Twitter CEO పరాగ్ అగర్వాల్‌‌, ఈలాన్ మస్క్‌ మధ్య మెసేజ్‌ల యుద్ధానికి కారణం ఏంటి? జాక్ డోర్సీ ఏం చేశారు?

ఈలాన్ మస్క్, పరాగ్ అగర్వాల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమ్స్ క్లేటన్
    • హోదా, బీబీసీ నార్త్ అమెరికా టెక్నాలజీ రిపోర్టర్

ఈలాన్ మస్క్‌కు, ట్విటర్ బాస్ పరాగ్ అగర్వాల్‌కు మధ్య సాగిన మెసేజ్‌ల సంభాషణను ఓ కోర్టు కేసు కోసం సమర్పించారు.

సత్సంబంధంగా మొదలైన వీరి బంధం.. ఆ తర్వాత నాటకీయంగా ఎలా చెడిపోయిందనే విషయాన్ని ఈ మెసేజ్‌లు వెల్లడిస్తున్నాయి.

ట్విటర్‌లో షేర్లు కొనాలని, వీలైతే ట్విటర్ సంస్థ యాజమాన్య బోర్డులో కూర్చోవలని ఈలాన్ మస్క్ ఆసక్తిగా ఉన్నట్లు మార్చి చివర్లో స్పష్టమైంది.

పరాగ్ అగర్వాల్ మార్చి 27వ తేదీన ఈలాన్ మస్క్‌ను సంప్రదించారు: ''హే ఈలాన్ - నేరుగా సంప్రదించటం చాలా బాగుంది. (మీతో) మాట్లాడాలని కోరుకుంటున్నా'' అని ఆయన చెప్పారు.

ఈ మెసేజ్‌ను ఈలాన్ మస్క్ లైక్ చేశారు. ''ఈ రోజు రాత్రి 8 గంటల సమయం సరేనా'' అని స్పందించారు.

అంతవరకూ బాగానే ఉంది.

ఈలాన్ ట్విటర్ ఒప్పందం వేడి అందుకుంటుండగా.. మార్చి 31వ తేదీన హడావుడిగా సాన్ జోస్ సమీపంలో ఒక డిన్నర్‌కు ప్లాన్ చేశారు.

ఈ పరిణామాలు ఇంత వేగంగా సాగుతుండటంతో పరాగ్ అగర్వాల్‌ చాలా ఆనందించారు. ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ట్విటర్ బోర్డు సభ్యుడు కాబోతున్నాడు మరి. ఈలాన్ మస్క్‌ను వ్యక్తిగతంగా కలవడానికి తాను చాలా 'ఉత్సుకత'తో ఉన్నానని ఆయనకు పరాగ్ అగర్వాల్ మెసేజ్ చేశారు.

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, EPA/ALEXANDER BECHER

ట్విటర్ బోర్డు చైర్మన్ బ్రెట్ టేలర్ డిన్నర్ గురించి ఈలాన్ మస్క్‌కు టెక్ట్స్ మెసేజ్ పంపించారు. ''వాళ్లు ఎయిర్‌పోర్టు దగ్గర ఎయిర్‌బీఎన్‌బీ కోసం వెదుకుతున్నట్లు నేను భావిస్తున్నా. అక్కడ ట్రాక్టర్లు, గాడిదలు ఉన్నాయి. ఆ ప్రాంతం అత్యంత విచిత్రమైన ప్రాంతంగా గెలుస్తుంది. అక్కడ నేను ఇటీవల ఒక సమావేశంలో పాల్గొన్నాను'' అని అందులో చెప్పారు.

ఆ ప్రాంతం వ్యవసాయ క్షేత్రమైనా కానీ విందు సమావేశం బాగానే జరిగింది. అది ''పలు కారణాల వల్ల గుర్తుండిపోతుంది. నిజంగా ఆస్వాదించాను'' అని పరాగ్ అగర్వాల్ పేర్కొన్నారు.

కొన్ని రాజుల తర్వాత.. ట్విటర్ బోర్డులో ఈలాన్ మస్క్ చేరుతున్నట్లు ప్రకటించారు.

''చాలా ఉద్విగ్నంగా ఉంది'' అని పరాగ్ అగర్వాల్ మెసేజ్ చేశారు.

ఈ ప్రకటన బయటకు వెలువడటంతో ఈలాన్ మస్క్‌కు ఎంతో మంది టెక్ట్స్ మెసేజ్‌లు పంపించటం మొదలుపెట్టారు.

