‘హెచ్‌ఐవీ ఉన్నా ఉద్యోగం నుంచి తొలగించలేరని కోర్టు చెప్పింది’

హెచ్‌ఐవీ, వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అనఘా పాఠక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''నేను 15 ఏళ్ల నుంచి ఒంటరిపోరాటం చేస్తున్నాను. నేను హెచ్‌ఐవీతో పోరాడుతున్నాను. నేను హెచ్‌ఐవీ పాజిటివ్ అన్న విషయం దాచి పెట్టడానికి పోరాడుతున్నాను. ఈ పోరాటంలో నేను చాలాసార్లు ఓడిపోయాను. అయితే... హెచ్‌ఐవీ పాజిటివ్ అని నన్ను ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీపై న్యాయపోరాటంలో విజయం సాధించడం వల్ల కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను'' అని రజనీ (గోప్యత కోసం పేరు ) అన్నారు.

నాతో ఫోన్‌లో మాట్లాడుతుంటే ఆమె ఆనందం స్పష్టంగా తెలుస్తోంది. తనకు వస్తున్న గుర్తింపు, ప్రశంసలు ఆమెకు ఇంతకు మునుపెన్నడూ అనుభవంలోకి రాలేదు. ఇంతవరకూ తనను జనం చెత్తను చూసినట్లే చూడడమే ఆమెకు అనుభవం.

35 ఏళ్ల రజనీ పుణెలో ఉంటున్నారు. ఆమె మూడేళ్లుగా తన ఉద్యోగం కోసం పోరాడుతున్నారు.

డిసెంబర్ 3న లేబర్ కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడమే కాకుండా, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించిన కాలానికి జీతం చెల్లించాలని ఆదేశించింది.

#హర్‌చాయిస్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని ఓ చిన్న గ్రామానికి చెందిన రజనీకి చిన్న వయసులోనే వివాహమైంది. ఆమెకు 22 ఏళ్ల వయసు ఉన్నపుడు ఆమె భర్త హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌తో మరణించారు.

''2004లో నా భర్తకు హెచ్‌ఐవీ-ఎయిడ్స్ ఉందని తెలిసింది. ఆయనను బతికించుకోవడానికి నేను చేయగలిగిందంతా చేశాను. కానీ బతికించుకోలేకపోయాను. 2006లో తను మరణించాడు. నా భర్త మరణించిన మూడు రోజులకే నా అత్తావారింటి వాళ్లు నేను వాళ్ల ఇంటిలో ఉండడానికి వీల్లేదన్నారు.''

తన తండ్రిదండ్రులు కూడా సహాయం చేసే స్థితిలో లేకపోవడంతో ఆమె జీవించడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు.

''పుణెలో ఏదో పని దొరికితే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎవరి పనుల్లో వారుంటారని, మన గురించి పెద్దగా పట్టించుకోరని నాకు అర్థమైంది. దాంతో అక్కడో కొత్త జీవితం ప్రారంభించాలని భావించాను. పుణె వచ్చాక నాకు కొంచెం ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగింది.'' అని రజనీ అన్నారు.

రజనీ తొందరగానే ఉద్యోగంలో కుదురుకున్నారు.

గ్రామంలో ఉండగానే ఆమె అప్పుడప్పుడూ జబ్బు పడేవారు. పుణెకు వచ్చాక వైద్య పరీక్షలు చేయించుకోవడంతో ఆమెకు హెచ్‌ఐవీ ప్లస్ అని వెల్లడైంది.

''దాంతో నా జీవితం మరోసారి అల్లకల్లోలమైంది. అది నన్ను మానసికంగా, భౌతికంగా కుంగదీసింది. పుణెలో ఓ కొత్త జీవితం ప్రారంభించాలన్న నా కలలు కల్లలయ్యాయి.''

హెచ్ఐవీ/ఎయిడ్స్

ఫొటో సోర్స్, Science Photo Library

నేను చచ్చిపోయినా ఏడ్చేవాళ్లు లేరు

ఆమె తల్లిదండ్రులు కూడా సంబంధాలు తెంచుకోవడంతో ఆమె ఒంటరి అయ్యారు.

జీవితంలో ఒకోసారి ఎంత లోతుకి పడిపోతామంటే ఇక అంతకన్నా కిందకు పడడం సాధ్యం కాదు. జీవితంతో పోరాడ్డమే మనం చేయగలిగింది. రజనీ విషయంలో సరిగ్గా అదే జరిగింది.

''నాకెవరూ లేరని అర్థమైంది. నేను చచ్చిపోయినా నా కోసం ఏడ్చేవాళ్లెవరూ లేరు. అందువల్ల నేను కూడదీసుకున్నాను. నేను తీసుకునే ఆహారం గురించి, నా వైద్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించాను.'' అని రజనీ వివరించారు.

తను పని చేసే ఫార్మాస్యూటికల్ కంపెనీలో బాగా పని చేయడంతో ఆమెను పర్మనెంట్ చేశారు. అక్కడ ఆమె ఎనిమిదేళ్లు పని చేశారు. కానీ ఒక్కసారి తనకు హెచ్‌ఐవీ ఉందని తెలియగానే తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని ఆమె తెలిపారు.

