తిరుమ‌ల టీటీడీ ఆలయంపై కరోనావైర‌స్ ప్రభావం ఎలా ఉంది?

తిరుమల వేంకటేశ్వర స్వామి విగ్రహం

ఫొటో సోర్స్, TTD

ఫొటో క్యాప్షన్, తిరుమల ఆలయంలో భ‌క్తులు వేచి ఉండే స‌మ‌యాన్ని త‌గ్గించేందుకు విశేష‌ పూజ, సహస్ర కలశాభిషేకం మరియు వసంతోత్సవం సేవ‌ల‌ను రద్దు చేసిన‌ట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు
    • రచయిత, వి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

కరోనావైరస్ ప్ర‌భావం ఆల‌యాల మీద కూడా క‌నిపిస్తోంది. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి భ‌క్తుల రాక‌పై ఇప్ప‌టికే నియంత్రణ విధించారు. వివిధ ప్రాంతాల నుంచి త‌ర‌లివ‌స్తున్న వారికి ప్ర‌త్యేక ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. అన్ని విధాలుగా అప్ర‌మ‌త్తంగా ఉన్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

అయితే.. పెద్ద సంఖ్య‌లో వ‌స్తున్న యాత్రికుల‌కు టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు ఏ మేర‌కు సరిపోతాయనే సందేహాలు వినిపిస్తున్నాయి. చెకింగ్ పాయింట్ల ఏర్పాటు, అవ‌గాహ‌న పెంచే ప్ర‌చారం వంటివి నిర్వ‌హిస్తున్నప్ప‌టికీ ర‌ద్దీకి త‌గ్గ‌ట్టుగా స‌రిపోతాయా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

అంద‌రికీ మాస్కూలు అందించాల‌ని కొంద‌రు భ‌క్తులు కోరుతుంటే టీటీడీ యంత్రాంగం మాత్రం రోగుల‌కు, వారి స‌హాయ‌కుల‌కు మాత్ర‌మే మాస్కులు అవ‌స‌రం అని చెప్తోంది. మరోవైపు.. తిరుమ‌ల‌కు వ‌చ్చే వారి సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో యాత్రికులపై ఆధార‌ప‌డిన‌ వివిధ రంగాల వారు స‌త‌మ‌తమవుతున్నారు.

తిరుమల కరోనావైరస్

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ ఎలా ఉంది?

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం భారీ సంఖ్య‌లో యాత్రికులు తిరుమ‌ల‌కు త‌ర‌లివ‌స్తుంటారు. విదేశాల నుంచి వ‌చ్చే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ప్ర‌స్తుతం క‌రోనావైరస్ కార‌ణంగా యాత్రికుల సంఖ్య త‌గ్గింది. విద్యార్థులకు ప‌రీక్ష‌ల సీజ‌న్ కావ‌డం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఉండ‌టం కూడా ర‌ద్దీ త‌గ్గటానికి కారణాలుగా చెప్తున్నారు.

ఏటా ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల సంఖ్య‌ కొంత త‌గ్గుతుంది. ఈసారి ఇదే సీజన్‌లో భ‌క్తుల సంఖ్య మరింతగా తగ్గినట్లు క‌నిపిస్తోంది.

''తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల సంఖ్య జ‌న‌వ‌రి త‌ర్వాత కొంచెం త‌గ్గుద‌ల ఉంటుంది. ఏప్రిల్ నుంచి మే, జూన్ వ‌ర‌కూ క్ర‌మంగా పెరుగుతుంది. జూన్ త‌ర్వాత ఉత్త‌రాది నుంచి వ‌చ్చే భ‌క్తుల సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంది. జులై మ‌ధ్య వ‌ర‌కూ ఆ ప్ర‌భావం ఉంటుంది'' అని టీటీడీ ప్ర‌ధాన పౌర‌సంబంధాల అధికారి డాక్ట‌ర్ టి.ర‌వి బీబీసీకి చెప్పారు.

ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని.. భ‌క్తుల సంఖ్య‌ గతం కన్నా త‌గ్గిందని తెలిపారు. ''క‌రోనావైరస్ కార‌ణంగా కొంద‌రు యాత్రికులు ముందుగా చేసుకున్న రిజ‌ర్వేష‌న్లు కూడా ర‌ద్దు చేసుకోవ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. అలాంటి వారు రిజ‌ర్వేష‌న్ వాయిదా వేసుకోవ‌డానికి లేదా ర‌ద్దు చేసుకోవ‌డానికి టీటీడీ అనుమ‌తిస్తోంది'' అని వివ‌రించారు.

తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల సంఖ్య‌లో ప్ర‌తీ వారం కూడా హెచ్చుత‌గ్గులు ఉంటాయి. ముఖ్యంగా శుక్ర‌, శ‌ని, ఆదివారాల్లో అధికంగా భ‌క్తుల సంఖ్య న‌మోద‌వుతుంది. అదే స‌మ‌యంలో సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కూ ఆ సంఖ్య‌లో స్ప‌ష్ట‌మైన తేడా ఉంటుందని టీటీడీ లెక్క‌లు చెప్తున్నాయి.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి
BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
తిరుమల కరోనావైరస్

ద‌ర్శ‌నం సులువుగా జ‌రిగిపోతుంది..!

ఏటా మార్చి నెల‌లో స‌గ‌టున 17 లక్షల నుంచి 18 ల‌క్ష‌ల మంది తిరుమ‌ల‌కు వ‌స్తుంటారు. ఈసారి తొలి ప‌ది రోజుల్లో 6,98,020 మంది తిరుమ‌ల‌కు వ‌చ్చారు. స‌హ‌జంగా ఏటా న‌మోద‌య్యే సంఖ్య క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ మార్చి రెండు, మూడు వారాల్లో క‌రోనావైరస్ కార‌ణంగా మొత్తం సంఖ్య‌ త‌గ్గుతుందని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

మార్చి 8 త‌ర్వాత క్ర‌మంగా భ‌క్తుల సంఖ్య‌ త‌గ్గగటంతో ద‌ర్శ‌నాలు కూడా సుల‌భంగా జ‌రుగుతున్నాయ‌ని భ‌క్తులు అంటున్నారు. గ‌తంలో సాధార‌ణ క్యూ లైన్ల‌లో ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి ప‌ట్టిన స‌మ‌యంలో ఇప్పుడు స‌గం స‌మ‌యం స‌రిపోతోంద‌ని తూర్పు గోదావ‌రి జిల్లాకి చెందిన ఎ.సుద‌ర్శ‌న్ రెడ్డి బీబీసీకి తెలిపారు.

''గ‌త ఏడాది తిరుమ‌ల వ‌చ్చాను. అప్పుడు సుప‌థం ద‌ర్శ‌నం చేసుకున్నాం. రూ. 300 టికెట్లు కొని ద‌ర్శ‌నానికి వెళితే 2 గంట‌లు ప‌ట్టింది. ఇప్పుడు స‌ర్వ‌ద‌ర్శ‌నం చేసుకున్నాం. శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు క్యూ లైన్లోకి వెళితే మ‌ధ్యాహ్నం 1.30కి బ‌య‌ట‌కు వ‌చ్చేశాం'' అని చెప్పారు.

తిరుమల కరోనావైరస్

తిరుమ‌లకు రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు...

క‌రోనావైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో టీటీడీ యంత్రాంగం భక్తులకు అవగాహన పెంచటం కోసం విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. భ‌క్తుల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు కూడా విధించింది.

''తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల విష‌యంలో అన్ని జాగ్ర‌త్త‌లు పాటించాం. అందుకు త‌గ్గ‌ట్టు యంత్రాంగాన్ని స‌న్న‌ద్ధం చేశాం. టీటీడీలో వివిధ విభాగాల్లో సుమారు 14,000 మంది సిబ్బంది ఉన్నారు. వారికి జాగ్ర‌త్త‌లు సూచించాం'' అని టీటీడీ జేఈఓ ఎ.ధ‌ర్మారెడ్డి బీబీసీకి తెలిపారు.

