అఫ్గానిస్తాన్: ‘పెళ్లి వేడుకలో ఉండగానే కాబుల్ వెళ్లాలనే మెసేజ్ వచ్చింది. 24 గంటల్లో అక్కడ వాలిపోయాను’

లూసీ చాటన్

ఫొటో సోర్స్, British Army

ఫొటో క్యాప్షన్, లూసీ చాటన్
    • రచయిత, రాచెల్ స్టోన్‌హౌస్
    • హోదా, న్యూస్‌బీట్ రిపోర్టర్

20 ఏళ్ల పాటు అఫ్గాన్ భూభాగంపై ఉన్న అమెరికా సేనలు అక్కడి నుంచి వైదొలగడం మొదలుపెట్టినప్పటి నుంచి తాలిబాన్ సేనలు క్రమంగా ఆక్రమణను మొదలుపెట్టాయి. నెలరోజుల్లో పూర్తిగా ఆక్రమించుకున్నాయి.

తాలిబాన్లు అఫ్గానిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎయిర్‌పోర్టుల దగ్గర గందరగోళం నెలకొంది. ఆగస్టులో అఫ్గాన్‌లో ప్రజలను తరలించేందుకు సహాయ పడేందుకు వెళ్లిన 750 మంది బ్రిటిష్ సైనికుల్లో లూసీ చాటన్ ఒకరు.

ఆమె గత ఐదేళ్ల నుంచి సైన్యంలో పని చేస్తున్నారు. ‘‘కాబుల్ వెళ్లాలనే పిలుపు ఆసక్తికరంగానే ఉన్నా, అది నరాలు తెగేంత టెన్షన్ పుట్టించింది" అని లూసీ అన్నారు.

పారాచూట్ రెజిమెంట్‌లో ఆమెతో పాటు మరికొంత మంది సైనికులను విదేశాల్లో ఆపరేషన్‌కు పంపడం ఇదే మొదటిసారి.

"నా తోటి సైనికుడి పెళ్లికి హాజరైనప్పుడు నాతో పాటు చాలా మందికి వెంటనే విధుల్లో చేరాలనే సందేశం వచ్చింది. కానీ, అదృష్టవశాత్తూ పెళ్లి కొడుకుకు ఈ మెసేజ్ రాలేదు" అని ఆమె రేడియో-1 న్యూస్ బీట్‌కు చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లో బ్రిటిష్ సేనలు రెండున్నర వారాల పాటు ఉన్నాయి. దాదాపు 15 వేల మందిని అక్కడ నుంచి తప్పించాయి. అందులో 2,000 మందికి పైగా చిన్నారులున్నారు.

అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ నెలకొన్న ఆకలి, పోషకాహార లోపం, మహిళలు, బాలికల భద్రత గురించి అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

‘మహిళలు మనోనిబ్బరం కోల్పోకుండా సహాయపడ్డాను’

బ్రిటన్ నుంచి కాబుల్ వెళ్లిన యూనిట్‌లో లూసీ ఒక్కరే మహిళ. ప్రమాదంలో ఉన్న మనుషులను కనిపెట్టి, అక్కడ నుంచి తప్పించే పనిలో ఆమె కీలక పాత్ర పోషించారు.

అఫ్గానిస్తాన్‌ సంస్కృతిలో ఇతర పురుషులు మహిళలను చూడడం గాని, తాకడం గాని చేయకూడదు. ఆ పని నేను చేయాల్సి వచ్చేది" అని ఆమె చెప్పారు.

"అక్కడ మహిళలు నా ముఖాన్ని చూసి కాస్త శాంతించేవారు" అన్నారామె. తన కుటుంబం కంటే స్నేహితులు ఎక్కువగా తన గురించి ఆందోళన చెందారని లూసీ తెలిపారు.

"నాకు చాలా మంది స్నేహితురాళ్లు ఉన్నారు. నేను కాబుల్ వెళుతున్నట్లు వారికి వాట్సాప్ చేయగానే, ఇంత తొందరగా పరిస్థితులు మారడాన్ని వాళ్ళు నమ్మలేకపోయారు’’ అన్నారామె.

బ్రిటిష్ సేనలు

ఫొటో సోర్స్, British Army

ఫొటో క్యాప్షన్, బ్రిటిష్ సేనలు

కొత్త అనుభవం

విదేశీ సైనిక ఆపరేషన్లలో పని చేయడం లియాన్ స్ట్రాంగ్‌కు కూడా మొదటిసారి. 21 సంవత్సరాల లియాన్ స్ట్రాంగ్ కూడా గాలింపు చర్యల్లో సహాయపడటంతో పాటు జనం ఒకచోట గుమిగూడకుండా చూసేవారు.

