కరోనావైరస్: స్కూళ్లను కోళ్ల పరిశ్రమల్లా మార్చేస్తున్నారు

కరోనావైరస్ వ్యాప్తి నడుమ వచ్చే జనవరి వరకూ స్కూళ్లను తెరవకూడదని కెన్యా నిర్ణయించింది. దీంతో చాలా ప్రైవేటు స్కూళ్ల మనుగడ కష్టమవుతోంది. అక్కడి స్కూళ్ల పరిస్థితిపై బసిలియో ముతాహి, మర్సి జూమా అందిస్తున్న కథనం.
ఒకప్పుడు విద్యార్థుల స్వరాలతో మార్మోగిన మువేయా బ్రెథ్రెన్ స్కూల్ క్లాస్‌రూముల్లో నేడు కోడి పిల్లల కొక్కొరొకో శబ్దాలు వినిపిస్తున్నాయి.
బ్లాక్‌బోర్డుపై గణిత సమీకరణాలకు బదులుగా వ్యాక్సీన్ షెడ్యూల్ కనిపిస్తోంది.
సెంట్రల్ కెన్యాలోని ఈ పాఠశాలను జోసెఫ్ మైనా నడుపుతున్నారు. స్కూళ్లు మూతపడటంతో ఆయనకు ఎలాంటి ఆదాయమూ లేకుండా పోయింది. దీంతో ఈ గదులను కోళ్లను పెంచుకొనేందుకు ఆయన అద్దెకు ఇచ్చేశారు.
''మనుగడకు పోరాటం''
మార్చిలో పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ అయినప్పుడు ఆయన పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇదివరకు తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని ఆయన బ్యాంకును అభ్యర్థించాల్సి వచ్చింది.
''మొదట్లో అంతా కోల్పోయినట్లు అనిపించింది. అయితే మనగడ కోసం ఏదో ఒకటి చేయాలని మేం నిర్ణయించుకున్నాం''అని బీబీసీతో జోసెఫ్ చెప్పారు.
కెన్యాలో 20 శాతం మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుకుంటున్నారు. ఈ స్కూళ్లకు పిల్లలు చెల్లించే ఫీజులే ఆధారం. లాక్‌డౌన్‌తో సిబ్బందికి జీతాలు చెల్లించలేక చాలా స్కూళ్లు ఇబ్బందుల్లో పడ్డాయి.
కొన్ని స్కూళ్లు మాత్రం ఆన్‌లైన్ బోధనతో ఎలాగోలా నెట్టుకు వస్తున్నాయి. పిల్లలు చెల్లించే ఫీజులు కేవలం టీచర్ల జీతాలకే సరిపోతోందని కెన్యా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (కేపీఎస్‌ఏ) వెల్లడించింది.
ఇక్కడ మూడు లక్షల వరకూ ప్రైవేటు స్కూల్ సిబ్బంది ఉన్నారు. వీరిలో 95 శాతం మందికి జీతాలు ఇవ్వకుండా సెలవులపై వెళ్లాలని సూచించినట్లు కేపీఎస్‌ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ ఎన్‌డోరో తెలిపారు.
133 స్కూళ్లు అయితే శాశ్వతంగా మూతపడ్డాయి.

