ఫేస్‌బుక్ స్పందన: ‘రాజకీయ హోదాలు, పార్టీ అనుబంధాలతో పనిలేదు.. హింసను ప్రేరేపించే కంటెంట్‌ను నిషేధిస్తాం’

రాహుల్ గాంధీ, రాజాసింగ్, రవిశంకర్ ప్రసాద్

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ, రాజాసింగ్, రవిశంకర్ ప్రసాద్

భారతదేశంలో పాలక బీజేపీ నేతలు ఫేస్‌బుక్‌లో చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను ఆ సంస్థ చూసీచూడనట్లు వదిలేస్తోందని.. చర్యలు తీసుకోవడం లేదంటూ ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ కథనం రాసింది. భారత్‌లో తన వ్యాపార లావాదేవీలు దెబ్బతినకుండా ఉండేందుకే ఫేస్‌బుక్ అలా చేస్తోందని ఆ కథనంలో రాశారు.

‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ కథనాన్ని ఉటంకిస్తూ పలు పత్రికలు, వెబ్‌సైట్లు ఈ విషయంపై కథనాలు రాశాయి.

Presentational grey line

ఈ వివాదంపై ఫేస్‌బుక్ స్పందించింది.

వ్యక్తుల రాజకీయ హోదాలు, పార్టీలతో వారి అనుబంధాలతో సంబంధం లేకుండా తాము అంతర్జాతీయ స్థాయిలో విధానాలను అమలు చేస్తుంటామని, హింసను ప్రేరేపించే విద్వేష పూరిత ప్రసంగాలను, సమాచారాన్ని నిషేధిస్తామని ప్రకటించింది.

''హింసను ప్రేరేపించే విద్వేష పూరిత ప్రసంగాలను, సమాచారాన్ని మేం నిషేధిస్తాం. వ్యక్తుల రాజకీయ హోదా, పార్టీ అనుబంధంతో సంబంధం లేకుండా అంతర్జాతీయంగా విధానాలను అమలు చేస్తాం. అయితే, ఇంకా చేయాల్సింది చాలా ఉందని మాకు తెలుసు. నిస్పక్షపాతాన్ని, కచ్చితత్వాన్ని పాటించేలా ఎప్పటికప్పుడు ఆడిట్‌లు నిర్వహిస్తున్నాం'' అని ఫేస్‌బుక్ సంస్థ అధికార ప్రతినిధి బీబీసీకి వెల్లడించారు.

Presentational grey line

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా దీన్ని ఉటంకిస్తూనే బీజేపీపై ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలు ఫేస్‌బుక్, వాట్సప్‌లను నియంత్రిస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాగా ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ తన కథనంలో తెలంగాణకు చెందిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఫేస్‌బుక్ పోస్టులనూ ప్రస్తావించింది.

రాజాసింగ్

ఫొటో సోర్స్, RAJASINGH/FB

అంఖీ దాస్‌ అనే ఫేస్‌బుక్‌ సంస్థ ప్రతినిధి తమ సంస్థ ఉద్యోగులతో మాట్లాడినట్లు చెబుతున్న వ్యాఖ్యలను ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ తన కథనంలో పేర్కొంది.

బీజేపీ నాయకుల విద్వేష పూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో మన బిజినెస్‌ దెబ్బతినే ప్రమాదముందని అంఖీ దాస్‌ ఉద్యోగులతో అన్నట్లు ఆ కథనంలో ఉంది.

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తోపాటు మరో ముగ్గురు బీజేపీ నేతల విద్వేష పూరిత ప్రసంగాలు చర్యలు తీసుకునే స్థాయిలో ఉన్నాయని ఫేస్‌బుక్‌ సంస్థ ప్రస్తుత ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు కూడా గుర్తించారని.. అయినా చర్యలు తీసుకోలేదని ఆ కథనం వెల్లడించింది.

ఆ నలుగురు నేతల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉన్నాయని అందులో రాసుకొచ్చారు.

భారతదేశంలో ఫేస్‌బుక్‌ సంస్థ తరఫున వ్యాపార లావాదేవీలకు సంబంధించి లాబీయింగ్‌ కూడా చేసే ఫేస్‌బుక్‌ ప్రతినిధి అంఖీదాస్‌, బీజేపీ నేతలపై చర్యలు తీసుకుంటే ఇండియాలో మన బిజినెస్‌ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుందని, అందువల్ల అలాంటి వారికి హేట్‌ స్పీచ్‌ రూల్స్‌ను అమలు చేయవద్దని పేర్కొన్నట్లు ఈ కథనం వెల్లడించింది.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంపై స్పందించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బీజేపీ, ఆరెస్సెస్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.

"ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ఇప్పుడు బీజేపీ ఆరెస్సెస్‌ అదుపులో ఉన్నాయి. ఫేక్‌ న్యూస్‌ను, విద్వేషాలను రెచ్చగొట్టడంలో బీజేపీకి సహకరిస్తున్నాయి, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి'' అని ట్విటర్‌ వేదికగా ఆరోపించారు.

"చివరకు అమెరికా మీడియాయే ఫేస్‌బుక్‌పై అసలు నిజాలను బయటపెట్టింది'' అని రాహుల్ తన ట్వీట్‌లో విమర్శించారు.

రవిశంకర్ ప్రసాద్

ఫొటో సోర్స్, Getty Images

అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌లో స్పందించారు. " తమ సొంతవారిని కూడా ప్రభావితం చేయలేని వారు, ప్రపంచం మొత్తం బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రభావం చేస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు'' అని ఆయన విమర్శించారు.

"కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా, ఫేస్‌బుక్‌ నుంచి సమాచారం తీసుకుని ఎన్నికల్లో ఉపయోగించుకోడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన మీరు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా ?'' అని రవిశంకర్ ప్రసాద్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు.

కాగా ఈ ఆరోపణలకు సంబంధించి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఫేస్‌బుక్‌ నుంచి వివరణ కోరుతుందని, విద్వేష ప్రసంగాలపై మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రశ్నిస్తుందని తాను ఆశిస్తున్నానని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)