శ్రీలంక సంక్షోభం: దివాలా తీసిన దేశంలో ప్రతిరోజూ బతుకు గండమే

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ఆండ్రూ ఫిడెల్ ఫెర్నాండో
- హోదా, కొలంబో నుంచి
శ్రీలంకలో ప్రజలు రోజూ పొద్దున మేల్కొనేసరికే అలిసిపోతున్నారు. దేశంలో ఇంధనం కరువు తీవ్రంగా ఉండడంతో కరెంట్ కోతలు అర్థరాత్రుల వరకూ కొనసాగుతున్నాయి. ఉక్కపోత, వేడికి నిద్ర కరువైపోతోంది. నెలలు దాటినా ఇదే పరిస్థితి. ఇంట్లో పిల్లా పాపలు సహా అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఏది ఎలా ఉన్నా కాలం ఆగిపోదు. రోజు గడవాల్సిందే. నిత్యావసర వస్తువుల ధరలు గత నెల కన్నా రెట్టింపు అయ్యాయి. రోజు రోజుకూ పరిస్థితి దిగజారిపోతోందే తప్ప ఆశ చిగురించట్లేదు.
ఉదయం లేచి ఏదో తిన్నామన్నట్టు తిని లేదా అసలు తినకుండా బయటకు పరుగులు పెట్టడం.. అసలు యుద్ధం ఇక్కడ మొదలవుతుంది. రవాణా దొరకదు.

ఫొటో సోర్స్, Reuters
రైలు పట్టాల్లా సాగిపోతున్న క్యూలు
నగరాల్లో ఇంధనం కోసం క్యూలు కట్టడం ఆగలేదు. క్యూల పొడవు పెరుగుతూనే ఉంది. ఊరి చివర్ల వరకు విస్తరిస్తోంది. రోడ్లన్నీ గందరగోళంగా ఉన్నాయి. జీవితాలు నలిగిపోతున్నాయి.
ఆటో డ్రైవర్లు తమ వాహనాల్లో ఎనిమిది లీటర్లు పెట్రోలు పోయించుకోడానికి రోజుల తరబడి క్యూలలో నిల్చుంటున్నారు. ఎనిమిది లీటర్లతో బహుశా ఓ రెండు రోజులు గడుస్తుంది. మళ్లీ క్యూ కట్టాల్సిందే. బట్టలు, తలగడలు, నీళ్లు తెచ్చుకుని క్యూలలోనే జీవితం గడుపుతున్నారు.
ప్రజలే ప్రజలకు సాయం అందిస్తున్నారు. కొన్ని రోజులు మధ్య, ఎగువ తరగతి ప్రజలు తమ ఇళ్ల పక్కనే క్యూలలో నిల్చున్నవారికి భోజనం పొట్లాలు, కూల్ డ్రింకులు అందించేవారు.
కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆహారం, వంట గ్యాస్, బట్టలు, రవాణా, విద్యుత్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. శ్రీలంక రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో, డబ్బున్నవారికి కూడా కష్టాలు మొదలయ్యాయి.
శ్రామిక వర్గాల్లో ప్రజలు కట్టెల పొయ్యి వాడడం మొదలుపెట్టారు. కడుపు నింపుకోడానికి రోజూ ఇంత అన్నం, కొబ్బరి పచ్చడి వండుకోగలిగితే చాలన్నట్టు ఉంది వాళ్ల పరిస్థితి.
పప్పు వండుకోవడానికి లేదు. పప్పుధాన్యాల ధరలు సాధారణ ప్రజలు అందుకునేలా లేవు. మాంసం సంగతి మరచిపోవచ్చు. ధర గతం కన్నా మూడు రెట్లు పెరిగింది.
ఒకప్పుడు తాజా చేపలు విరివిగా, చౌకగా దొరికేవి. కానీ, ఇప్పుడు డీజిల్ కొరత కారణంగా పడవలు సముద్రంలోకి వెళ్లట్లేదు. సముద్రంలోకి వెళ్లగలిగే మత్స్యకారులు తమ చేపలను హొటళ్లు, రెస్టారెంట్లకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. సాధారణ ప్రజలకు ఆ ధరలు అందుకోవడం గగనం.

