కరోనావైరస్ కేసుల డబ్లింగ్ రేటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంత... కోవిడ్ వ్యాప్తి పెరుగుతోందా, తగ్గుతోందా?

ఐసీఎంఆర్ ఆమోదించిన కోవిడ్-19 పరీక్షా కేంద్రాలు

ఫొటో సోర్స్, ICMR

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో సుమారు 300 ప్రభుత్వ, వంద ప్రైవేటు ల్యాబ్‌లు కోవిడ్-19 పరీక్షలు జరుపుతున్నాయి
    • రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలో కరోనావైరస్ కేసుల రెట్టింపు రేటు ఏప్రిల్ 29వ తేదీ నాటికి 11.3 రోజులకు తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీ నాటికి ఈ రేటు 7.5 రోజులు అని, మార్చి 25వ తేదీ.. అంటే దేశంలో లాక్‌డౌన్ అమలు చేయకముందు 3.4 రోజులు అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కోవిడ్-19 సోకినట్లు నిర్థరణ అయిన కేసుల సంఖ్య ఎన్ని రోజుల్లో రెట్టింపు అవుతోందో ఆ రోజుల్ని బట్టి ఈ రేటును లెక్కిస్తున్నారు. ఏప్రిల్ 20వ తేదీ నాటికి ఈ రేటు ఆంధ్రప్రదేశ్‌లో 10.6 రోజులు, తెలంగాణలో 9.4 రోజులు అని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

భారతదేశంలో తొలి కోవిడ్-19 కేసు 2020 జనవరి 30వ తేదీన నమోదైంది. అప్పట్నుంచి 44 రోజులకు వంద కేసులు నమోదు కాగా.. తర్వాతి వంద కేసులు ఆరు రోజుల్లో, ఆ తర్వాతి 200 కేసులు కేవలం రెండు రోజుల్లోనే నమోదయ్యాయి. అనంతరం ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతూ వచ్చింది.

ఏప్రిల్ 9వ తేదీ నాటికి దేశంలో కేసుల సంఖ్య 6400 దాటగా.. అవి రెట్టింపై 12800 దాటడానికి వారం రోజులు పట్టింది. ఆ కేసులు రెట్టింపై 24600 కేసుల్ని దాటడానికి ఎనిమిది రోజులు పట్టింది. ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 10 గంటకు మొత్తం కేసుల సంఖ్య 33,050కు చేరింది. ఐదు రోజుల్లో కేసుల సంఖ్య 35 నుంచి 40 శాతం పెరిగింది. అంటే, రెట్టింపయ్యేందుకు అంతకుముందుతో పోలిస్తే ఎక్కువ సమయం పడుతోంది. ఈ సమయం పెరిగిన కొద్దీ రెట్టింపు రేటు తగ్గినట్లు.

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కేసు మార్చి 11వ తేదీన నమోదు కాగా వంద కేసులు చేరుకోవడానికి 21 రోజులు, అవి రెట్టింపై 200 కేసులు చేరుకోవడానికి 4 రోజులు, అవి రెట్టింపై 400 కేసులు చేరుకోవడానికి 6 రోజులు, అవి రెట్టింపై 800 కేసులు చేరుకోవడానికి 11 రోజుల సమయం పట్టింది. ఏప్రిల్ 22వ తేదీన ఏపీలో కేసుల సంఖ్య 800 సంఖ్యను దాటగా ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేసిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో కేసుల సంఖ్య 1403 కేసులు నమోదయ్యాయి. అంటే వారం రోజుల్లో కేసుల సంఖ్య సుమారు 75 శాతం పెరిగింది. అంతకు ముందుతో పోలిస్తే రెట్టింపు రేటు స్వల్పంగా పెరిగింది.

