'డబ్బు పరిహారంతో గాయం మానదు' - నంబి నారాయణన్

డాక్టర్ నంబి నారాయణన్

ఫొటో సోర్స్, Imran Qureshi/BBC

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇస్రో గూఢచర్యం కేసులో తప్పుడు ఆరోపణలు చేసి అరెస్ట్ చేయటం వల్ల తాను అనుభవించిన ‘బాధ’.. డబ్బు పరిహారంతో తీరిపోయేది కాదని, 50 లక్షలు కాదు.. ‘ఐదు కోట్ల రూపాయలైనా ఆ గాయం మానిపోద’ని ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ నంబి నారాయణ్ పేర్కొన్నారు.

గూఢచర్యం కేసులో ఆయనను అకారణంగా మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ. 50 లక్షలు పరిహారం చెల్లించాలంటూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దేశాన్ని, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను కుదిపేసిన ఈ కేసు నమోదైన 24 ఏళ్ల తర్వాత.. నాడు నారాయణన్ అరెస్టు చేయటం ‘‘అనవసరం’’ అని వ్యాఖ్యానించింది.

ఆ కుట్రకు బాధ్యులైన అధికారులను గుర్తించటం కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డి.కె. జైన్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ న్యాయస్థానం ఆదేశించింది.

గూఢచర్యం కేసులో డాక్టర్ నారాయణన్‌ను నిర్దోషిగా 1998లో సుప్రీంకోర్టు విడుదల చేసింది. అయితే ఆ కేసులో ఆయనను, మరో ఆరుగురిని ఇరికించి అరెస్ట్ చేసిన కేరళ పోలీసులపై చర్యలు చేపట్టటానికి హైకోర్టు తిరస్కరించింది. దీనిపై డాక్టర్ నారాయణన్ సుప్రీంకోర్టు తలుపుతట్టారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

తప్పుడు కేసు ఎందుకు బనాయించారో తెలియదు

‘‘ఆ తప్పుడు కేసును ఎలా బనాయించారో నాకు తెలుసు. కానీ ఎందుకు బనాయించారో తెలియదు. వాళ్లు ముందు నేరస్థుడిని ఎంచుకున్నారు. నేరాన్ని రచించారు. ఆ తర్వాత సాక్ష్యాలను పుట్టించారు. ఎందుకలా చేశారో నాకు తెలియదు. దానికి నా దగ్గర సమాధానం లేదు’’ అని డాక్టర్ నారాయణన్ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

1994లో డాక్టర్ నారాయణన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేయటం వల్ల, రాకెట్లలో ఉపయోగించే క్రయోజనిక్ ఇంజన్లను దేశీయంగా అభివృద్ధి చేసే ప్రక్రియ రెండు దశాబ్దాల కాలం వెనుకబడిందన్నది అంతరిక్ష శాస్త్రవేత్తలకు బాగా తెలిసిన విషయం.

‘‘డాక్టర్ నారాయణన్ ఇండియాలో అత్యధిక పీడనంతో కూడిన ఇంజన్‌ను తక్కువ కాలంలో అభివృద్ధి చేశారు. (పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్లకు అది చాలా కీలకమైన ఇంజన్.) ఆయన సామర్థ్యం, ఆయన అందించిన సేవలను అది చాటుతుంది’’ అని ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ మాధవన్ నాయర్ బీబీసీకి తెలిపారు.

నారాయణన్‌‌తో పాటు మరో శాస్త్రవేత్త, మాల్దీవులకు చెందిన ఇద్దరు మహిళలు, బెంగళూరుకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలను.. గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇస్రో రాకెట్ ఇంజన్లకు సంబంధించిన డ్రాయింగ్‌ల‌ను ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు విక్రయిస్తున్నారని, సాంకేతిక పరిజ్ఞాన్ని ఇతర దేశాలకు అందిస్తున్నారని ఆరోపణలు చేశారు.

ఇస్రో రాకెట్

ఫొటో సోర్స్, Getty Images

ఆ డ్రాయింగ్‌లు.. ఆ కాలానికి ఇండియాలో ఇంకా తయారు చేయని క్రయోజనిక్ ఇంజన్లకు సంబంధించినవని ఆ తర్వాత వెల్లడైంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈ కేసు దర్యాప్తును చేపట్టిన తర్వాత మాత్రమే.. డాక్టర్ నారాయణన్‌కు తనపై ఆరోపణలు ఏమిటన్నది తెలిసింది. డాక్టర్ నారాయణన్ చెప్తున్న విషయంలో వాస్తవముందని సీబీఐ నిర్ధారణకు వచ్చింది.

కానీ, దానికన్నా ముందు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయనను ప్రశ్నించింది. ఒక అదికారి అయితే కోర్టులో నారాయణన్ ఈ కేసు గెలిస్తే ‘‘నన్ను చెప్పుతో కొట్టు’’ అని కూడా అన్నారు.

మరి మీరు ఆయనను చెప్పుతో కొడతారా? అంటే, ‘‘అవును... (ఆయన ఆ మాట అన్నారు). నేను నా చెప్పు పట్టుకుని వేచిచూస్తున్నా. కానీ ఆయన కనిపించటం లేదు’’ అని నారాయణన్ బదులిచ్చారు.

