#AadhaarFacts: పేదలకు ఆధార్ వరమా? శాపమా?

- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో దాదాపు 100 కోట్ల మందికి ఆధార్ ఉంది. నగదు లావాదేవీలకు కూడా దీన్ని తప్పనిసరి చేయడంతో ఆధార్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. పేదలకు అందాల్సిన పథకాలు, ప్రయోజనాలు వారికే చేరాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు చాలా వివాదాస్పదంగా మారుతోంది.
"మాకు నెలలో కనీసం ఓ వారం రోజులపాటు తినడానికి తిండి ఉండదు" - ఇది ఐదుగురు కుటుంబ సభ్యులున్న మునియా దేవి ఆవేదన.
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన ఝార్ఖండ్‌లోని ఓ మారుమూల గ్రామంలో ఈమె నివసిస్తున్నారు. భర్త భూషణ్ 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఇటుకల బట్టీలో పనిచేస్తారు. రోజంతా కష్టపడితే వచ్చేది కేవలం రూ.130.
పేదవాళ్లకు అందాల్సిన సబ్సిడీ, రేషన్ సరుకులు గత మూడేళ్లుగా వీరికి ఎన్నడూ సక్రమంగా అందలేదు. దీనికి కారణం గ్రామంలో రేషన్ దుకాణం లేకపోవడమో, లేదా అక్కడ సరుకులు లేకపోవడమో కాదు. వీరి రేషన్ కార్డులను బయోమెట్రిక్ ఆధారిత నంబర్లతో అనుసంధానించకపోవడమే.
ఇలాంటి బాధితులు ఝార్ఖండ్‌లో ఇంకా ఎందరో ఉన్నారని బీబీసీ అధ్యయనంలో తేలింది.

ఫొటో సోర్స్, AFP
మూడు నెలల క్రితం 35 కిలోమీటర్ల దూరంలోని ఆఫీసుకు వెళ్లి రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించడానికి అవసరమైన పేపర్లను అందజేశారు మునియాదేవి. అక్కడి అధికారులు రూ.400 లంచం తీసుకుంటే తప్ప ఆ పని చేసిపెట్టలేదు. రూ.400 అంటే వారి నాలుగు రోజుల సంపాదన.
"నెట్‌వర్క్ సరిగా లేదు, కంప్యూటర్ పనిచేయడం లేదు అంటూ వాళ్లు ఏవేవో కారణాలు చెప్తున్నారు. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సి వస్తోంది" అంటూ మునియా ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Ronny Sen
మునియా దేవి ఉండే విష్ణుబంధ్ గ్రామంలోని 282 కుటుంబాల్లో దాదాపు ఎవ్వరికీ వ్యవసాయ భూములు లేవు. వరి అన్నం, ఓ రెండు కూరలు దొరికిన రోజు వాళ్లకు పండుగే. కొన్ని రోజులు తినడానికి ఏమీ దొరకదు. ఆకలి నిరంతరం వాళ్లకు తోడుగా ఉంటుంది.
గడువులోగా రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించకపోవడంతో మొత్తం 350 మంది లబ్ధిదారుల్లో 60 మంది రేషన్‌ను నిలిపివేశారు.
వాళ్లంతా - తాము ఎన్నిసార్లు ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందో, అక్కడి సిబ్బందికి ఎలా లంచాలు ఇవ్వాల్సి వచ్చిందో కథలుగా వివరిస్తారు.
రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాల్సిందేనని ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త డాక్టర్ జీన్ ద్రెజ్ వాటిని - బలవంతపు, పేదల వ్యతిరేక చర్యలుగా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, dhiraj
'ఆకలి చావులు'
సెప్టెంబర్‌లో సిండెగా జిల్లాలో రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించకపోవడంతో ఒక కుటుంబానికి రేషన్ ఇవ్వలేదు. దీనివల్ల ఆ కుటుంబంలోని పదకొండేళ్ల బాలిక మరణించింది. ఆహారం లేకుండా ఉప్పు, టీతో ప్రాణాలు నిలుపుకొన్న సంతోషి కుమారి చివరికి ఆకలికి తాళలేక ప్రాణాలు కోల్పోయింది. అయితే ఒక సీనియర్ అధికారి మాత్రం ఆమెది ఆకలిచావే అనడానికి ఆధారాలు లేవన్నారు. కానీ అలాంటి ఆకలిచావులు అర డజను వరకు ఉన్నాయని డాక్టర్ ద్రెజ్ తెలిపారు.
"వాళ్లు ఆకలితో మరణించారా లేదా అన్నది మరో విషయం. వాస్తవం ఏమిటంటే, ఆధార్ సమస్య కారణంగా వాళ్ల ఇళ్లలో కొన్ని రోజుల పాటు ఆహారం లేదు" అన్నారు ఆయన.
గత మార్చిలో ఝార్ఖండ్‌లో సుమారు 7.6 లక్షల 'నకిలీ' రేషన్ కార్డులను రద్దు చేశారు. ఆధార్‌తో అనుసంధానించకపోవడంవల్లే వాటిలో చాలా కార్డులను రద్దు చేశారని డాక్టర్ ద్రెజ్ భావిస్తున్నారు. దీని వల్ల వేల మందికి తిండి లేకుండా పోయింది.
కేవలం రేషన్ కార్డులను ఆధార్‌తో అనుంసంధానించలేదన్న కారణంతో అర్హులైన వారికి సరుకులను ఇవ్వడానికి నిరాకరించకూడదు. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మాత్రం ఇదే.
''ఆధార్ లేనంత మాత్రాన ఆహార ధాన్యాలు ఇవ్వకుండా ఆపకూడదు. అయితే మా ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తాం'' అని ఝార్ఖండ్‌లో ఆహార ధాన్యాల సరఫరా ఇన్‌ఛార్జి అమితాబ్ కౌశల్ తెలిపారు.
అయితే ఒక సీనియర్ అధికారి ఇటీవల 'ఆధార్ లేకుండా రేషన్ ఇవ్వలేం' అని చెప్పారనడానికి తన వద్ద వీడియో సాక్ష్యాలు ఉన్నాయని డాక్టర్ ద్రెజ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Ronny Sen
'చాలా అరుదు'
ఇంటర్నెట్ తదితర సమస్యల కారణంగా వేలిముద్రలు తీసుకోవడం కష్టమై, లబ్ధిదారులను తిప్పి పంపేస్తున్నారు.
ఝార్ఖండ్‌లోని అనేకమంది పింఛనుదార్లు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో రూ.600-800 పింఛనుకు అర్హులైన సుమారు 12 లక్షల మంది వితంతువులు, వృద్ధులు, వికలాంగులు ఉన్నారు.
గత ఏడాది పింఛనులను ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరి చేసిన ప్రభుత్వం, సుమారు 3 లక్షల మంది నకిలీ పింఛనుదారులు ఉన్నారంటూ వారి పింఛన్లు రద్దు చేసింది.
అయితే ఈ ఆరోపణలను కౌశల్ తోసిపుచ్చారు.

