జార్ఖండ్‌: మూక హత్యకు బలైన తబ్రేజ్ అన్సారీ కేసులో మళ్లీ సెక్షన్ 302 కింద చార్జిషీటు

తబ్రేజ్ అన్సారీ మాబ్ లించింగ్

ఫొటో సోర్స్, SARTAJ ALAM

    • రచయిత, రవి ప్రకాశ్
    • హోదా, బీబీసీ హిందీ కోసం, రాంచీ నుంచి

దేశమంతటా కలకలం సృష్టించిన తబ్రేజ్ అన్సారీ మాబ్ లించింగ్ కేసులో జార్ఖండ్ పోలీసులు నిందితులపై మళ్లీ సెక్షన్ 302 కింద విచారణకు అపీల్ చేశారు.

సరాయ్‌కేలా ఖర్సావా జిల్లా కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు ఈ కేసులో ఇప్పుడు నిందితులపై కేసును ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉద్దేశ పూర్వక హత్యగా మార్చడానికి తగిన సాక్ష్యాలు లభించాయని చెప్పారు.

జార్ఖండ్ ఏడీజీ మురళీ లాల్ మీనా బీబీసీతో మాట్లాడుతూ "దీనిపై వివరంగా ఒక ప్రెస్ రిలీజ్ విడుదల చేశాం. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులు ఉద్దేశ పూర్వక హత్య ఆరోపణల కింద విచారణ ఎదుర్కుంటారు" అని చెప్పారు.

తబ్రేజ్ అన్సారీ మాబ్ లించింగ్

ఫొటో సోర్స్, RAVI PRAKASH /BBC

పోలీసుల ప్రకటనలో ఏముంది

జార్ఖండ్ పోలీసులు జారీ చేసిన ప్రెస్ రిలీజ్‌లో "ఇంతకు ముందు మేం దాఖలు చేసిన చార్జిషీటులో దర్యాప్తు కోసం పోస్టుమార్టం రిపోర్టులోని మృతి కారణాలను బయటపెట్టలేదు. ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన లోపలి అవయవాల పరీక్ష రిపోర్టు ప్రకారం గుండె ఆగిపోవడం వల్లే తబ్రేజ్ చనిపోయాడని తెలిసింది. కానీ అందులో దానికి కారణం ఏంటో స్పష్టత లేదు".

"న్యాయ ప్రయోజనాలు, విచారణ కోసం పోలీసులు ఎంజీఎం మెడికల్ కాలేజీలో సీనియర్ వైద్యుల బోర్డును మృతికి స్పష్టమైన కారణాలు కోరాం. అక్కడ వైద్య నిపుణుల రిపోర్టుతో మాకు ఈ కేసులో అదనపు సాక్ష్యాలు లభించాయి. వాటి ఆధారంగా సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసి, నిందితులందరి మీదా 302 కింద ప్రొసీడింగ్స్ జరపాలని కోరాం. ఈ కేసుపై మా పరిశోధన కూడా కొనసాగుతోంది" అని చెప్పారు.

"ఈ ఘటనకు సంబంధించిన వైరల్ వీడియో ఇంటిగ్రిటీ దర్యాప్తు రిపోర్ట్ కూడా పోలీసులకు అందింది. మేం స్వాధీనం చేసుకున్న వీడియో ఇంటిగ్రిటీలో ఎలాంటి మార్పులు-చేర్పులు చేసినట్లు కనిపించలేదు".

ఈ కేసులో నిందితులను 72 గంటల్లోపే అరెస్టు చేశాం. మెరుగైన దర్యాప్తు కోసం టెక్నికల్ పరిశోధన, టెక్నికల్ సాక్ష్యాలు సేకరించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం" అని పోలీసులు తమ ప్రకటనలో చెప్పారు.

తబ్రేజ్ అన్సారీ మాబ్ లించింగ్

ఫొటో సోర్స్, RAVI PRAKASH /BBC

వైద్య నిపుణులు ఏం చెప్పారు

పోలీసులకు ఇచ్చిన రిపోర్ట్ గురించి మాట్లాడిన వైద్య నిపుణులు "దారుణంగా కొట్టడం వల్ల పక్కటెముకలు విరిగి, అవయవాలు పనిచేయడం ఆగిపోవడంతో హార్ట్ చాంబర్‌లో రక్తం నిండి, తబ్రేజ్ అన్సారీ కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు" అని చెప్పారు.