''సెన్సార్‌షిప్ చేసి సంతోషించే మూక నుంచి ట్విటర్‌ను విముక్తం'' చేస్తున్నారా.. అంటూ ఈలాన్‌ను పాడ్‌కాస్టర్ జో రోగన్ అడిగారు.

''నేను సలహా ఇస్తాను. దానిని వాళ్లు పాటించవచ్చు, పాటించకపోవచ్చు'' అని ఈలాన్ బదులిచ్చారు.

వీడియో క్యాప్షన్, ఎలాన్ మస్క్: ట్విటర్‌ను రూ. 3.37 లక్షల కోట్లకు కొని ఆయన ఏం చేయబోతున్నారు?

ట్విటర్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సీ ఏప్రిల్ 5వ తేదీన ఈలాన్‌కు పంపిన మేసేజ్‌లో.. పరాగ్ అగర్వాల్ ''అద్భుతమైన ఇంజనీర్'' అని, కానీ ట్విటర్ బోర్డు ''దారుణంగా'' ఉంటుందని పేర్కొన్నారు.

ఏప్రిల్ 7వ తేదీన పరాగ్ అగర్వాల్, ఈలాన్ మస్క్‌లు.. తమ కోడింగ్ అనుభవాల గురించి మాట్లాడుకున్నారు. అది చూస్తే.. ఇద్దరి మధ్య అందమైన పని సంబంధం మొదలుకాబోతున్నట్లు కనిపిస్తుంది.

''నేను 20 ఏళ్ల పాటు హెవీ డ్యూటీ సాఫ్ట్‌వేర్ రాశాను. ప్రోగ్రామ్ మేనేజర్లు/ఎంబీఐ తరహా వాళ్లతో కన్నా.. హార్డ్‌కోర్ ప్రోగామింగ్ చేయగల ఇంజంనీర్లతో నేను చాలా బాగా కలిసిపోతాను'' అని ఈలాన్ చెప్పారు.

పరాగ్ అగర్వాల్.. ''మన తర్వాతి సంభాషణలో నన్ను సీఈఓగా కాకుండా ఇంజనీర్‌గా చూడండి. అది మనల్ని ఎక్కడికి తీసుకెళుతుందో చూద్దాం'' అని బదులిచ్చారు.

''అలాగే'' అని ఈలాన్ స్పందించారు.

కానీ అంతలోనే అశనిపాతం.

ఈలాన్ మస్క్ ఏప్రిల్ 9వ తేదీన ఒక ట్వీట్ చేస్తూ.. ట్విటర్‌లో అత్యధిక ఫాలోయర్లు ఉన్న అకౌంట్లలో చాలా తక్కువ అకౌంట్లు మాత్రమే ఎక్కువగా ఎందుకు ట్వీట్ చేస్తున్నాయని అడుగుతూ.. ''ట్విటర్ చనిపోతోందా?'' అని ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ ట్వీట్ పరాగ్ అగర్వాల్‌కు కోపం తెప్పించింది. ఆ రోజు ఆయన ఇలా మెసేజ్ చేశారు:

''ట్విటర్ చనిపోతుందా?' అని కానీ ట్విటర్ గురించి ఇంకేమైనా కానీ ట్వీట్ చేసే స్వేచ్ఛ మీకు ఉంది. కానీ ప్రస్తుత సందర్భంలో ట్విటర్‌ను మెరుగు పరచటానికి నాకు అది సాయం చేయటం లేదని మీకు చెప్పాల్సిన బాధ్యత నాది''.

''ఈసారి మనం మాట్లాడుకున్నపుడు.. మా పనిచేయగల సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రస్తుత అంతర్గత కలతల గురించి మీకు అవగాహన కల్పించాలని నేను అనుకుంటున్నా'' అని కూడా పరాగ్ పేర్కొన్నారు.

అయితే.. తను ఏం చేయాలో తనకు ఎవరైనా చెప్తే ఈలాన్ మస్క్‌కు అస్సలు నచ్చదనే విషయం జగద్విదితం. ముఖ్యంగా తను ట్వీట్ చేయొచ్చా, చేస్తే ఏం ట్వీట్ చేయాలి అనేదాని గురించి చెప్పటం ఆయనకు సుతారమూ నచ్చదు.

తెర వెనుక ఏం జరుగుతోందనేది మనకు కచ్చితంగా తెలియదు. కానీ ఈ మెసేజ్ ఈలాన్ మస్క్‌కు కోపం తెప్పించినట్లు కనిపిస్తోంది. కొన్ని గంటల తర్వాత ఆయన వరుసపెట్టి కోపంగా మెసేజ్‌లు పంపించారు.