''విదేశాల నుంచి వ‌చ్చే భక్తులు, తాజాగా విదేశీ ప్ర‌యాణాలు చేసి వ‌చ్చిన భార‌తీయులు కూడా ఈనెలాఖ‌రు వ‌ర‌కూ తిరుమ‌ల‌కు రాకూడ‌ద‌ని తెలియ‌జేశాం. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలున్న వారు కూడా ద‌ర్శ‌నాల కోసం వ‌చ్చేముందు ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. మాస్కులు స‌హా త‌గు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించాం'' అని చెప్పారు.

ముందుగా ఎవ‌రైనా ద‌ర్శ‌నాల‌కు సంబంధించి రిజ‌ర్వేష‌న్లు చేయించుకుని ఇప్పుడు యాత్ర ర‌ద్దు చేసుకుంటే రూ. 300 ద‌ర్శ‌నం టికెట్ల సొమ్ము తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. అయితే శుక్ర‌వారం వ‌ర‌కూ ఎవ‌రూ రిఫండ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోలేదన్నారు.

స్క్రీనింగ్

భ‌క్తుల‌కు కరోనావైరస్ లక్షణాల త‌నిఖీలు...

తిరుప‌తిలో కొండ దిగువ నుంచి తిరుమ‌ల రాక‌పోక‌ల‌కు మూడు మార్గాలున్నాయి. వాటిలో అలిపిరి నుంచి ప్రారంభ‌మ‌య్యే కాలిన‌డ‌క‌న వెళ్లే భ‌క్తుల‌కు శ్రీవారి మెట్టు మార్గం, వాహ‌నాలు వెళ్లేందుకు ఉన్న ఘాట్ రోడ్డు ఆరంభంలోని అలిపిరి టోల్ గేట్, అలిపిరి పాదాల వ‌ద్ద‌ కూడా ప్ర‌స్తుతం టీటీడీ ఆరోగ్య విభాగం చెకింగ్ పాయింట్లు ఏర్పాట్లు చేసింది. థ‌ర్మ‌ల్ సెన్సార్ల ద్వారా భ‌క్తుల‌ను ప‌రీక్షిస్తోంది.

ఒక డాక్ట‌ర్, ఒక స్టాఫ్ న‌ర్స్, ఒక ఎంఎన్‌ఓతో పాటు న‌ర్సింగ్ విద్యార్థినుల‌ను ఈ చెక్ పాయింట్ల‌లో విధుల‌కు కేటాయించారు. కాలిన‌డ‌క‌న వెళ్లే వారు లేదా బ‌స్సులు, ఇత‌ర వాహ‌నాల్లో వెళ్లే వారికి విడివిడిగా ఈ ప‌రీక్ష‌లు చేసిన త‌ర్వాత మాత్ర‌మే అనుమ‌తిస్తున్నామ‌ని అధికారులు చెప్తున్నారు.

అయితే.. రోజుకి 50 వేల నుంచి 60 వేల మంది భ‌క్తులు వివిధ మార్గాల్లో తిరుమ‌ల‌కు వ‌స్తుంటే కేవ‌లం ముగ్గురు వైద్యులు, మ‌రో ముగ్గురు స్టాఫ్ న‌ర్సుల‌ను మాత్ర‌మే ప‌రీక్షలు చేయ‌డానికి కేటాయించ‌డంతో.. కొద్ది మందిని మాత్రమే తనిఖీ చేయటం సాధ్య‌మ‌వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ముఖ్యంగా టీటీడీ ధర్మ‌ర‌థం బ‌స్సులు, ఆర్టీసీ బ‌స్సుల్లో కొండ‌పైకి వెళుతున్న వారికి కేవ‌లం క‌ర‌ప‌త్రాలు పంచి స‌రిపెట్టుకుంటున్నారు. కార్లు, ఇత‌ర ప్రైవేటు వాహ‌నాల్లో వ‌స్తున్న కొద్ది మంది అనుమానితుల‌ను మాత్ర‌మే ప‌రీక్షిస్తున్నామ‌ని టీటీడీ అధికారులు కూడా చెప్తున్నారు.

Sorry, your browser cannot display this map