తెలంగాణలో తొలి కేసు మార్చి 1వ తేదీన నమోదు కాగా వంద కేసులు చేరుకోవడానికి 30 రోజులు పట్టింది. అవి రెండు రోజుల్లోనే రెట్టింపై 200 కేసులకు చేరుకోగా.. ఆ తర్వాత నాలుగు రోజులకు కేసుల సంఖ్య 400 దాటింది. అవి రెట్టింపు కావడానికి 11 రోజులు పట్టింది. ఏప్రిల్ 18వ తేదీన తెలంగాణలో కేసులు 800 సంఖ్యను దాటాయి. ఏప్రిల్ 28వ తేదీ రాత్రి 8.25 గంటలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించిన సమాచారం మేరకు కేసుల సంఖ్య 1408కి చేరుకుంది. అంటే పది రోజుల్లో కేసుల సంఖ్య సుమారు 75 శాతం పెరిగింది. అంతకు ముందుతో పోలిస్తే ఈ రెట్టింపు రేటు స్వల్పంగా తగ్గింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

తాజా గణాంకాల ప్రకారం చూస్తే.. మహారాష్ట్ర, గుజరాత్‌లలో కరోనావైరస్ పెరుగుదల రేటు తీవ్రంగా ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి సభ్యురాలిగా పనిచేసిన ప్రొఫెసర్ షామిక రవి తెలిపారు.

"ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో కరోనావైరస్ పెరుగుదల రేటు ఆందోళనకరంగా ఉందని, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జమ్మూ, కశ్మీర్‌ల్లో కూడా వైరస్ పెరుగుతోందని వివరించారు.

కేరళ, హరియాణా రాష్ట్రాలు బాగా కోలుకున్నాయని, దిల్లీ, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో రెండోసారి ఈ వైరస్ విజృంభిస్తోందని వెల్లడించారు.

డబ్లింగ్‌ను బట్టి కరోనా ఉధృతిని అంచనా వేయొచ్చా?

కరోనావైరస్ మహమ్మారి విస్తరించే వేగాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి కేంద్ర మంత్రులు, అధికారులు, నిపుణులు ఈ డబ్లింగ్ రేటును ఉదహరిస్తున్నారు. అయితే, దీని ఆధారంగా కరోనావైరస్ ఉధృతిని ఎంత వరకు కచ్చితంగా అంచనా వేగలం అనేది స్పష్టంగా చెప్పలేం.

ఎందుకంటే.. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా కొందరు చెప్పినట్లు కరోనావైరస్ భారతదేశంలో పుట్టింది కాదు. ఇతర దేశాల్లో ఉన్నవారికి సోకి, వారి ద్వారా ఇక్కడికి వచ్చింది. వారి నుంచి ఇతరులకూ పాకింది. కరోనావైరస్ వ్యాప్తి చెందటం ప్రారంభించిన మొదట్లో.. అంటే మార్చి మొదటి వారం నాటికి దేశంలో దీనిని పరీక్షించే యంత్రాలు, ల్యాబొరేటరీలు చాలా తక్కువగా ఉన్నాయి. తర్వాత పెరుగుతూ వస్తున్నాయి. మార్చి 25వ తేదీ నుంచి లాక్‌డౌన్ అమలవుతుండగా.. అప్పటికి ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఎంత మంది ఉన్నారు, వారు ఏయే రాష్ట్రాల్లో ఉన్నారు? వారిలో ఎంత మందిని ప్రభుత్వం గుర్తించి, పరీక్షలు జరిపింది? వారిని కలిసిన వారిలో ఎంత మందిని పరిశీలించింది? ఇలా చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తాజా గణాంకాల ప్రకారం చూస్తే.. కోవిడ్-19 నిర్థరణ పరీక్షలు జరిపే ల్యాబ్‌లు దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, పంజాబ్‌ సహా తూర్పున ఉన్న పశ్చిమ బెంగాల్‌లో తక్కువగా ఉన్నాయి.

ఐసీఎంఆర్ తాజా లెక్కల ప్రకారం దేశంలో ఇప్పటి వరకూ 8.30 లక్షల శాంపిళ్లను పరీక్షించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 88 వేల శాంపిళ్లు పరీక్షించామని, తమిళనాడులో లక్షా 9 వేలకు పైగా శాంపిళ్లు పరీక్షించామని, కర్ణాటకలో 55వేలకు పైగా శాంపిళ్లు పరీక్షించామని, కేరళలో దాదాపు 24 వేల శాంపిళ్లు పరీక్షించామని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. మధ్యప్రదేశ్‌లో 33 వేల శాంపిళ్లు, బిహార్ 21 వేల శాంపిళ్లు, దిల్లీ దాదాపు 40 వేల శాంపిళ్లు, పంజాబ్ 18 వేల శాంపిళ్లు పరీక్షించినట్లు తెలిపాయి. దేశంలోనే అత్యధికంగా 21 కోట్ల జనాభా ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో ఐసీఎంఆర్ ఆమోదం పొందిన కోవిడ్-19 ల్యాబ్‌ల సంఖ్య 20. అవి కూడా ప్రభుత్వ, ప్రైవేటు రెండు రంగాల్లోనూ కలిపి. ఈ రాష్ట్రంలో ఎంత మందికి శాంపిళ్లు సేకరించి, పరీక్షించారనే సమాచారం అందుబాటులో లేదు.

