అక్బరుద్దీన్-రాజా సింగ్: ‘15 నిమిషాలు ఇవ్వమంటేనే భయపడ్డారు‘.. ‘15 ఏళ్లు ఇచ్చినా ఏమీ చేయలేవు’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Raja Singh, MIM
పదిహేను నిమిషాలు వదిలిపెడితే, హిందూ-ముస్లిం జనాభా నిష్పత్తిని సమానం చేస్తామని తాను చేసిన వ్యాఖ్యలకు ఆర్ఎస్ఎస్ ఇంకా భయపడుతోందని ఎంఐఎం పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
మజ్లిస్ పార్టీ ఓడినా పర్వాలేదని, బీజేపీ మాత్రం గెలవకూడదని అక్బరుద్దీన్ అన్నారు. మంగళవారం రాత్రి కరీంనగర్‌లో జరిగిన ఎంఐఎం వ్యవస్థాపకుడు అబ్దుల్ వాహెద్ ఒవైసీ సంస్మరణ సభలో ఈ మేరకు ప్రసంగించారు.
''గతంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్‌గా ముస్లిం ఉండేవారు. ఇప్పుడు బీజేపీ వ్యక్తి ఉన్నారు. ఎంఐఎంకు ఓటేయనందుకు బాధ లేదు. కానీ బీజేపీ గెలిస్తే సహించబోను. ముస్లింలు అంతా ఒక్కతాటిపై నిలబడి ముందుకు సాగితేనే మన లక్ష్యాన్ని సాధించగలం. ఎంత మంది గాడ్సేలు వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు'' అని అన్నారు.
''ఆరెస్సెస్ మనల్ని ముట్టుకోవడానికి కూడా సాహసించదు. ఎందుకంటే నేను ఆరోజు చేసిన వ్యాఖ్యలకు అది ఇంకా భయపడుతోంది. మనం భయపెడితే ఎదుటి వారు భయపడతారు. ఆరోజు నేను అలా అన్నందుకే ముస్లిం ప్రజల్లో ధైర్యం పెరిగింది'' అని వ్యాఖ్యలు చేశారు.
''నేనెప్పుడు చనిపోతానో తెలియదని డాక్టర్లు చెప్పారు. ఒక్క అక్బరుద్దీన్ చనిపోతే వెయ్యిమంది అక్బరుద్దీన్‌లు పుట్టుకు వస్తారు. నేను టైగర్‌ను కాదు. యువతను టైగర్లుగా మార్చాలనుకుంటున్నాను. అది నా లక్ష్యం'' అన్నారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
15 ఏళ్ల సమయం ఇచ్చినా అక్బరుద్దీన్ ఏమీ చేయలేరని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
''ఎదురుగా వస్తే సత్తా ఏంటో తేల్చుకుందాం. ఎక్కడో.. ఎప్పుడో.. చెప్పు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే గట్టిగా బుద్ధి చెబుతాం’’ అంటూ సవాల్ చేశారు.
‘‘మీరు 15 నిమిషాల గురించి గుర్తు చేస్తే.. మేము సెకన్ల గురించి మాట్లాడాల్సి వస్తుంది'' అని బండి సంజయ్ అన్నారు.
అక్బర్ తీరు 'కుక్కతోక వంకర' అన్న సామెతను గుర్తు చేస్తోందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ విమర్శించారు. అక్బర్ ప్రసంగం వీడియోను పరిశీలిస్తున్నామని, రెచ్చగొట్టే వ్యాఖ్యలుంటే కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త అసెంబ్లీ అవసరమా?
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మించాల్సిన అవసరం ఉందా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించినట్లు నవతెలంగాణ దినపత్రిక ఓ వార్త రాసింది.
ఎర్రమంజిల్ భవనం కూల్చివేత అంశంపై విచారణ సందర్భంగా కొత్తగా అసెంబ్లీ కాంప్లెక్స్ కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, అన్ని సదుపాయాలూ కలిగిన ప్రస్తుత అసెంబ్లీ ఎందుకు సరిపోదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
హుడా చట్ట నిబంధనల ప్రకారం ఎర్రమంజిల్ బిల్డింగ్ హెరిటేజ్ కాదని చెబుతున్న ప్రభుత్వం.. కూల్చివేయాలని నిర్ణయం తీసుకునే ముందు హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ నుంచి అనుమతి తీసుకుందా అని కోర్టు ఆరా తీసింది.
వాస్తవ పరిస్థితుల్ని కోర్టుకు విన్నవించడంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలు గురువారం నాడు జరిగే విచారణలో చెప్పాలని ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రస్తుత అసెంబ్లీ భవనాలకు అనేక సార్లు మరమ్మతులు జరిగాయని, వాహనాల పార్కింగ్‌కు యోగ్యంగా లేదని, అందుకే కొత్త భవనాన్ని కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇది విధాన నిర్ణయం కాబట్టి న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు ఆస్కారం లేదని, రిట్లన్నింటినీ కొట్టేయాలని కోరారు.

ఫొటో సోర్స్, facebook/YSJAGAN
మన పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు పెట్టేవారు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని మాత్రమే వారిని తాము కోరతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు సాక్షి దినపత్రిక ఓ కథనం రాసింది.