ఆమరణ నిరాహారదీక్ష బెదిరింపు

మరోవైపు, రెండు రోజుల క్రితం సరాయ్‌కేలా ఖర్సావా డీసీ, ఎస్పీని కలిసిన తబ్రేజ్ అన్సారీ భార్య షాయిస్తా పర్వీన్ తన భర్త హత్య కేసులో నిందితులపై మళ్లీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయకపోతే, ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించారు.

ఇప్పుడు పోలీసులు నిందితులపై 302 కింద చార్జిషీటు దాఖలు చేయడంతో తబ్రేజ్ అన్సారీ భార్య షాయిస్తా పర్వీన్ తమకు న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నారు.

బీబీసీతో మాట్లాడిన ఆమె "పోలీసులు నా భర్తను హత్య చేసినవారిపై మళ్లీ 302 కింద చార్జిషీటు నమోదు చేసినట్లు తెలిసింది. అందుకు వారికి ధన్యవాదాలు" అన్నారు.

"నాకు ఇంతకు ముందు పోలీసులపై నమ్మకం పోయింది. ఎందుకంటే వాళ్లు హంతకులకు వ్యతిరేకంగా సెక్షన్-304 కింద చార్జిషీటు పెట్టారు. ఇప్పుడు మళ్లీ న్యాయం లభిస్తుందనే ఆశ ఏర్పడింది. ఇప్పుడు నా భర్త ఆత్మకు శాంతి లభిస్తుందని అనిపిస్తోంది" అన్నారు.

తబ్రేజ్ అన్సారీ మాబ్ లించింగ్

ఫొటో సోర్స్, RAVI PRAKASH /BBC

అసలేం జరిగింది

జూన్ 18న ఉదయం షాయిస్తా పర్వీన్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసింది ఆమె భర్త తబ్రేజ్ అలియాస్ సోను. ఫోన్లో అతడి గొంతు భయంతో వణుకుతోంది. "షాయిస్తా నన్ను కాపాడు. వీళ్లు నన్ను దారుణంగా కొడుతున్నారు. నన్ను రాత్రంతా కుళ్లబొడిచారు" అని ఫోన్‌లో చెప్పారు.

తబ్రేజ్ ఝార్ఖండ్‌లోని సరాయ్‌కేలా జిల్లా కాడండిహా గ్రామానికి చెందినవాడు. ఈ గ్రామం రాజధాని రాంచీకి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జూన్ 17న ఒక మూక ఆయన్ను దొంగతనం ఆరోపణలతో తీవ్రంగా కొట్టింది.

మరుసటి రోజు అంటే జూన్ 18న పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. అదే సమయంలో తబ్రేజ్ పరిస్థితి క్షీణించింది. అదే నెల 22న అతడు చనిపోయారు.

ఆ కేసులో వెంటనే 11 మందిని అరెస్టు చేశారు.

ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ఖార్సన్వాలోని పోలీసు అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.

ఈ ఘటన ఖార్‌సావన్ జిల్లా ధాట్కిడిహ్ గ్రామం సమీపాన జరిగింది.

తబ్రేజ్ నివసించే కాడండిహా గ్రామంలో సుమారు వెయ్యి ఇళ్లు ఉంటాయి. అందులో ఎనిమిది మాత్రమే హిందువులవి. మిగతావన్నీ ముస్లింలవే.

తబ్రేజ్ అన్సారీ మాబ్ లించింగ్

ఫొటో సోర్స్, MOHAMMAD SARTAJ ANSARI

ఫొటో క్యాప్షన్, పోలీస్ స్టేషన్లో తబ్రేజ్ అన్సారీ

తబ్రేజ్ మరణం గురించి...

తబ్రేజ్ గాయపడిన రోజు ఏం జరిగిందని బీబీసీ షాయిస్తాను అడిగింది.

తబ్రేజ్‌తో చివరి సంభాషణ గురించి చెప్పడానికి ప్రయత్నించిన ఆమెకు ఏడుపొచ్చింది. తర్వాత "జూన్ 17న రాత్రి పది గంటలప్పుడు తబ్రేజ్ నాకు ఫోన్ చేశాడు. జంషెడ్‌పూర్ నుంచి తిరిగి వస్తున్నానని చెప్పాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం తిరిగి ఫోన్ చేశాడు. కొందరు గ్రామస్థులు తనను పట్టుకొని, కనికరం లేకుండా కొడుతున్నారని చెప్పాడు. ఆ కాల్ తర్వాత నేను నా బంధువులకు ఫోన్ చేశాను" అని వివరించారు. తర్వాత మాట్లాడలేకపోయారు.