ఫొటో సోర్స్, Reuters
మానవతా సంక్షోభానికి దగ్గరగా..
శ్రీలంకలో ఇప్పుడు చాలామంది పిల్లలకు పౌష్టికాహారం అందట్లేదు. చంటిపిల్లలకు పాల పొడి దొరకట్లేదు.
దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ నుంచి పరమాణు స్థాయి వరకు ప్రతి స్థాయిలోనూ తీవ్ర సంక్షోభం నెలకొని ఉంది. అన్ని వర్గాల ప్రజలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఈ సంక్షోభం నెలల తరబడి కొనసాగుతోంది. ఇదిలాగే ఉంటే, దేశంలో పోషకాహార లోపం, మానవతా సంక్షోభం తలెత్తే పరిస్థితులు రావచ్చని ఐక్యరాక్య సమితి హెచ్చరించింది.
బస్సులు, లోకల్ ట్రైన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఫుట్‌బోర్డులు మీద ఒంటి కాలిపై నిల్చుని ప్రయాణం చేస్తున్నారు. లోపల కూర్చున్నవారికి గాలి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
దశాబ్దాలుగా శ్రీలంక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రంగంలో తగినన్ని పెట్టుబడులు పెట్టడంలో విఫలమైంది. మరోపక్క బస్సు, ఆటో డ్రైవర్ల క్రమశిక్షణా రాహిత్యం గురించి సంపన్నులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.
రాజకీయ, ఆర్థిక సంపన్నులకు సాధారణ ప్రజల పట్ల ఉన్న ఈ చిన్నచూపే దేశాన్ని మోకాళ్లపైకి ఈడ్చుకొచ్చిందనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది.
కానీ, దిగువ మధ్య తరగతి ప్రజలు, శ్రామికులే వర్గాలే ఈ సంక్షోభం పెను భారాన్ని మోస్తున్నాయి. దీనివల్ల ఎక్కువ అతలాకుతలం అయింది వాళ్ల జీవితాలే.

ఫొటో సోర్స్, EPA
మందులు దొరకట్లేదు
ప్రయివేటు ఆస్పత్రులు నడుస్తున్నాయి. ఇంతకు ముందు ఉన్నంత బాగా కాదుగానీ నడుస్తున్నాయి. అనురాధాపురలో 16 ఏళ్ల బాలుడు పాముకాటుకు బలైపోయాడు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాము కాటుకు మందు దొరకలేదు. దాంతో, ఆ బాలుడి తండ్రి మందుల దుకాణాల్లో గాలించాడు. ఎక్కడా దొరకలేదు. చివరికి ఆ పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రాణాలను రక్షించే మందుల కొరత తీవ్రంగా ఉంది. మే నెలలో రెండురోజుల పసికందు పచ్చకామెర్లతో చనిపోయింది. పాపను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడానికి పాప తల్లిడండ్రులకు ఆటో దొరకలేదు. దాంతో, పాప చనిపోయింది.
2019లో శ్రీలంక అవలంబించిన ఆర్థిక విధానమే ఈ పరిస్థితికి కారణమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆ ఏడాది భారీగా పన్నులు తగ్గించింది. కార్పొరేట్, ప్రొఫెషనల్స్ లాబీయింగ్ చేశారు. పన్ను తగ్గింపులను ప్రోత్సహించారు. దాంతో, శ్రీలంక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిది. దేశాన్ని ఈ అంచుకు తీసుకువచ్చింది.
బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఇంధనం దొరుకుతోంది. పెద్ద పెద్ద ప్రయివేటు వాహనాదరులు, ఇంట్లో విద్యుత్ జనరేటర్లు ఉన్నవాళ్లు బ్లాక్ మార్కెట్లో కొనుక్కుంటున్నారు.
