కరోనావైరస్: ‘రంజాన్ మాసంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి’ : మతపెద్దల మార్గదర్శకాలు

‘‘రంజాన్ ప్రార్థనల మాసం. ఆ ప్రార్థనలు ఇళ్లలోనూ చేసుకోవచ్చు’

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ‘‘రంజాన్ ప్రార్థనల మాసం. ఆ ప్రార్థనలు ఇళ్లలోనూ చేసుకోవచ్చు’
    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నాయి. ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నాయి.

మరోవైపు ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం త్వరలోనే మొదలవ్వబోతోంది.

సౌదీ అరేబియాలో ఇస్లాంకు సంబంధించిన అత్యున్నత మత సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఓ విజ్ఞప్తి చేసింది.

రంజాన్ మాసంలో మసీదులకు రావొద్దని, ఎక్కడా గుమిగూడొద్దని అభ్యర్థించింది. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించింది.

ప్రఖ్యాత మక్కా మసీదు సహా తమ దేశంలోని అన్ని మసీదులను సౌదీ అరేబియా మూసేసింది.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

లాక్‌డౌన్ కారణంగా రంజాన్‌లో ఉపవాసం (రోజా) పాటించలేకపోయినా ఫర్వాలేదని ఇరాన్‌లోని ఇస్లామిక్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

పాకిస్తాన్ మాత్రం అక్కడి ఇస్లాం మతపెద్దలు, ఇమామ్‌ల ఒత్తిళ్లకు తలొగ్గింది. మసీదుల్లో ప్రార్థనలకు కొన్ని షరతుల మీద అనుమతులు ఇచ్చింది.

మరోవైపు భారత్‌వ్యాప్తంగా మే 3 వరకూ లాక్‌డౌన్ ఉంది. దేశంలోని మసీదులన్నింటినీ మూసేశారు.

ఈ నేపథ్యంలో భారతీయ ముస్లింలు రంజాన్ ఎలా జరుపుకోవాలనే విషయం గురించి ఇస్లాం మతపెద్దలతో సంప్రదింపులు జరిపి కొందరు మేధావులు మార్గదర్శకాలు సూచించారు. అవి...

  • మసీదులకు బదులుగా ఇళ్లలోనే ముస్లింలు నమాజ్ చదవాలి. మసీదుల్లో లౌడ్‌ స్పీకర్లు వాడకూడదు.
  • మసీదుల్లో ఇఫ్తార్ విందులను నిర్వహించొద్దు.
  • రంజాన్ కోసం వస్తువులను కొనేందుకు బయటకు రావొద్దు.
సౌదీ తమ దేశంలోని మసీదులను మూసేసింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సౌదీలోని అన్ని మసీదులనూ మూసివేశారు

సవాళ్లు ఏంటంటే...

రంజాన్ మాసంలోనూ లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తామని దేశంలోని చాలా మసీదులు ప్రకటించాయి.

దిల్లీలోని మహారాణీ బాగ్ ప్రాంతంలో ఓ పాత మసీదు ఉంది. దాని గేటుకు ఇప్పుడు తాళం వేశారు.

మసీదు మూసి ఉన్నా, రోజూ ఐదు సార్లు లౌడ్ స్పీకర్ ద్వారా నమాజ్ వినిపిస్తున్నామని మసీదు నిర్వాహకుడు ముయినుల్ హక్ చెప్పారు. రంజాన్ సమయంలో ఇళ్లలనే నమాజ్ చేయాలని మైక్‌ల్లో అభ్యర్థిస్తున్నట్లు వివరించారు.

మసీదుల్లో గుంపులుగా చేరేందుకు ఇది సమయం కాదని హైదరాబాద్‌కు చెందిన ఫరీద్ ఇక్బాక్ అనే వ్యాపారి అన్నారు. లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటూ, శ్రద్ధతో ప్రార్థించే అవకాశం దొరికిందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘సాధారణ రోజుల్లో మసీదులకు వెళ్లని కొందరు, రంజాన్ మాసంలో వెళ్తుంటారు. ఈ మాసంలో మసీదు వెళ్లకపోతే తామేదో తప్పు చేస్తున్నట్లని వాళ్లు అనుకుంటుంటారు. కానీ, ఇప్పుడు సౌదీలోని మక్కానే మూసేశారు. ఇక్కడి మసీదులు పెద్ద విషయం కాదు’’ అని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌వై ఖురేషీ అన్నారు.

ఈ మార్గదర్శకాలు ఎందుకు?

రంజాన్ ప్రార్థనలు జరిపే మాసమని, ఆ ప్రార్థనలు ఇంట్లోనూ చేసుకోవచ్చని మేరట్‌కు చెందిన నజీబ్ ఆలం అనే ఇమామ్ అన్నారు.

రంజాన్ మాసంలో లాక్‌డౌన్ పాటించాల్సిన సవాలును ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని ముస్లిం సమాజాలు ఎదుర్కొంటున్నాయి.

