లోక్‌సభ ఎన్నికలు 2019 : భారత దేశంలో నిరుద్యోగం పెరుగుతోందా? - BBC Reality Check

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల సమీపిస్తున్న వేళ నిరుద్యోగం లెక్కలను ప్రభుత్వం తొక్కిపెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
2014లో అధికారం చేపట్టిన తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడం తమ లక్ష్యమని ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది.
నిరుద్యోగంపై అధికారికంగా విడుదల చేసిన గణాంకాలు చాలా పరిమితంగా ఉన్నాయి. కానీ, లీకైన వివరాలు భారతదేశంలో నిరుద్యోగం ఎంతన్న దానిపై తీవ్రమైన చర్చకు దారితీశాయి.
ఉద్యోగాల కల్పనపై ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆరోపించారు.
మరి, దేశంలో నిజంగానే నిరుద్యోగం పెరిగిపోయిందా?
ఏప్రిల్ 11న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగంపై ప్రధాన పార్టీలు చేసిన ఆరోపణలు- ప్రకటనలపై బీబీసీ రియాలిటీ చెక్ టీమ్ పరిశీలించింది.
భారతదేశంలో నిరుద్యోగం నాలుగు దశాబ్దాల గరిష్టానికి అంటే 6.1శాతానికి చేరిందని.. ఈ సమాచారం నేషనల్ శాంపుల్ సర్వే కార్యాలయం - ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నుంచి లీకైందని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో నిరుద్యోగం అంశంపై వివాదం రాజకుంది.
భారతదేశంలో అతిపెద్ద ఇంటింటి సర్వేని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ చేస్తుంది. అందులో భాగంగా నిరుద్యోగంపై కూడా అంచనాలు రూపొందిస్తుంది.
నిరసనగా నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ - ఎన్‌ఎస్‌సీ తాత్కాలిక చైర్మన్ రాజీనామా చేశారు. తాను ఆ గణాంకాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
కానీ, ప్రభుత్వం ఈ గణాంకాలు డ్రాఫ్ట్ మాత్రమే అని చెబుతోంది. నిరుద్యోగం సమస్యపై ఇచ్చిన సూచనలను తోసిపుచ్చింది. ఆర్థిక ప్రగతి చాలా బాగుందని చెప్పింది.
అప్పటి నుంచి వంద కంటే ఎక్కువ మంది ఆర్థికవేత్తలు, సోషల్ సైన్స్ ప్రొఫెసర్లు ఓపెన్ లెటర్ రాశారు. "భారత గణాంక యంత్రాంగంపై తీవ్రమైన ఒత్తిడి ఉందని, రాజకీయ ప్రయోజనాల మేరకు నడుచుకుంటున్నాయని" వాళ్లు అభిప్రాయపడ్డారు.
NSSO నిరుద్యోగ సర్వే ని చివరిగా 2012లో ప్రచురించారు.
గత NSSO సర్వే డేటాలో గ్యాప్ ఉంది. అయితే, దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న పాత గణాంకాలను నిలిపివేయడమే దానికి కారణంగా చెపుతున్నారు.
2012లో నిరుద్యోగం రేటు 2.7 శాతంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
రెండు సర్వేలను పోల్చవచ్చా?
లీకైన తాజా నివేదిక చూడకుండా 2012 నాటి సర్వేతో దీన్ని నేరుగా పోల్చి చూడటం కష్టమే. అలాగే, నిరుద్యోగం రేటు 40 ఏళ్ల గరిష్టానికి చేరిందా లేదా అన్నది కచ్చితంగా చెప్పలేము.
అయితే, "అవే పద్ధతులు పాటించారు. పోల్చి చూసేందుకు ఎలాంటి సమస్య లేదు" అని హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టాటిస్టిక్స్ కమిషన్ మాజీ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు.
2012 - 2014 మధ్య భారతదేశంలో నిరుద్యోగం రేటు తగ్గిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెప్పింది. కానీ 2018లో ఇది కొద్దిగా పెరిగి 3.5శాతానికి చేరిందని పేర్కొంది. అయితే, ఇది 2012 NSSO సర్వేపై ఆధారపడి వేసిన అంచనా మాత్రమే.