దిగువ తరగతుల వారు సైకిళ్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. కానీ, మారకపు విలువ పడిపోవడంతో అదీ అసాధ్యమైంది.
పోలీసుల దురాగతాలు
భారీ విద్యుత్ కోతల కారణంగా ప్రజలు తిరగబడ్డారు. మార్చి నెలలో భారీ నిరసనలు చేపట్టారు. మండు వేసవిలో రోజుకు 13 గంటలు కరెంటు కోతతో ప్రజలు బాగా అలిసిపోయారు. ఆ అలసట కోపాన్ని రేకెత్తించింది. దాంతో, కొలొంబోలో దేశాధ్యక్షుడి ఇంటి ముందు వేలాదిమంది నిరసనలకు దిగారు.
సుందర నదీశ్ అనే వ్యక్తి దేశంలోని రాజకీయ శక్తులను, మతాధికారులను, మీడియాను దుయ్యబడుతూ ప్రసంగం చేశారు. వీరంతా కలిసి దేశాన్ని సర్వనాశనం చేశారని తీవ్రగా ఆరోపించారు. దేశంలో ఇంత పనికిమాలిన ప్రభుత్వం ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాంతో, పోలీసులు నదీశ్‌ను చావబాదారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నదీశ్ లాగే ఎంతోమంది పోలీసుల చేతుల్లో హింసకు గురయ్యారు.
మిలటరీలోని అత్యున్నత స్థాయి వర్గాలకు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్ష అత్యంత సన్నిహుతుడు. ఆయన మాజీ డిఫెన్స్ సెక్రటరీ కావడంతో రక్షణ రంగంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
దాంతో, అసమ్మతి తెలిపినవారంతా రాజ్య హింసకు బలవుతున్నారు. గత కొన్ని నెలలుగా ఇదే జరుగుతోంది. శాంతియుతంగా నిరసనలు జరిపినవారిని కూడా తుపాకీ కాల్పులతో భయపెట్టారు.
చిన్నపిల్లలు ఉన్న చోట విచక్షణారహితంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిత్యావసర సరుకుల కోసం క్యూలలో నిల్చున్నవారు ఏ మాత్రం అసహనం ప్రదర్శించినా పోలీసుల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్నారు.

ఫొటో సోర్స్, Reuters
పౌరులు నిరసనల్లో భాగంగా రాళ్లు విసిరినప్పుడు తమకు దెబ్బలు తగిలాయని పోలీసుకు చెబుతున్నారు. కానీ, అక్కడ పౌరులు ప్రాణాలే కోల్పోతున్నారు. దెబ్బలతో ఆస్పత్రుల పాలవుతున్నారు.
సోషల్ మీడియాలో రాజకీయ నేతలు దేశ ప్రజల ఇక్కట్ల పట్ల సానుభూతి తెలుపుతూ, వారి అగచాట్లను ఫొటోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. మార్పు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ చర్యలు ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. మమ్మల్ని ఈ దుస్థితికి ఈడ్చుకొచ్చింది మీరు కాదా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న రాజకీయ నాయకులు
దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ దేశధ్యక్షుడు సహా ఆయన పటాలమంతా గద్దె దిగాలని పిలుపునిచ్చినా వారు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. తెరవెనుక జరుగుతున్న ఒప్పందాలు చూస్తుంటే దేశప్రజల పట్ల వారి చిన్నచూపు స్పష్టగా కనిపిస్తోంది. వారి చర్యలు దేశ రాజకీయాలను మరింత విషపూరితం చేస్తున్నాయని అనేకమంది భావిస్తున్నారు.
దేశాన్ని అథోగతికి ఈడ్చిన నాయకులే మళ్లీ ఉద్ధరిస్తామని పట్టుబడుతున్నారు. కానీ, వారి విధానాల పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
శ్రీలంక పౌరులను మిడిల్ ఈస్ట్ దేశాలకు పనిమనుషులుగా, డ్రైవర్లు, మెకానిక్కులుగా పంపాలనే విధానాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. వీళ్లు అక్కడ పనిచేసి సంపాదించిన డబ్బులను స్వదేశానికి పంపిస్తారని ఆశ.
