చీకటి గుహలో 150 ఆవులు, 10 గేదెలు, మేకల మందలతో మూడు కుటుంబాల జీవనం.. దీపాలు, కట్టెల పొయ్యిల వెలుగే ఆధారం

గుహలోని పశువుల కొట్టం
ఫొటో క్యాప్షన్, గుహలోని పశువుల కొట్టం
    • రచయిత, ప్రాచి కులకర్ణి
    • హోదా, బీబీసీ మరాఠి కోసం

చీకట్లు కమ్ముకుంటున్న వేళ ఫోఫ్సండీ కొండల్లో పశువుల గంటల శబ్దాలు వినపడటం ప్రారంభమవుతుంది.

యజమాని తమ వెనక వస్తున్నా, రాకపోయినా ఆ ఆవులు, గేదెలు, మేకలు అన్నీ తిన్నగా నడుచుకుంటూ వెళ్లి ఒక గుహ దగ్గర చేరుతాయి. ఒక్కటొక్కటిగా గుహలో దూరుతాయి.

అహిల్యానగర్‌లోని ఫోఫ్సండిలో ప్రాంతంలో ఉన్న ఈ చిన్న గుహలో సుమారు 150 ఆవులు, 10 గేదెలు, కొన్ని మేకలు, 3 కుటుంబాలు నివసిస్తున్నాయి.

ఆవులు, గేదెలు గుహలోకి ప్రవేశించినప్పుడు అక్కడ చాలా చీకటిగా ఉంటుంది.

ఆ ఆవులు, గేదెలను పోషిస్తున్న కుటుంబాలు కూడా వాటితో పాటే గుహలో ఉంటున్నాయి.

పశువులు గుహకు తిరిగే వచ్చే సమయానికి గుహలోని కుటుంబాలు తమ చిన్నస్థలంలో దీపం వెలిగించి వంట ప్రారంభిస్తాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గుహలో జీవిస్తున్నవారిలో కుషబా మగదే కుటుంబం ఒకటి. గుహలోకి ప్రవేశించగానే కుడి వైపు ఉన్న స్థలం మగదేకు చెందినది.

ఈ గుహలో నివసిస్తున్న వారు ప్రస్తుతం నాలుగో తరానికి చెందినవారు.

నిజానికి సమీపంలోని గ్రామంలో ఉండే ఈ కుటుంబాలు వర్షాకాలం ప్రారంభం కాగానే పశువులు సహా ఇక్కడకు వస్తాయి.

ఇక్కడ నివసించే కుటుంబాలు గుహలోనే గూడుల్లాని నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు.

ఇటుకలు, రాళ్లతో గుహలోనే గూడులా చేసుకుని అందులో ఉంటున్నారు. గుహలోని మిగిలిన స్థలమంతా పశువులకు వదిలేశారు.

ఈ చిన్న స్థలంలో, ఒక పొయ్యి, కొన్ని గిన్నెలతోనే వారు అక్కడ జీవనం గడుపుతారు.

దుస్తులు, పాత్రలు తప్ప వారివద్ద పెద్దగా సామగ్రి లేదు.

ఫోఫ్సాండి కొండలు, మహారాష్ట్ర
ఫొటో క్యాప్షన్, గుహ బయట పనిచేస్తోన్న మహిళ

పశువుల పెంపకమే కారణం

తాము గుహల్లో నివసించేందుకు కారణం ఈ పశువులే అని మగదే చెప్పారు.

‘మా గ్రామంలో లక్ష్మి అనే ఆవు ఉండేది. అది మొదట ఈ గుహలోని మట్టిని తవ్వి బయటకు లాగింది. తరువాత గ్రామస్థులు గుహ లోపల తవ్వి, లోపలున్న మట్టిని బయటకు తీశారు. ఆ తర్వాత మేం ఇక్కడ నివసించడం ప్రారంభించాం'' అని మగదే తెలిపారు.

