వైఎస్ జగన్ క్యాబినెట్: ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి

ఫొటో సోర్స్, facebook/PushpaSreevani
- రచయిత, శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రివర్గం ఈరోజు కొలువుదీరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి తన క్యాబినెట్‌లో ఏకంగా ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఒకే సమయంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు క్యాబినెట్‌లో ఉండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
7వ తేదీ శుక్రవారం జరిగిన శాసనసభాపక్షం సమావేశంలోనే ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఈ రోజు డిప్యూటీ సీఎంలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గానికి చెందిన ఐదుగురికి అవకాశం కల్పించారు.
ఏపీ డిప్యూటీ సీఎంలు వీరే..
ఆళ్ల నాని, నారాయణ స్వామి, పుష్ప శ్రీవాణి, పిల్లి సుభాశ్ చంద్ర, అంజద్ బాషాలు డిప్యూటీ సీఎంలుగా వ్యవహరించనున్నారు.

పిల్లి సభాష్ చంద్రబోస్
డిప్యూటీ సీఎంలలో అందరికంటే రాజకీయాల్లో సీనియర్ పిల్లి సుభాష్ చంద్రబోస్. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను ఈయనకు కేటాయించారు.
పిల్లి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం హసన్ బాద్ . వయసు 67 సంవత్సరాలు, బీఎస్సీ వరకు చదివారు. ఆది నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు.
1989లో రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు. 1994,1999లో ఓటమి పాలయినప్పటికీ 2004, 2009లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిచారు.
2012 ఉప ఎన్నికలు, 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూనే 2019 ఎన్నికల్లో మండపేట నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
తనకు అధిష్టానం అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని చెప్పి గతంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన నేతగా జగన్‌కు సన్నిహితుడయ్యారు.

ఫొటో సోర్స్, NANI/FB
ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)
పూర్తి పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి విజయం సాధించారు.
49 ఏళ్ల నాని కాపు సామాజికవర్గంలో గుర్తింపు ఉన్న నేతగా ఎదిగారు. బీకాం వరకు చదివారు.
తొలుత కాంగ్రెస్ లోనూ, ఆ తర్వాత జగన్ వెంట వైసీపీలో కొనసాగుతున్నారు.
2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముందు నుంచీ జగన్ వెంట ఉన్నారు.
2014 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత ఆయనను వైసీపీ ఎమ్మెల్సీగా చేసింది.
ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నారు. ఈయనకు వైద్య, ఆరోగ్య శాఖ కేటాయంచారు.

షేక్ అంజాద్ బాషా
కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలిచారు. బీఏ వరకూ చదివిన బాషా వయసు 47 ఏళ్లు.
మైనార్టీ కోటాలో ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కినట్టుగా చెబుతున్నారు. వివాదాలకు దూరంగా ఉంటారనే పేరుంది. డిప్యూటీ సీఎంతో సహా మైనాటరీ వ్యవహారాలను చూసుకోనున్నారు.
2004లో తొలిసారి కడప కార్పొరేటర్‌గా బాషా రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2014, 2019 ఎన్నికల్లో కడప అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు.
ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అమీర్ బాబుపై 54,794 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

పాముల పుష్పశ్రీవాణి
పాముల పుష్ప శ్రీవాణి వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా అవకాశం పొందారు. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి బీఎడ్ చేసిన ఈ మాజీ టీచర్ విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా రెండో సారి గెలిచారు. జియ్యమ్మ వలస మండలంలోని చినమేరంగి కోటలో నివాసం ఉంటున్నారు. ఉపాధ్యాయ వృత్తిని వీడి భర్త ప్రోత్సాహంతో రాజకీయ ఆరంగేట్రం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి రాజకీయంగా రాణిస్తూ ఈసారి ఎస్టీ మహిళా కోటాలో మంత్రిపదవిని ఆశించి, పొందారు.
2014 ఎన్నికల్లో 27 ఏళ్ల వయసులో శ్రీవాణి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ తరుపున బరిలో దిగి 19,083 ఓట్ల తేడాతో గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి విజయకేతనం ఎగురవేశారు. ఈసారి 26,602 ఓట్ల ఆధిక్యతను సాధించారు. జగన్ ఈమెకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు.

ఫొటో సోర్స్, AP CMO/FB
కళత్తూరు నారాయణ స్వామి
చిత్తూరు జిల్లా పుత్తూరు నివాసి. వయసు 70ఏళ్లు. ప్రస్తుతం క్యాబినెట్ లో వయసు రీత్యా పెద్దవారు. బీఎస్సీ వరకు చదువుకున్నారు. 2004 ఎన్నికల్లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణస్వామి 2014, 2019 ఎన్నికల్లో గంగాధనెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వుడు సీటు. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, పెద్దిరెడ్డి అనుచరుడుగా ఉన్నారు. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా పేరుంది.వైసీపీ ఏర్పాటు తర్వాత ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ శాఖను ఈయనకు కేటాయించారు.
ఇవి కూడా చదవండి:
- నాసా: అంతరిక్ష కేంద్రం సందర్శించేందుకు పర్యాటకులను అనుమతి.. ఒక రాత్రికి రూ.24 లక్షలు
- జగన్ క్యాబినెట్: సుచరితకు హోం శాఖ.. 25 మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు ఇవీ
- అభిప్రాయం: ఇది విలీనం కాదు టోకు ఫిరాయింపు
- ఎడిటర్స్ కామెంట్: ఇంటర్మీడియట్ పిల్లల చావులకు బాధ్యులెవరు?
- ‘100 మందిని చంపేసి నదిలో పడేశారు’.. సూడాన్ నరమేధం
- ఈవిడ షాపింగ్ బిల్లు రూ.140 కోట్లు..
- రాజ్‌నాథ్ సింగ్ బీజేపీకి కొత్త చిక్కుముడిలా మారారా: అభిప్రాయం
- షోరూంలో వస్తువులు కొని, క్యారీ బ్యాగ్ కోసం డబ్బులిస్తున్నారా, ఇకపై ఇవ్వొద్దు
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- మహేంద్ర సింగ్ ధోని ఆ కీపింగ్ గ్లవ్స్ వాడకూడదన్న ఐసీసీ.. అవే కొనసాగిస్తాడన్న బీసీసీఐ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