భారత్‌లో ముస్లింలు లాక్‌డౌన్ తప్పక పాటించేలా చూసేందుకే ఇక్కడి ఇస్లాం మతగురువుల సలహాలతో తాజా మార్గదర్శకాలు రూపొందాయి.

‘‘ఇదో మంచి అడుగు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముస్లిం సమాజంలోని నాయకులు అర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఇది చూపుతోంది’’ అని ఇండియన్ మైనార్టీస్ ఎకనామిక్ డెవెలప్‌మెంట్ ఏజెన్సీ అధ్యక్షుడు ఎమ్‌జే ఖాన్ అన్నారు.

రంజాన్ మాసంలో మసీదుల్లో ప్రార్థనలకు షరతుల మీద పాకిస్తాన్ అనుమతులు ఇచ్చింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రంజాన్ మాసంలో మసీదుల్లో ప్రార్థనలకు షరతుల మీద పాకిస్తాన్ అనుమతులు ఇచ్చింది

నిజాముద్దీన్ తర్వాత...

ఇటీవల దిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్‌లో వేల సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. వీరిలో చాలా మందికి కరోనావైరస్ సోకినట్లు ఆ తర్వాత వెల్లడైంది.

ఈ ఉదంతం తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో కరోనావైరస్ వ్యాప్తికి ముస్లింలను బాధ్యులుగా చూపుతూ చాలా కథనాలు వచ్చాయి. తాము వివక్ష ఎదుర్కుంటున్నామని చాలా చోట్ల ముస్లింలు ఫిర్యాదులు చేశారు.

ఈ నేపథ్యంలో దిల్లీలోని ‘ఇండియన్ ముస్లిమ్స్ ఫర్ ఇండియా ఫస్ట్’ అనే సంస్థ కొందరు మతగురువులు, ఇమామ్‌ల పర్యవేక్షణలో రంజాన్ కోసం తాజా మార్గదర్శకాలను రూపొందించింది.

‘‘వివక్ష మనిషి నైజంలో భాగం. కరోనావైరస్ వ్యాప్తి విషయంలో ముస్లింలు వివక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే దీన్ని మనం నియంత్రించాలి. అందుకు, ఇదే సరైన సమయం అని నేను అనుకుంటున్నా’’ అని ఇండియన్ ముస్లిమ్స్ ఫర్ ఇండియా సభ్యుడు, ఆదాయపు పన్ను శాఖ మాజీ కమిషనర్ సయ్యద్ జఫర్ మహమూద్ అన్నారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ప్రభుత్వం ఆలస్యంగా...

తబ్లీగీ జమాత్ పెద్ద తప్పు చేసిందన్న అభిప్రాయం చాలావరకూ ముస్లింల్లో ఉంది. అయితే, అది సాకుగా చూపి, మొత్తం వర్గంపై బురద జల్లే ప్రయత్నాలు జరిగాయని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. మొదట్లో ప్రభుత్వం వివక్షను ఖండించకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని అంటున్నారు.

మొదట్లో ప్రభుత్వం ఏమీ మాట్లాడకున్నా, కొన్ని రోజుల తర్వాత కరోనావైరస్ వ్యాప్తి విషయంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకోకూడదని ఓ ప్రకటన విడుదల చేసింది.

కరోనావైరస్ విషయంలో ముస్లింలను అవమానించేలా మాట్లాడేవారిపై చర్యలు తీసుకుంటామని కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప చెప్పారు.

కోవిడ్-19 జాతి, మతం, కులం, రంగు, భాష అన్న తేడాలు చూపదని, అందరం కలిసి దానికి వ్యతిరేకంగా ఐకమత్యంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

బాధ్యత నిర్వర్తించాల్సిన సమయం

ఈసారి రంజాన్ కళ తప్పవచ్చని, అయితే లాక్‌డౌన్ పాటించకపోతే ముస్లింలకు చాలా చెడ్డపేరు వస్తుందని లఖ్‌నవూకు చెందిన జాహిద్ ఘనీ అనే ఇమామ్ అభిప్రాయపడ్డారు.

రంజాన్ మాసం ముగిసేవరకూ లాక్‌డౌన్ పొడిగించాలని కూడా కొందరు ముస్లింలు అంటున్నారు. వారిలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ ఫిరోబ్ బఖ్త్ అహ్మద్ ఒకరు. ఆయన ఈ విషయమై ప్రధానికి లేఖ కూడా రాశారు. ‌మే 24 వరకూ లాక్‌డౌన్ అమలు చేయాలని ఆయన కోరారు.

‘‘మార్గదర్శకాలను పాటించడంలో ఇబ్బందులేమీ ఉండవు. లాక్‌డౌన్‌కు జనాలు అలవాటుపడ్డారు. ఇది దేశం కోసం, దేశ ప్రజల కోసం. ఒకవేళ రంజాన్ ఆరంభమయ్యే సమయంలోనే లాక్‌డౌన్ మొదలుపెట్టి ఉంటే ఇబ్బందులు వచ్చేవి’’ అని జఫర్ మహమూద్ అన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)