గుహకు మరో వైపు నివసిస్తోన్న ఒక వృద్ధుడు నామ్‌దేవ్ ముతే ఈ గుహ గురించి, ఈ ప్రాంతం గురించి చెప్తూ... ''ఇక్కడ బాగా వర్షం పడుతుంది. వర్షం వల్ల పచ్చిక ఉంటుంది. పశువులకు మేతకు కొరత ఉండదు. పచ్చిక తినడానికి వెళ్లే ఆవులు గేదెలు తిరిగి ఇక్కడికే వస్తాయి. మళ్లీ ఉదయాన్నే మేతకు వెళ్లి తిరిగొచ్చేస్తాయి'' అని తెలిపారు.

ఈ పశువుల వల్ల తాము ఇక్కడ నివసిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడున్న అందరికీ కొండ కింద రెండు గ్రామాల్లో ఇళ్లు ఉన్నాయి.

వారు పెంచుతున్న ఆవులు, గేదెలను కట్టేందుకు సరిపడినంత స్థలం గ్రామంలోని వారి ఇళ్ల వద్ద లేకపోవడం, పశువులకు కొండల్లో పుష్కలంగా మేత దొరకడం వల్ల వర్షాకాలంలో గుహలోకి వచ్చి ఉంటున్నట్లు వారు చెప్పారు.

‘పశువుల కోసం మేం ఈ గుహలో ఉంటున్నాం. గ్రామంలో పశువులను కనుక మేపడానికి వదిలేస్తే, పంట పొలాల్లోకి అవి వెళ్తాయి. దీనివల్ల గొడవలు జరుగుతాయి. కొండల్లో అయితే, వీటిని స్వేచ్ఛగా వదిలేయొచ్చు. అందుకే నాలుగు నెలలకు పైగా మేం ఇక్కడ నివసిస్తాం'' అని ముతే చెప్పారు.

గుహ, మహారాష్ట్ర
ఫొటో క్యాప్షన్, రాత్రిపూట, గుహలో చాలా చీకటి ఉంటుంది. స్టవ్ వెలుతురులోనే వంట చేస్తారు.

గుహలో రోజు ఇలా గడుస్తుంది

గుహలోని ఈ కుటుంబాలకు ఉదయం నాలుగు గంటలకు రోజు మొదలవుతుంది. ఆ తర్వాత పొద్దునే అన్నం వండుతారు.

కుటుంబంలోని ఒకరు పాలను తీసుకొని గ్రామానికి వెళ్తారు. ఈ కుటుంబాలకు ఇదొక్కటే ఆదాయం.

పాల క్యాన్‌ను పట్టుకుని బయటకు వెళ్లిన తర్వాత, పశువులను మేతకు బయటికి వదిలేస్తారు.

ఈ ఆవులు, గేదెలు రోజూ అవి వెళ్లే మార్గంలోనే కొండల్లో మేతకు వెళ్తాయి. ఆవులు, గేదెలకు కాపలాగా వెళ్లకపోయినా ఫర్వాలేదని వారంటున్నారు.

పశువులను వదిలేసిన తర్వాత, గుహలో ఉండేవారు వంట చేసుకోవడం, ఇతర రోజువారీ పనులు ప్రారంభిస్తారు. ఒకరు వంట వండితే, మరొకరు నీళ్లను పడుతుంటారు.

రాత్రిపూట, గుహలో చాలా చీకటి ఉంటుంది. పొయ్యి వెలుతురులోనే వంట చేస్తారు. వంటకు, తాగడానికి అవసరమైన నీటిని తేవడానికి రాత్రి పూట మహిళలు బయటకు వెళ్తారు.

''ఆరు నెలల పాటు ఇక్కడ నివసిస్తాం. ఆ తర్వాతనే ఇంటికెళ్తాం. ఇక్కడ రోజంతా శుభ్రపరుచుకుంటాం. రాత్రయ్యాక, దీపం వెలిగించి, పనిచేసుకుంటాం. ఉదయాన్నే లేచాక, ఆవుల పేడ ఎత్తి శుభ్రపరుస్తాం'' అని ఇక్కడ నివసించే వనిత మగదే బీబీసీతో చెప్పారు.

