టీడీపీ నేత‌ల కార్లపై మాచ‌ర్ల‌లో దాడి: ఇది వైసీపీ అరాచకం అంటున్న బుద్ధా వెంకన్న; వారే రెచ్చగొట్టారంటున్న వైసీపీ

    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం
పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌లు చోట్ల ప‌రిస్థితులు అదుపు త‌ప్పుతున్నాయి. అధికార పార్టీ నేత‌లు దౌర్జ‌న్యాల‌కు పాల్పడుతున్నార‌ని విప‌క్షం ఆరోపిస్తుండ‌గా, పాల‌క‌పార్టీ వాటిని తోసిపుచ్చుతోంది. ఇప్ప‌టికే నామినేష‌న్ ప‌త్రాలు స‌మ‌ర్పించేందుకు వ‌స్తున్న ఆశావాహుల‌పై దాడి ఘ‌ట‌న‌లు న‌మోద‌య్యాయి.

టీడీపీ వాహనాలపై దాడి

బుధవారం తెలుగుదేశం పార్టీ నేత‌ల వాహ‌నాలపై గుంటూరు జిల్లా మాచ‌ర్ల వ‌ద్ద మెయిన్ రోడ్డుపై దాడి జ‌రిగింది. ఈ దాడిలో ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ స‌హా ప‌లువురు నేత‌ల‌ను సుర‌క్షితంగా విజ‌య‌వాడ త‌ర‌లించామ‌ని పోలీసులు చెబుతున్నారు. నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామని చెబుతున్నారు.

మాచ‌ర్ల‌లో మొద‌టి నుంచి వివాదాలే..!

ఏపీలో అధికార మార్పిడి త‌ర్వాత మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితిపై ప‌లుమార్లు ఆందోళ‌న‌లు జ‌రిగాయి.

గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లోనే మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను వెలివేశారంటూ పెద్ద ఆందోళ‌న జ‌రిగింది. ఈ విష‌యంలో కేంద్ర మాన‌వ‌ హ‌క్కుల సంఘం కూడా విచార‌ణ జ‌రిపింది.

స్థానిక ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్‌ పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి వైఖ‌రి మూలంగానే ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని ప్ర‌తిప‌క్ష టీడీపీ ఆరోపిస్తోంది.

ప్ర‌స్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌ నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. అదే స‌మ‌యంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు కూడా నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

కొన్ని చోట్ల టీడీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేయ‌కుండా వైసీపీ అడ్డుకుంటోంద‌ని విప‌క్షం చెబుతోంది.

మాచ‌ర్ల‌లో కూడా అలాంటి ప‌రిస్థితి ఉంద‌ని, దాంతో ప‌రిస్థితిని ప‌రిశీలించేందుకు రాష్ట్ర స్థాయి నేత‌లు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్లాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. అందులో భాగంగా విజ‌య‌వాడ న‌గ‌రానికి చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌రరావు వంటి నేత‌లు వారి అనుచ‌రుల‌తో క‌లిసి మాచ‌ర్ల బ‌య‌లుదేరారు.

మాచ‌ర్ల మెయిన్ రోడ్డులో ప్ర‌యాణిస్తున్న టీడీపీ నేత‌ల వాహ‌నంపై కొంద‌రు వ్య‌క్తులు దాడికి పాల్ప‌డిన వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. బోండా ఉమ పేరుతో రిజిస్టర్ అయిన ఏపీ 16 సీజెడ్ 1314 వాహ‌నంపై క‌ర్ర‌ల‌తో దాడికి పాల్ప‌డుతున్న దృశ్యాలు ఆ వీడియోల్లో కనిపిస్తున్నాయి. అక్కడున్న స్థానికులు చూస్తుండ‌గానే ఈ దాడి జ‌రిగింది.

ఈ దాడిలో టీడీపీ నేత‌ల వెంట ఉన్న అడ్వ‌కేట్ మ‌హేష్ గాయాలపాల‌య్యారు. దాంతో ఆయ‌న‌కు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స అందించిన‌ట్టు టీడీపీ నేత బోండా ఉమా తెలిపారు. పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డానికి వెళ్తుండ‌గా గ‌న్ మన్ ఉండ‌గానే దాడికి పాల్ప‌డ‌డం దారుణమని ఆయ‌న వ్యాఖ్యానించారు.

టీడీపీ వాహనాలపై దాడి

డీజీపీ ఏం సమాధానం చెబుతారు?: చంద్ర‌బాబు

మాచ‌ర్ల ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు. త‌మ పార్టీకి చెందిన నేత‌ల‌ను హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని విమ‌ర్శించారు. రక్షణగా ఉన్న పోలీసు వాహనంపైనా దాడి చేశారని, ఇంత జరిగినా పోలీసులకు బాధ లేదా? అని ఆయ‌న ప్రశ్నించారు.