స్థానికులకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై శాసనసభలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా జగన్ ప్రసంగించారు.
పరిశ్రమలకు తమ ప్రభుత్వం అనుకూలమని వెల్లడించారు. ''రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తాం.. మన పిల్లలకే ఉద్యోగాలు ఇస్తాం'' అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని గర్వంగా చెబుతున్నానని ఆయన అన్నారు. 'మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి.. మా పిల్లలకు పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వండి' అని మాత్రమే తిరిగి కోరుతామని వెల్లడించారు.
ఈ చట్టం తేవడం వల్ల పారిశ్రామికీకరణ ఆగిపోతుందంటూ దుష్ప్రచారం జరుగుతోందని జగన్ వ్యాఖ్యానించారు.
''ఫ్యాక్టరీలు పెట్టేటప్పుడు స్థానిక ప్రజలను మభ్యపెడతారు. భూములు తీసుకుంటారు. ఆ తరువాత అక్కడ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు'' అని జగన్ అన్నారు.
''మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. డిగ్రీలు చేతికి వచ్చాక మన పిల్లలు ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లాల్సి వస్తోంది. అక్కడా ఉద్యోగాలు లేకపోతే దుబాయ్, కువైట్ పోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి పోవాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
పార్లమెంటు నియోజకవర్గానికో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి
ప్రభుత్వమే స్థానికులకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు అవసరమైన నిపుణులను అందిస్తుందని చెప్పారు.
''స్థానికులు అన్న అంశాన్ని ఈ బిల్లులో సరిగ్గా నిర్వచించాం. పరిశ్రమలు పెట్టేందుకు ఎక్కడైతే భూములు తీసుకుంటారో ఆ భూములకు సంబంధించిన వారిని మొదటి ప్రాధాన్యత కింద స్థానికులు అని చెప్పాం. అక్కడ పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం కలిగిన మానవవనరులు దొరక్కపోతే 'స్థానికత' పరిధి మరింత పెరిగి మండల స్థాయికి చేరుతుంది. అక్కడా దొరక్కపోతే జిల్లా స్థాయికి పెరుగుతుంది. అక్కడా దొరక్కపోతే రాష్ట్ర స్థాయికి పెరుగుతుంది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/TDP.OFFICIAL
పోలవరంపై విషం కక్కుతున్నారు.. అమరావతిని చంపేశారు
పోలవరం ప్రాజెక్టుపై అధికార పక్షం విషం కక్కుతోందని, పోలవరం ప్రాజెక్టు జాప్యానికి, నిర్మాణ వ్యయం పెరగడానికీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్వాకమే కారణమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లు ఈనాడు దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
రాష్ట్రానికి బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి అమరావతిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చంపేసిందని, అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపిందని చంద్రబాబు విమర్శించారు.
శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారని, ముగ్గురు తెదేపా నేతలపై విధించిన సస్పెన్షన్‌ను బేషరతుగా తొలగించాలని, మిగతా నాలుగు రోజులు సభను హుందాగా నడపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
గతంలో సింహాద్రిపురం ఎస్‌ఐని జగన్ కొట్టినట్లు ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యలు చేసిన ఓ వీడియో క్లిప్‌ను చంద్రబాబు ప్రదర్శించారు.
హరగోపాల్ చెప్పినదానికీ, ఇప్పుడు శాసనసభలో జగన్ ప్రవర్తనకూ సరిపోలుతోందని చంద్రబాబు అన్నారు.
''గోదావరి పుష్కరాల్లో జరిగిన దుర్ఘటనలో 29 మంది చనిపోతే, మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా పుష్కరాల్లో మీ తండ్రి విజయవాడకు వచ్చినప్పుడు ఐదుగురు చనిపోయారు. వాళ్లను ఆయనే చంపారని అంగీకరిస్తారా?'' అని జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు.
వైఎస్ చేసిన పనికి పోలవరంలో రూ.2,550 కోట్లు అదనంగా ఖర్చయిందని, ఆయన్న ప్రాసిక్యూట్ చేస్తారా అని ప్రశ్నించారు.
రైతులకు ఏటా రూ.12,500 ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక కేంద్రం ఇస్తున్న రూ.6 వేలకు, తాము మరో రూ.6,500 కలిపి ఇస్తామని జగన్ చెబుతున్నారని .. ఇలా మాట మార్చడం ద్వారా రైతులకు రూ.20 వేల కోట్ల మేర అధికారపక్షం టోకరా వేసిందని చంద్రబాబు విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
- ఇంగ్లండ్: ప్రపంచకప్ గెలిచిన పిచ్‌పై 85 పరుగులకు ఆలౌట్
- చంద్రయాన్-2 భూకక్ష్యలోకి చేరింది.. దీనివల్ల భారత్‌కు ఏం లభిస్తుంది?
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- కర్ణాటక అసెంబ్లీ: ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ.. కుమారస్వామి రాజీనామాను ఆమోదించిన గవర్నర్
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








