‘భారత్ విడిచి వెళ్లాలని నన్ను మౌఖికంగా ఆదేశించారు.. లిఖిత ఆదేశాలు ఇవ్వలేదు’: సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న జర్మనీ విద్యార్థి

ఫొటో సోర్స్, TheNewsMinute
- రచయిత, శశాంక్ చౌహాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అకడమిక్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఐఐటీ మద్రాస్‌లో విద్యాభ్యాసం కోసం వచ్చారు జర్మనీ విద్యార్థి జాకబ్ లిన్‌డెన్థల్. ఆయన ప్రోగ్రాం పూర్తికాకముందే భారత్ విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశించారు.
అయితే.. దేశం విడిచి వెళ్లాలని ఏ అధికారీ తనకు ఎటువంటి అధికారిక ఉత్తర్వులూ అందించలేదని.. కానీ చెన్నైలోని ఒక ఇమిగ్రేషన్ అధికారి తనను తక్షణం ఈ దేశం నుంచి వెళ్లిపోవాలని మౌఖికంగా ఆదేశించారని ఆయన బీబీసీతో చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా డిసెంబరు 16వ తేదీన చెన్నైలో జరిగిన నిరసన కార్యక్రమంలో జాకబ్ లిన్‌డెన్థల్ పాల్గొన్నారు. ఆ నిరసనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు భారత మీడియాలో విస్తృతంగా ప్రసారమయ్యాయి.
జాకబ్ విద్యార్థి వీసా ప్రకారం ఆయన ఈ దేశంలో ఎటువంటి నిరసనల్లో పాల్గొనటానికి అనుమతి లేదని, కాబట్టి ఆయన తక్షణం భారతదేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని చెన్నైలోని ఇమిగ్రేషన్ కార్యాలయం (ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్) అధికారులు డిసెంబర్ 23వ తేదీన ఆయనకు తెలిపారు.
ఎఫ్ఆర్ఆర్ఓ కార్యాలయం నేరుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. భారతదేశంలో పర్యటించే విదేశీయులకు సంబంధించిన అంశాలను ఈ కార్యాలయం చూస్తుంటుంది.
ఒక నార్వే మహిళా పర్యటకురాలు తాను సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో.. ఆమెకు కూడా కొచ్చిలోని ఎఫ్ఆర్ఆర్ఓ కార్యాలయం ఫోన్ చేసింది. ఆ మహిళ వీసా నిబంధనలను ఉల్లంఘించారా అనే అంశం మీద దర్యాప్తు చేస్తున్నట్లు ఒక అధికారి పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు.
బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ విభాగానికి చెందిన వెబ్‌సైట్.. భారతదేశంలో పర్యటించే విదేశీయులు తాము తొలుత ఏ అవసరం నిమిత్తం వీసా కోసం దరఖాస్తు చేసుకున్నామో దానికి అనుగుణంగా ఉండాల్సి ఉంటుందని.. ఆ వీసాతో పాటు అంగీకరించిన నిబంధనలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని చెప్తోంది.
భారతదేశానికి సంబంధించిన వివిధ ఇమిగ్రేషన్, వీసా దరఖాస్తు వెబ్‌సైట్లు.. నిరసనల్లో పాల్గొనటం తదితర అంశాల గురించిన ప్రస్తావన ఏదీ లేదు.
అయితే.. దేశం విడిచి వెళ్లాలని ఆదేశించటానికి కారణమేమిటనేది లిఖితపూర్వకంగా తెలియజేయాలని జాకబ్ కోరినా కూడా ఇమిగ్రేషన్ విబాగం అతడికి లిఖితపూర్వకంగా ఎటువంటి కారణమూ తెలియజేయలేదు.

ఫొటో సోర్స్, JakobLindenthal
''నిరసన ప్రదర్శనల్లో పాల్గొనటం ద్వారా వీసా నిబంధనలను ఉల్లంఘించినందువల్ల దేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తున్నట్లు నాకు మౌఖికంగా వివరించారు'' అని ఆయన న్యూరెంబర్గ్ నుంచి బీబీసీతో మాట్లాడుతూ తెలిపారు.
''నన్ను బలవంతంగా వెనక్కు పంపించివేయలేదు. బలవంతంగా తిప్పిపంపించటాన్ని నివారించటానికి ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా నడచుకోవాలని చెన్నైలోని జర్మన్ కాన్సులేట్ నాకు సూచించింది'' అని ఆయన చెప్పారు.
