చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది

ఫొటో సోర్స్, EPA
- రచయిత, టిమ్ హార్ఫోర్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1859, ఆగస్టు 27.. అమెరికా వ్యాపారవేత్త ఎడ్విన్ డ్రేక్‌కు అప్పులిచ్చినవారిలో చిట్టచివరి రుణదాత ఆయనకు ఒక హెచ్చరికలాంటి వర్తమానం పంపించారు.
‘‘అన్నీ వదిలేసి వచ్చేయ్.. అప్పులు తీర్చు’’ అనేది ఆ సందేశం సారాంశం. అప్పటికి ఆ రుణదాత పూర్తిగా సహనం కోల్పోయి ఉన్నారు. అందుకే డ్రేక్‌కు అంత ఘాటుగా సందేశం పంపించారు.
డ్రేక్ అప్పుడు ‘రాక్ ఆయిల్’ అన్వేషణలో ఉన్నారు. రాక్ ఆయిల్ అంటే గోధుమ రంగులో ఉండే ఒక రకమైన ముడి చమురు.
పశ్చిమ పెన్సిల్వేనియా ప్రాంతంలో అప్పుడప్పుడూ నేల నుంచి అది ఉబికివస్తూ ఉంటుంది. దాన్ని శుద్ధి చేసి కిరోసిన్ తయారు చేయాలన్నది డ్రేక్ ఆలోచన.
అప్పట్లో దీపాలు వెలిగించేందుకు తిమింగలాల నుంచి తీసే నూనె వాడుతుండేవారు. దాని ఖరీదు అంతకంతకూ పెరగడంతో ప్రత్యామ్నాయంగా కిరోసిన్ వాడేవారు.
కిరోసిన్ తయారీ సమయంలో గ్యాసోలిన్ లాంటి ఉపఉత్పత్తులు వస్తాయి. కానీ, అవి అంత ఉపయోగకరం కాదు. వాటిని కొనేవారు లేకకపోతే పారబోసేవారు.
తన రుణదాత పంపిన ఆ సందేశం ఇంకా డ్రేక్‌కు అందకుముందే ఆయన ప్రయత్నం ఫలించింది. ఆయన బృందం చేపట్టిన తవ్వకాలలో ఓ చమురు ఊట దొరికింది. 21 మీటర్ల లోతులో ఉన్న ఆ ఊట నుంచి చమురు బయటకు ఎగిసిపడుతోంది.
అంతే, తిమింగలాలు బతికిపోయాయి. ప్రపంచం అక్కడ నుంచి భారీ మార్పును చూసింది.
1864లో పెన్సిల్వేనియాలోని పిట్‌హోల్‌లో చమురు బయటపడిందని.. అక్కడ పదుల కిలోమీటర్ల విస్తీర్ణంలో గట్టిగా 50 మంది కూడా నివసించడంలేదని న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక అప్పట్లో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, ఒక ఏడాది తర్వాత పిట్‌హోల్ జనాభా 10వేలకు చేరుకుంది. 50 హోటళ్లు, అమెరికాలోనే అత్యంత రద్దీ ఉండే పోస్ట్ ఆఫీస్‌లు, టెలిగ్రాఫ్ స్టేషన్లు వెలశాయి అక్కడ.
పెద్ద సంఖ్యలో వేశ్యాగృహాలూ ఏర్పడ్డాయి. కొందరు విపరీతంగా సంపాదించారు. కానీ, అసలైన ఆర్థికవ్యవస్థలా నిలదొక్కకునే లక్షణాలేవీ పిట్‌హోల్ నగరానికి లేవు.
చమురు వల్ల ఏర్పడిన హంగామా అక్కడ తొందరగానే ముగిసింది.
కానీ, మనిషి చమురు దాహానికి అక్కడే పునాది పడింది. అది అంతకూఅంతకూ పెరిగిపోతూ వచ్చింది. ఆధునిక ఆర్థికవ్యవస్థ పూర్తిగా చమురులోనే తడిసిముద్దయింది.
ప్రపంచానికి అవసరమైన ఇంధన శక్తిలో మూడింట ఒక వంతు చమురు నుంచే వస్తోంది.