ఇది పౌరుల జీవితాలను మరింత దుర్భరం చేస్తుంది. స్థానికంగా పని దొరకక విదేశాలకు వలస వెళ్లేవారు మరింత గందరగోళంలో పడతారు. కుటుంబాలను విడిచిపెట్టి, సరైన రక్షణ, బాగోగులు చూసుకునే ఏజెన్సీ లేకుండా విదేశాలకు వెళ్లడం, వారి పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.
ఒక ఆంత్రపాలజిస్ట్ శ్రీలంక తీసుకొచ్చిన ఈ విధానాన్ని "పిశాచ అవస్థ"గా (ది వాంపైర్ స్టేట్) గా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EPA
రోజంతా యుద్ధమే.. అన్నిటికీ పోరాటమే
ప్రస్తుత పరిస్థితుల్లో సాయంత్రం అయ్యేసరికి ప్రజలు పూర్తిగా అలిసిపోతున్నారు. పొద్దున్న లేచి నిత్యావసరాలకు ఒక యుద్ధం, ఆఫీసులకు వెళ్లడానికి మరో పోరాటం, సరుకుల కోసం క్యూలలో రోజుల తరబడి నిల్చోవాల్సి రావడం. దాంతో, పూర్తిగా నిస్సత్తువ ఆవహిస్తోంది.
పోనీ, రాత్రి కంటి నిండా నిద్రపోదామంటే కరంట్ కోతలు, ఉక్కపోత. చాలీచాలని తిండి. కుటుంబానికి సరిపడా ఆహారం వండుకునే పరిస్థితి లేదు. ఇంట్లో పెద్దవాళ్లకు మందులు లేవు. పిల్లలకు సరైన చదువుల్లేవు.
ప్రస్తుతం స్కూళ్లు మూతబడ్డాయి. పిల్లలను స్కూలు తీసుకెళ్లాడానికి రవాణా సదుపాయాలు లేవు. ఆన్‌లైన్‌లో క్లాసులు జరుగుతున్నాయి. కరోనాతో మొదలై మూడేళ్లుగా ఆన్‌లైన్ పాఠాలే గతి.
శ్రీలంకలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. ఇరుగు పొరుగు, బంధువులు ఫోన్ చేసి డబ్బులు సర్దమని అడుగుతారు. పోలీసులు, మిలటరీ ఉన్న కాస్త ఆశలనూ తుడిచిపెట్టేస్తారు. కానీ, ఇంకా ఊపిరి పీల్చుకోగలుగుతున్నందుకు సంతోషిస్తున్నారు. ఎందుకంటే చుట్టూ ఉన్నవాళ్ల పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంది.
గత వారం, ఓ తల్లి తన పిల్లలిద్దరితో పాటు నదిలో దూకి ప్రాణాలు తీసుకుంది.
రోజూ మనసు ముక్కలైపోయే వార్త వినిపిస్తూనే ఉంటుంది. బతుకు దిన దిన గండంగా మారింది.
*శ్రీలంకలో నివసిస్తున్న ఆండ్రూ ఫిడెల్ ఫెర్నాండో పలు అవార్డులు గెలుచుకున్న రచయిత, పాత్రికేయుడు.
ఇవి కూడా చదవండి:
- అలర్జీ అంటే ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
- వైసీపీ ప్లీనరి: 11 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో 5 కీలక దశలు
- రాణి రుద్రమ దేవి వారసుడు ఈయనేనా, ఇన్నాళ్లూ ఎక్కడున్నారు
- ఓలా, ఉబర్ పీక్ చార్జీల పేరుతో బాదేస్తున్నాయా... ఇదిగో పరిష్కారం
- కాళీమాతను మాంసాహారం, మద్యం తీసుకునే దేవతగా ఊహించుకునే హక్కు నాకుంది - తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