పారాచూట్ రెజిమెంట్లోని మరో కోణాన్ని ఈ ఆపరేషన్ చూపించింది. "యుద్ధంలో పారా మిలిటరీ సైనికులు పని చేస్తారని సాధారణంగా అనుకుంటారు. కానీ, ఇది ఒక మానవ సంక్షోభానికి స్పందించడం" అని ఆయన అన్నారు.

లూసీ మాదిరిగానే, లియాన్ కూడా వేసవి సెలవుల్లో ఉండగా కాల్ వచ్చింది. "ఆ రోజు ఆదివారం రాత్రి, ఇక నిద్రపోదామని అనుకుంటుండగా, ఫోన్ రింగవడం మొదలయింది" అని చెప్పారు.

"లియాన్ ఈ ఫోన్ కాల్‌తో చాలా ఉత్సాహపడి తెల్లవారుజామున 5 గంటలకల్లా ఆర్మీ బేస్‌కు చేరుకున్నారు. నాలో ఏదో అలజడి కలుగుతూనే ఉంది" అని ఆయన న్యూస్ బీట్ కు చెప్పారు. "అందుకే ఈ ఆపరేషన్‌కు వెళ్లేందుకు అంగీకరించా" అని చెప్పారు.

వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ రోజులన్నీ చాలా భయానకంగా గడిచాయి. మేం కూడా ఆ ఆపరేషన్లో పాలు పంచుకున్నందుకు గర్వంగా ఉంది" అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ‘నా భర్త తిరిగొచ్చాడు.. నేను దేశం వదిలి పారిపోయా..’

ఒక తండ్రిగా ఆ బాధ...

సర్జన్ట్ రాబ్ రెనాల్డ్స్ గత 15 సంవత్సరాలుగా సైన్యంలో పని చేస్తున్నారు. ఆయన అఫ్గానిస్తాన్‌కు వెళ్లడం ఇది మూడోసారి. కానీ, ఈ సారి ఎదురైన అనుభవం గతం కంటే భిన్నంగా ఉంది.

"మాకు నోటీసు అందిన 10 గంటల్లో మేము కాబుల్ చేరుకునేందుకు సిద్ధమయ్యాం. సాధారణంగా 24 గంటల సమయం లభిస్తుంది" అని చెప్పారు.

"మేము అక్కడ నుంచి బయలుదేరినప్పటి నుంచీ ప్రతీ క్షణం వేగంగా కదిలింది. విశ్రాంతి లేకుండా పని చేశాం. సైనికుల నిబద్ధత నన్ను ఆకట్టుకుంది" అన్నారాయన.

"మాకున్న తక్కువ సమయంలో, వివిధ దేశాలకు చెందిన దాదాపు లక్ష మందిని కనిపెట్టగలిగాం. అదొక అద్భుతమైన విజయం" అని అన్నారు.

కానీ, ఇంకా కొంత మంది అక్కడే మిగిలిపోయారనే విషయం రాబ్‌కు బాగా తెలుసు. "మరికొన్ని రోజులు అక్కడుండే అవకాశముంటే, మేం ఇంకా సర్వీస్ ఇవ్వగలిగేవాళ్ళం" అని అన్నారు.

సర్జన్ట్ రాబ్ రెనాల్డ్స్

ఫొటో సోర్స్, British Army

ఫొటో క్యాప్షన్, సర్జన్ట్ రాబ్ రెనాల్డ్స్

కష్టాల్లో ప్రజలు

తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న నాలుగు నెలల తర్వాత కూడా అక్కడ పరిస్థితి అనిశ్చితంగానే ఉంది. ఈ శీతాకాలాన్ని తట్టుకుని ఎంతమంది బయట పడతారనోననే సందేహం కూడా ఉండింది.

ఇంకా కొందరు దేశం వదిలి పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి బ్రిటన్ సేనలు పూర్తిగా వైదొలిగాయి. మళ్లీ అక్కడికి వెళ్లే ప్రణాళికలు ప్రస్తుతానికి లేవు.

కాబుల్‌లో ప్రజలను అక్కడి నుంచి తప్పించేందుకు చేపట్టిన సహాయ చర్యల తర్వాత, రాబ్ భార్య తమ నాలుగవ బిడ్డకు జన్మనిచ్చే సమయానికి ఆయన ఇంటికి చేరుకున్నారు.

"తమ పిల్లలను రక్షించుకునేందుకు అఫ్గాన్లు పడుతున్న కష్టం గురించి ఒక తండ్రిగా అర్ధం చేసుకోగలను" అన్నారు రాబ్.

"రేపు మళ్లీ వెళ్లాల్సి వస్తే తప్పకుండా వెళతాం. అవసరమైనప్పుడు సహాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధం" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, ‘తిండి లేదు, వైద్యం అందదు.. రోజూ ఇదే పరిస్థితి’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)