ఇది బొగ్గు కన్నా ఎక్కువ. అణు, జలవిద్యుత్, పునరుత్పాదన ఇంధన వనరులన్నింటినీ కలిపినా చమురు నుంచి వచ్చే శక్తి కన్నా తక్కువే.
మనం వాడే విద్యుత్‌లో 25 శాతం చమురు, గ్యాస్ నుంచే వస్తోంది. చాలా రకాల ప్లాస్టిక్‌ల తయారీకి ఇవి ముడి పదార్థాలుగా ఉపయోగపడతాయి.
రవాణా రంగం గురించైతే ఇక చెప్పనక్కర్లేదు.
గ్యాసోలిన్‌ను ఎవరు కొంటారా అని ఎడ్విన్ డ్రేక్ ఎదురుచూసేవారు. కానీ, ‘ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్’ ఆయన ఎదురుచూపులకు సమాధానం ఇచ్చింది.
కార్లు, ట్రక్కులు, కార్గో నౌకలు, జెట్ విమానాలు.. ఇలా ఎన్నో దాన్ని ఇంధనంగా చేసుకుని ఇప్పుడు మన ముందు పరుగులు తీస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వస్తుధరల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రధానం చమురు ధరే అని చెప్పొచ్చు.
1973లో కొన్ని ధనిక దేశాలకు చమురు ఎగుమతి చేయడంపై పలు అరబ్ దేశాలు నిషేధం అమలు చేశాయి. దీంతో ఒక బ్యారల్ చమురు ధర ఆరు నెలల వ్యవధిలోనే 3 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెరిగిపోయింది.
ఫలితంగా ఆర్థిక మందగమనం ఏర్పడింది. 1978, 1990, 2001ల్లో చమురు ధరల పెరుగుదల కారణంగా అమెరికా ఆర్థిక మాంద్యాలు ఎదుర్కొంది. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యానికి చమురు ధరలు రికార్డు స్థాయికి పెరగడమే కారణమని కొందరు ఆర్థికవేత్తల అభిప్రాయం కూడా. అయితే, చాలా మంది ఇది బ్యాంకింగ్ రంగంలో తలెత్తిన సంక్షోభం వల్లే వచ్చిందని అంటుంటారు.
చమురు ఎలా నడిస్తే, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు అలా మారతాయి.

ఫొటో సోర్స్, Getty Images
అసలు, మనం మరీ ఇంతగా చమురుపై ఆధారపడే స్థాయికి ఎలా చేరుకున్నాం?
చమురు చరిత్రపై డేనియల్ యెర్గిన్ రాసిన ‘ద ప్రైజ్’ అనే పుస్తకం.. విన్‌స్టన్ చర్చిల్‌కు ఎదురైన ఓ సందిగ్ధావస్థను ప్రస్తావిస్తూ మొదలవుతుంది.
1911లో రాయల్ నేవీకి చర్చిల్ అధిపతి అయ్యారు. జర్మనీ ఆక్రమణవాదాన్ని ఎదుర్కొనేందుకు బ్రిటిష్ సామ్రాజ్యానికి కొత్త యుద్ధ నౌకలు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటిని తమకు ఏ చిక్కూ లేకుండా అందుబాటులో ఉండే వెల్ష్ కోల్‌తో నడిచేలా రూపొందించాలా? లేక, సుదూరంగా ఉన్న పర్షియా (ప్రస్తుత ఇరాక్) నుంచి తెచ్చే చమురుతో నడిచేలా తయారుచేయాలా? అన్నది చర్చిల్ ముందున్న ప్రశ్న.
అంత దూరం నుంచి వచ్చే చమురుపై ఆధారపడితే, పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం.
కానీ, చమురు ఇంధనంతో చాలా ప్రయోజనాలున్నాయి. నౌకలు వేగంగా కదులుతాయి. తక్కువ సిబ్బంది అవసరమవుతారు. తుపాకులు, మందుగుండు సామగ్రి ఎక్కువ మోసుకువెళ్లొచ్చు.
ఎందుకంటే, సహజంగానే బొగ్గు కన్నా చమురు మెరుగైన ఇంధనం.
