'తెలంగాణ కాళేశ్వరానికి జాతీయ హోదాపై నిశితంగా అధ్యయనం చేసి ముందుకెళ్తాం' -మోదీ :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Sean Gallup/Getty Images
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయాన్ని నిశితంగా అధ్యయనం చేసి ముందుకెళ్తామని, తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి దృఢ సంకల్పంతో కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని ఈనాడు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో తామిచ్చిన వాగ్దానాలను పూర్తిగా నెరవేరుస్తామని, పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా సాయం అందిస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయమై ప్రశ్నించగా, తాము ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ వల్లే ఎక్కువ ప్రయోజనమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో అంగీకరించారని ప్రధాని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసమే గవర్నర్‌ను కొనసాగిస్తున్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా మోదీ చెప్పారు.
‘‘ఎన్నికల్లో గెలుపొందాలనే కాంగ్రెస్ హడావుడిగా విభజన ప్రక్రియ చేపట్టింది. అలాకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలను, పార్టీలను విశ్వాసంలోకి తీసుకొని అందరినీ ఒకచోట కూర్చోబెట్టి, ఒక్కో అంశంపై సంపూర్ణంగా చర్చించి ఉంటే ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ తరహాలోనే ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకెళ్లే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరికొకరు ఎదురుపడటానికి ఇష్టం లేని వాతావరణాన్ని సృష్టించారు. అధికారులు కూడా ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి ఉంది. ఇద్దరినీ కలిపి సమస్యలు పరిష్కరించాలని నేను ఎంతో ప్రయత్నం చేశాను. సమావేశాలు ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరించాలని గవర్నర్‌కూ పొడిగింపు (ఎక్స్‌టెన్షన్) ఇచ్చాం. ఒకవైపు రాజకీయ అజెండాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెళ్తున్నారు. అయినప్పటికీ ఏపీ, తెలంగాణల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కంకణబద్ధులమై ఉన్నాం. అక్కడి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ప్రజల హితం కోసం అన్ని చర్యలూ తీసుకుంటాం’’ అని ఆయన తెలిపారు.
దేశంలో గతంలో ప్రభుత్వం పట్ల ప్రజలకు కోపం ఉండేదని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సమానాభివృద్ధి జరుగుతోందని, ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ ఎన్నో పనులు జరుగుతున్నాయని తెలిపారు.
మైనారిటీల భద్రత విషయంలో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా తుదముట్టిస్తామన్నారు.
ఈ ఐదేళ్లలో యావద్దేశానికి తన శక్తి సామర్థ్యాలేంటో తెలిశాయని, ఈ సారి ఘనమైన విజయాన్ని సొంతం చేసుకుంటామని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వ విధానాల ఫలితంగా దేశాభివృద్ధి, ఉపాధి కల్పన జోరందుకున్నాయని చెప్పారు. ప్రజలు గుండెల మీద నిబ్బరంగా చేతులు వేసుకునేంత భరోసా కల్పించామన్నారు. దేశానికి సుదృఢ భద్రత కల్పించడంతో పాటు చివరి పంక్తిలో కూర్చున్న నిరుపేదకూ న్యాయం చేస్తామని తెలిపారు.
వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడి తననే బాధితుడిగా మార్చిన కొన్ని పార్టీలు ఇప్పుడు వ్యవస్థల భద్రతపై ఆందోళన వెలిబుచ్చడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్: నాలుగో విడత రుణమాఫీ నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నాలుగో విడత రుణమాఫీ సొమ్మును విడుదల చేసిందని, పది శాతం వడ్డీతో కలిపి రూ.3,900 కోట్లు అందించిందని, ఈ సొమ్మును ఆయా బ్యాంకుల అధికారులు రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మందికి ఈ విడతలో నేరుగా లబ్ధి చేకూరిందని చెప్పింది.
నాలుగో విడత సొమ్ము రైతుల ఖాతాలకు జమ చేయడం పూర్తికాగానే ఐదో విడత సొమ్మును కూడా ఈ ఖరీఫ్ సీజన్‌లోగా విడుదల చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వెల్లడించారు. ఏమైనా మే 23లోపే నాలుగు, అయిదు విడతల సొమ్ము రైతుల ఖాతాలకు చేరుతుందని స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
''రైతులంతా హడావుడిగా బ్యాంకుల వద్ద క్యూలు కట్టనవరం లేదు. ఉపశమన పత్రాన్ని ఉదయం నమోదు చేస్తే సాయంత్రానికి క్లియర్ అవుతుంది. ఆ తరువాత 48 గంటల్లో సొమ్ము ఖాతాలకు ఆన్‌లైన్‌లోనే జమవుతుంది. మాఫీకి అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాకు జమ అవుతుంది. ఈ విషయంలో ఎవరూ ఆదుర్దా పడాల్సిన పనిలేదు. రైతు ముందే రుణాన్ని చెల్లించి ఉంటే, రీపేమెంట్ చేస్తారు'' అని ఆయన వివరించారు.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలుత రూ.50 వేలు లోపు రుణాలున్న 23.76 లక్షల మంది రైతులకు ఏక మొత్తంగా ఊరట కలిగించారు. వారి అప్పులన్నీ రద్దు చేశారు. మిగిలిన 32 లక్షల మంది రైతులకు ఐదు విడతలుగా మాఫీ వర్తింపజేయాలని అప్పుడే ప్రకటించారు. వారికి రుణ ఉపశమన పత్రాలను జారీచేశారు. ఆ ప్రకారం 2018 ఆగస్టు నాటికే మూడు విడతల మాఫీ సొమ్ము రైతుల ఖాతాలకు జమ చేశారు. ఈ క్రమంలో సుమారు రెండు లక్షల మందిని రుణవిముక్తులను చేశారు.
