కంప్యూటర్లపై కేంద్రం నిఘా: మోదీ ప్రభుత్వం దర్యాప్తు ఏజన్సీలతో నిఘా పెడుతోందా? ఇందులో నిజమెంత?

ఫొటో సోర్స్, Getty Images
మీరు, మేము మనమంతా పనిచేస్తున్న కంప్యూటర్లపై కేంద్రం నిజంగానే కన్నేసి ఉంచబోతోందా?
అందులో మనం ఏ డేటా భద్రపరుస్తున్నామో, మన ఆన్‌లైన్ కార్యకలాపాలు ఏమిటో, మనకు ఎవరెవరితో సంబంధాలున్నాయో అన్నిటిపైనా నిఘా పెట్టబోతోందా?
కంప్యూటర్లలో డేటాపై నిఘా పెట్టాలని, వాటిని సేకరించేందుకు, దర్యాప్తు జరిపేందుకు దేశంలోని నిఘా ఏజెన్సీలకు హక్కులు కల్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో సామాన్యుడి మనసులో కూడా ఇలాంటి ప్రశ్నలే పుట్టుకొస్తున్నాయి.
కేంద్ర హోంశాఖ శుక్రవారం (20.12.2018) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పది ఏజెన్సీలకు ఈ హక్కులు అందించింది.
మొదట్లో పెద్ద నేరాలు జరిగినప్పుడు మాత్రమే ఆ కేసుల్లో కంప్యూటర్ లేదా ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా పెట్టేవారు. దర్యాప్తు చేసేవారు. వాటిని సీజ్ చేసేవారు.

సామాన్యులు కూడా కొత్త ఆదేశాల కిందికి వస్తారా?
సోషల్ మీడియాలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అది తమ గోప్యత హక్కులో జోక్యం చేసుకున్నట్లేనని చాలా మంది భావిస్తున్నారు.
అప్రకటిత అత్యవసర స్థితి అమలవుతోందా?
విపక్షాలు కూడా దీనిపై ప్రశ్నలు లేవెనెత్తుతున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలో అప్రకటిత అత్యవసర స్థితి అమలైందని అన్నారు.
ఇటు ప్రభుత్వం మాత్రం ఏజెన్సీలకు ఈ హక్కు మొదట్నుంచీ ఉన్నదే అని చెబుతోంది. వాటిని తాము మళ్లీ జారీ చేశామని మాత్రమే చెప్పింది.
రాజ్యసభలో విపక్షాల ఆరోపణలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రభుత్వం సమాధానం ఇచ్చారు. ప్రతిపక్షాలు సామాన్యులను గందరగోళంలో పడేస్తున్నాయని అన్నారు.
"ఐటీ యాక్ట్ సెక్షన్ 69 కింద ఎవరైనా తమ భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే, అది దేశ భద్రతకు, సమగ్రతకు సవాలుగా నిలిస్తే ఈ హక్కు ద్వారా ఏజెన్సీలు వారిపై దర్యాప్తు చేయవచ్చు" అని జైట్లీ తెలిపారు.
"2009లో యూపీఏ ప్రభుత్వం ఏయే ఏజెన్సీలకు కంప్యూటర్లపై నిఘా పెట్టే హక్కులు ఉంటాయో నిర్ణయించింది. ఎప్పటికప్పుడు ఆ ఏజెన్సీల జాబితా ప్రచురించేవారు. ప్రతిసారీ దాదాపు అవే ఏజెన్సీలు ఉండేవి" అని జైట్లీ చెప్పారు.
"దేశ భద్రతకు సవాలు విసిరేవారు, తీవ్రవాద కార్యకలాపాలలో ప్రమేయం ఉన్నవారి కంప్యూటర్ల పైనే ఈ నిఘా ఉంటుంది. సామాన్యుల కంప్యూటర్లు, డేటాపై ఎలాంటి నిఘా ఉండదు"