జాకబ్ వచ్చి తమను కలవాలంటూ చెన్నై ఇమిగ్రేషన్ ఆఫీస్ నుంచి వచ్చిన వినతిని ఐఐటీ మద్రాస్‌లోని ఇంటర్నేషనల్ ఆఫీస్ ఆయనకు తెలియజేసింది.
ఐఐటీ నుంచి ఫోన్ వచ్చినపుడు జాకబ్ బెంగళూరులో ఫ్రిస్బీ టోర్నమెంటులో పాల్గొంటున్నారు.
ఈ విషయం మీద స్పందన కోసం ఐఐటీ మద్రాస్‌ను బీబీసీ సంప్రదించింది. వారి దగ్గరి నుంచి ఇంకా సమాధానం రావాల్సి ఉంది.
చెన్నైలోని జర్మన్ కాన్సులేట్‌ను బీబీసీ ప్రతినిధి సంప్రదించగా.. ఈ అంశంపై వ్యాఖ్యానించటానికి వారు నిరాకరించారు.
జర్మనీ తిరిగి వెళ్లటానికి కనెక్టింగ్ విమానం కోసం దిల్లీ వెళ్లి వేచివున్నపుడు.. విమానాశ్రయంలో భారత ఇమిగ్రేషన్ అధికారులు తనపై చర్యలు చేపట్టే అవకాశం ఉందన్న ఆందోళనతో జర్మనీ రాయబార కార్యాలయాన్ని తాను సంప్రదించానని జాకబ్ తెలిపారు. తాను జర్మనీ విమానం ఎక్కేవరకూ తనకు సాయం చేయటానికి సంసిద్ధంగా ఉండటానికి జర్మనీ రాయబార కార్యాలయ అధికారి ఒకరు తనకు హామీ ఇచ్చారని చెప్పారు.
దిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయం స్పందన కోసం బీబీసీ చేసిన విజ్ఞప్తులకు కూడా సమాధానం రాలేదు.

ఫొటో సోర్స్, JakobLindenthal
చెన్నైలోని ఇమిగ్రేషన్ కార్యాలయంలో ఏం జరిగిందనేది జాకబ్ సవివరంగా చెప్పారు.
''నన్ను ఇమిగ్రేషన్ కార్యాలయానికి పిలిపించారు. ఒక అధికారి, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులూ మౌనంగా ఉన్నారు. అధికారి.. నేను ఖాళీ సమయంలో ఏం చేస్తుంటానని, నా వ్యక్తిగత అభిరుచులు ఏమిటని అడగటం మొదలుపెట్టారు.
కొంతసేపటికి నా 'రెసిడెంట్ రిజిస్ట్రేషన్'కి తుది గడువు దగ్గరపడిందని ఆమె చెప్పారు. ఈ తుది గడువు గురించి నాకు తెలీదు. నాకు ఎటువంటి నిర్ధారణా అందలేదు. నేను ఇండియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి లిఖిత ప్రకటనా అందలేదు.
ఐఐటీ మద్రాసులోని ఇంటర్నేషనల్ కార్యాలయం నుంచి నా రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకోవాలని, భారతదేశంలోని నా తాజా బ్యాంకు ఖాతా సమాచారాన్ని జతచేయాలని ఆ అధికారి వివరించారు. అంతటితో సమస్య ముగిసినట్లు కనిపించింది.
అప్పుడు ఆ అధికారి నా రాజకీయ అభిప్రాయాల గురించి అడగటం మొదలుపెట్టారు. ప్రత్యేకించి.. భావప్రకటనా స్వేచ్ఛ, ఇమిగ్రేషన్ గురించి అడిగారు. అప్పుడు సీఏఏ వ్యతిరేక నిరసనల అంశం ప్రస్తావనకు వచ్చింది. నేను నా ఆందోళనలను (ఒక మత సమూహాన్ని అనవసరంగా వేరు చేస్తుండటం.. సీఏఏను దురుద్దేశపూరితంగా అమలు చేసినపుడు ఒక శక్తివంతమైన వివక్షను సృష్టించగల అవకాశం కల్పించటం) వ్యక్తీకరించినపుడు.. నాకు విషయం తెలియదని ఆ అధికారి అన్నారు. విషయం తెలిసిన భావవ్యక్తీకరణకు మాత్రమే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పరిమితం కావాలని చెప్పారు.''
