ఫైనల్ పరీక్షలు రాయకుండా విద్యార్థుల్ని ప్రమోట్ చేయొద్దు - సుప్రీం కోర్టు తీర్పు

విద్యార్థి, బాలిక
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

తుది సంవత్సరం చదువుతున్న కాలేజీ విద్యార్థులు ఫైనల్ పరీక్షలు రాయకుండా వారిని ప్రమోట్ చేయకూడదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

కరోనావైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనుకుంటే తుది పరీక్షలను సెప్టెంబర్ 30వ తేదీ తర్వాత ఎప్పుడైనా పెట్టుకునేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని అనుమతి కోరవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది.

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తుది సంవత్సరం పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలు వాయిదా వేసుకునే వెసులుబాటు లభించింది. వాటిని రద్దు చేసే అవకాశం మాత్రం లేదు.

కరోనావైరస్ నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ఆధ్వర్యంలోని యువసేన సహా పలు సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కాలేజీలు, యూనివర్శిటీలను మూసేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్లలో పేర్కొన్నారు. విద్యార్థులంతా ఈ విద్యా సంవత్సరంలో ఐదు సెమిస్టర్లను పూర్తి చేశారని, కాబట్టి ఆయా పరీక్షల్లో వారి ప్రతిభ, గ్రేడ్లు ఆధారంగా తర్వాతి సంవత్సరాలకు ప్రమోట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

అయితే, అంతర్గతంగా కాలేజీలు, యూనివర్శిటీలు నిర్వహించే పరీక్షలు, ఇచ్చే గ్రేడ్‌లు సరిపోవని, వాటి ఆధారంగా విద్యార్థులను తర్వాతి సంవత్సరాలకు ప్రమోట్ చేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది.

కాగా, సెప్టెంబర్ 30వ తేదీ నాటికి తుది పరీక్షలను నిర్వహించాల్సిందేనని యూజీసీ సుప్రీం కోర్టుకు తెలిపింది. విద్యార్థుల ‘విద్య భవిష్యత్’(అకడమిక్ ఫ్యూచర్)ను కాపాడేందుకు పరీక్షల నిర్వహణ తప్పనిసరి అని, పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు ఇవ్వలేమని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)