ఫొటో సోర్స్, Getty Images
కొత్తగా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరమేంటి?
మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఇదే ప్రశ్నతో మోదీ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టింది.
"మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయంతో రాజకీయంగా షాక్‌కు గురైన బీజేపీ ఇప్పుడు ప్రతి ఇంట్లో వ్యక్తిగత సంభాషణలు వినాలని అనుకుంటోందని" కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయవీర్ షేర్‌గిల్ ఆరోపించారు.
"ఐటీ యాక్ట్ సెక్షన్ 69 ప్రకారం "ఏ ఏజెన్సీ దర్యాప్తు చేస్తుంది, ఆ ఆదేశాలు ఎప్పుడు ఇవ్వాలి, అనేదంతా ఆయా కేసుల ఆధారంగా ఉంటుంది. అవేవీ లేకుండానే ప్రభుత్వం ఈ హక్కులు ఇవ్వకూడదు"
"యూపీఏ ప్రభుత్వం 2009లో ఇలాంటి ఆదేశాలు ఇచ్చినపుడు, ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ వాటిని కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఏముందని" జయవీర్ షేర్‌గిల్ ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరగడంతో బీజేపీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో దీనిపై స్పష్టత ఇచ్చింది. సామాన్యులను ఈ నిఘా నుంచి బయట ఉంచుతామని చెప్పింది.
ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దర్యాప్తు ఆదేశాలు ఇస్తారని, ఎవరి కంప్యూటర్ పైనైనా నిఘా పెట్టే ముందు హోం మంత్రిత్వశాఖ నుంచి దానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది.

ఫొటో సోర్స్, Twitter
ఐటీ యాక్ట్ 2000 అంటే ఏంటి?
భారత ప్రభుత్వం ఐటీ యాక్ట్ చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను 2000 జూన్ 9న ప్రచురించింది. ఈ చట్టంలోని సెక్షన్ 69 ప్రకారం ఎవరైనా జాతీయ భద్రతకు సవాలుగా మారితే, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే, ఏజెన్సీలు వారి కంప్యూటర్లు, డేటాపై నిఘా పెట్టవచ్చు అని పేర్కొంది.
చట్టంలో సబ్ సెక్షన్-1లో నిఘా హక్కు ఏ ఏజెన్సీలకు ఇవ్వాలి అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు.
ఇక సబ్ సెక్షన్-2లో ఏదైనా హక్కులు పొందిన ఏజెన్సీ భద్రతకు సంబంధించిన అంశాల విషయంలో ఎవరినైనా పిలిస్తే, వారు ఆ ఏజెన్సీలకు సహకరించాలని, అన్ని వివరాలూ సమర్పించాలని తెలిపింది.
సబ్ సెక్షన్-3లో పిలిపించిన వ్యక్తి ఏజెన్సీలకు సహకరించకపోతే, అతడిని శిక్ష విధించవచ్చని పేర్కొంది. అందులో ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించే నిబంధన కూడా ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఏయే ఏజెన్సీలకు హక్కులు అందించారు
శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం 10 భద్రత, నిఘా ఏజెన్సీలకు కంప్యూటర్, ఐటీ పరికరాలపై నిఘా పెట్టే హక్కులు అందించారు.
ఆ ఏజెన్సీల్లో...
- ఇంటెలిజెన్స్ బ్యూరో
- నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
- ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
- సెంట్రల్ బోర్ట్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్
- డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్
- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
- నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
- క్యాబినెట్ సెక్రటేరియట్(రా)
- డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్
- కమిషనర్ ఆఫ్ పోలీస్, దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో నిఘా చరిత్ర
టెక్నాలజీ ద్వారా నేర కార్యకలాపాలకు పాల్పడకుండా సుమారు వందేళ్ల క్రితమే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ రూపొందించారు.
ఈ యాక్ట్ ప్రకారం భద్రతా ఏజెన్సీలు ఆ సమయంలో టెలిఫోన్‌లో జరిగే సంభాషణలను ట్యాప్ చేసేది.
అనుమానితుల సంభాషణలపైన మాత్రమే భద్రతా ఏజెన్సీలు నిఘా పెట్టేవి
ఆ తర్వాత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత, కంప్యూటర్ వాడకం పెరిగింది. కంప్యూటర్ ద్వారా నేర కార్యకలాపాలకు పాల్పడకుండా 2000లో భారత పార్లమెంట్ ఐటీ చట్టం ఆమోదించింది.
ఇవి కూడా చదవండి
- పౌడర్ రాసుకుంటే క్యాన్సర్ వస్తుందా?
- కోడి పందేలు: వ్యాపారంగా, ఉపాధి మార్గంగా కోడి పుంజుల పెంపకం
- జీరోగా మారినా.. జీవితం అంతమైపోదు: షారుఖ్ ఖాన్
- భారత్లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ
- మధుమేహం అంటే ఏమిటి? రాకుండా జాగ్రత్తపడడం ఎలా?
- నెహ్రూ కాలర్ పట్టుకుని నిలదీసిన మహిళ
- జాతీయవాదం పేరిట వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
- యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్... వీటి భవిష్యత్తు ఏమిటి?
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- డిజిటల్ ఇండియాపై మోదీ మాటల్లో వ్యత్యాసం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