తబ్రేజ్ అన్సారీ మాబ్ లించింగ్

ఫొటో సోర్స్, ANAND DUTTA

'మాకు న్యాయం కావాలి'

షాయిస్తా తండ్రి షేక్ సైఫుద్దీన్. ఆయనో దర్జీ. ఆయన మానసిక ఆరోగ్యం బాగోలేదు.

తబ్రేజ్ గురించి షాయిస్తా తల్లి షాబాజ్ బేగం కూడా ఏడుస్తూనే బీబీసీతో మాట్లాడారు. "మా అల్లుడు మంచోడు. మరో ఊళ్లో నా కుమార్తె సంతోషంగా ఉంటుందని ఆశపడ్డా. ఇప్పుడు మా అల్లుడి మరణంతో నా కూతురు జీవితం నాశనమైంది. దీనికి కారణమైనవారిని ఊరికే వదిలిపెట్టం. ఏదో ఒకటి చేస్తాం" అన్నారు.

తబ్రేజ్‌ను కొట్టిన రోజు 'జై శ్రీరామ్' అనాలని గ్రామస్థులు అతడిని బలవంతపెడుతున్న ఒక వీడియో వైరల్ అయ్యింది.

తబ్రేజ్ అన్సారీ మాబ్ లించింగ్

ఫొటో సోర్స్, ANAND DUTTA

తబ్రేజ్‌ను కొట్టిన గ్రామం ధతకీడీ

దాని గురించి తెలుసుకోడానికి బీబీసీ ధతకీడీకి వెళ్లిన రోజు రోడ్లపై పెద్దసంఖ్యలో మహిళలతోపాటు పోలీసు వాహనాలు కనిపించాయి. మగవారు దాదాపు ఎవ్వరూ కనిపించలేదు.

ఊతకర్రల సాయంతో నడుస్తున్న ఒక వృద్ధుడిని పలకరిస్తే, "ఆ ఘటన జరిగింది ఊళ్లోని దిగువ ప్రాంతంలో, ఇది ఎగువ ప్రాంతం. అక్కడికి వెళ్లు" అని ఆయన చెప్పారు.

గ్రామంలోని పోలీసు క్యాంప్ ఇన్‌ఛార్జి అయిన సరాయ్‌కేలా ఎస్‌డీపీవో అవినాష్ కుమార్ ఇది మూక హత్య కేసు అని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు.

తబ్రేజ్ అన్సారీ మాబ్ లించింగ్

ఫొటో సోర్స్, ANAND DUTTA

ఫొటో క్యాప్షన్, తబ్రేజ్ అన్సారీ

'ముందు వైద్యం అందించాలని కోరాం'

తాము జూన్ 18 ఉదయం సరాయ్‌కేలాలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పుడు తబ్రేజ్‌ లాకప్‌లో ఉన్నాడని సమీప బంధువు మసూర్ ఆలం బీబీసీతో చెప్పారు. "అప్పుడు అతని పరిస్థితి దారుణంగా ఉంది. అతనికి ముందు వైద్యం అందించాలని, ఆ తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ బిపిన్ బిహారీ సింగ్‌ను అడిగాను. కానీ, తబ్రేజ్‌ను అదే స్థితిలో జైలుకు పంపించారని మాకు తర్వాత తెలిసింది" అని ఆయన వెల్లడించారు.

జూన్ 19న తాము జైల్లో తబ్రేజ్‌ను కలిశామని, అతడి పరిస్థితి చాలా దారుణంగా ఉందని మసూర్ ఆలం చెప్పారు. ఇద్దరు పోలీసులు అతడిని బలవంతంగా తమ వద్దకు తీసుకొచ్చారని, అతడు మాట్లాడే పరిస్థితిలో కూడా లేడని తెలిపారు. "మేం మళ్లీ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ బిపిన్ బిహారీ సింగ్‌తో మాట్లాడాం. తబ్రేజ్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆయనను కోరాం. కానీ, ఆయన అంగీకరించలేదు. జైలు రెసిడెంట్ డాక్టర్ పీకే పాటిని కలుద్దామని ప్రయత్నించాం. కానీ కలవలేకపోయాం" అని వివరించారు.

తబ్రేజ్‌ పరిస్థితి క్షీణించిందని, అతడ్ని సిటీ ఆస్పత్రికి తీసుకొస్తున్నారని జూన్ 22న తమకు తెలిసిందని మసూద్ ఆలం చెప్పారు. "మేం ఉదయం ఏడున్నరకు ఆస్పత్రికి చేరుకున్నాం. అక్కడ తబ్రేజ్‌ మృతదేహం తెల్లటి వస్త్రంలో చుట్టి ఉంది" అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)