చీరాలలో ప్రజా సంఘం నేత నాగార్జున రెడ్డిపై దాడి.. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆమంచి కుటుంబీకులపై కేసు నమోదు

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
''గతంలో రెండుసార్లు దాడులు చేశారు. ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్ ముందే దాడి జరిగినా స్పందించలేదు. అందుకే ఇప్పుడు ఏకంగా కిడ్నాప్ చేసి, హత్యాయత్నం చేశారు. చనిపోయాడనుకుని వదిలేసి పోయారు. సోమవారం సాయంత్రం మాకు సమాచారం అందగానే వెళ్లేసరికి చావు బతుకుల్లో ఉన్నారు. ఇప్పడు ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు'' అని జ్యోతి వివరించారు.
చీరాలకు చెందిన ప్రజా సంఘ నాయకుడు నాయుడు నాగార్జునరెడ్డి మీద సోమవారం జరిగిన దాడి గురించి ఆయన భార్య జ్యోతి బీబీసీకి చెప్పిన మాటలివి.
''మా తాతల నాడు చీరాల పేరుకి ఎంతో ప్రాధాన్యం ఉండేది. చీరాల వాసులంటే ఎంతో గొప్పగా భావించేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రశ్నించేందుకు అవకాశం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి భవిష్యత్తు అనుమానంగా మారుతోంది'' అంటున్నారు చీరాలకు చెందిన బీరక పరమేష్.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
''పదేళ్లుగా చీరాలలో ప్రజాస్వామ్యం లేదు. ఇసుక మాఫియా చేతుల్లోనే అన్నీ బందీ అయిపోయాయి. ఎవరైనా ఎదిరిస్తే వారికి అనేక ఇక్కట్లు తప్పడం లేదు. ప్రశ్నిస్తున్న మాలాంటి ప్రజాసంఘాల వారిని వేధిస్తున్నారు. అందులో భాగమే నాగార్జునరెడ్డి మీద వరుసగా హత్యాయత్నాలు" అంటూ చెప్పుకొచ్చారు ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ధర్మ.
ఈ క్రమంలో చీరాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు ఆయన సోదరుడు సోములు వ్యవహారశైలి అనేకమందిని ఇబ్బందులకు గురిచేస్తోందని, ఆయన ప్రమేయంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ విమర్శలను బీబీసీ నేరుగా ఆమంచి కృష్ణమోహన్ దృష్టికి తీసుకొచ్చింది. కానీ ఆయన వాటిని తోసిపుచ్చారు.
''మా మీద సాగుతున్న దుష్ప్రచారం అది. నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నాం. గిట్టని వాళ్లు ఇలాంటి నిందలు వేస్తున్నారు. నాగార్జునరెడ్డి విలేకరి కాదు. అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ పోలింగ్ ఏజెంట్‌గా పనిచేశారు. కౌంటింగ్‌లోనూ ఆయన టీడీపీ తరఫున ఉన్నారు. ఆయన కారణంగానే సమస్యలు వస్తున్నాయి.'' అంటూ చెప్పుకొచ్చారు.
ఇసుక మాఫియా, నాగార్జునరెడ్డి మీద హత్యాయత్నం ఘటనలో ఆమంచి కృష్ణమోహన్ మీద ఉన్న కేసుల గురించి ప్రస్తావించగా.. ఈ విషయాలపై ప్రస్తుతం స్పందించలేనన్నారు.
బీబీసీ బృందం చీరాలలో అడుగుపెట్టిన తర్వాత ఎవరితో మాట్లాడినా ఆ పక్కనే ఎవరో ఒకరు పరిశీలిస్తుండడం, ఫోటోలు, వీడియోలు తీసి ఎవరికో పంపిస్తున్నట్టుగా కనిపించింది.
చీరాలలో ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్, ఆయన సోదరుడు సోముల మీద ఉన్న ఆరోపణలు, కేసుల గురించి డీఎస్‌పీ వై.జె.రామసుబ్బారెడ్డిని బీబీసీ వివరాలు కోరింది.
ఆయన మాట్లాడుతూ.. ''గతంలో ఏం జరిగిందో తెలియదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించడం లేదు. చీరాలలో రెండు వర్గాలవారు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టింగ్స్ పెట్టుకుంటూ, కరపత్రాలు పంచుకుంటున్నారు. వాటిపై దృష్టి పెట్టాం. ఇసుక అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టాం. అన్నింటినీ అడ్డుకుంటాం'' అని మాత్రం చెప్పారు.

నాగార్జునరెడ్డి ఎవరు, హత్యాయత్నం ఎందుకు జరిగింది?
చీరాల సమీపంలోని వేటపాలెం గ్రామ నివాసి నాయుడు నాగార్జునరెడ్డి ప్రజాసంఘాలలో పనిచేస్తున్నారు. గతంలో కొన్ని పత్రికల్లో విలేకరిగా పనిచేశారు. ఆ సందర్భంగానే ఆమంచి కృష్ణమోహన్‌తో ఆయనకు వివాదం మొదలైంది. నాగార్జునరెడ్డి సాక్షి పత్రికలో పనిచేస్తున్న కాలంలో నాటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌కి వ్యతిరేకంగా కథనాలు రాశారు.
2007లో నాగార్జునపై చీరాల క్లాక్ టవర్ సెంటర్‌లో దాడి జరిగింది. సీసీ కెమెరాల్లో రికార్డైన నాగార్జునపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై కేసు కూడా నమోదైంది.
ఈ దాడి కేసులో పోలీసుల వ్యవహారశైలిపై నాగార్జున భార్య జ్యోతి ఆరోపణలు చేశారు. వేటపాలెంలో చిన్న రేకుల షెడ్ ఇంట్లో నివసిస్తున్న వారి కుటుంబాన్ని బీబీసీ కలిసింది.
''ఒంగోలు ఎస్‌పీ గారిని స్పందన కార్యక్రమంలో కలిసేందుకు వెళ్లి వస్తుండగా నా భర్తపై దాడికి పాల్పడ్డారు'' అని ఆమె తెలిపారు.

