ఇండియన్ సైన్స్ కాంగ్రెస్: ఉస్మానియాలో జరగాల్సింది.. ఎందుకు వాయిదా పడింది? మధ్యలో విద్యార్థులేం చేశారు?

ఫొటో సోర్స్, ISC105.Org
- రచయిత, సతీశ్ ఊరుగొండ
- హోదా, బీబీసీ ప్రతినిధి
జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో జరగాల్సిన 105వ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు వాయిదా పడింది. ఆ సదస్సుకు తాము ఆతిథ్యం ఇవ్వలేమని యూనివర్శిటీ అధికారులు స్పష్టం చేశారు.
నేషనల్ సైన్స్ కాంగ్రెస్‌కు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. కొత్త ఏడాదిలో ప్రధానమంత్రి పాల్గొనే తొలి సదస్సు ఇదే. సదస్సు జరిగే వేదిక, తేదీ ఏడాది ముందే ఖరారు చేస్తారు. దేశ, విదేశీ శాస్త్రవేత్తలతో పాటు సుమారు పదివేల మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా 105వ సైన్స్ కాంగ్రెస్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.
అయితే, సదస్సుకు రెండు వారాల ముందు సైన్స్ కాంగ్రెస్ ఆతిథ్యం ఇవ్వలేమని ఉస్మానియా యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ తమకు సమాచారం అందించారని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోషియేషన్ - ఐఎస్‌సీఏ వెబ్‌సైట్ పేర్కొంది.

ఫొటో సోర్స్, ISCA Website
సైన్స్ కాంగ్రెస్‌కు ఆతిథ్యం ఇవ్వలేం-ఓయూ
ఈ అంశంపై ఉస్మానియా వైస్ చాన్స్‌లర్ రామచంద్రంతో బీబీసీ మాట్లాడింది.
ప్రస్తుత పరిస్థితుల్లో సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వలేమని ఆయన బీబీసీకి చెప్పారు.
డిసెంబర్ 3న ఎమ్మెస్సీ ఫిజిక్స్ విద్యార్థి మురళి క్యాంపస్ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతినిధులు, సైన్స్ కాంగ్రెస్, యూనివర్శిటీ అధికారులు అందరూ చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని ఓయూ వీసీ చెప్పారు.

ఫొటో సోర్స్, OU WEBSITE
ఈ మేరకు యూనివర్శిటీ అధికారులు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు.
గత మూడు నెలలుగా సైన్స్ కాంగ్రెస్ కోసం తీవ్రంగా శ్రమించామని, దీనికోసం పరీక్షలను కూడా రీషెడ్యూల్ చేశామని యూనివర్శిటీ అధికారులు తెలిపారు.
సదస్సు ప్రారంభోత్సవాన్ని మరో చోట చేసి, మిగతా సమావేశాలను ఓయూలో నిర్వహించాలని ఒక దశలో భావించినట్లు ప్రెస్‌నోట్‌లో వివరించారు.
నేషనల్ సైన్స్ కాంగ్రెస్ ప్రతినిధులతో చర్చించి, సదస్సు నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని అందులో తెలిపారు.

ఫొటో సోర్స్, OU
నేనొక్కడిని తీసుకున్న నిర్ణయం కాదు:వీసీ
సైన్స్ కాంగ్రెస్‌ను విద్యార్థులు వ్యతిరేకించారని అనడం సరికాదని వీసీ చెప్పారు. నిజానికి విద్యార్థులు సైన్స్ కాంగ్రెస్ సదస్సును ఆహ్వానించారని రామచంద్రం బీబీసీకి వివరించారు.
‘సదస్సును నిర్వహించలేమన్నది నా ఒక్కడి నిర్ణయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం, సైన్స్ కాంగ్రెస్ ప్రతినిధులు, పోలీసులు.. అందరి సమష్టి నిర్ణయం’ అని ఆయన తెలిపారు.
అలాగే, హాస్టళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించామన్నది కూడా కరెక్ట్ కాదని చెప్పారు.
హాస్టళ్ల మరమ్మత్తుల కోసం ఖాళీ చేయమన్నామని, సర్కులర్‌లో ఒక పదం పొరపాటుగా రావడం వల్ల విద్యార్థుల్లో అపొహలు వచ్చాయని, తాము ఇచ్చిన వివరణతో వారు సంతృప్తి చెందారని వీసీ వివరించారు.
సైన్స్ కాంగ్రెస్‌కు విద్యార్థుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని ఆయన పునరుద్ఘాటించారు.
నిన్నటి వరకు సైన్స్ కాంగ్రెస్ ఏర్పాటు పనుల్లో బిజీగా ఉన్నామని, కానీ సదస్సు ఓయూలో జరగకపోవడం విచారంగా ఉందని వీసీ రామచంద్రం బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, ISC105.Org
‘అడ్డుకుంటామని చెప్పలేదు-సైన్స్ కాంగ్రెస్‌ను స్వాగతించాం’
ఈ అంశంపై ఓయూ విద్యార్థి సంఘాలను బీబీసీ సంప్రదించింది.
తాము సైన్స్ కాంగ్రెస్ సదస్సును అడ్డుకోవాలని పిలుపు ఇవ్వలేదని నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్ మానవతారాయ్ స్పష్టం చేశారు.
నిజానికి తాము సైన్స్ కాంగ్రెస్‌ను స్వాగతించామని చెప్పారు. సదస్సు నిర్వహించలేమని చెప్పడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.
ఇవాంకా వచ్చినప్పుడు, తెలుగు మహాసభల సమయంలోనూ నిరసనలు వ్యక్తం అయ్యాయని, అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేయాలని చెప్పడంపై ప్రశ్నించామని, విద్యార్థులు లేకుండా సైన్స్ కాంగ్రెస్ ఎలా నిర్వహిస్తారని అడిగిన మాట నిజమేనని అన్నారు.
అయితే, సైన్స్ కాంగ్రెస్‌ను అడ్డుకోవాలని పిలుపు ఇవ్వలేదని తేల్చిచెప్పారు.

