ఆర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగ్గర్: ‘యుద్ధంపై మీకు నిజం చెప్పటం లేదు.. భయంకరమైన విషయాలు దాస్తున్నారు’ - రష్యా ప్రజలకు హాలీవుడ్ హీరో సందేశం

అర్నాల్డ్ ష్క్వార్జెనెగర్

ఫొటో సోర్స్, Getty Images

రష్యా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ హాలీవుడ్ నటుడు అర్నాల్డ్ ష్క్వార్జెనెగర్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో శుక్రవారం నాడు రష్యాలో వైరల్‌గా మారింది. యుక్రెయిన్ మీద రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మాట్లాడిన ఈ విడియోకు విపరీతమైన ప్రతిస్పందన లభించింది.

యుక్రెయిన్ మీద దాడి గురించి రష్యా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని అర్నాల్డ్ తన వీడియోలో పేర్కొన్నారు.

నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ''ఈ యుద్ధాన్ని మీరు మొదలు పెట్టారు. మీరే దీనిని ఆపగలరు'' అని చెప్పారు.

యుక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రష్యన్లు అర్నాల్డ్ వీడియో సందేశాన్ని ప్రశంసించారు.

ప్రతిపక్ష రాజకీయ నాయకుడు లెవ్ ష్లోస్బర్గ్ టెలిగ్రామ్ యాప్‌లో.. ''మన పట్ల, రష్యా ప్రజల పట్ల గౌరవంతో'' ఈ వీడియోను రూపొందించారని కితాబునిచ్చారు.

''ఎవరితోనైనా ఒప్పించేలా, గౌరవప్రదంగా, సమాన స్థాయిలో మాట్లాడగలిగే విశిష్టమైన సామర్థ్యం అర్నాల్డ్ ష్క్వార్జెనెగర్‌కు ఉంది. జ్ఞానం, బలం, న్యాయం. వినండి. ఆలోచించండి. అర్థంచేసుకోండి'' అని ఆయన సూచించారు.

అర్నాల్డ్ సందేశంలో 'రూసోఫోబియా' లేదని లిబరల్ జర్నలిస్ట్ ఆంటన్ ఒరేఖ్ టెలిగ్రామ్‌ కామెంట్‌లో అభివర్ణించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

''ప్రపంచంలో మనం వెలికిగురయ్యాం. రష్యన్లను ఆటవికులని కాకుండా, దారితప్పిన మంచి మనుషులని సంభోదిస్తూ మాట్లాడిన అతికొద్ది మందిలో అర్నాల్డ్ ఒకరు'' అని ఒరేఖ్ పేర్కొన్నారు.

అయితే.. 'బరాక్ ఒబామా' పేరుతో ట్విటర్‌లో ఉన్న రష్యా అధ్యక్ష భవనం అనుకూల నకిలీ ఖాతా ఒకటి.. ఈ వీడియో ''కూలి తీసుకుని మాట్లాడే అమెరికా తలల'' అభిప్రాయమని, రష్యన్లు దీనిని పట్టించుకోరని విమర్శించారు.

యుక్రెయిన్‌లో యుద్ధాన్ని, ఆ దేశంలోని రష్యా మాట్లాడే ప్రజలను రక్షించటానికి చేపట్టిన 'స్పెషల్ ఆపరేషన్' అని రష్యా చెప్తూ వస్తోంది.

యుక్రెయిన్‌ను నాజీరహితం చేయటానికి దండయాత్ర చేస్తున్నట్లు చెప్పటం ద్వారా.. రష్యా అధ్యక్ష భవనం రష్యా ప్రజలకు అబద్ధం చెప్తోందని ఈ వీడియోలో అర్నాల్డ్ తప్పుపట్టారు.

''ఈ యుద్ధాన్ని యుక్రెయిన్ ప్రారంభించలేదు. క్రెమ్లిన్‌లో అధికారంలో ఉన్నవారు ప్రారంభించారు'' అని ఆయన పేర్కొన్నారు.