''ఈ వారం ఏం పని చేయించారు?... నేను బోర్డులో చేరటం లేదు... ఇది టైం వేస్ట్. ట్విటర్‌ను ప్రైవేటుగా మార్చటానికి ఆఫర్ ఇస్తాను'' అని వ్యాఖ్యానించారు.

పరాగ్ అగర్వాల్

ఫొటో సోర్స్, LINKEDIN/PARAG AGRAWAL

ఫొటో క్యాప్షన్, పరాగ్ అగర్వాల్

ఈ మెసేజ్‌లు చూసి పరాగ్ అగర్వాల్ నిర్ఘాంతపోయినట్లు కనిపిస్తోంది.

ఆయన.. ఏం జరుగుతోందో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్న బ్రెట్ టేలర్‌కు ఫోన్ చేశారు.

''పరాగ్ ఇప్పుడు నాకు ఫోన్ చేసి, మీ టెక్ట్స్ సంభాషణల గురించి ప్రస్తావించారు. మీరు మాట్లాడగలరా?'' అని ఆయన ఈలాన్ మస్క్‌కు మెసేజ్ చేశారు.

''పరాగ్‌తో చాట్ చేయటం ద్వారా ట్విటర్‌ను బాగు చేయటం జరిగే పనికాదు. తీవ్ర చర్య అవసరం'' అని ఈలాన్ మస్క్ చెప్పారు.

''నాకు అర్థమయ్యేలా చెప్పటానికి 10 నిమిషాలు మాట్లాడగలరా'' అని టేలర్ అడిగారు.

''మీరు బోర్డులో చేరి 24 గంటలైంది. మీరు చెప్తున్న విషయం నాకు అర్థమైంది. కానీ ఈ ఆకస్మిక మలుపు గురించి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా'' అని కూడా చెప్పారు.

ఈలాన్ మస్క్ తను అన్నట్లు చేశారు. ట్విటర్‌ను ప్రైవేటుగా మార్చటానికి 4,400 కోట్ల డాలర్లు ఆఫర్ చేశారు. ఏప్రిల్ 25వ తేదీన ట్విటర్ బోర్డు ఈ ఆఫర్‌ను ఆమోదించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఆ మరుసటి రోజు ఈలాన్ మస్క్, పరాగ్ అగర్వాల్‌ల మధ్య సయోధ్య కుదర్చటానికి జాక్ డోర్సీ ప్రయత్నించారు. ఆయన ఒక ఫోన్ కాల్ ఏర్పాటు చేశారు. కానీ సవ్యంగా సాగలేదు.

ఆ సంభాషణ అనంతరం జాక్ డోర్సీకి ఈలాన్ మస్క్ మెసేజ్ చేశారు. ''మీకు నాకు మధ్య సంపూర్ణ ఏకాభిప్రాయం ఉంది. పరాగ్ చాలా చాలా నెమ్మదిగా కదులుతున్నారు. తను ఏం చేసినా సంతోషించని జనాన్ని సంతోషపెట్టటానికి ప్రయత్నిస్తున్నారు'' అని పేర్కొన్నారు.

జాక్ డోర్సీ బదులిస్తూ: ''కనీసం మీరు కలిసి పనిచేయలేరన్న విషయం స్పష్టమైంది'' అని చెప్పారు.

అక్కడి నుంచి ఈలాన్ మస్క్‌కు, ట్విటర్‌కు మధ్య సంబంధం అంతకంతకూ దిగజారుతూ వచ్చింది.

చివరికి ఈ ఒప్పందం నుంచి పూర్తిగా బయటకు రావాలని ఈలాన్ జూలైలో ప్రయత్నించారు. అయినాకానీ ట్విటర్ సెప్టెంబర్‌లో ఈ కొనుగోలును ఆమోదించింది.

ఆయన ఈ ఒప్పందం నుంచి వైదొలగవచ్చా, లేదంటే ఆ కంపెనీని బలవంతంగా కొనాల్సిందేనా అనే విషయాన్ని డెలవేర్‌లోని ఓ కోర్టు కేసు అక్టోబరు మధ్యలో నిర్ణయిస్తుంది.

అయితే.. ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు, ఈలాన్ మస్క్‌కు మధ్య సంబంధం చాలా ముందుగానే బెడిసికొట్టిందని ఈ మెసేజీలు చూపుతున్నాయి.

ఒకవేళ ట్విటర్‌ను ఈలాన్ మస్క్ తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి వస్తే.. పరాగ్ అగర్వాల్ మరో ఉద్యోగం చూసుకోవాల్సి వస్తుందని కూడా ఈ సందేశాలు సూచిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)