ఇదే తర్కం.. 1912 ఏప్రిల్‌లో చర్చిల్‌ను చమురు వైపు మొగ్గేలా చేసింది. మనల్ని దానిపై విపరీతంగా ఆధారపడేలా చేసింది. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తూ వచ్చింది.
చర్చిల్ నిర్ణయం తీసుకున్నాక.. బ్రిటన్ ప్రభుత్వం ఆంగ్లో-పర్షియన్ ఆయిల్ కంపెనీలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
1951లో ఆ కంపెనీని ఇరాన్ ప్రభుత్వం జాతీయం చేసింది. అది తమ సంస్థ అని బ్రిటిష్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. చమురు తమదని ఇరాన్ స్పందించింది. ఆ తర్వాత కొన్ని దశాబ్దలపాటు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘర్షణలు తలెత్తాయి.
కొన్ని దేశాలు అద్భుత ప్రగతి సాధించాయి. ప్రపంచంలోనే ధనిక దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. అందుకు కారణంగా ఆ దేశ చమురు నిల్వలే.
సౌదీ ప్రభుత్వ చమురు సంస్థ సౌదీ అరామ్‌కో విలువ ఆపిల్, గూగుల్, అమెజాన్ సంస్థల కన్నా ఎక్కువే.

ఫొటో సోర్స్, Reuters
కానీ, జపాన్, జర్మనీల్లా సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ పరిపక్వం కాదు. సౌదీ ఒక పెద్ద స్థాయి పిట్‌హోల్ సిటీ లాంటిది.
ఇరాక్ నుంచి ఇరాన్ వరకు, వెనెజువెలా నుంచి నైజీరియా వరకు.. చాలా దేశాల్లో చమురు సమృద్ధిగా ఉన్నా అవి లాభపడలేదు. ఆర్థికవేత్తలు దీన్నే ‘చమురు శాపం’ అని పిలుస్తుంటారు.
1960ల్లో వెనెజువెలా చమురు శాఖ మంత్రి పనిచేసిన పాబ్బో పెరెజ్ అల్ఫోంజో.. ఆ తర్వాతి కాలంలో చమురును ‘సైతాను మలమూత్రం’గా వర్ణించారు. ‘‘మనం అందులో మునిగిపోతున్నాం’’ అని హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
చమురు సమృద్ధిగా ఉంటే సమస్యలేంటి?
చమురు ఎగుమతుల వల్ల దాన్ని ఉత్పత్తి చేసే దేశం కరెన్సీ విలువ పెరుగుతుంది. ఫలితంగా చమురు తప్ప మిగతా అన్ని ఉత్పత్తుల తయారీ ఖరీదవుతుంది.
తయారీ, సేవల రంగాల్లో పరిశ్రమలు రావడం కష్టమవుతుంది.
చారిత్రకంగా, చాలా మంది రాజకీయ నాయకులు తమ చమురు ఉత్పత్తులను తమ దేశానికి, మిత్ర దేశాలకు మాత్రమే అమ్మాలని ప్రయత్నించిన సందర్భాలున్నాయి.
నియంతలు రావడం కూడా అసాధారణమేమీ కాదు. కొందరు ఆర్జిస్తారు. కానీ ఆర్థికవ్యవస్థలు మాత్రం బలహీనపడతాయి.
పర్యావరణ మార్పులతోపాటు చమురుకు ప్రత్యామ్నాయం రావాలని ఆశించడానికి ఇది కూడా ఓ కారణం.
చమురు ఇప్పటివరకూ బ్యాటరీలకు చోటివ్వడం లేదు. ఎందుకంటే కదిలే యంత్రాలు తమ శక్తి వనరును తమతోపాటు తీసుకెళ్లాలి. అది ఎంత తేలిగ్గా ఉంటే అంత ప్రయోజనకరం.
ఒక కిలో పెట్రోలులో 60 కేజీల బ్యాటరీలతో సమానమైన శక్తి ఉంటుంది. వాడిన తర్వాత దాని ఆనవాళ్లు కూడా ఉండవు. కానీ, బ్యాటరీలు ఖాళీ అయిన తర్వాత కూడా అంతే బరువుతో ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పరిస్థితిని మారుస్తూ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌లోకి దూసుకువస్తున్నాయి. ఎలక్ట్రిక్ జంబో జెట్‌లు తయారు చేయడం పెద్ద సవాలే.