విషయం సరిగా తెలియని వారికి నిరసన తెలిపే హక్కు ఉండరాదని ఆ అధికారి వాదించిన తర్వాత.. పౌరసత్వ సవరణ చట్టం గురించి మరెంతో లోతుగా అధ్యయనం చేస్తానని తాను హామీ ఇచ్చానని జాకబ్ చెప్తున్నారు.
అక్కడితో సమస్య పరిష్కారమైందని ఆయన అనుకున్నారు. అవసరమైన పక్షంలో లిఖిత పూర్వకంగా క్షమాపణ అందిస్తాననీ ఆ అధికారితో చెప్పారు. ఆ అధికారి తాను ఆయన రెసిడెంట్ పర్మిట్ విషయం చూస్తానని చెప్తూ.. ఆయనను బయట వేచి ఉండాలని పంపించారు.

''నన్ను మళ్లీ కార్యాలయంలోకి పిలిపించారు. ఈసారి ఆ అధికారి ఒక్కరే ఉన్నారు. నా అభిప్రాయం రీత్యా, సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలో నేను పాల్గొన్నందుకు గాను.. నన్ను తక్షణం భారతదేశం విడిచివెళ్లాలని కోరుతున్నట్లు ఆమె నాతో చెప్పారు. ప్రభుత్వం నేను ఆ ప్రదర్శనలో పాల్గొనటం సరికాదని భావిస్తున్నట్లు ఆమె బలంగా చెప్పారు. నాకు కొన్ని క్షణాల పాటు మాటలు రాలేదు'' అని జాకబ్ బీబీసీకి వివరించారు.
ఎటువంటి పౌర నిరసనల్లోనైనా పాల్గొనటానికి అనుమతి లేదన్న విషయం తన వీసా నిబంధనల్లో ఉందన్న విషయం తనకు తెలియదని.. ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థి సంస్కృతిలో నిరసనలు ఒక భాగమని.. తాను ఆ అధికారితో చెప్పినట్లు ఆయన తెలిపారు.
''నిరసన ప్రదర్శనల్లో పాల్గొనటం నిషిద్ధమని చెప్పే నిర్దిష్ట నిబంధనలు ఎక్కడ ఉన్నాయో చూపించాలని నేను ఆమెను అడిగినప్పుడు.. ఆమె చాలా ఆగ్రహించారు. విద్యార్థి వీసా అనేది కేవలం చదువుకోవటానికి మాత్రమే ఉందని.. ఆ వివరణ సరిపోతుందని నాతో చెప్పారు'' అని ఆయన పేర్కొన్నారు.
అప్పుడు ఆయన పాస్‌పోర్టును ఆ అధికారి తీసేసుకున్నారు. కొన్ని గంటల తర్వాత.. ఆయన భారతదేశం విడిచి వెళ్లటానికి విమానం టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ఆయన పాస్‌పోర్టును ఆయనకు తిరిగి ఇచ్చారు.
విద్యార్థి వీసా కింద.. నిరసనలో పాల్గొనటం విస్పష్టంగా నిషద్ధమా అనేది తనకు ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదని జాకబ్ చెప్తున్నారు.
''ఒకవేళ ఖచ్చితంగా నిర్వచించినట్లయితే.. ఈ నిబంధనల ప్రకారం నేను శాస్త్రీయ సదస్సులకు మినహా దేశంలో అంతర్గతంగా మరే అవసరానికీ ప్రయాణించటానికి వీలులేదు. నేను ప్రాధమికంగా నిద్రపోవటం కోసం నా గదికి, తినటం కోసం క్యాంటీన్‌కి, చదువుకోవటం కోసం తరగతి గదికి, గ్రంథాలయానికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.
విద్యార్థి అనే పదాన్ని చూసినపుడు.. విస్తృత సామాజిక జీవనంలో నాకు అనుమతి ఉంటుందని నేను భావించాను. నాకు తెలిసిన చాలా మంది విద్యార్థులు తరచుగా ప్రదర్శనల్లో పాల్గొంటుంటారు. అయినప్పటికీ తమను విద్యార్థులుగానే నిర్వచిస్తారు కానీ.. 'విద్యార్థులు - రాజకీయ కార్యకర్తలు' అని నిర్వచించరు. కానీ.. భారతదేశంలో కొందరు అధికారులు దీనిని భిన్నంగా చూస్తున్నట్లు కనిపిస్తోంది'' అని ఆయన పేర్కొన్నారు.