పోలీసులు విచారణ పేరుతో డాక్టర్ నారాయణన్ మీద థర్డ్ డిగ్రీ పద్ధతులు కూడా ప్రయోగించారు. ‘‘అది మాట్లాడుకోవలసినంత ఆసక్తికరమైన విషయం కాదు. దానితో నిమిత్తంలేదు. నన్ను అమానవీయంగా హింసించారు. అది ఎవరు చేశారనేది తెలిస్తే. మీ ప్రశ్నకు విలువ ఉంటుంది. వాళ్లు గుర్తుతెలియని మనుషులు’’ అని ఆయన అన్నారు.

డాక్టర్ నంబి నారాయణన్

ఫొటో సోర్స్, Imran Qureshi/BBC

నిర్దోషిగా మళ్ళీ విధుల్లోకి...

1998లో ఈ కేసు నుంచి సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించిన తరువాత డాక్టర్ నారాయణన్ ఇస్రోలో మళ్లీ చేరారు. ‘‘కానీ నేను సాధికారికంగా పనిచేసే పరిస్థితిలో లేను. ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కానీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా కానీ పనిచేయాలంటే సాధికారికంగా ఉండాలి. కానీ ఈ చెడ్డ పేరు, అవమానాల కారణంగా, వాళ్లు నన్ను నాయకుడిగా అంగీకరిస్తారా లేదా అన్నది నాకు తెలియదు. కానీ, ప్రాజెక్టును పాడు చేయకూడదన్నదే నా అభిమతం’’ అని ఆయన వివరించారు.

‘‘అందుకని.. నాకు ఎగ్జిక్యూటివ్ విధులు కాకుండా డెస్క్‌లో విధులు ఇవ్వాలని అడిగాను. డెస్క్ జాబ్ అయితే.. ఎవరినీ కలవాల్సిన అవసరం ఉండదు. నేను కుంగిపోలేదు. కానీ మరో దారి లేదు. ఉద్యోగంలో కొనసాగటమా లేక రాజీనామా చేసి కనిపించకుండా పోవటమా? అంతే. నేను తప్పుచేయలేదని నిరూపించుకోవటం, నా గౌరవాన్ని పునరుద్ధరించుకోవడం... ఇవే నా ముందున్న సమస్యలు. అందుకు 24 ఏళ్లు పట్టింది’’ అన్నారు డాక్టర్ నారాయణన్.

డాక్టర్ నంబి నారాయణన్

ఫొటో సోర్స్, Imran Qureshi/BBC

మరి... మీ గౌరవం తిరిగివచ్చిందా?

‘‘వచ్చిందని నేను అనుకుంటున్నా. అయినా మీ ప్రశ్న విలువైనదే. గౌరవం పునరుద్ధరణ అయిందా లేదా అన్నది మనకు తెలియదు. ఎందుకంటే.. దేశ అత్యున్నత న్యాయస్థానం.. ‘నిన్ను అక్రమంగా నిర్బంధించార’ని చెప్పడం, నాకు పరిహారం ఇస్తుండడం.. దర్యాప్తు కమిషన్‌ను కూడా నియమించడం... వీటన్నింటి అర్థం ఏమిటి? ఇవన్నీ ఉపచారాలు మాత్రమే. అయినా ఇంతకు మించి ఇంకేమీ లభించదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, ‘మీ మీద ఈ కేసు పెట్టకుండా ఉన్నట్లయితే.. క్రయోజనిక్ ఇంజన్‌ను దేశీయంగా తయారుచేయగలిగేవారా?’ అని అడిగినపుడు, ‘‘తప్పకుండా, అది చాలా కాలం కిందటే రెడీ అయ్యుండేది’’ అని డాక్టర్ నారాయణన్ బదులిచ్చారు.

‘‘కాకపోతే, ఏదైనా జరగని విషయాన్ని.. జరిగి ఉండేదా లేదా అనేది నిరూపించలేం. ఏదేమైనా నేను చాలా కాలం కిందటే ఏదైనా చేసుండేవాడిని. కానీ, మొత్తం నిర్మాణాన్ని కదిలించేశారు. పేల్చేశారు. అది చాలా మందిని కుంగదీసింది. ఫలితంగా ఆలస్యమైంది’’ అని ఆయన చెప్పారు.

‘‘ఆయన అందుబాటులో ఉన్నట్లయితే క్రయోజనిక్ ఇంజన్‌ను దేశీయంగా అభివృద్ధి చేయటం కొన్నేళ్లు వేగంగా జరిగివుండేద’’ని డాక్టర్ నాయర్ కూడా నమ్ముతున్నారు. ‘‘ఆయనను తీవ్ర మనోవేదనకు గురిచేశారు. దానికన్నా ఎక్కువగా ఆయన తన కెరీర్ కోల్పోయారు. భారతదేశపు ఈ గొప్ప శాస్త్రవేత్తకు కోర్టు సరైన పరిహారం అందించింది’’ అని నాయర్ అభిప్రాయపడ్డారు.

మరి నారాయణన్ గాయం తాలూకు బాధ..? ‘‘అవును.. అదలాగే ఉంటుంది.’’

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)