మంకీపాక్స్:75 దేశాలు, 16 వేల కేసులు, 5 మరణాలు గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ

మంకీపాక్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాబర్ట్ ప్లమర్
    • హోదా, బీబీసీ న్యూస్

మంకీపాక్స్ వ్యాప్తిని అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ఆ మేరకు హై అలర్ట్ జారీ చేసింది. ఇకపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులపై దృష్టి పెడుతుంది.

ఈ వైరస్‌పై చర్చించేందుకు రెండోసారి సమావేశమైన డబ్ల్యూహెచ్ఓ ఎమెర్జెన్సీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు 75 దేశాల నుంచి 16,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని, మొత్తంగా అయిదు మరణాలు సంభవించాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.

మంకీపాక్స్‌కు ముందు ఈ కేటగిరీలో రెండు హెల్త్ ఎమరజెన్సీలు ఉన్నాయి. ఒకటి కోవిడ్ మహమ్మారి కాగా, రెండవది పోలియో. దీని నిర్మూలనకు నిరంతర ప్రయత్నం కొనసాగుతూనే ఉంది.

మూడవది మంకీపాక్స్. గతంలో సమావేశమైనప్పుడు, మంకీపాక్స్ వ్యాప్తిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా వర్గీకరించాలా వద్దా అనే దానిపై అత్యవసర కమిటీ ఏకాభిప్రాయానికి రాలేకపోయిందని డాక్టర్ టెడ్రోస్ చెప్పారు.

మంకీపాక్స్ వైరస్

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్, మంకీపాక్స్ వైరస్

అయితే, ప్రపంచవ్యాప్తంగా కేసులు వేగంగా పెరుగుతుండడంతో ఇది అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగించే విషయంగా గుర్తిచినట్టు ఆయన తెలిపారు.

ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతోందో స్పష్టంగా తెలియడం లేదని డాక్టర్ టెడ్రోస్ చెప్పారు.

"డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా యూరప్ మినహా అన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్ ప్రమాదం మధ్యస్థంగా ఉంది. యూరప్ ప్రాంతంలో మంకీపాక్స్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంది" అని టెడ్రోస్ వివరించారు.

అంతర్జాతీయంగా ప్రయాణికుల రాకపోకలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ వైరస్ మరింత విజృంభించే ప్రమాదం కనిపిస్తోందని ఆయన అన్నారు.

ఈ వైరస్‌ను అత్యవసర పరిస్థితిగా వర్గీకరించడం వలన వ్యాక్సీన్ల అభివృద్ధి వేగవంతం కాగలదని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిబంధనలు కూడా పెరుగుతాయని డాక్టర్ టెడ్రోస్ అన్నారు.

మంకీపాక్స్ వ్యాప్తిని అరికట్టడానికి, ఎక్కువ రిస్క్ ఉన్నవారిని కాపాడడానికి డబ్ల్యూహెచ్ఓ కొన్ని నిబంధనలను కూడా జారీ చేసింది.

"సరైన కమ్యూనిటీలలో సరైన వ్యూహాలు పాటిస్తే ఈ వైరస్ వ్యాప్తిని ఆపగలం" అని టెడ్రోస్ అన్నారు.

మంకీపాక్స్

ఫొటో సోర్స్, Getty Images

మంకీపాక్స్ గురించి బీబీసీ కరస్పాండెంట్ జేమ్స్ గళ్లఘర్ అందిస్తున్న నివేదిక

మంకీపాక్స్ లక్షణాలేంటి, దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం ఉందా, లేదా మొదలైన విషయాలను జేమ్స్ గళ్లఘర్ వివరించారు.

"మంకీపాక్స్‌ను తొలుత 1950లలో మధ్య ఆఫ్రికాలో గుర్తించారు. బ్రిటన్‌లో ఇప్పటివరకు 2,000 కంటే ఎక్కువ కేసులను ధృవీకరించారు.

గే, బైసెక్సువల్ పురుషులు, హెల్త్‌కేర్ వర్కర్లు సహా మంకీపాక్స్‌ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారికి వెంటనే వ్యాక్సీన్ అందజేయాలని ఆరోగ్య అధికారులు ఇప్పటికే సిఫార్సు చేస్తున్నారు.

ఈ వైరస్ సోకితే అధిక జ్వరం, గవద బిళ్లల వాపు, శరీరంపై బొబ్బర్లు, దద్దుర్లు, నోటిలో, జననాంగాలపై పొక్కులు రావచ్చు. సాధారణంగా ఈ ఇంఫెక్షన్ తక్కువగానే ఉంటుంది.

మంకీపాక్స్‌ను అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా గుర్తించడం సరైన చర్య.

ఈ వైరస్‌ను సీరియస్‌గా తీసుకోవాలని దేశాలకు హెచ్చరించినట్టయింది. అలాగే, దీని గురించి అవగాహన పెంచుకుని, అవసరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఈ వైరస్‌ను నిలువరించడానికి మన దగ్గర సాధనాలు ఉన్నాయి. ఇది కోవిడ్ అంత సులువుగా వ్యాపించదు. దీనికి ఇప్పటికే వ్యాక్సీన్ ఉంది. స్మాల్‌పాక్స్ వ్యాక్సీన్ ఇవ్వచ్చు. మంకీపాక్స్ నుంచి రక్షించుకునేందుకు ఇది బాగా పనిచేస్తుంది.

మంకీపాక్స్ ఎవరికైనా సోకే ప్రమాదం ఉంది. కానీ గే, బైసెక్సువల్ పురుషులు, స్వలింగ సంపర్కులైన పురుషులకు ఎక్కువగా వ్యాపిస్తుందని చెబుతున్నారు.

ఈ సమాచారంతో ఆయా సమూహాలను లక్ష్యాలుగా చేసుకుని, తగిన చర్యలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.

అయితే, కొన్ని దేశాల్లో స్వలింగ సంపర్కం చట్టపరంగా నేరం. అటువంటప్పుడు ఈ సమూహాల పట్ల ఆంక్షలు, వేధింపులు అవరోధంగా నిలుస్తాయి.

మంకీపాక్స్‌ను అరికట్టడం అనేది సాంఘికంగా, సాంస్కృతికంగా కూడా సవాలు" అని గళ్లఘర్ అన్నారు.

వీడియో క్యాప్షన్, అలర్జీల విషయంలో మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలివే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)