''ఇలా ఎప్పుడూ లేదు''
సెంట్రల్ కెన్యాలోని రోకా ప్రిపరేటరీ స్కూల్‌ను మూసివేయకుండా చూసేందుకు తాత్కాలిక కోళ్ల పరిశ్రమలా మార్చేశారు.
''పరిస్థితులు ఇంత దారుణంగా ఎప్పుడూ మారలేదు''అని ఈ స్కూల్‌ను 23ఏళ్ల క్రితం స్థాపించిన జేమ్స్ కుంగు.. బీబీసీతో చెప్పారు.
ఒకప్పుడు పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్‌లో నేడు కూరగాయలు పండిస్తున్నారు.
''నా పరిస్థితి మిగతా స్కూళ్ల యజమానుల్లానే ఉంది. కారులో డీజిల్ కొట్టించుకొనేందుకూ డబ్బులు లేవు. ఇక్కడ విద్యార్థులు లేరు. టీచర్లు లేరు. మేం మానసికంగా చాలా బాధపడుతున్నాం''అని జేమ్స్ వ్యాఖ్యానించారు.
జోసెఫ్, జేమ్స్ ప్రస్తుతం ఇద్దరు సిబ్బందిని మాత్రమే ఉంచుకున్నారు. ఆ ఇద్దరు కూడా తమ పరిశ్రమలో సాయం చేసేందుకు మాత్రమే.
''ఇది డబ్బులు సంపాదించడానికి కాదు. మేం ఏదో ఉంటున్నాం. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తున్నాం. ఇది ఒక చికిత్సలా పనిచేస్తోంది''అని జేమ్స్ వ్యాఖ్యానించారు.
టీచర్లకు పనిలేదు
ఈ రెండు స్కూళ్లు ప్రత్యామ్నాయ మార్గంలో ఎలాగోలా కొంత ఆదాయం సంపాదిస్తున్నాయి. అయితే వీటిలో పనిచేసే టీచర్లకు మాత్రం ఐదు నెలలుగా జీతాలు లేవు.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు మాత్రం జీతాలు చెల్లిస్తున్నారు.
''కొంత మంది టీచర్లు ఫోన్‌చేసి చేసేందుకు ఏదైనా పనుందా? అని అడుగుతున్నారు. కానీ మేం తినడానికే ఏమీ లేదు''అని జోసెఫ్ వ్యాఖ్యానించారు.
చాలా మంది ప్రైవేటు స్కూల్ టీచర్లు కూడా ఆదాయం కోసం వేరే వృత్తుల బాట పడుతున్నారు.
కెన్యా రాజధాని నైరోబీలో ఆరేళ్ల నుంచీ ఓ ప్రైవేటు స్కూల్‌లో పాఠాలు చెప్పిన మెర్సీన్ ఒటీనో.. నేడు ఇంటి అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్నారు. దీంతో ఆమె ఇల్లును ఖాళీ చేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఆమె ఓ పిల్లాడి ఆలనాపాలనా చూసే ఆయాగా ఓ ఇంటిలో ఉంటున్నారు.

''కెన్యాలో ఒక కోవిడ్-19 కేసు బయటపడిన వెంటనే.. స్కూళ్లన్నీ మూసివేశారు. మాకు చేయడానికి ఎలాంటి పనీ లేకుండా పోయింది''
''నా కొడుకు తినడానికి ఏదో ఒకటి పెట్టాలని చాలా ప్రయత్నించాను. అయితే, అంత తేలిగ్గా పని దొరకలేదు''అని ఆమె బీబీసీతో చెప్పారు.
తూర్పు కెన్యాలో టీచర్‌గా పనిచేసిన గ్లోరియా ముటుకు అయితే, ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని నిర్ణయించుకున్నారు. సరకులు అమ్మే బిజినెస్ పెట్టేందుకు ఆమె లోన్ తీసుకున్నారు.
ఈ బిజినెస్ సవ్యంగా నడవాలని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. మళ్లీ స్కూల్ తెరిచినా తను వెళ్లి పాఠాలు చెప్పబోనని ఆమె వివరించారు.
అసలు ప్రైవేటు స్కూళ్లు మళ్లీ తెరచుకుంటాయా? కరోనావైరస్ ఆందోళనల నడుమ మార్పులకు సిద్ధమా? అనే ప్రశ్నలు వెంటాడుతుండటంతో ఆమెలానే చాలా మంది ఆలోచిస్తున్నారు.
ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం 65 మిలియన్ డాలర్లు సాయం చేయాలని కేపీఎస్‌ఏ కోరుతోంది. టీచర్లు ఇదే వృత్తిలో కొనసాగాలని అభ్యర్థిస్తోంది.
''ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం సాయం చేయాలి. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థలో అవి కూడా భాగమే. విద్యపై ప్రభుత్వం పెట్టే ఖర్చును తగ్గించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి''అని పీటర్ వ్యాఖ్యానించారు.
''ప్రభుత్వ సాయం చేయకపోతే.. చాలా స్కూళ్లు మూతపడతాయి''అని ఆయన హెచ్చరించారు.
తాము విధించిన నిబంధనలకు లోబడే పాఠశాలలకు షరతులపై రుణాలు ఇస్తామని దేశ విద్యా శాఖ చెబుతోంది. కానీ అది సరిపోదని పీటర్ ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- "సినిమా వాళ్లు, మీడియావాళ్లు, రాజకీయ నాయకుల మనుషులు.. నాపై అత్యాచారాలు చేశారు’’
- లాక్డౌన్లో పెరిగిన గృహ హింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
- నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- సోనూ పంజాబన్: ఈ మహిళకు వ్యభిచారం ‘ప్రజాసేవ’, 'కామం' ఒక భారీ మార్కెట్
- ఈ తెగలో వ్యభిచారం ఓ ఆచారం, అమ్మాయి పుడితే సంబరాలు చేసుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