''మాచర్లలో జరిగిన ఘటన ప్రభుత్వానికి కనబడలేదా? ఏంటీ రాజకీయాలు? గత 40 ఏళ్లలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? డీజీపీ ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. ఆయన ఏం సమాధానం చెబుతారు? ఇంత జరిగినా చీమకుట్టినట్లైనా లేదు? బుద్దా వెంకన్న, బోండా ఉమాపై హత్యాయత్నం జరిగితే ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా ఏ నియోజకవర్గంలోనైనా ఇలా జరిగిందా? ఇంత అరాచకాలేంటి? కట్టడి చేయాల్సిన బాధ్యత లేదా? కట్టడి చేయలేకపోతే వ్యవస్థ ఎందుకు? ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి లేదా? ఓటు వేసే హక్కు లేదా? కశ్మీర్‌, బిహార్‌లలోనూ ఇలా జరగలేదు'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్నామా.. ఆట‌విక రాజ్యంలో ఉన్నామా: టీడీపీ

ఈ దాడికి సంబంధించి ఇరు పార్టీల నేత‌లు భిన్న వాద‌నలు వినిపిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న బీబీసీతో మాట్లాడారు.

"మాచ‌ర్ల‌లో ప్ర‌జాస్వామ్యం లేదు. నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దాని గురించి మాట్లాడి, పార్టీ నేత‌ల‌కు ధైర్యం చెప్పేందుకు మేం వ‌చ్చాం.

మేం వ‌చ్చిన‌ట్టు తెలుసుకుని మమ్మ‌ల్ని వెంబ‌డించారు. మా కార్ల‌పై రాళ్లు విసిరారు. దొరికిన వాహ‌నంపై దాడి చేసి భ‌య‌భ్రాంతుల‌కు గురిచేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్నామా.. ఆట‌విక రాజ్యంలో ఉన్నామా అనేది అర్థం కావట్లేదు.

ప‌ట్ట‌ప‌గ‌లు ఓ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే స్థాయి నేత‌ల‌పై హ‌త్యాయ‌త్నం జరగడం చూస్తుంటే ప‌రిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందో అర్థ‌మ‌వుతోంది. పోలీసులు మ‌మ్మ‌ల్ని కాపాడ‌తామ‌ని చెబుతున్నారు. వేరే వాహ‌నం ఏర్పాటు చేసి విజ‌య‌వాడ త‌ర‌లించారు. కానీ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం అబ‌ద్ధాలు చెబుతున్నారు. ప్ర‌జ‌ల సాక్షిగా జ‌రిగిన దాడిని కూడా వ‌క్రీకరించాల‌ని చూడ‌డం సిగ్గుచేటు" అని వెంకన్న అన్నారు.

టీడీపీ వాహనాలపై దాడి

ప‌ల్నాడులో చిచ్చు పెట్ట‌డానికే వ‌చ్చారు: వైసీపీ

పల్నాడులో ప్రశాంత పరిస్థితులున్నాయ‌ని, వాటిని చెడగొట్టేందుకు టీడీపీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి ఆరోపించారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ.. "విజయవాడ నుంచి 10 కార్లలో బోండా ఉమ, బుద్ధా వెంకన్న రావాల్సిన అవ‌స‌రం ఏముంది? ఇదంతా చంద్ర‌బాబు కుట్ర‌.

టీడీపీ నేత‌ల వాహ‌నం ఒక‌టి రోడ్డు ప‌క్క‌న ఉన్న పిల్లాడిని ఢీకొట్ట‌డంతో స్థానికులు కొంద‌రు కోపోద్రిక్తులయ్యారు. వారిని సముదాయించాల్సింది పోయి, టీడీపీ నాయకులు బోండా ఉమ సహా ఇతర నాయకులు దుర్భాషలాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే టీడీపీ పథకం అని అర్థ‌మ‌వుతోంది. అందుకే గొడ‌వ‌లు పెట్టారు.

గ‌తంలో మా పార్టీ నేత‌ల‌పై టీడీపీ వాళ్లే దాడికి పాల్ప‌డ్డారు. అయినా మేం సంయ‌మ‌నం పాటించాం. కానీ ఇప్పుడు టీడీపీ నేత‌లే రెచ్చ‌గొట్టి వివాదాలు రాజేసేందుకు ప్ర‌య‌త్నించ‌డం వారి తీరుని చాటుతోంది" అని పిన్నెల్లి బీబీసీతో అన్నారు.

ఎవరు దాడి చేశారో తెలియదు

మాచర్ల ఘటనలో ఎవరు దాడి చేశారో తెలియదని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. ఎవరు ఎవరిపై దాడి చేశారో విచారణలో తెలుస‍్తుందన్నారు.

