అల్ జవహిరి: అమెరికా డ్రోన్ దాడిలో అల్ ఖైదా నాయకుడు హతం

ఫొటో సోర్స్, AFP
- రచయిత, రాబర్ట్ ప్లమర్
- హోదా, బీబీసీ న్యూస్
అఫ్గానిస్తాన్‌లో జరిపిన డ్రోన్ దాడిలో అల్ ఖైదా నాయకుడు అయ్‌మాన్ అల్-జవహిరి హతమయినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు.
ఆదివారం అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా (సీఐఏ) చేపట్టిన ఆపరేషన్‌లో ఆయన మరణించారు.
అల్ జవహిరి "అమెరికా పౌరులపై హింస, హత్యలకు మార్గం వేశారని" జో బైడెన్ అన్నారు.
"ఇప్పుడు న్యాయం జరిగింది. ఈ తీవ్రవాద నాయకుడు ఇక లేరు" అని ఆయన అన్నారు.
అల్ జవహిరి ఒక సురక్షిత ప్రాంతంలోని ఇంట్లో ఉన్నారని, అమెరికా డ్రోన్ దాడి చేసినప్పుడు ఆయన ఆ ఇంటి బాల్కనీలో తిరుగుతున్నారని అధికారులు తెలిపారు.
మిగతా కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు కానీ, వారికి ఏమీ కాలేదని, అల్ జవహిరిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని వివరించారు.
71 ఏళ్ల అల్-ఖైదా నాయకుడిపై "కచ్చితమైన గురి పెట్టడానికి" తాను తుది ఆమోదం తెలిపినట్లు బైడెన్ చెప్పారు.
2011లో ఒసామా బిన్ లాడెన్ మరణించిన తరువాత అయ్‌మాన్ అల్ జవహిరి అల్ ఖైదా నాయకత్వాన్ని అందుకున్నారు. అల్ జవహిరి, లాడెన్ కలిసి అమెరికాలో జరిగిన 9/11 దాడులకు పథకం రచించారు. అమెరికా "మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో" అల్ జవహరి ఒకరు.
అల్ జవహిరి మరణం 2001 దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు సాంత్వన కలిగిస్తుందని బైడెన్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
2000 అక్టోబర్‌లో అడెన్‌లోని యూఎస్ఎస్ కోల్ నావికా దళంపై ఆత్మాహుతి బాంబు దాడి సహా పలు దాడుల వెనుక ప్రధాన హస్తం అల్ జవహిరిదేనని బైడెన్ చెప్పారు. యూఎస్ఎస్ కోల్‌పై బాంబు దాడిలో 17 మంది అమెరికా నావికులు చనిపోయారు.
"ఎంత సమయం పట్టినా, మీరు ఎక్కడ ఏ మూల దాక్కున్నా, మీ వల్ల మా పౌరులకు ముప్పు అని భావిస్తే, అమెరికా మిమ్మల్ని కచ్చితంగా పట్టుకుంటుంది, చంపేస్తుంది. మా దేశాన్ని, మా పౌరులను రక్షించడంలో మేమెప్పుడూ వెనుకాడం" అని బైడెన్ అన్నారు.
అయితే, అమెరికా చేసిన డ్రోన్ దాడి అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించిందని తాలిబాన్ ప్రతినిధి ఒకరు అన్నారు.
"ఇలాంటి చర్యలు గత 20 ఏళ్లుగా విఫలమవుతూనే న్నాయి. ఇవి అమెరికా, అఫ్గానిస్తాన్, చుట్టుపక్కల ప్రాంతాల ప్రయోజాలకు విరుద్ధం" అని ఆయన అన్నారు.
అయితే, ఈ ఆపరేషన్‌కు చట్టపరమైన సమ్మతం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు.
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనుదిరిగిన ఏడాది తరువాత ఆ దేశం అల్ జవహిరిపై దాడి చేసింది.
2020లో తాలిబాన్లు, అమెరికాతో చేసుకున్న శాంతి ఒప్పందంలో.. తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో అల్ ఖైదా లేదా మరే ఇతర తీవ్రవాద సంస్థలను అనుమతించమని అంగీకరించారు.
అయితే, తాలిబాన్, అల్ ఖైదా చిరకాలంగా సన్నిహితులని, కాబూల్‌లో అల్ జవహిరి ఉన్నట్టు తాలిబాన్లకు తెలుసని అమెరికా అధికారులు అంటున్నారు.
