కొండగట్టు ప్రమాదం BBC Ground Report: ‘ఆ కడుపులో కవలలు లోకం చూడకుండానే కన్నుమూశారు’

రోదిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు

తెలంగాణలోని కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం.. ‘‘ఓ ఊరినే వల్లకాడుగా మార్చింది.’’ కొన్ని కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచేసింది. బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని ప్రమాద బాధితుల గ్రామాలకు వెళ్లి పరిశీలించారు. బుధవారం శనివారంపేట, డబ్బు తిమ్మయ పాలెం, హిమ్మత్‌రావుపేట, రాం సాగర్, కొండగట్టులకు వెళ్లారు. ప్రత్యక్ష సాక్షులు, బాధిత కుటుంబాలతో మాట్లాడారు.

అక్కడి పరిస్థితులపై అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది.

"కొన్ని గంటల్లోనే నా జీవితం మారిపోయింది. ఆసుపత్రికి ఏమేం తీసుకెళ్లాలనేది మాట్లాడుకున్నాం. నా భార్యను బస్టాప్ వరకూ వదలిపెట్టడానికి తీసుకెళ్లా. నవ్వుతూ చేయూపింది. అదే చివరిసారి ఆమె నన్ను పలకరించడం"... ఐసు దిమ్మపై ఉంచిన తన భార్య, తల్లి మృతదేహాల వంక చూపిస్తూ ఏడుస్తూ చెప్పారు సురేశ్. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యే వరకూ మృతదేహాలు పాడవకుండా ఐసు దిమ్మెలపై వాటిని ఉంచి, ఐసు కరిగిపోకుండా ఊకతో కప్పెట్టారు.

శనివారంపేటకు చెందిన సురేశ్ రోజుకూలీగా పనిచేస్తాడు. కరీంనగర్ ఆసుపత్రిలో డెలివరీ కోసం అతడి భార్య సుమలత బయలుదేరింది. వాళ్లకు కవలలు పుట్టబోతున్నారని సురేశ్‌తో డాక్టర్ అప్పటికే చెప్పారు. కానీ మార్గ మధ్యలోనే సుమలత చనిపోయింది. లోకం చూడకుండానే ఆ కవలలు కన్నుమూస్తారని సురేశ్ ఊహించలేదు.

సురేశ్ ఇంటికి కొద్ది దూరంలోనే మరో ఇంట్లో హర్ష వర్ధన్ అనే మూడేళ్ల బాబు చనిపోయాడు. హర్ష తన తల్లి లక్ష్మితో కలిసి శనివారంపేట దగ్గర బస్సెక్కాడు. హర్షకు జ్వరంగా ఉండడంతో తల్లి జగిత్యాల ఆసుపత్రికి బయల్దేరారు. ప్రమాదంలో లక్ష్మికి పక్కటెముకలు విరిగిపోయాయి. కాలు విరిగింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి.

గ్రామంలోని చాలా ఇళ్ల ముందు ఇలాంటి టెంట్లు కనిపించాయి
ఫొటో క్యాప్షన్, గ్రామంలోని పరిస్థితికి ఈ టెంట్లు అద్దం పడుతున్నాయి

ప్రమాదం కారణంగా జగిత్యాల జిల్లాలోని ఐదు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మంగళవారం నాడు జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 58 మంది చనిపోగా, 20 మందికి గాయాలయ్యాయి. కొందరు తల్లిదండ్రులను, ఇంకొందరు పిల్లలను పోగొట్టుకున్నారు.

"మా చెల్లిని చూడ్డానికి మా అమ్మ వెళ్లింది. జగిత్యాలలో స్నేహితుడిని కలవడానికి నాన్న వెళ్లాడు. వాళ్లు సాయంత్రం జగిత్యాలలో కలుసుకుని తిరిగి రాత్రి భోజన సమయానికి ఇంటికి చేరుకోవాలనుకున్నారు. కానీ వాళ్లను నేను వెళ్లొద్దన్నాను. చివరికి ఇప్పుడు వాళ్లు అంబులెన్సులో ఇంటికి వచ్చారు" అని చెప్పారు డబ్బుతిమ్మయ్యపల్లికి చెందిన రాజు.

ఈ గ్రామాల్లో ఎటు చూసినా రోదనలు, అంబులెన్సుల శబ్దాలే వినిపిస్తున్నాయి. "రాత్రికిరాత్రే మా ఊరు వల్లకాడుగా మారింది" అన్నారు హిమ్మత్‌రావు పేటకు చెందిన వెంకాయమ్మ. ఆమె భర్తను (చిన్నయ్య) కోల్పోయిన తన చెల్లెలిని ఓదారుస్తోంది. చిన్నయ్య, అతని కజిన్ రాజవ్వలు ఇద్దరూ బస్సెక్కారు. జ్వరంతో బాధపడుతుండడంతో వారు ఆసుపత్రికి వెళుతున్నారు. బస్సు ప్రమాదంలో ఇద్దరూ చనిపోయారు.

