500 రూపాయలకే ఆధార్ డేటా లీక్.. ప్రభుత్వ వివరణ

ఫొటో సోర్స్, Getty Images
ఆధార్‌లోని ప్రజల వ్యక్తిగత వివరాలను అమ్మేస్తున్నారన్న వార్తలతో.. 'యు.ఐ.డి.ఏ.ఐ' అధికారులు స్పందించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఆధార్‌లో పొందుపరచిన ప్రజల వ్యక్తిగత వివరాలను రూ.500కు అమ్మేస్తున్నారని మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.
అయితే.. వ్యక్తిగత సమాచారానికి భంగం వాటిల్లదని చెబుతూనే.. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేయడానికి అధికారులు సమాయత్తమయ్యారు.
ప్రజల వ్యక్తిగత వివరాలను అందిస్తానంటూ వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తోన్న ఓ ఏజెంట్ ద్వారా.. ఓ వ్యక్తికి చెందిన ఆధార్ వివరాలను కొన్నామని 'ట్రిబ్యూన్' పత్రిక ఓ కథనాన్ని వెలువరించింది.
ఏజెంట్‌కు డబ్బిచ్చాక, ట్రిబ్యూన్ రిపోర్టర్లకు ఆ ఏజెంట్.. ఓ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇచ్చాడని.. ఆ పాస్‌వర్డ్ ద్వారా ఆధార్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యామని కథనంలో పేర్కొంది.
ఏజెంట్ ఇచ్చిన పాస్‌వర్డ్ ద్వారా ఫోన్ నంబర్, ఈ-మెయిల్, ఇంటి అడ్రస్, ఫోటో సహా ఎవరి వివరాలనైనా దొంగలించవచ్చని ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ఏజెంట్‌కు అదనంగా రూ.300 ఇస్తే.. ఆధార్ కార్డులను ప్రింట్ చేసే సాఫ్ట్‌వేర్‌ను కూడా తమకిచ్చాడని తెలిపింది.
ఆధార్ కార్డులోని పేర్లు, అడ్రస్‌ల నమోదులో దొర్లిన తప్పులను సరిదిద్దుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని కొందరు తప్పుదారిపట్టించినట్టు అధికారులు తెలిపారు.
అయినా, ఈ కార్యక్రమంలో.. ప్రజల వ్యక్తిగత వివరాలను తెలుసుకునే వీలు లేదని కూడా అధికారులు చెబుతున్నారు.
ఈ విషయమై సోషల్ మీడియాలో చాలా మంది స్పందించారు. వారి వ్యక్తిగత వివరాల గోప్యత పట్ల అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొదట్లో, ఆధార్ కార్డులో వివరాలు నమోదు చేసుకోవడం అన్నది పూర్తిగా ప్రజల ఇష్టమని చెప్పిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఆధార్‌ను తప్పనిసరి చేసింది.
అయితే, ఈ పథకం ద్వారా ప్రజల వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం పొంచి ఉందని విమర్శకులు గతంలోనే అభిప్రాయపడ్డారు.
కానీ, ఈ విషయంలో భయపడాల్సిందేమీ లేదని, వ్యక్తిగత వివరాలు సాంకేతిక లిపిలో తమ వద్ద భద్రంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతూ ఉంది.
ఒకవేళ ఎవరైనా వివరాలను బహిర్గతం చేస్తే.. వారికి జైలు శిక్ష తప్పదని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు.. ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు అకౌంట్లకు ఆధార్‌ను అనుసంధానించే అంశం సుప్రీం కోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