మిగిలిన 30 లక్షల మందికి లబ్ధి చేకూర్చే క్రమంలో ఇప్పుడు 4వ విడత ఇచ్చేస్తున్నారు. 5వ విడత విడుదల పూర్తయితే మొత్తం రూ.24,500 కోట్ల వ్యవసాయ రుణాలను టీడీపీ ప్రభుత్వం మాఫీ చేసినట్లు అవుతుంది.
తెలంగాణ: ఏడు లక్షల మందికి వారంలో ‘రైతుబంధు’ నిధులు
తెలంగాణలో యాసంగి పంటలకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందని రైతులకు వారంలోగా పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని నమస్తే తెలంగాణ తెలిపింది.
తొలి విడతగా 2018 శాసనసభ ఎన్నికలకు ముందే దాదాపు 44 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించారు. మరో ఏడు లక్షల మందికి పంపిణీ చేయాల్సి ఉండగా, వివిధ కారణాలతో నిలిచిపోయింది. ఆ రైతులకు దాదాపు రూ.800 కోట్లను పంపిణీ చేసేందుకు కార్యాచరణ సిద్ధంచేస్తున్నారు. మార్చి 31తోనే యాసంగి కాలం ముగిసినా సాయం అందనివారిని దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, apagrisnet.gov
తెలంగాణలో ఐదెకరాలలోపు ఉన్న 14.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బు జమైంది. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులను 47 లక్షల మందిని గుర్తించగా, వీరిలో 26 లక్షల మంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హత సాధించారు. తెలంగాణలో ఇప్పటివరకు 14.41 లక్షల మందికి రూ.288 కోట్లను కేంద్రం విడుదల చేసింది.
మీ ఓటెంతో రహస్యం.. ఎవరికీ తెలియదు: ఏపీ సీఈవో ద్వివేది
వీవీప్యాట్‌లతో ఎవరికి ఓటు వేశారో తెలిసిపోతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది ఖండించారని సాక్షి తెలిపింది.
పోలింగ్ బూత్‌లో వేసిన ఓటు మరో వ్యక్తికి తెలిసే అవకాశమే ఉండదని, ఓటు వేసిన వారికి మాత్రమే వీవీప్యాట్‌లో ఎవరికి ఓటు వేశారన్నది ఏడు సెకన్లపాటు కనిపిస్తుందని, ఆ తర్వాత దీన్ని ఇక ఎవ్వరూ చూసే అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Twitter
‘‘మీరు ఎవరికి వోటు వేశారో మాకు తెలుస్తుంది’’ అంటూ ఎవరైనా ఓటర్లను బెదిరిస్తుంటే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా ద్వివేది సూచించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిన తర్వాత ఎన్నికలయ్యేంత వరకు నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండటానికి వీల్లేదన్నారు.
వికలాంగ ఓటరుకు సహాయకులుగా వచ్చినవారి విషయంలో ఎన్నికల నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని, పోలింగ్ సిబ్బంది వీటిని తప్పకుండా పాటించాలని సీఈవో తెలిపారు. ఒక సహాయకుడు ఒకరికి మాత్రమే సహాయంగా పోలింగ్ కేంద్రంలోకి రావడానికి అనుమతిస్తారని, ఇలా వచ్చిన సహాయకుడి కుడి చేతి వేలుకు ఇంకు మార్కు వేయాల్సి ఉంటుందని, దీనివల్ల అతను మరొకరికి సహాయకుడిగా రావడానికి వీలుండదని వివరించారు.
పోలింగ్ కేంద్రాల్లోకి కెమెరాలు, సెల్‌ఫోన్లు తీసుకెళ్లడానికి వీల్లేదని ఆయన చెప్పారు. ఓటరు ఓటు వేయడానికి వచ్చేసరికి అతని ఓటును వేరేవాళ్లు వేసి ఉంటే టెండర్ ఓటు ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, దీనికి సంబంధించిన పత్రాలు ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద ఉంటాయని, కానీ ఈ ఓటును ఓట్ల లెక్కింపులో పరిగణనలోకి తీసుకోరని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో పైచేయి ఎవరిది?
- లోక్‌సభ: పెరుగుతున్న బీజేపీ ప్రాబల్యం.. తగ్గుతున్న ముస్లిం ప్రాతినిధ్యం
- BBC Reality Check: భారత్దేశంలో నిరుద్యోగం పెరిగిందా? లేక తగ్గిందా?
- భారత్‌లో మహిళలు సురక్షితంగానే ఉన్నారా...
- 'విద్యుదీకరణతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం' అన్న మోదీ మాటల్లో నిజమెంత?
- మసూద్ అజర్‌ను జమ్మూ జైలు నుంచి కాందహార్‌కు ఎలా తీసుకువచ్చారు...
- ఇడుపులపాయ: గసగసాలు సాగు చేశారు.. పోలీసులు జైల్లో పెట్టారు
- Reality Check: మోదీ హయాంలో దేశ భద్రత పెరిగిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