‘ఆ బస్సు ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా పడిపోతుందని నేనూ మా ఫ్రెండ్స్ అనుకునే వాళ్లం’ అని చెప్పారు చిన్నయ్య మనవరాలు, ఆశా వర్కరుగా పనిచేస్తోన్న లత. ‘‘ఆ బస్సులో ఎప్పుడూ జనం ఎక్కువగా ఉంటారు. ఘాట్ రోడ్ మీదుగా మళ్లింపు మాకెప్పుడు భయం కలిగించేది. ఆ దారిలో వెళ్లొద్దంటూ మాలో కొంతమంది డ్రైవర్‌కు చెబుతూనే ఉండేవాళ్లం. ఇప్పుడేం జరిగిందో చూడండి" అని బాధపడుతూ చెప్పింది లత.

జగిత్యాల డిపో లెక్కల ప్రకారం బస్సులో వంద మంది ఉన్నారు.

సురేశ్ భార్యతో పాటు ఆమె కడుపులోని కవల పిల్లలు కూడా చనిపోయారు
ఫొటో క్యాప్షన్, సురేశ్ భార్యతో పాటు ఆమె కడుపులోని కవల పిల్లలు కూడా చనిపోయారు

ప్రమాదానికి గురైన బస్సు జగిత్యాల, శనివారంపేటల మధ్య రోజూ తిరుగుతుంది. ఈ బస్సు ఈ రూట్లో రోజుకు నాలుగు ట్రిప్పులు వేస్తుందని జగిత్యాల ఆర్టీసి డివిజినల్ మేనేజర్ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి తెలిపారు.

జగిత్యాల బస్ డిపో నుంచి నాచుపల్లి, డబ్బుతిమ్మయ్యపల్లి, రాంసాగర్, హిమ్మత్‌రావు పేట, శనివారంపేట, తిరుమలపూర్ మీదుగా ఈ బస్సు వెళ్తుంది. తిరిగి వచ్చేప్పుడు మాత్రం రాంసాగర్ నుంచి బస్సును దారి మళ్లిస్తున్నారు. దాంతో కొండగట్టు దగ్గర ఘాట్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి వస్తోంది.

"ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాకే మేం దారి మళ్లిస్తున్నాం. కొండగట్టు గుడికి వెళ్లాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ చిన్న దారి మళ్లింపు సర్వీసుకు లాభాలు తెస్తుందని భావించాం. దారి మళ్లింపు మొదలైంది 20 రోజుల క్రితమే" అన్నారు డీవీఎం.

లక్ష్మి మూడేళ్ల కొడుకు హర్ష చనిపోయాడు. ఆమెకు పక్కటెముకలు విరిగాయి.
ఫొటో క్యాప్షన్, లక్ష్మి మూడేళ్ల కొడుకు హర్ష చనిపోయాడు. ఆమెకు పక్కటెముకలు విరిగాయి.

ఘాట్ రోడ్ చివర పూజా సామాగ్రి అమ్మే దుకాణాలున్నాయి. ఘాట్ రోడ్డు చివరి మలుపు దగ్గర ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి 200 మీటర్ల దూరంలో కొండగట్టు బస్టాప్ ఉంది.

రోడ్డు చివర శ్రీనివాస రావు అనే చిన్న వ్యాపారి ఉన్నారు. దివ్యాంగుడైన శ్రీనివాసరావు ప్రమాదాన్ని చూసిన వెంటనే ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ చేసినట్టు తెలిపారు. "నాకు పెద్ద చప్పుడు వినిపించింది. జనాల ఏడుపులు, అరుపులు వినిపించాయి. మా ఆవిడ, కొడుకు బస్సు దగ్గరకు పరుగెత్తుకెళ్లారు. నేను అంబులెన్సుకు ఫోన్ చేసి, అధికారులకు చెప్పాను. మా అబ్బాయి ఇంకొందరు బస్సు నుంచి జనాల్ని బయటకు లాగడం మొదలుపెట్టారు. మా అబ్బాయి అతని ఫ్రెండు కలిసి రక్తం కారుతున్న ఒక అమ్మాయిని ఎత్తుకొని పరుగెత్తారు. కానీ అంబులెన్సులో ఎక్కించేలోపే ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి కవల సోదరి బస్సులోనే చనిపోయింది’’ అని ప్రమాద పరిస్థితిని వివరించారు శ్రీనివాస్.