నాగార్జునరెడ్డి మీద 2017, 2018 సంవత్సరాల్లో కూడా వరుసగా రెండుసార్లు దాడులు జరిగాయి. తాజాగా సోమవారం సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో చినగంజాం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడోసారి దాడి జరిగింది.
అక్కడి నుంచి 18 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి చీరాల సమీపంలో పడేసి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో పడి ఉన్న నాగార్జునరెడ్డిని స్థానికులు ఇచ్చిన సమాచారంతో తొలుత ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం మొదట చీరాలలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి, తర్వాత ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రికి తరలించారు.
చీరాలకి చెందిన అందే కృష్ణ అనే వ్యక్తి ఇంటి సమస్య విషయంలో జిల్లా ఎస్‌పీని కలిసేందుకు సోమవారం నాగార్జున ఒంగోలు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఆమంచి కుటుంబీకులు సహా 26మందిపై కేసు నమోదు..
నాగార్జునరెడ్డి మీద హత్యాయత్నం, కిడ్నాప్, కుట్రపూరితంగా వ్యవహరించడం జరిగిందని చీరాల డీఎస్‌పీ బీబీసీకి తెలిపారు.
''ఈ ఘటన మీద చినగంజాం పీఎస్ పరిధిలో క్రైమ్ నంబర్ 130/2019కింద కేసు నమోదైంది. బాధితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా 26 మందిపై కేసు పెట్టాం. వారిలో ఆమంచి కుటుంబీకులు కూడా ఉన్నారు. కృష్ణ మోహన్, సోముల పాత్ర గురించి నాగార్జునరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. బాధ్యులు ఎవరైనా సరే అరెస్ట్ చేస్తాం. రెండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేస్తాం'' అని తెలిపారు.

చీరాలలో వరుసగా రెండుసార్లు గెలిచిన ఆమంచి కృష్ణ మోహన్, ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతుల్లో ఓటమి పాలయ్యారు. అయినా రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టడంతో చీరాలలో ఆమంచి హవానే నడుస్తోందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల రామచంద్రపురం గ్రామంలో ఒక కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేశారు. బాధిత కుటుంబానికి చెందిన బాలిక నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాసింది.
అయితే.. సీఎం ఆదేశాలతో ఆ గ్రామంలో జాయింట్ కలెక్టర్ నిర్వహించిన విచారణ ఆమంచి కృష్ణ మోహన్ సమక్షంలో సాగడం ప్రొటోకాల్‌కు విరుద్ధమని ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు.

చేనేత దినోత్సవాన్ని అడ్డుకోవడానికి 144 సెక్షన్ పెట్టారు..
రాజకీయంగా చీరాలలో చేనేత కార్మికులు ఆమంచికి వ్యతిరేకంగా పనిచేశారనే అభిప్రాయంతో ఏకంగా చేనేత దినోత్సవం కూడా జరపకుండా అడ్డుకున్నారని బీసీ ఫెడరేషన్ కార్యదర్శి పరమేష్ ఆరోపించారు.
''జాతీయ చేనేత దినోత్సవం కేంద్రమే నిర్ణయించింది. దేశమంతా జరుపుకునే ఆ కార్యక్రమాన్ని చీరాలలో మాత్రం అడ్డుకున్నారు. దానికోసం ఏకంగా 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దేశంలోనే అత్యధికంగా చేనేత కార్మికులు ఓ క్లస్టర్‌గా ఉన్న ప్రాంతంలో చేనేత దినోత్సవం జరుపుకోలేకపోయాం'' అని వివరించారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసమే అలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. తాజాగా నాగార్జునరెడ్డి మీద హత్యాయత్నం తర్వాత కూడా చీరాలలో పోలీస్ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రధాన కూడళ్లలో స్పెషల్ పోలీసులు పహారా కాస్తున్నారు.
ప్రస్తుతం నాగార్జునరెడ్డికి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. అదే సమయంలో చీరాల పరిణామాలపై జిల్లా ఎస్‌పీ జోక్యం చేసుకోవాలని, సమగ్ర విచారణ జరపాలని చీరాలలో మంగళవారం నిర్వహించిన వివిధ పార్టీల, ప్రజాసంఘాల సమావేశం డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- ‘ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘించారు’.. గద్దె దించేందుకు అభిశంసన తీర్మానం పెట్టిన డెమోక్రాట్స్
- అమెరికాలో నెహ్రూ, ఇందిరా గాంధీలను చూసేందుకు అంతమంది వచ్చారా? ఈ ఫొటో వెనుకున్న వాస్తవం ఏంటి?
- #నో బ్రా ఉద్యమం: బ్రా వేసుకోకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్న దక్షిణ కొరియా మహిళలు
- అబద్ధాలు చెప్పే వారిని ఎలా గుర్తించాలి?
- ఎడమ చేతి అలవాటుకు కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








