మధ్యప్రదేశ్: బహిరంగ మలవిసర్జన చేశారని ఇద్దరు దళిత చిన్నారులను కొట్టి చంపారు

ఫొటో సోర్స్, SHURIAH NIAZI
- రచయిత, షురేహ్ నియాజీ
- హోదా, బీబీసీ కోసం, భోపాల్ నుంచి
మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలో బహిరంగంగా మల విసర్జన చేశారని ఇద్దరు దళిత చిన్నారులను కొట్టి హత్య చేశారు.
ఈ ఘటన సిర్సౌద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భావ్‌ఖేడీ గ్రామంలో జరిగింది. అక్కడ వాల్మీకి సమాజానికి చెందిన 12 ఏళ్ల రోషిణి, పదేళ్ల అవినాశ్ బుధవారం ఉదయం పంచాయతీ భవనం ఎదురుగా ఉన్న రోడ్డు దగ్గర మల విసర్జన చేస్తున్నారు.
"హకీం అనే వ్యక్తి మొదట ఇద్దరు పిల్లలతో రోడ్డు మీద మల విసర్జన చేయవద్దని చెప్పాడు, రోడ్డును పాడు చేస్తున్నారని అన్నాడు. ఆ తర్వాత అతడు రామేశ్వర్‌తో కలిసి వారిపై దాడి చేశాడు" అని పోలీసులు చెప్పారు.
నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర ఉన్న వివరాలను బట్టి బాధిత పిల్లలు ఇద్దరూ వరుసకు అత్త, అల్లుడు అవుతారు.
ఈ ఘటన తర్వాత ఉద్రిక్తతలు తలెత్తడంతో గ్రామంలో పోలీసులను మోహరించారు.
"పిల్లలు ఇద్దరూ ఉదయం 6 గంటలకు మల విసర్జన కోసం వెళ్లారు. హకీం, రామేశ్వర్ యాదవ్ వారిని కర్రలతో కొట్టారు. అలా వారు చనిపోయేవరకూ కొడుతూనే ఉన్నారు. నేను అక్కడికి వెళ్లేసరికే ఇద్దరూ పారిపోయారు" అని అవినాశ్ తండ్రి మనోజ్ వాల్మికి చెప్పారు.

ఫొటో సోర్స్, SHURIAH NIAZI
మరుగుదొడ్డి కట్టుకోనివ్వలేదు
రోషిణి మనోజ్ చెల్లెలు. కానీ పాపను ఆయన తన కూతురు లాగే చూసుకున్నారు. అవినాశ్, రోషిణి అక్కాతమ్ముళ్లలా ఉండేవారని చెప్పాడు.
మనోజ్, అతడి కుటుంబం ఉంటున్న ఇంటి దగ్గర మరుగుదొడ్డి కట్టనివ్వలేదు. అది లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు బయటికెళ్లి మల విసర్జన చేయాల్సి వస్తోంది.
"మా ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోడానికి పంచాయతీకి డబ్బులు కూడా వచ్చాయి. కానీ వాళ్లు దానిని కట్టుకోనివ్వలేదు. వాళ్ల వల్ల గ్రామంలో నా కుటుంబం చాలా బాధలు పడింది" అని మనోజ్ చెప్పారు.
రెండేళ్ల క్రితం గ్రామంలో సొంత ఇల్లు కట్టుకోడానికి రోడ్డు మీద ఉన్న కట్టెలు కొట్టినందుకు నిందితులు తనపై శత్రుత్వం పెంచుకున్నారని మనోజ్ చెప్పారు. తనను వారు నోటికొచ్చినట్టు తిట్టేవారని, బెదిరించేవారని, తక్కువ కూలి ఇచ్చేవారని చెప్పాడు.
మనోజ్‌కు సొంతంగా భూములేవీ లేవు. దాంతో రోజు గడవడానికి అతడి కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళ్తుంటారు.

ఫొటో సోర్స్, SHURIAH NIAZI
పోలీసులు ఏం చెబుతున్నారు
"పిల్లలిద్దరూ బహిరంగంగా మల విసర్జన చేస్తున్నారు. దానిపై నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వాళ్లు పిల్లలను కర్రలతో తీవ్రంగా కొట్టారు" అని సర్‌సౌద్ స్టేషన్ ఇన్‌ఛార్జి ఆర్.ఎస్.ధాకడ్ చెప్పారు.
"భావ్‌ఖేడీలో కర్రలతో కొట్టి ఇద్దరు పిల్లలను చంపేసిన కేసులో, మేం ఇద్దరు నిందితులపై హత్య కేసు నమోదు చేశాం. వారిని ప్రశ్నిస్తున్నాం" అన్నారు.
పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన మొత్తం వివరాలు సేకరిస్తున్నారు.

ఫొటో సోర్స్, SHURIAH NIAZI
చిన్నారుల హత్యపై రాజకీయాలు
కానీ ఈ ఘటన చుట్టూ ఇప్పుడు రాజకీయాలు ముసురుకుంటున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి దళిత పిల్లలను దారుణంగా కొట్టి చంపారని చెబుతున్న ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
దీనిపై ట్వీట్ చేసిన మాయావతి, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల గురించి ప్రస్తావించారు.
"దేశంలోని కోట్లాది దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలకు ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించకుండా వంచించడంతోపాటు, వారు అన్నిరకాల దారుణాలకు బలయ్యేలా చేస్తోంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ శివపురిలో దళిత చిన్నారులను కొట్టి చంపడం చాలా విచారకరం, ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"పేద దళితులు, వెనుకబడిన వర్గాలకు వారి ఇళ్లలో మరుగుగొడ్డి ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చెప్పాలి. ఇది చాలా చేదు నిజం. తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ మల విసర్జన చేస్తున్న దళిత పిల్లలను కొట్టి చంపిన వారికి కచ్చితంగా ఉరిశిక్ష పడేలా చేయాలి" అని ఆమె అన్నారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కూడా ఈ ఘటనను ఖండించారు. దీనిని చాలా దారుణమైన ఘటనగా చెప్పారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. బాధిత కుటుంబానికి రక్షణ ఇవ్వడంతోపాటు, వారికి అన్నిరకాల సాయం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఇవి కూడా చదవండి:
- మధ్యాహ్న భోజన పథకం: దక్షిణ భారత్‌లో అమలవుతోంది, ఉత్తరాదిలో ఎందుకు కావడం లేదు
- ఇంతమంది చిన్నారులు ఎందుకు చనిపోతున్నారు...
- గ్లోబల్ వార్మింగ్ వెనుక ఉన్న డర్టీ సీక్రెట్ ఇదే
- ఈ బంగారు టాయిలెట్‌ను ప్యాలస్ నుంచి ఎత్తుకెళ్లారు
- బంగారు చెవిదుద్దును కోడిపుంజు మింగేసింది.. కోసి బయటకు తీశారు
- దక్షిణ కొరియా నాయకులు ఎందుకు గుండు కొట్టించుకుంటున్నారు?
- పాకిస్తాన్లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి
- ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'.. మానవ విపత్తులా మారిన ఫేస్‌బుక్ ఈవెంట్
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- #HowdyModi: అమెరికాలో మోదీ కార్యక్రమానికి రానున్న ట్రంప్
- పచ్చరాళ్ళ వేట కోసం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు... ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