"దెబ్బలు తగిలిన వాళ్లకు మంచినీళ్లిచ్చాను. ఇలాంటివి చూడ్డం చాలా బాధాకరం. అంతా మా కళ్ల ముందే జరిగింది. నేను షాపులో కుర్చున్నాను. బస్సు పడిపోవడం చూశాను. జనాలు అరవడం నాకు వినిపించింది. అంతా నిమిషాల్లో జరిగిపోయింది" అని చెప్పారు మరో దుకాణదారు లక్ష్మి.

ప్రమాదానికి గురైన బస్సు

డబ్బుతిమ్మయ్యపల్లి, రాంసాగర్, శనివారంపేట గ్రామాల నుంచి చాలా మంది జ్వరాలతో బాధపడుతూ వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లడానికి ఈ బస్సు ఎక్కారు.

గాయపడ్డవారిలో జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 ఏళ్ల మణిదీప్ ఒకరు. ఆ బాబుకి తన తల్లి వరలక్ష్మి చనిపోయినట్టు తెలీదు. మణిదీప్, వాళ్ళ అమ్మతో కలిసి తన అమ్మమ్మను చూడ్డానికి వెళుతున్నాడని చెప్పారు ఆసుపత్రిలో మణిదీప్‌ను చూసుకుంటున్న అతని కజిన్ ప్రసన్న.

"అతను చాలా బాధలో ఉన్నాడు. అతనికి తల్లి చనిపోయిందని ఇంకా చెప్పలేదు. అమ్మ ఇంటి దగ్గర ఉందని చెబుతున్నాం. ఎంత కాలం నిజం దాయగలమో తెలీదు. కానీ, అతనికి నిజం చెప్పడానికి ధైర్యం సరిపోవడం లేదు" అన్నారు ప్రసన్న.

ఝార్ఖండ్‌కి చెందిన అమిత్ కుమార్ పది రోజుల క్రితమే జగిత్యాల వచ్చాడు. అతను బట్టలు అమ్ముతుంటాడు.

"నేను డబ్బు సంపాదించుకుందామని ఇక్కడకు వచ్చాను. కానీ ఇప్పుడు నా మణికట్టు విరిగిపోయింది. నేను డ్రైవర్ కంటే కొన్ని సీట్ల వెనకాల నిల్చున్నాను. బస్సులో చాలా జనం ఉన్నారు. ఏం జరుగుతుందో కనపడలేదు. కానీ ఒక్కసారిగా నన్ను డ్రైవర్ సీటువైపు తోశారు. జనం నాపై పడ్డారు. బస్సు వెళ్లి లోయలో పడిపోయింది. నేను బయటకు రావడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు. ఊపిరాడలేదు. కొంత మంది తల నుంచి రక్తం కారడం చూశాను. నాకు తెలిసి ఓ పావుగంట అలా ఉన్నాను. ఎవరో అద్దం పగలగొట్టి మమ్మల్ని బయటకు లాగారు" అంటూ గుర్తు చేసుకున్నాడు అమిత్.

గతంలోనూ ఆ రోడ్డులో ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు
ఫొటో క్యాప్షన్, గతంలోనూ ఆ రోడ్డులో ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు

ప్రమాదం జరిగిన చోట ధ్వంసమైన బస్సును చూడ్డానికి చాలా మంది జనం వస్తున్నారు.

చనిపోయిన వారి లెక్కలు రోడ్డు ప్రమాద గణాంకాల్లో ఒక అంకెగా మిగిలిపోకూడదని గ్రామస్థులు కోరుకుంటున్నారు. "ముఖ్యమంత్రి గారు డబ్బులు ప్రకటించారు. కానీ ఇక్కడ సర్వీస్ మారకపోతే డబ్బు వల్ల ఏం ఉపయోగం లేదు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మేమంతా చాలా వరకూ వ్యవసాయ కూలీలమే. జిల్లా కేంద్రానికి మమ్మల్ని చేరవేసేది ఈ బస్సే. ఆసుపత్రి, కాలేజీ, స్కూలు... అన్నింటికీ ఈ బస్సులో వెళతాం. బస్సు సర్వీసుల సంఖ్య పెంచి లాభం కంటే మా భద్రతకు ప్రాధాన్యం ఇస్తే తప్ప న్యాయం జరగదు" అన్నారు ప్రమాదంలో తన తల్లిని కోల్పోయిన హనుమంతు.

ఘటనా స్థలం నుంచి బీబీసీ తెలుగు ప్రతినిధి దీప్తి బత్తిని బుధవారం అందించిన ఫేస్‌బుక్ లైవ్‌ను కింద చూడొచ్చు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ఫొటోలు: నవీన్ కుమార్, బీబీసీ ప్రతినిధి

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)