Lakshya Sen: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత షట్లర్ ఓటమి

ఫొటో సోర్స్, Reuters
భారత బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్య సేన్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పైనల్లో ఓటమి పాలయ్యారు.
డెన్మార్క్ షట్లర్ విక్టర్ ఎక్సల్‌సన్ 21-10, 21-15తో లక్ష్య సేన్‌ను ఓడించారు.
22 నిమిషాలపాటు జరిగిన మొదటి గేమ్‌లో సేన్ ఎంత ప్రయత్నించినా ఆధిక్యం సంపాదించలేకపోయారు.
గేమ్ ప్రారంభం నుంచే విక్టర్ అద్భుత ప్రదర్శన చూపారు.
ఆయన ఎదుట లక్ష్య సేన్ ఎక్కడా నిలదొక్కుకోలేకపోయారు. ఆయన తిరిగి పుంజుకునే ప్రయత్నం చేసినా, అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది.
డెన్మార్క్ క్రీడాకారుడు విక్టర్ ఎక్సల్‌సన్‌తో ఈ పోటీని చాలా కఠినమైనదనే ముందు నుంచి భావించారు. కానీ రెండో గేమ్‌లో సేన్ అతడికి గట్టి పోటీ ఇచ్చారు.
ఒక సమయంలో రెండో గేమ్‌లో ఇద్దరి మధ్యా పోటీ సమానంగా కనిపించింది. కానీ లక్ష్య సేన్ చివరికి ఒత్తిడికి చిత్తయ్యారు.
స్మాష్ నుంచి డిఫెన్స్ వరకూ కోర్ట్ కవరేజ్‌లో విక్టర్ సేన్ కంటే ఎంతో మందున్నట్లు కనిపించారు. రెండో గేమ్ 31 నిమిషాలపాటు సాగింది. విక్టర్ చివరికి దాన్ని 21-15 తేడాతో గెలుచుకున్నారు.
విక్టర్ ప్రస్తుతం బ్యాడ్మింటన్ పురుషుల ర్యాంకింగ్‌లో ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్నారు.
లక్ష్య సేన్‌కు ముందు ప్రకాష్ నాథ్, ప్రకాష్ పదుకోన్, పుల్లెల గోపీచంద్ మాత్రమే ఈ టోర్నీ ఫైనల్ వరకూ చేరుకోగలిగారు.
ఈ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్ గెలుచుకున్న భారతీయుల్లో ఇప్పటివరకూ ప్రకాష్ పదుకోన్, గోపీచంద్ మాత్రమే ఉన్నారు. 1980లో పదుకోన్, 2001లో గోపీచంద్ ఈ టైటిల్ సాధించారు.
1947లో ప్రకాష్ నాథ్ ఈ టోర్నీ ఫైనల్లో ఓడిపోగా, మహిళల కేటగిరీలో సైనా నెహ్వాల్ 2015లో జరిగిన ఫైనల్లో ఓటమి పాలయ్యారు.

ఫొటో సోర్స్, PA Media
లక్ష్య సేన్ అద్భుత ప్రదర్శన
2018లో యూత్ ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం గెలుచుకున్న భారత షట్లర్ లక్ష్య సేన్ గత ఆర్నెల్లుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు.
జనవరిలో ఆయన ఇండియా ఓపెన్ సూపర్ 500లో తన మొదటి టైటిల్ గెలుచుకున్నారు. గత వారం జరిగిన జర్మన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచారు.
2021 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత లక్ష్య సేన్ డిఫెండింగ్ చాంపియన్ జీ జియాను 21-13, 12-21, 21-19 తేడాతో ఓడించారు.
ఈ మ్యాచ్ గంటా 16 నిమిషాలపాటు సాగింది. క్లిష్టమైన ఈ మ్యాచ్‌లో ఆయన రెండో రౌండ్‌లో చాలా వెనకబడ్డారు. అయితే, మూడో రౌండ్‌లో అద్భుతంగా పుంజుకుని విజయం సాధించారు.
లీ జీ జియా ప్రస్తుతం ఇంటర్నేషనల్ ర్యాంకింగ్‌లో 7వ స్థానంలో ఉంటే, లక్ష్య సేన్ 11వ స్థానంలో ఉన్నారు.

ఫొటో సోర్స్, PA Media
లక్ష్య సేన్ ఎవరు?
భారత షట్లర్ లక్ష్య సేన్ 2001 ఆగస్టు 16న ఉత్తరాఖండ్‌లోని అల్మేడాలో జన్మించారు. 5 అడుగులా 11 అంగుళాల పొడవున్న ఈ ఆటగాడు బ్యాడ్మింటన్ ప్రముఖ కోచ్‌లు విమల్ కుమార్, పుల్లెల గోపీచంద్, యాంగ్ సూ యూ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు.
ప్రకాష్ పదుకోన్ బ్యాడ్మింటన్ అకాడమీలో కూడా శిక్షణ పొందారు.
లక్ష్య సేన్ తండ్రి డీకే సేన్ కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఆయన కోచింగ్ కూడా ఇచ్చేవారు. లక్ష్య సేన్ తన తండ్రి నుంచి కూడా శిక్షణ పొందారు. లక్ష్య సేన్ సోదరుడు చిరాగ్ సేన్ కూడా ఇంటర్నేషనల్ లెవల్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో ఆడారు.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్‌లో మేయర్లను మార్చేస్తున్న రష్యా సైన్యం.. నకిలీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తోందన్న జెలియెన్‌స్కీ
- యుద్ధ నేరం అంటే ఏమిటి? యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందా?
- ‘దండయాత్రపై లెక్క తప్పిన పుతిన్’ యుక్రెయిన్‌పై దాడి తీవ్రతను మరింత పెంచుతారా
- యుక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాను భారత్ ఎందుకు విమర్శించలేకపోతోంది?
- పాకిస్తాన్ తమ దేశంలో పడిన భారత మిసైల్‌ను రివర్స్ ఇంజనీరింగ్‌తో కాపీ కొడుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