అఫ్గానిస్తాన్ ఇంకెప్పటికీ తీవ్రవాదులకు ఆశ్రయం కాకూడదని బైడెన్ అన్నారు.
ఈజిప్ట్‌కు చెందిన అల్ జవహిరి ఒక కంటి డాక్టర్. ఈజిప్షియన్ ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూప్‌ను స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించారు. 2011లో లాడెన్ మరణం తరువాత అల్ ఖైదా పగ్గాలు చేపట్టారు.
అంతకు ముందు అల్ జవహిరి ఒసామా బిన్ లాడెన్ కుడి భుజంగా వ్యవహరించేవారు. అల్ ఖైదాలోని ముఖ్య సిద్ధాంతకర్త కూడా.
అమెరికా 9/11 దాడుల్లో ప్రధాన హస్తం అల్ జవహిరిదేనని నిపుణులు భావిస్తారు.

అల్ ఖైదాకు ప్రధాన సిద్ధాంతకర్త అల్ జవహిరి. మిలిటెంట్ ఇస్లాంలో ప్రమేయం ఉందన్న కారణంగా 1980లలో ఈ ఈజిప్షియన్ వైద్యుడిని అరెస్ట్ చేశారు.
విడుదలైన తరువాత ఆ దేశన్ని విడిపెట్టి, అంతర్జాతీయ జిహాదిస్ట్ ఉద్యామాల్లో భాగమయ్యారు.
క్రమంగా అఫ్గానిస్తాన్‌లో స్థిరపడి ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడయ్యారు. ఇద్దరూ కలిసి అమెరికాపై యుద్ధాన్ని ప్రకటించారు. 9/11 దాడులకు పథకం రచించారు.
లాడెన్‌ను పట్టుకోవడానికి అమెరికాకు ఒక దశాబ్దం పట్టింది. లాడెన్ మరణం తరువాత అల్ జవహిరి అల్ ఖైదాకు నాయకత్వం వహించారు. కానీ, ఆయన ఉనికి నామమాత్రంగానే మిగిలిపోయింది. ఎప్పుడైనా ఏదైనా సందేశాలు ఇవ్వడానికే పబ్లిక్‌లో కనిపిస్తుండేవారు.
అల్ జవహిరి మరణానికి అమెరికా వేడుక చేసుకుంటుంది. ముఖ్యంగా గత ఏడాది అఫ్గానిస్తాన్ నుంచి తమ దళాలను వెనక్కు రప్పించిన నేపథ్యంలో ఇది వారికి పెద్ద విజయం.
అయితే, ఇస్లామిక్ స్టేట్ వంటి పలు ఇతర సంస్థలు వెలుగులోకి వచ్చి, చురుకుగా మారడంతో అల్ జవహిరి ప్రభావం పెద్దగా కనిపించలేదు.
ఇప్పుడు ఆయన మరణం తరువాత కొత్త అల్ ఖైదా నాయకుడు తెరపైకి వస్తాడు. కానీ, ఆయన ప్రభావం కూడా తక్కువగానే ఉండవచ్చు.
కాబూల్‌లో జరిపిన తాజా దాడి అఫ్గానిస్తాన్ పట్ల ఇంకా ఆందోళనలు ఉన్నాయని నిరూపిస్తుంది. ముఖ్యంగా అక్కడ తాలిబాన్ పాలనలోకి రావడం, మళ్లీ ఆ దేశం తీవ్రవాద మూకలకు స్వర్గంలా మారుతుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయి.
అయితే, సుదూరాల నుంచి కూడా ఉగ్రవాదంపై విల్లు ఎక్కుపెట్టగలమని తాజా దాడితో అమెరికా నిరూపించింది.
ఇవి కూడా చదవండి:
- ఇండియా హిందూ దేశంగా మారుతోందా
- గే జంటల ముద్దుల పోటీ: పార్కులో ముద్దు పెట్టుకుంటే తిట్టారు... అందుకే
- అవిభక్త కవలలకు వీఆర్ హెడ్‌సెట్స్ పెట్టుకుని సర్జరీ చేసిన డాక్టర్లు... ఆపరేషన్ సక్సెస్
- ఆహారం: నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా... ఈ ప్రచారంలో నిజమెంత?
- మంకీపాక్స్ వైరస్‌తో భారత్‌లో తొలి మరణం... 20 మందికి ఐసోలేషన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











