కర్ణాటక అసెంబ్లీ: ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ.. కుమారస్వామి రాజీనామాను ఆమోదించిన గవర్నర్

ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వ విశ్వాస తీర్మానంపై చర్చ ముగిసింది. ఓటింగ్ జరిగింది.
స్పీకర్ రమేశ్ ఓటింగ్ నిర్వహించారు. స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవాన్ని కాపాడేందుకుగాను తాను ఓటింగ్‌లో పాల్గొనడం లేదని రమేశ్ వెల్లడించారు.
ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు ఎవరెవరు.. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఉన్న వారు ఎవరు? అని స్పీకర్ ఒక్కో వరుసలో ఉన్న ఎమ్మెల్యేలను అడిగారు.
అసెంబ్లీ అధికారులు ఒక్కో వరుస వద్దకు వెళ్లి.. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారిని వేరుగా, వ్యతిరేకంగా ఉన్నవారిని వేరుగా లెక్కించారు.
విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు లభించాయని స్పీకర్ ప్రకటించారు.
దీంతో ఆరు ఓట్ల తేడాతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది.
అనంతరం ఇరు పార్టీల నాయకులు గవర్నర్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు.
కుమారస్వామి తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారు.

ఫొటో సోర్స్, Govt of Karnataka
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘సుస్థిర, సమర్థ ప్రభుత్వాన్ని అందిస్తాం’ - బీజేపీ
కాగా, ఓటింగ్ అనంతరం బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ‘ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. బీజేపీ జిందాబాద్’ అంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నినాదాలు చేశారు.
బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ సైతం రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును ఉద్దేశిస్తూ ట్వీట్ చేసింది.
‘‘ఇది కర్ణాటక ప్రజల విజయం. ఇది అవినీతి, అపవిత్ర కూటమి పాలనకు అంతం. కర్ణాటక ప్రజలకు సుస్థిరమైన, సమర్థ ప్రభుత్వాన్ని అందిస్తామని మేం హామీ ఇస్తున్నాం. అందరం కలసి కర్ణాటకను మళ్లీ సుభిక్షం చేద్దాం’’ అని ఈ ట్వీట్‌లో బీజేపీ పేర్కొంది.
‘యడ్యూరప్ప సీఎం కావడం ఖాయం’ - బీజేపీ ఎమ్మెల్యేలు
అసెంబ్లీలో ఓటింగ్ అనంతరం పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి అవసరమైన బలం లేదని, ఈరోజు అది తేలిందని అన్నారు. కుమారస్వామిది రెండు పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వమని, తమది ఒక పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ప్రభుత్వమని వారు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం తమకు ఉందని, తాము సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వారు చెప్పారు.
ఓటింగ్ పూర్తయిన నేపథ్యంలోను, తమ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్న నేపథ్యంలోనూ.. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నరే తమను ఆహ్వానించాలని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పారు. మంగళవారం రాత్రి తాము సమావేశం అవుతామని, తదుపరి కార్యాచరణపై ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
‘ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసేందుకు సిద్ధం’ - కుమారస్వామి
నాలుగు రోజులపాటు జరిగిన ఈ బల నిరూపణ చర్చకు మంగళవారం సాయంత్రం కుమారస్వామి సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ (ముఖ్యమంత్రి) పదవిని సంతోషంగా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పారు.
విశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్‌ను మరింత కాలం పాటు పొడిగించే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. అలాగే స్పీకర్‌కు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
తాను ఎందుకు రాజీనామా చేయనిది, ఎందుకు ముఖ్యమంత్రిగా కొనసాగుతోంది కూడా ఆయన వివరణ ఇచ్చారు.
2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించానని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
బల నిరూపణకు కావాల్సిన బలం 103 ఎమ్మెల్యేలు
కుమారస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. ఈ చర్చ ముగిసిన వెంటనే ఓటింగ్ జరుగుతుంది. రెబల్ ఎమ్మెల్యేలు గైర్హాజరైన ఈ ఓటింగ్‌లో నెగ్గాలంటే జనతాదళ్ (సెక్యులర్), కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి కనీసం 103 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్, జేడీఎస్ కూటమి తరపు నుంచి 101 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ పార్టీ తరపు నుంచి 105 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని పలు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
‘ఎమ్మెల్యేలను ‘హోల్‌సేల్’గా కొనుగోలు చేసిన బీజేపీ’ - సిద్ధరామయ్య ఆరోపణ
కాగా, ఈ విశ్వాస తీర్మానం చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఎమ్మెల్యేలను ‘హోల్‌సేల్’గా కొనుగోలు చేసిందని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రపై ఇదొక మాయనిమచ్చ అని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర వెనుక ఉన్నది బీజేపీయే అన్న సంగతి 99 శాతం మంది ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.
కాంగ్రెస్ జారీ చేసిన విప్‌కు విలువ లేదు - యడ్యూరప్ప
అంతకు ముందు బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలకు జారీ చేసిన విప్‌కు ఎలాంటి విలువ లేదని చెప్పారు.
‘‘(రెబల్) ఎమ్మెల్యేలకు విప్ నుంచి సుప్రీంకోర్టు మినహాయింపు ఇప్పింది. వాళ్లు అసెంబ్లీకి తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేదు. మీరు అంగీకరించినా, అంగీకరించకపోయినా మీరు జారీ చేసిన విప్‌కు విలువ లేదు’’ అని యడ్యూరప్ప చెప్పారు.
ఈ అంశంపై కొద్దిసేపు బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య సభలో వాదోపవాదాలు జరిగాయి.
ఇవి కూడా చదవండి:
- కర్ణాటక సంక్షోభం: క్లైమాక్స్‌లో ఎవరి పాత్ర ఏమిటి?
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- బోరిస్ జాన్సన్: బ్రిటన్‌కు కొత్త ప్రధానమంత్రి
- కర్ణాటక సంక్షోభం: కుమార స్వామి ప్రభుత్వం కూలుతుందా.. కొనసాగుతుందా
- కర్ణాటక రాజకీయ సంక్షోభం.. సుప్రీం తీర్పు: కుమారస్వామి ప్రభుత్వం పడిపోతుందా?
- కర్నాటక సంక్షోభం: బలపరీక్షకు సిద్ధమైన సీఎం కుమారస్వామి... రిసార్టుల్లో రెబల్ ఎమ్మెల్యేలు
- కర్ణాటక సంక్షోభం: కాంగ్రెస్, బీజేపీల వ్యూహాలేంటి? ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