శుక్రవారం మధ్యాహ్న సమయానికి ఈ వీడియోను 2.50 కోట్ల సార్లు వీక్షించారు. 3.25 లక్షల సార్లు రీట్వీట్ చేశారు.

క్రెమ్లిన్ అధికారిక రష్యన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్విటర్ అకౌంట్లు అనుసరించే అతి కొద్ది అకౌంట్లలో అర్నాల్డ్ ష్క్వార్జెనెగర్‌ అకౌంట్ ఒకటి.

ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్

ఫొటో సోర్స్, Getty Images

మొత్తం తొమ్మిది నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో.. యుక్రెయిన్‌లో విధ్వంస దృశ్యాలను కూడా చేర్చారు. తప్పుడు సమాచారం, బూటకపు ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలు తెలుసుకోవాలని రష్యా ప్రజలకు అర్నాల్డ్ పిలుపునిచ్చారు.

''ప్రపంచంలో మీకు తెలియకుండా దాస్తున్న భయంకరమైన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మీరు తెలుసుకోవాలి. అందుకే మీతో మాట్లాడుతున్నా'' అని పేర్కొన్నారు.

''యుక్రెయిన్ ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదు. జాతీయవాదులో, నాజీలో మొదలుపెట్టలేదు. ఇది రష్యా ప్రజల యుద్ధం కూడా కాదు. యుద్ధం పర్యవసానాలపై మీకు నిజం చెప్పటం లేదు.. అక్కడ అమాయకులైన పౌరుల మీద బాంబుల వర్షం కురిపిస్తున్నారు'' అంటూ యుక్రెయిన్ నగరాల మీద రష్యా దాడుల గురించి వరుసగా చెప్పారు.

ఆస్ట్రియాలో జన్మించిన మాజీ బాడీబిల్డింగ్ చాంపియన్ కాలిఫోర్నియా నగరానికి గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఆయన 'రెడ్ హీట్' సినిమాను మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో నిర్మించారు.

తన యుక్తవయసులో తనకు స్ఫూర్తినిచ్చిన రష్యా బాడీబిల్డర్ యూరి వ్లాసోవ్ గురించి అర్నాల్డ్ మాట్లాడారు. రష్యా పట్ల తనకున్న ప్రేమాభిమానాల గురించి వివరించారు. తను బాడీ బిల్డర్‌గా ఉన్నపుడు, ఆ తర్వాత సినిమా నిర్మాణానికి పలుమార్లు రష్యా సందర్శనలకు వెళ్లినప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

తన తండ్రి నాజీ జర్మనీ సైనికుల్లో ఒకరని, రెండో ప్రపంచ యుద్ధంలో నాటి లెనిన్‌గ్రాడ్ (ఇప్పుడు సెయింట్ పీటర్స్‌బర్గ్) వద్ద గాయపడ్డాడని చెప్పారు.

యుక్రెయిన్ మీద వ్లాదిమిర్ పుతిన్ దండయాత్ర ఫలితంగా మానవ సంక్షోభం తలెత్తిందని.. ''రష్యా ఇప్పుడు ప్రపంచ దేశాల సమాజంలో ఏకాకిగా మారింద''ని అర్నాల్డ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

''స్వదేశం కోసం పోరాడుతున్న యుక్రెయిన్ బలగాలకు, ఆక్రమించటానికి యుద్ధం చేస్తున్న రష్యా నాయకత్వానికి మధ్య చిక్కుకుని వేలాది మంది రష్యా సైనికులు కూడా చనిపోయారు'' అని ఆయన చెప్పారు.

''ఇది అక్రమ యుద్ధం. మీ జీవితాలు, మీ శరీరాలు, మీ భవిష్యత్తును ఈ మతిలేని యుద్ధానికి బలి చేస్తున్నారు'' అని రష్యా ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు.

యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టిన వేలాది మంది రష్యా నిరసనకారుల మీద అర్నాల్డ్ ప్రశంసలు కురిపించారు. ''మీ సాహసాన్ని ప్రపంచం చూసింది. మీరు నా హీరోలు'' అని పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధంలో ఆప్తుల్ని పోగొట్టుకున్నవారి దుఃఖమిది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)