మాచర్లలో ప్రజలను రెచ్చగొట్టేందుకే బోండా ఉమ, బుద్ధా వెంకన్న అక్కడకు వెళ్లారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఏదో ఒక అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో టీడీపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

టీడీపీ వాహనాలపై దాడి

స్థానికులు ఏమంటున్నారు?

మాచ‌ర్ల‌లో ఈమ‌ధ్య కాలంలో దాడులు, ప్ర‌తిదాడులు చ‌ల్లారినట్లు క‌నిపించినా ఇప్పుడు మ‌ళ్లీ స్థానిక ఎన్నిక‌ల సందర్భంగా బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని ప‌ట్ట‌ణానికి చెందిన పి.వెంక‌టేశ్వ‌ర‌రావు చెబుతున్నారు. టీడీపీ నేత‌ల కారుపై జ‌రిగిన దాడిలో ప్ర‌త్య‌క్ష సాక్షిగా ఉన్న ఆయ‌న బీబీసీతో మాట్లాడారు.

"నేను కిరాణా సామాన్ల కోసం రోడ్డు మీద‌కు వ‌చ్చాను. ఒక కారుని కొంద‌రు వెంబ‌డిస్తూ వ‌స్తున్నారు. దాంతో ఏం జ‌రుగుతోందో తెలియ‌క అక్కడున్న అందరం ఆందోళ‌న‌గా చూస్తున్నాం. అంత‌లోనే ఆ కారు ట్రాఫిక్‌లో కొద్దిగా స్లో కాగానే, క‌ర్ర‌ల‌తో మా ఎదురుగానే కారుపై దాడి జ‌రిగింది. కొంద‌రు అరుస్తూ కేక‌లు వేశారు. ఇంకొంద‌రు ఆ కారుని వెంబ‌డించారు. అప్పుడు పోలీసులు ఎవ‌రూ అక్క‌డ లేరు. ఏం జ‌రుగుతోందో మాకెవ‌రికీ తెలియ‌లేదు" అని ఆయన చెప్పారు.

టీడీపీ వాహనాలపై దాడి

స్పందించిన డీజీపీ

సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాల్సిదిగా గుంటూరు ఐజీని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మాచ‌ర్ల‌లో టీడీపీ నేత‌ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఉద్రిక్త‌త‌లు ఏర్ప‌డినా, ప్ర‌స్తుతం ప‌రిస్థితి ప్ర‌శాంతంగా ఉంద‌ని గుర‌జాల డీఎస్పీ శ్రీహ‌రిబాబు బీబీసీకి తెలిపారు.

"టీడీపీ నేత‌లు పార్టీ ప‌నిమీద వ‌చ్చారు. ఆ సంద‌ర్భంగా జ‌రిగిన వివాదంలో కారుపై దాడి జ‌రిగింది. వీడియోల స‌హాయంతో నిందితుల‌ను గుర్తిస్తున్నాం. అన్నీ ప‌రిశీలించిన త‌ర్వాత కేసు నమోదు చేస్తాం. ప్ర‌స్తుతం ప‌రిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. పోలీస్ భ‌ద్ర‌త మ‌ధ్య టీడీపీ నేత‌లంద‌రినీ విజ‌య‌వాడ‌కు త‌ర‌లించాం. ఇలాంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కాకుండా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాం" అని చెప్పారు.

నిందితుల అరెస్ట్

ఈ ఘటనతో సంబంధముందని భావిస్తున్న ముగ్గురు నిందితులను సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు.

బోండా ఉమ, బుద్దా వెంకన్నపై దాడి ఘటనకు సంబంధించి తురకా కిషోర్‌, మల్లెల గోపి, బత్తుల నాగరాజు అనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఐజీ ప్రభాకర్‌రావు తెలిపారు.

వెల్దుర్తి మండలంలో మరికొందరు నిందితుల్ని గుర్తించామని, దాడిలో టీడీపీ నేతల వాహనంతో పాటు పోలీస్‌ వాహనం ధ్వంసమైందన్నారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ హెచ్చరించారు.

డీజీపీ ఆఫీస్ ముందు చంద్రబాబు

డీజీపీ ఆఫీసు ముందు బైఠాయించిన చంద్రబాబు

మాచర్ల ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డీజీపీ కార్యాలయానికి వచ్చారు. అయితే కార్యాలయంలోకి అనుమతి నిరాకరించడంతో చంద్రబాబు, టీడీపీ నేతలు అక్కడే రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు.

చంద్రబాబుకు మద్దతుగా సీపీఐ నేత రామకృష్ణ కూడా అక్కడ కూర్చున్నారు.లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ చంద్రబాబుతో చర్చలు జరిపారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)