2010 నుంచి భారత కార్మిక మంత్రిత్వ శాఖ తన సొంత పద్ధతుల్లో కుటుంబ సర్వేలు చేసింది. 2015లో చివరిసారిగా చేసింది. అప్పుడు నిరుద్యోగం రేటు 5 శాతంగా ఉందని పేర్కొంది. గత కొన్నేళ్ళలో ఇది పెరిగింది.
పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉందని ఆ డేటా చెబుతోంది.
ఈ నిరుద్యోగం రేటు చాలా వేగంగా పెరుగుతోందని ఒక నిపుణుడు అభిప్రాయపడ్డారు.
ఉద్యోగాలకు సంబంధించిన గణాంకాల్లో మరోటి కార్మిక భాగస్వా మ్య రేటు. అంటే మొత్తం జనాభాలో ఉద్యోగం చేయగలిగిన వయసు ఉండి (అంటే కనీసం 15 ఏళ్లకు పైబడినవారు).. ఉద్యోగం చేస్తున్న వారి జనాభా నిష్పత్తి.
''2016లో కార్మికుల భాగస్వామ్య శాతం 47 నుంచి 48 మధ్య ఉండగా అది ఇప్పుడు 43 శాతానికి పడిపోయింది. అంటే దాదాపు 5 శాతం మంది కార్మిక వ్యవస్థ నుంచి బయటకు వచ్చేశారు.'' అని సీఎంఐఈ హెడ్ మహేశ్ వ్యాస్ చెప్పారు.
ఉద్యోగాల కరువు, లేకుంటే ఉద్యోగాల తొలగింపు వల్ల ఇలా జరిగి ఉంటుందని వివరించారు.
భారతీయ ఉద్యోగాలపై ప్రభావం చూపుతున్న అంశాలు..
2016లో చేసిన నోట్ల రద్దు ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపిందన్న వాదన ఉంది.
నోట్ల రద్దు నిర్ణయం వల్ల పలువురు ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని ఓ విశ్లేషణ వెల్లడించింది. దీని వల్ల 35 లక్షల మంది ప్రత్యక్షగానో పరోక్షంగానో ఉద్యోగాలు కోల్పోయి ఉంటారన్నది ఓ అంచనా.
మరోవైపు ప్రభుత్వం మేకిన్ ఇండియా ద్వారా దేశాన్ని చైనా, తైవాన్‌లలాగా తయారీ కేంద్రంగా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మౌలిక వసతుల లేమి, లోపభూయిష్ఠ కార్మిక విధానాలు తదితరాల వల్ల మేకిన్ ఇండియా వృద్ధి అనుకున్నంతగా జరగలేదని నిపుణులు చెబుతున్నారు.
యంత్రాల వినియోగం పెరగడం కూడా నిరుద్యోగ రేటు పెరగడానికి ఓ కారణమనీ ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
ఈ సందర్భంగా వివేక్ కౌల్ అనే ఆర్థిక నిపుణులు మాట్లాడుతూ.. '' భారత్‌లో ఓ కంపెనీని విస్తరించాలి అనుకుంటే.. ఆ యాజమాన్యం కార్మికులకన్నా యంత్రాలనే అధికంగా కొనేందుకు మొగ్గుచూపుతుంది.'' అని చెప్పారు.


ఇవి కూడా చదవండి.
- పుల్వామా దాడి: సీఆర్పీఎఫ్ జవాన్లకు భారత ప్రజల అశ్రు నివాళి
- 2014 తర్వాత భారత్‌లో భారీ తీవ్రవాద దాడులు జరగలేదా
- 'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్లో హింస ఏమైనా తగ్గిందా?
- 26/11 ముంబయి దాడులు: ‘ఆ మారణకాండ నుంచి నేనెలా బైటపడ్డానంటే..’
- పుల్వామా దాడి: కశ్మీర్ ఎలా విడిపోయింది? వారికి ఏం కావాలి?
- పుల్వామా దాడి: కశ్మీర్ యువత మిలిటెన్సీలో ఎందుకు చేరుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