ఫొటో సోర్స్, ISC105.Org
'డిసెంబర్ 27న నిర్ణయం తీసుకుంటాం'
తాజా పరిణామాలపై బీబీసీ హైదరాబాద్ ప్రతినిధి బళ్ల సతీశ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గంగాధర్‌తో మాట్లాడారు.
సైన్స్ కాంగ్రెస్‌కు ఆతిథ్యం ఇవ్వలేమని ఓయూ వీసీ డిసెంబరు 19 సాయంత్రం తమకు ఈమెయిల్ పంపారని, దానికి కారణాలు ఏమిటో తమకు తెలియదని గంగాధర్ అన్నారు.
‘ఓయూలో ఏర్పాట్లు పరిశీలించడానికి మూడు, నాలుగు సార్లు వెళ్లాం. అక్కడ అన్నీ బాగా చేశారు. కానీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు’ అన్నారు.
సైన్స్ కాంగ్రెస్ 2018 నిర్వహణకు సంబంధించి.. డిసెంబర్ 27న కోల్‌కతాలో జరిగే ఎగ్జిక్యూటివ్ కమిటి సమావేశంలో చర్చిస్తామని గంగాధర్ తెలిపారు.
ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఓయూ క్యాంపస్ బదులు వేరే స్థలంలో నిర్వహిస్తామన్నా తమకు ఇబ్బంది లేదని, రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా సైన్స్ కాంగ్రెస్ నిర్వహించడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
నోబెల్ బహుమతి గ్రహీతలు, విదేశీ శాస్త్రవేత్తలు టికెట్లు బుక్ చేసుకున్నారు. 12 నుంచి 15 వేల మంది ప్రతినిధులు అన్నీ ప్లాన్ చేసుకుని, టికెట్లు తీసుకుని సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇలాంటి లేఖ వస్తుందనుకోలేదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ISC105.Org
విద్యార్థుల ఆందోళనలపై పోలీసులకు సమాచారం?
అయితే, సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని పోలీసులకు పక్కా సమాచారం అందిందని మరో వాదన ఉంది.
మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు సైన్స్ కాంగ్రెస్ నిర్వహించే ఉస్మానియా క్యాంపస్‌లోని ఏ, సీ గ్రౌండ్లను పరిశీలించారు.
సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా దళిత, మైనార్టీ, వెనకబడిన వర్గాల విద్యార్థులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు ఆయనకు తెలిసింది.
దీంతో తాజా పరిస్థితిని సీఎం కేసీఆర్‌కు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు పోలీసులు వివరించినట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
మా ఇతర కథనాలు:
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దానికోసం పోరాడుతూనే ఉండండి’
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు సభలు తేల్చిందేమిటి?
- ముద్రగడతో బీబీసీ ఇంటర్వ్యూ: బాబు గారూ ఆనాడు కాపు ఆందోళనకి మద్దతిచ్చారు..మరి డబ్బెంత ఇచ్చారు?
- ద్రౌపదిని ఫెమినిస్ట్ అనడం సరైందేనా?
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- ‘పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- బిట్కాయిన్లతో బిలియనీర్లయిపోగలమా?
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
- అనుపమా పరమేశ్వరన్ : కాలేజీ రోజుల్లో నన్నూ వేధించారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