శాంపిళ్లు పరీక్షిస్తే బాగా కట్టడి చేసినట్లేనా?

వాస్తవానికి కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు సరైన ఫార్ములా ఇదీ అని ఏ దేశమూ స్పష్టంగా తేల్చలేకపోయింది. అత్యధిక స్థాయిలో ప్రజలకు పరీక్షలు జరిపిన దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల్లో తొలుత తగ్గినట్లు కనిపించిన ఈ వైరస్ తర్వాత మళ్లీ స్వల్పంగా వ్యాప్తి చెందడం ప్రారంభించింది.

పైగా, భారతదేశంలో మొత్తం పాజిటివ్ కేసుల్లో 80 శాతం ఎలాంటి లక్షణాలూ కనిపించని కేసులు అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ, పరీక్షలు చేయడానికి జారీ చేసిన మార్గదర్శకాల్లో మాత్రం విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిలో లక్షణాలు ఉన్నవారు, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న రోగులు, కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన రోగుల కుటుంబ సభ్యులు, రోగుల్ని కలిసిన వారికి మాత్రమే పరీక్షలు జరుపుతోంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ర్యాండమ్‌గా శాంపిళ్లను సేకరించి, పరీక్షించాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇంటింటికీ సర్వే చేసి, లక్షణాలు ఉన్న వారికి తొలుత ర్యాపిడ్ (ట్రూనాట్) టెస్టు, అందులో పాజిటివ్ వస్తే అప్పుడు కోవిడ్-19 నిర్థరణ (ఆర్‌టీ-పీసీఆర్) పరీక్ష జరుపుతున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ర్యాపిడ్ టెస్టు ఫలితాలు సరిగా రావటం లేదని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో దీనిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ర్యాపిడ్ కిట్లను దిగుమతి చేసుకున్నప్పటికీ, చాలా రాష్ట్రాల్లో ర్యాపిడ్ కిట్లు, కోవిడ్-19ను నిర్థరించే కిట్లు అవసరమైనన్ని అందుబాటులో లేవన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు పెరిగితే, కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కానీ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాత్రం.. ఐసీఎంఆర్ నిర్థరించిన ప్రమాణాల మేరకు, ఆయా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తామని, లక్షణాలు లేని వారికి పరీక్షలు జరపడం అంటే కిట్లను వృధా చేయడమే అవుతుందని మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు.

దేశంలో తొలి కరోనా కేసు నమోదైనప్పుడు కోవిడ్-19 పరీక్షలు జరిపే ల్యాబ్ ఒక్కటే ఉందని, ఇప్పుడు ప్రభుత్వ రంగంలోనే 280 ల్యాబ్‌లు ఉన్నాయని, వెయ్యికి పైగా శాంపిల్ సేకరణ కేంద్రాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్థన్ జాతీయ టెలివిజన్ డీడీ నేషనల్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో తెలిపారు. రోజుకు లక్ష పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు చాలా సరికొత్త వైరస్‌లు, మహమ్మారులు పుట్టుకొస్తూనే ఉంటాయని, వాటిలో ఒకటి రెండు మహమ్మారులను మాత్రమే శాశ్వతంగా అంతం చేయగలమని హర్షవర్థన్ చెప్పారు. మిగతా వైరస్‌లను కట్టడి చేస్తుంటామని, కాలక్రమంలో అవి మిగతా రోగాల్లాగే తరచూ వస్తూ, పోతుంటే వాటికి చికిత్స అందిస్తుంటామని ఆయన వెల్లడించారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)