చమురు పూర్తిగా అయిపోవడం ప్రారంభమై, ధరలు విపరీతంగా పెరిగితే పునరుత్పాదక ఇంధనవనరుల వైపు ఆర్థిక వ్యవస్థల మళ్లాల్సిన అవసరం తలెత్తుతుందని ఒకప్పుడు భావించేవారు.
అయితే, ఇప్పుడు మనం వినియోగిస్తున్నదాని కంటే, కొత్తగా బయటపడుతున్న చమురు ఎక్కువగా ఉంటోంది.
హైడ్రాలిక్ ఫ్రాకింగ్ అనే వివిదాస్పద ప్రక్రియ కూడా అందుకు ఓ కారణం. ఈ ప్రక్రియలో నీళ్లు, ఇసుక, రసాయనాలను అధిక పీడనంతో భూమి లోపలికి పంపి చమురు, గ్యాస్ విడుదలయ్యేలా చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
సంప్రదాయ చమురు గుర్తింపు, ఉత్పత్తి విధానాల కన్నా ఫ్రాకింగ్ భిన్నం. ఇది ఒక రకంగా తయారీ ప్రక్రియ.
చమురు ధరలు తమకు అనుకూలంగా అవసరమైనప్పుడు ఉత్పత్తిని విపరీతంగా పెంచుకుని, వద్దనుకున్నప్పుడు ఆపేయొచ్చు.
అయితే, దీర్ఘకాలంలో పర్యావరణంపై ఫ్రాకింగ్ దుష్ప్రభావాలు పడే అవకాశముందని చాలా మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా ఫ్రాకింగ్ పరిశ్రమకు కేంద్రమైన పర్మియన్ బేసిన్ ఇప్పటికే.. సౌదీ అరేబియా, ఇరాక్‌లు మినహా పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఓపెక్)లోని మిగతా 14 సభ్య దేశాల కన్నా ఎక్కువ చమురును ఉత్పత్తి చేస్తోంది.
ప్రస్తుతానికైతే ‘శైతాను మలమూత్రం’లో ఇంకా మనం మునిగి ఉన్నట్లే అనిపిస్తోంది. ఇంకా, కొంత కాలం ఇలాగే ఉండొచ్చు కూడా.
ఇవి కూడా చదవండి
- యెమెన్ యుద్ధం: వేలాది సౌదీ సైనికులను పట్టుకున్నామన్న హౌతీ తిరుగుబాటుదారులు
- తాజ్‌మహల్ కన్నా ఈ మురికి వాడకు వచ్చే సందర్శకులే ఎక్కువ
- సౌదీలో డ్రోన్ దాడులు: అమెరికా చమురును భూగర్భంలో ఎందుకు దాచిపెడుతోంది?
- ఆర్ఎస్ఎస్తో గాంధీకి ఉన్న అసలు బంధం ఏమిటి?
- సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల వల్ల భారత్‌లో ధరలు పెరుగుతాయా?
- 'హౌడీ మోదీ' నిరసనలో నేనెందుకు పాల్గొన్నాను, అక్కడేం జరిగింది: అభిప్రాయం
- సౌదీ ప్రిన్స్: 'ఇరాన్ దూకుడుని ఆపకపోతే... చమురు ధరలు చెలరేగిపోతాయి'
- 17 ఏళ్లుగా దొరకని నేరస్తుడిని డ్రోన్ల సాయంతో పట్టుకున్న పోలీసులు
- ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- అమెరికా - ఇరాన్ ఘర్షణ: హోర్ముజ్ జలసంధిలో సంక్షోభం మీ మీద, ప్రపంచం మీద చూపే ప్రభావం ఏమిటి?
- పాక్‌కు దెబ్బ మీద దెబ్బ, ఇమ్రాన్ ఖాన్ చమురు ఆశలు ఆవిరి
- గయానా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం కానుందా....
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