ఈ అంశం మీద ఇంటర్వ్యూ ఇవ్వటానికి కానీ, ప్రకటన ఇవ్వటానికి కానీ బీబీసీ చేసిన విజ్ఞప్తికి చెన్నైలోని ఎఫ్ఆర్ఆర్ఓ స్పందించలేదు.

''నా నిరసన భారతదేశానికి వ్యతిరేకంగా కాదు.. ఒక రాజకీయ స్రవంతికి వ్యతిరేకంగా''
న్యూరెంబర్గ్‌లో పుట్టి పెరిగిన జాకబ్‌ది.. మధ్యస్థ క్యాథలిక్ కుటుంబం. ప్రైవేట్ స్కూల్‌లో చదువుకున్నారు. స్కూలు విద్య పూర్తయిన తర్వాత టాంజానియన్ అగ్నిమాపకదళం.. దార్-ఎస్-సలామ్‌లో ఒక సంవత్సరం పాటు వలంటీరుగా పనిచేశారు. అక్కడ విధుల్లో పాల్గొంటున్న సమయంలో తనకు మొదటిసారిగా మానవ హక్కుల ఉల్లంఘన గురించి తెలిసిందని ఆయన చెప్తారు. డ్రెస్డెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ అధ్యయనం చేస్తూ జర్మనీలో గ్రీన్ పార్టీలో చేరారు.
సాక్సన్ గ్రీన్ పార్టీలో ఆర్థిక విధాన బృందం ఏర్పాటులో ఆయన పాలుపంచుకున్నారు. ఏడాది కాలం పాటు ఆ బృందానికి స్పీకర్‌గా పనిచేశారు. అనంతరం భారతదేశం వచ్చారు.
ఇప్పుడు.. డ్రెస్డెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి, ఐఐటీ మద్రాస్ ఫిజిక్స్ విభాగానికి మధ్య ఎక్సేంజ్ ప్రోగ్రామ్ (విద్యార్థి బదిలీ)లో భాగంగా ఇక్కడ ఇంకా ఒక సెమిస్టర్ మిగిలివుంది. దానిని పూర్తి చేయటానికి తాను తిరిగి భారతదేశానికి రాగలనా లేదా అనేది ఆయనకు తెలియటం లేదు.
''డ్రెస్డెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలోనే నా చదువు కొనసాగించటానికి నేను సిద్ధమవుతున్నాను. చెన్నైలో నాకు మంచి మిత్రులు లభించారు. ఐఐటీ మద్రాస్‌లో విద్యాభ్యాస వాతావరణం నాకు నచ్చింది. కాబట్టి భారతదేశం తిరిగి రావాలని నేను ఖచ్చితంగా కోరుకుంటాను. నా నిరసన భారతదేశానికి వ్యతిరేకంగా కాదని.. అంతకంతకూ నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఒక రాజకీయ స్రవంతికి వ్యతిరేకంగానే నేను నిరసన తెలిపానని నేను స్పష్టం చేయదలచుకున్నా'' అని జాకబ్ చెప్పారు.
సీఏఏకి వ్యతిరేకంగా నిరసనల గురించి చెన్నైలోని తన స్నేహితులు తనకు చెప్పారని.. దాని గురించి కొంచెం చదివిన తర్వాత.. ఆ చట్టాన్ని, ఎన్ఆర్‌సీతో కలిపి ఉపయోగించినప్పుడు భారతదేశంలోని ముస్లింలు ఏ దేశానికీ చెందని వారవుతారని తనకు అనిపించిందని ఆయన తెలిపారు.
''ఆ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనటం ద్వారా.. నిర్మాణంలో ప్రమాదకరమైన లోపాలున్న ఒక వినూత్నమైన ఉత్పత్తి మార్కెట్‌లోకి ప్రవేశించినపుడు ఎవరికైనా కలిగే ఆందోళన తరహాలోనే నా ఆందోళనను నేను వ్యక్తంచేశాను. ఆ చట్టం ఉద్దేశం హేతుబద్ధంగా కనిపిస్తుంది కానీ.. ఆ చట్టాన్ని తేలికగా దుర్వినియోగం చేయజాలరన్న హామీని ప్రభుత్వం ఇవ్వలేకపోయింది'' అని చెన్నైలో నిరసనల్లో తాను పాల్గొనటం గురించి జాకబ్ వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నిరసనలను అణచివేయటానికి ప్రభుత్వం అనవసర బలప్రయోగం చేసిందని కూడా ఆయన పేర్కొన్నారు. ''ఆందోళనకారుల వల్ల నిరసనలు హింసాత్మకంగా మారినచోట.. ప్రభుత్వం పట్ల ఏళ్లతరబడి మౌన అసమ్మతితో పేరుకుపోయిన ఆగ్రహం అలా బయటకువచ్చినట్లు కనిపిస్తోంది. అది సరైన కారణం కాదనేది నిజమే. కానీ.. ప్రస్తుతానికి ఏకైక పరిష్కారం ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం చేసినట్లుగా.. ప్రభుత్వం విమర్శలను అంగీకరించాలి'' అని అభిప్రాయపడ్డారు.