ఫొటో సోర్స్, Ronny Sen
స్వతంత్ర పరిశోధకులు రిషభ్ మల్హోత్రా, అన్‌మోల్ సోమాంచి చేపట్టిన పరిశోధన ప్రకారం, రద్దు చేసిన పింఛన్లలో నకలీవి అతి తక్కువని తేలింది. ఆధార్‌తో అనుసంధానించలేదన్న నెపంతో అనేక మంది నిజమైన పింఛనుదారుల పింఛను కూడా నిలిపేశారు. కొన్ని చోట్ల డాటా ఆపరేటర్లు లబ్ధిదారుల పేరు, వయసులను తప్పుగా ఎంటర్ చేయడం వల్ల కూడా ఇది జరిగింది.
అలాంటి తప్పుల కారణంగా కొన్ని విషాద ఘటనలు, కొన్ని నవ్వొచ్చే ఘటనలు కూడా జరిగాయి. డాటా ఆపరేటర్ల తప్పు కారణంగా కొన్ని గ్రామాలకు చెందిన ప్రజలందరి జన్మదినాలు జనవరి 1గా నమోదు చేశారు.
సద్వాదిహ్ గ్రామానికి చెందిన జామా సింగ్ వయసు ఆధార్ కార్డులో 102 ఏళ్లు అని రావడంతో ఆయన్ను పింఛనుకు అనర్హునిగా తేల్చారు.
జామా సింగ్ బ్యాంకులో అకౌంట్ తెరవడానికి వెళ్లగా మూడంకెల వయసును ఎంటర్ చేయడానికి తమ సాఫ్ట్‌వేర్ అనుమతించదని తెలిపారు. తన వయసు 80 ఏళ్లని పేర్కొంటూ కొత్త ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకు అధికారులు ఆయనకు సలహా ఇచ్చారు.
''నా వయసెంతో నాకు కచ్చితంగా తెలీదు. కానీ నాకన్నా చిన్నవాళ్ళు కూడా పింఛన్ తీసుకుంటున్నారు. ఇదేం న్యాయం?'' అని జామా సింగ్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Ronny Sen
విష్ణుబంధ్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుంతిలో బ్యాంకు అకౌంట్లను ఆధార్‌తో అనుసంధానించడంలో పొరపాటు జరిగిందంటూ సుమారు 20 వేల మంది పింఛనుదారుల (వాళ్ళలో చాలా మంది మహిళలు) పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.
ఉదాహరణకు, బ్యాంక్ అకౌంటును ఆధార్‌తో అనుసంధానం చేయలేదన్న కారణంతో రాజ్‌కుమారి దేవి పింఛను గత అక్టోబర్‌లో నిలిపేశారు.
84 ఏళ్ల ఆ వృద్ధురాలు ఆ సమస్య పరిష్కారం కోసం సుమారు తన నెల పింఛను సొమ్మును ఖర్చు చేశారు. దాని వల్ల ఆమె వద్ద కేవలం 73 రూపాయలు మాత్రమే మిగిలాయి.
ఆమె బాగోగులు చూసుకుంటానని కుమారుడు అన్నపుడు, ఆమె దానికి అంగీకరించలేదు.
''నా డబ్బు నా డబ్బే. నేను ఎవరి దయ మీదా ఆధారపడి జీవించను'' అని ఆమె తోసిపుచ్చారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