గుహలో రాత్రిపూట పనిచేసుకోవడం గురించి అడిగినప్పుడు, చీకట్లో పనిచేయడం తనకు అలవాటైపోయిందని వనిత చెప్పారు.

మట్టి పొయ్యి
ఫొటో క్యాప్షన్, గుహలో పొయ్యిపై వంట చేస్తోన్న మహిళ

గుహలో విద్యుత్ లేనప్పటికీ.. కిలోమీటర్ల దూరంలో ఉండే వాలే కుటుంబంలోని ఇంట్లో ఒక బల్బు వెలుగుతోంది. కేవలం ఈ కుటుంబం కోసమే కొండల్లోకి విద్యుత్ తీగలను వేశారు.

ఆరు నెలల తర్వాత మగదే, ముతే కుటుంబాలు గ్రామంలోని ఇళ్లకు వెళ్తాయి. కానీ, వాలే కుటుంబం మాత్రం ఇక్కడే ఉండిపోతుంది. ఈ గుహే వారికి శాశ్వత నివాసం. గుహ కిందనున్న కొండ ప్రాంతంలో వాలేకు పొలం ఉంది. పశువులతో పాటు వాలే కుటుంబం ఈ గుహలోనే ఏడాదంతా ఉంటుంది.

ఇక్కడ నివసించడం ప్రారంభించినప్పటి నుంచి,.. ఇక్కడే ధాన్యం నిల్వ చేసుకోవడం, పశువులను కట్టేయడం చేస్తున్నారు. చిరుత పులులు తిరుగుతుంటాయి కనుక కాస్త చుట్టూ పకడ్బందీగా ఏర్పాటు చేసిన స్థలం ఉండాలని వాలే చెప్పారు.

సమీప గ్రామంలో పుట్టి పెరిగిన సంగీత లక్ష్మణ్ వాలే.. తన వివాహం తరువాత ఇలా పూర్తిగా గుహలో నివసించాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదని చెప్పారు.

''నాకు గుహ గురించి తెలుసు. కానీ, ఇక్కడ కొందరు నివసిస్తున్నారని తెలియదు. పెళ్లి తరువాత నన్ను ఇక్కడకు తీసుకొచ్చినప్పుడు తెలిసింది. ఎంతో కాలంగా వారి కుటుంబం ఇక్కడ నివసిస్తోంది. ఇది వారి నాలుగో తరం'' అని సంగీత చెప్పారు.

మహిళ

అయితే, చీకట్లోనే నివసించే వీరందరి వద్ద మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వాటిని చార్జ్ చేసేందుకు గ్రామంలోని తమ ఇళ్లకు వెళ్లి వస్తుంటారు.

గ్రామంలో తమకు ఇళ్ల వద్ద పశువుల కోసం కొట్టాలు లేకపోవడంతో వర్షాకాలమంతా ఈ గుహలో ఉండడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు.

అయితే, ఈ కుటుంబాల్లోని తరం మాత్రం కొండ కిందనున్న గ్రామంలో నివసిస్తోంది. పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారు. కుటుంబంలోని ఒకరు పిల్లలతో పాటు గ్రామంలోని ఇంట్లో నివసిస్తుంటారు.

గుహలో ప్రజలు నివసిస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే ప్రభుత్వాధికారులు పరిగెత్తుకుని వచ్చారని గ్రామస్థులు చెప్పారు.

గుహకు సీనియర్ స్థాయి అధికారులు వచ్చినట్లు చెప్పారు.

దీని గురించి అహిల్యానగర్‌లోని ఫోఫ్సాండి గ్రామ సర్పంచ్‌ సురేశ్ వాలేను అడిగాం.

''వారికి మేం ఆశ్రయం ఇవ్వడం లేదని అధికారులు భావించారు. కానీ, అలా కాదు. వారికి ఇళ్లు ఉన్నాయి. వారి సమస్యేంటంటే.. పశువులు, వాటికి మేత లేకపోవడం'' అని తెలిపారు.

ఈ కుటుంబాలు తమ జీవితంలోని సగం సమయం గుహలోనే గడుపుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)