ఈ జర్మనీ విద్యార్థి.. జర్మనీలోని నాజీ చరిత్రను ప్రజలకు గుర్తుచేసే ఉద్దేశంతో ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనల్లో పాల్గొన్న ఫొటోలు వైరల్‌గా మారాయి.
''1933-1945 - అది మేం చవిచూశాం' అనే నినాదం రాసిన ప్లకార్డును ప్రదర్శించటంలో.. ప్రస్తుత ప్రభుత్వాన్ని నాజీ పాలనతో పోల్చటం నా ఉద్దేశం కాదు. చాలా నిరంకుశ వ్యవస్థలు హేతుబద్ధంగా కనిపించినప్పటికీ.. విద్వేషపూరిత ప్రభుత్వాలు ప్రమాదకరంగా ఉపయోగించే అవకాశాలున్న చట్టాలతోనే మొదలవుతాయి (ఉదాహరణకు భారీ సంఖ్యలో ముస్లింలను దేశంలేని వారిగా చేయటం) అనే వాస్తవాన్ని తెలియజేయాలని నేను అనుకున్నాను.
ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ శ్రేణుల్లో ఉన్న వారు కూడా ముస్లిం వ్యతిరేక ప్రకటనలు ఇవ్వటం, మతం వంటి అంశాలు ప్రాతిపదికగా ప్రజల 'భారతీయత'ను తేడాగా చూడటం సాధారణంగా మారిపోయింది. నా లక్ష్యం.. నిరంకుశ పాలనను ఒక్క రోజులో (1933 సంవత్సరంలో) పుట్టుకురావని, సంపూర్ణ విపత్తు (1945 సంవత్సరంలో) ఇంకా దూరంగా ఉందని.. కానీ చిన్నచిన్న చర్యలు కలిసి ఆందోళనకరంగా మారి చివరికి ప్రమాదకరంగా పరిణమిస్తాయని చెప్పటం'' అని జాకబ్ వివరించారు.
అయినప్పటికీ.. ఒక విదేశీయుడు ఇటువంటి నినాదం చేయటం మరీ రెచ్చగొట్టే విధంగా ఉందని ఆయన అంగీకరించారు. దీనిని మళ్లీ వాడనని చెప్పారు.
భారతదేశంలో తన ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌ని పూర్తిచేయలేకపోతే.. సమయం కోల్పోకుండా ఉండటానికి ఏడాది మధ్యలో మళ్లీ తన యూనివర్సిటీలో చేరాలని జాకబ్ ఆశిస్తున్నారు.
''విదేశీ విద్యార్థులుగా మమ్మల్ని సాదరంగా ఆహ్వానించే వాతావరణం ఉండటంతో పాటు.. అక్కడ నేను చాలా మంది సహాధ్యాయులను, సహచరులను కలిశాను. వారితో అర్థవంతమైన సంబంధం నిర్మించుకోగలను'' అని చెన్నైలో తను గడిపిన సమయం గురించి ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- రాత్రిలా మారిన పగలు... బీచ్‌కు పరుగులు తీసిన ప్రజలు
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
- కొత్త ఏడాది తీర్మానాలు చేసుకుంటున్నారా? అయితే, ఈ 5 విషయాలు మరచిపోవద్దు
- 2019లో అంతరిక్ష అందాలను కళ్లకు కట్టిన అత్యద్భుత ఛాయా చిత్రాలు ఇవి
- ‘మాకిప్పుడే స్వతంత్రం వచ్చింది... జీవితంలో మొదటిసారి గుడిలోకి అడుగుపెట్టినాం’
- ‘దేశంలో ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితి.. విధానపరమైన నిర్ణయాలు అవసరం’
- విజన్ 2020: అబ్దుల్ కలాం, చంద్రబాబు లక్ష్యాలు ఏంటి? వాటిలో ఎన్ని నెరవేరాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