హెచ్‌ఐవీ-ఎయిడ్స్

ఫొటో సోర్స్, Getty Images

వాస్తవానికి జరిగిందేమిటి?

ఒకసారి రజనీ జబ్బుపడి ఆసుపత్రిలో చేరారు. బాగయ్యాక ఆమె మెడిక్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

''అలాగయితే వైద్యం ఖర్చులన్నీ కంపెనీనే చూసుకుంటుదని నేను విన్నాను. కానీ ఒక్కసారి నాకు హెచ్‌ఐవీ ఉందని తెలీగానే నన్ను ఉద్యోగం లోంచి తీసేశారు. అదీ 30 నిమిషాల్లో.''

''అది ఒక ఫార్మా కంపెనీ కాబట్టి మా ఉత్పత్తులకు కూడా అది అంటుకునే అవకాశం ఉందని మా కంపెనీ యాజమాన్యం చెప్పింది. నేను అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నానని, అలాంటిదేమీ జరిగే అవకాశం లేదని నేను వాళ్లకు చెప్పాను. నన్ను తీసేయవద్దని వాళ్లను ప్రాధేయపడ్డాను. నాకు ఉద్యోగం చాలా అవసరం ఉందని వేడుకున్నాను. కానీ కంపెనీ వినలేదు,'' అని ఆమె తెలిపారు.

మరోసారి రజనీ నిస్సహాయ స్థితిలో పడిపోయారు. కానీ ఆమె తన పోరాటస్ఫూర్తిని మాత్రం కోల్పోలేదు. కొందరు ఆమెకు ఆర్థికసాయం చేస్తామంటూ ముందుకు వచ్చినా ఆమె దానికి నిరాకరించారు. ఎవరికైనా హెచ్‌ఐవీ ఉన్నా, వాళ్లను ఉద్యోగం నుంచి తొలగించడానికి వీల్లేదని ఆమె తన సోదరుని ద్వారా తెలుసుకున్నారు. దాంతో ఆమె పుణె లేబర్ కోర్టులో తన కంపెనీపై కేసు వేశారు.

''నేను ఎప్పుడు ఒక కొత్త జీవితం ప్రారంభించాలని భావించినా, ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేవి. దీంతో ఏమైనా కానీ, నేను వాటితో చివరివరకు పోరాడాలని నిర్ణయించుకున్నాను. ఒకోసారి ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా పారిపోవాలనిపించేది. కానీ నన్ను నేను నిలువరించుకునేదాన్ని.'' అని రజనీ తెలిపారు.

ఎట్టకేలకు పుణె లేబర్ కోర్టు రజనీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. తీర్పులో, 'చట్టప్రకారం ఏ ఉద్యోగిని కానీ హెచ్‌ఐవీ పాజిటివ్ అన్న కారణంతో ఉద్యోగం నుంచి తొలగించడానికి వీల్లేదు. కంపెనీ దీనిని ఉల్లంఘించింది' అని పేర్కొంది.

మామూలు క్యాప్సూల్‌లాగే ఉండే వారానికో-పిల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మామూలు క్యాప్సూల్‌లాగే ఉండే వారానికో-పిల్

నేను నా మొహం దాచుకోవాల్సిన పరిస్థితి రాకూడదు

తీర్పు వచ్చినప్పుటి నుంచి రజనీకి ఆగకుండా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీడియా ప్రతినిధులు ఆమె ప్రతిస్పందన ఏమిటని అడుగుతున్నారు. ప్రజలు ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు.

కానీ మూడేళ్ల క్రితం ఆమెను తీసేసిన కంపెనీకి ఆమె తిరిగి వెళ్లాలనుకుంటున్నారా?

''అవును. నేను అక్కడే పని చేస్తా. ఇన్నాళ్లూ నేను నాకు హెచ్‌ఐవీ ఉందన్న విషయం దాచి పెట్టాలనుకున్నా. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అందువల్ల ఇప్పుడు దాన్ని దాచిపెట్టాలన్న వత్తిడి నాపై లేదు. నా గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటారన్న భయం లేదు. కేసు గెలిచినపుడు మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతుంటే నేను ముఖం దాచుకుని సమాధానాలు ఇచ్చా. కానీ అలా చేయకుండా ఉండాల్సింది అని నాకనిపిస్తోంది.'' అని రజనీ అన్నారు.

హెచ్‌ఐవీ-ఎయిడ్స్ ఉన్న మహిళలే పురుషులకన్నా ఎక్కువ కష్టాలు ఎదుర్కొంటారని రజనీ అంటారు.

''నేను ప్రతి నెలా మందులు తీసుకోవడానికి వెళ్లినపుడు అక్కడ అందరూ నన్ను గుచ్చే చూపులతో చూస్తారు. మహిళలకు హెచ్‌ఐవీ-ఎయిడ్స్ చాలావరకు వాళ్ల భర్తల ద్వారానే సంక్రమిస్తుంది. భర్తలు మరణిస్తే, భర్త తరపు బంధువులు వాళ్లను ఇళ్ల నుంచి గెంటేస్తారు. వాళ్ల తల్లిదండ్రుల సహకారం కూడా వాళ్లకు లభించదు.'' అన్నారు రజనీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)