బాల్ ఠాక్రే ఓటుహక్కు కోల్పోవడానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా: BBC Fact Check

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రశాంత్ చాహల్
- హోదా, బీబీసీ ఫ్యాక్ట్ చెక్
శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకు కాంగ్రెస్ పార్టీ ఓటు హక్కు లేకుండా చేసిందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలోని లాతూర్‌లో నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ... "కాంగ్రెస్ నాయకులు తమ ముఖాలను అద్దంలో చూసుకోవాలని అడుగుతున్నాను. మీరు బాల్ ఠాక్రే పౌరసత్వాన్ని తొలగించారు. ఆయన ఓటు హక్కును లాగేసుకున్నారు. మానవ హక్కుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు దేశంలోని ప్రతి బిడ్డకూ సమాధానం చెప్పాల్సి ఉంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Twitter
బాల్ ఠాక్రే కుమారుడు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలోనే ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తున్నట్లు బీజేపీ, శివసేన ఫిబ్రవరి 18న ప్రకటించాయి.
మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు గాను శివసేన 23, బీజేపీ 25 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, బాల్ ఠాక్రే విషయంలో మోదీ చేసిన వ్యాఖ్యల్లో పూర్తి వాస్తవం లేదని మా పరిశీలనలో తేలింది.
ఎన్నికల్లో పోటీ చేయకుండా లేదా ఓటు హక్కు వినియోగించుకోకుండా బాల్ ఠాక్రే మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ నిషేధం విధించలేదు.
బాల్ ఠాక్రే కేసును అప్పట్లో రాష్ట్రపతిగా ఉన్న కేఆర్ నారాయణ్ భారత ఎన్నికల సంఘానికి బదిలీ చేశారు. ఆ తర్వాత ఎన్నికల సంఘమే ఠాక్రేకు శిక్షను నిర్ణయించింది.
ఆయనకు 1995 నుంచి 2001 వరకు ఓటు హక్కు లేకుండా తొలగించారు. అది "ఆయన పౌరసత్వాన్ని లాగేసుకోవడమే" అని న్యాయ నిపుణులు అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
అప్పుడేం జరిగింది?
అది 31 ఏళ్ల నాటి కేసు. 1987లో మహారాష్ట్రలోని విలే పార్లే నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 13న పోలింగ్ జరగ్గా, 14న ఫలితాలు వెల్లడయ్యాయి.
ఆ ఎన్నికల్లో శివసేన మద్దతుదారుడైన స్వతంత్ర అభ్యర్థి యశ్వంత్ ప్రభు గెలుపొందారు.
అంతకుముందు ఆ స్థానం కాంగ్రెస్ ఖాతాలో ఉండేది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఆ ఎన్నికల ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి బాంబే హైకోర్టుకు వెళ్లారు. బాల్ ఠాక్రేతో పాటు, యశ్వంత్ ప్రభూలు ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రకటనలతో ఓటర్లను ప్రభావితం చేశారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఆ కేసును విచారించిన బాంబే హైకోర్టు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని నిబంధనల ప్రకారం, యశ్వంత్ ప్రభు, బాల్ ఠాక్రేలను దోషులుగా పేర్కొంటూ 1989 ఏప్రిల్ 7న తీర్పు ఇచ్చింది.
ఆ ఉప ఎన్నిక ఫలితాలను కూడా కోర్టు రద్దు చేసింది.
బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, సుప్రీం కోర్టు కూడా బాంబే హైకోర్టు తీర్పును సమర్థించింది.
"మేము హిందువులను రక్షించుకునేందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ముస్లింల ఓట్ల గురించి మేము పట్టించుకోం. ఈ దేశం హిందువులది, ఎప్పటికీ అలాగే ఉంటుందంటూ 1987 నవంబర్ 29, డిసెంబర్ 9, 10 తేదీల్లో బాల్ ఠాక్రే, యశ్వంత్ ప్రభులు ప్రసంగించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి చట్టవ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి, వారిద్దరూ దోషులే" అని జస్టిస్ జగ్దీష్ శరణ్ వర్మ తన తీర్పులో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్రపతి ఎన్నికల సంఘం సాయం కోరారు.
"బాల్ ఠాక్రే కేసును అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న కేఆర్ నారాయణ్ భారత ఎన్నికల కమిషన్‌కు పంపించారు. తర్వాత ఠాక్రేతో పాటు, యశ్వంత్ ప్రభుల మీద చర్యలపై ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంది" అని హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయం ఉపకులపతి, న్యాయ నిపుణులు ఫైజాన్ ముస్తఫా బీబీసీతో చెప్పారు.
"ఇలాంటి కేసుల్లో ఆరేళ్లపాటు ఓటు హక్కు లేకుండా చేయడమే అతిపెద్ద శిక్ష" అని మాజీ ఎన్నికల కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Eci
వాజ్‌పేయీ ప్రభుత్వం హయాంలో
బాల్ ఠాక్రే కేసుకు సంబంధించి 1998 సెప్టెంబర్ 22న రాష్ట్రపతి కార్యాలయానికి ఎన్నికల సంఘం రాతపూర్వకంగా కొన్ని సూచనలను పంపింది.
"ఆరేళ్లపాటు (11-12-1995 నుంచి 10-12-2001 వరకు) బాల్ ఠాక్రేకు ఓటు హక్కు కల్పించొద్దు" అని అప్పటి ఈసీ డాక్టర్ మనోహర్ సింగ్ గిల్ పేర్కొన్నారు.
బాల్ ఠాక్రే మీద నిషేధాన్ని 1999 జూలైలో రాష్ట్రపతి నారాయణ్ అమలు చేశారు. అప్పుడు కేంద్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
సీనియర్ జర్నలిస్టు, శివసేన రాజకీయ ప్రయాణంపై పుస్తకం రాసిన ప్రభాకర్ అకోల్కర్ బీబీసీతో మాట్లాడుతూ... "తనకు ఓటు హక్కు లేకుండా చేయడాన్ని అప్పుడు బాల్ ఠాక్రే ఖండించారు. కానీ, దానికి కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ ఆయన ఎన్నడూ నిందించలేదు" అని చెప్పారు.
ఆ నిషేధం కారణంగా 1999లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బాల్ ఠాక్రే ఓటు వేయలేకపోయారు. నిషేధం ఎత్తివేసిన తర్వాత 2004లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వద్దు.. బ్యాలెట్ విధానమే అనుసరించాలి’
- ‘హైదరాబాద్ మెట్రో‘ లిఫ్ట్‌లో దృశ్యాలు వైరల్: ముద్దూ ముచ్చట అసాంఘికమా
- మహిళల్లో సున్తీ (ఖత్నా) అంటే ఏమిటి... ఐక్యరాజ్య సమితి దీన్ని ఎందుకు నిషేధించాలంటోంది... #EndFGM
- ఆ అమ్మాయిలిద్దరూ ప్రేమించుకున్నారు... పెళ్ళి చేసుకున్నారు
- లైంగిక వేధింపులు: చట్ట ప్రకారం ఫిర్యాదు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా?
- ఆక్స్ఫర్డ్.. కేంబ్రిడ్జ్.. స్టాన్ఫర్డ్ల్లో ఉచితంగా చదవాలనుందా!
- ప్రపంచం మెరుగవుతోంది... ఇవిగో రుజువులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









