికి ఆయన ఇష్టపడలేదు.

అంకిత్‌ కుటుంబానికి దిల్లీ ప్రభుత్వం నుండి రూ.కోటి పరిహారంగా లభించింది. కేంద్ర ప్రభుత్వం అంకిత్‌ స్వగ్రామంలో మూడు కిలోమీటర్ల రహదారికి ఆయన పేరు పెట్టింది.

అంకిత్‌ హత్య కేసును ఫాస్ట్ ట్రాక్‌ కోర్టులో విచారించాలని, దోషులను ఉరి తీయాలని అంకిత్‌ కుటుంబం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది..

అంకిత్‌ శర్మ హత్య కేసులో మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ సహా పలువురిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

హసీన్‌ అనే కూరగాయల వ్యాపారి అంకిత్‌ను హత్య చేసినట్లు అతని ఫోన్ సంభాషణల ద్వారా గుర్తించామని దిల్లీ పోలీసులు తెలిపారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)